కెవి: పాత్రికేయులూ, ఒక పక్కే చూడకండి!

కొందరు అధికార పక్షం జెండా, మరికొందరు ప్రతిపక్షం జెండా మోయడం అత్యంత విచారకరం. ప్రజాపక్షం మాత్రం ఎవరూ లేరు. ప్రజలే మీ అజెండాగా కావాలి.

ప్రపంచం నిద్రపోయాక సమాజం కోసం తన కర్తవ్యాన్ని కొనసాగించే యోధుడు జర్నలిస్టు. అక్షరాలను అవసరాల కనుగుణంగా, అసాంఘిక శక్తులపై ఆయుధాలుగా, సమస్యల చీకటి కోణాలకు పరిష్కారం చూపే కరదీపికలుగా, అలసత్వంతో, నిరాశా నిస్పృహలతో కృంగిపోతున్న విద్యార్థులకూ, రైతన్నలకూ ఆశావహ దృక్పథం కల్పించే దీపస్తంభాలుగా, దుష్ట రాజకీయాల, మాఫియా ముఠాల చీకటి సామ్రాజ్యాలను వెలుగు లోకి తెచ్చి అమాయకపు ప్రజల భ్రమలు వదిలించే సూరీడు – జర్నలిస్టు.

నేను ఉటంకించిన అసాంఘిక శక్తుల గురించి, నేరపూరిత రాజకీయాల గురించి జర్నలిస్టులందరూ ఎంతో కొంత తమకున్న పరిధిలో బాగానే అక్షరీకరిస్తున్నారు. ఎటొచ్చీ పైస్థాయి రాజకీయాల విషయాని కొచ్చేసరికి పచ్చిగా పోలరైజేషన్‌ చోటు చేసుకొంది. కొందరు అధికార పక్షం జెండా, మరికొందరు ప్రతిపక్షం జెండా మోయడం అత్యంత విచారకరం. ప్రజాపక్షం మాత్రం ఎవరూ లేరు. ప్రజలే మీ అజెండాగా కావాలి. ప్రజలకేం కావాలో ఏవి ఉపయోగపడతాయో, వాటి మీద దృష్టి పెట్టమని నా అభ్యర్ధన.

ప్రజాజీవితంలో ముడిపడిన రంగాలపై చిన్నచూపు: ప్రజల మనుగడ కేవలం రాజకీయాలు, ప్రభుత్వ కార్యకలాపాల మీదనే మాత్రమే ఆధారపడి వుండదు. జనజీవనం భవిష్యత్తుకు, మనుగడకు అత్యంత ఆవశ్యకాలైనవి – విద్య, వైద్యం, వాణిజ్యం, పరిశ్రమలు. వీటి చుట్టూనే జనజీవితం పరిభ్రమిస్తూ వుంటుందని నా విశ్వాసం. మన దేశానికి మూలాధారమయిన వ్యవసాయం సైతం వ్యాపారంతో ముడిపడి వుంది. మార్కెట్‌ను అధ్యయనం చేసి సరైన పంటను వేసుకొనే ముందుచూపు, పండిన పంటను అమ్ముకోగలిగిన సామర్ధ్యం రైతు అలవర్చుకొన్నపుడు రైతు ఆత్మహత్య లుండవు.

నిరుద్యోగులూ, చిరుద్యోగులూ, మాజీ ఉద్యోగులూ అందరి చూపూ ఉపాధి కల్పనపై, వ్యాపారావకాశాలపై వుండాలని నాయకమాన్యులూ, పత్రికా సంపాదకులూ అందరూ స్లోగన్ల ద్వారా విరివిగా ఘోషిస్తూ వుండటం మనం చూస్తూనే వున్నాం. అయితే ఆయా రంగాలపై సమాచారం ప్రస్తుతం వున్న పరిస్థితులపై అధ్యయనం, రాబోయే అవకాశాలపై అంచనా, ఇతర రాష్ట్రాలకూ, దేశాలకూ విస్తరించగలిగే సాధ్యాసాధ్యాలు తెలిపే ప్రయత్నాలు వారు చేయరు.

నేరాలు, ఘోరాలు, మానభంగాలు, తల్లిని యింట్లోంటి గెంటేసిన కొడుకు, ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య, కూతురిని చెరిచిన కన్నతండ్రి, అవినీతి సొమ్ముతో పట్టుబడిన అధికారి, డైరక్టరు తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన సినీ నటి, భర్త తనను విడిచి మరో మహిళను చేరదీశాడని రచ్చ కెక్కిన భార్య… యిలాటి వార్తలతో పేపర్లు నిండిపోతున్నాయి. ఇదా మన ప్రజలకు కావలసిన సమాచారం?

నిర్మాణాత్మక కథనాలు కావాలి: స్వాతంత్య్ర అమృత మహోత్సవం జరుపుకొంటున్న యీ తరుణంలో ఆనాటి నేపథ్యం గురించి, బ్రిటిషు వారికి వ్యతిరేకంగా భిన్న మార్గాల్లో ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలు చేసి అసువులు బాసిన దేశభక్తుల వీరగాథలను కొందరు మహానుభావులు అక్షరీకరించి మన దినపత్రికల్లో ప్రచురించి మన మనస్సులను ఉత్తేజ పరుస్తున్నారు. వారికి నా అభివందనం. కానీ అది గతం. ఆ పోరాట స్ఫూర్తితో వర్తమాన పరిస్థితులను చక్కదిద్దుతున్న అక్షరవీరులు కనబడితే వారికి నేను సాష్టాంగ పడతాను. జనాల్ని చైతన్యవంతం చేసి, వ్యక్తిగత భవిష్యత్తును దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలిగిన పాత్రను దినపత్రికలు సజావుగా పోషించినపుడు దేశ ఆర్థిక చిత్రపటం రూపురేఖలు మారిపోతాయి.

వాణిజ్యం గురించి వార్తలేవీ?: విడిగా వాణిజ్య పత్రికలున్నా, అవి నిర్వహించే భూమిక చాలా చాలా పరిమితం. సాధారణంగా అందరూ చదివేది మాతృభాషలో వెలువడే జనరల్‌ దినపత్రికలే! కానీ యీనాటి దినపత్రికలు యీ బాధ్యతను పూర్తిగా విస్మరించాయని చెప్పడానికి నేను సందేహించను. అవి కేవలం కుళ్లు రాజకీయాలకు, స్థానిక చిల్లర వార్తలకు, ఫీచర్లకు పెద్దపీటవేసి, తక్కిన ముఖ్యాంశాల్ని పక్కకు నెట్టివేశాయి. జిల్లా ఎడిషన్సులో, ఆ జిల్లాలో జరిగే వ్యాపారం, వ్యవసాయం, విద్యావకాశాలు, వైద్యసదుపాయాలు, సేవామూర్తుల కార్యాచరణం గురించిన కథనాలుండవు.

ఇల్లాలు మానభంగానికి గురై ఒక కుటుంబం విచ్ఛిన్నమైతే అదో పతాక శీర్షిక వార్త! పది కుటుంబాలకు అన్నం పెట్టే పరిశ్రమ ప్రారంభించబడితే అది వార్త కానే కాదు! వాళ్లు యాడ్‌ యిస్తే వేసుకుంటారు. ఊరూరా వున్న రిపోర్టర్లు ఛోటా మోటా రాజకీయ నాయకులు వాళ్ల నాయకుడిని కీర్తిస్తూ, ప్రత్యర్థిని నిందిస్తూ యిచ్చిన స్టేటుమెంట్లు, ప్రభుత్వాఫీసుల లంచగొండితనం గురించి వివరణాత్మక వార్తలు, ఖాకీల దౌష్ట్యం గురించి తప్ప వేరే విధమైన వార్తలు వ్రాయరేం? ఆ జిల్లాలో కొత్తగా తెరుస్తున్న లేదా మూతపడుతున్న వ్యాపార సంస్థలు వారికంటికి ఆనవా? తెరిచేందుకు ఉన్న అవకాశాలేమిటి? మూత పడడానికి సంభవించిన కారణాలేమిటి? అవి ప్రజలకు చెప్పరా?

వార్తను వార్తగా, వ్యాఖ్యను వ్యాఖ్యగా రాయడం తగ్గిపోతున్న రోజులివి. వార్తను వ్యాఖ్యలుగా మారుస్తున్నారు. ధర్మాసనం వెలువరించిన తీర్పును కూడా తమ ఊహకు తోచినట్లు వ్యాఖ్యానిస్తూ ప్రచురిస్తున్నారు. ఏది వార్తో, ఏది వ్యాఖ్యో తెలియని అయోమయం. విశ్లేషణలకూ, వ్యాఖ్యలకూ ‘సంపాదకీయం’ అని, ఎడిట్‌ పేజీ అని కేటాయిస్తున్నారుగా! తక్కిన పేజీలకు వార్తలకు వదిలేసి, వాటిని యథాతథంగా యివ్వవచ్చు.

యాడ్స్‌ రావని భయమా?: తమాషా ఏమిటంటే, యిలాంటి వార్త-వ్యాఖ్య కలగలుపు వాణిజ్యరంగం విషయంలో కనబడదు. అంతేకాదు, విశ్లేషణాలు, మార్గదర్శనాలూ, జోస్యాలూ పారిశ్రామిక రంగం విషయంలో వుండవు. ఎందువలన? ఆ యా సంస్థల నుంచి యాడ్స్‌ రావని భయం కాదూ!? ఈనాటి పత్రికలకు ఆదాయం సర్క్యులేషన్‌ నుంచి రావటం లేదు. ప్రకటనల మీదనే పత్రిక మనుగడ ఆధారపడి ఉంది. సరైన వార్తలు సవ్యంగా యిచ్చి పాఠకులను ఆకట్టుకునే బదులు, రంగులతో, హంగులతో వారిని ఆకర్షించడానికి ప్రచురణా వ్యయం పెంచుకుంటున్నారు. దానివలన వ్యాపార ప్రకటనలపై ఆధారపడ వలసిన అవసరం మరింత పెరుగుతోంది.

వాణిజ్యరంగానికి, పారిశ్రామిక రంగానికి చెందిన విషయాలపై తమంతట తామే పరిశోధించి ఏదైనా రాస్తే చిక్కులు వచ్చి పత్రిక మనుగడకే ముప్పు వస్తుందని భయపడుతున్నాయి పత్రికల యాజమాన్యాలు. తమ పరిశోధనలో ఆ కంపెనీ మంచి పనులు చేస్తోందని తెలిస్తే యిబ్బంది లేదు కానీ, నియమోల్లంఘన చేసిందనో, కన్స్యూమర్లను మోసం చేసి అన్యాయంగా లాభాలు ఆర్జిస్తోందనో తేలితే, అది రిపోర్టు చేస్తే వాళ్లకి ఆగ్రహం కలిగి యాడ్స్‌ ఆపేస్తారని వాటి భయం.

అంతేకాదు, ఆ వ్యాపారవర్గాలు కొమ్ము కాసే రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు, వ్యాఖ్యలు రాసినా కూడా ప్రకటనలు నిలిచిపోతాయన్న బెదురు ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం గురించి, పార్టీ గురించి విమర్శనాత్మక కథనాలు రాస్తే ప్రభుత్వ ప్రకటనలు ఆగిపోతాయన్న భయం ఎలాగూ ఉంది. దానికి తోడు ఆ పార్టీ మద్దతుదారులైన వ్యాపారస్తుల, పారిశ్రామికవేత్తల కార్యకలాపాలను సమీక్షించినా భయమే. ‘‘తెనాలి’’ సినిమా కథానాయకుడిలా ఎటు చూసినా భయమే. అందుకే పనికిరాని విషయాలపై కథనాలు రాయడం, చర్చలు పెట్టడం! దానికి నొచ్చుకునే వాడు, బెదిరించే వాడు ఎవడూ ఉండడు.

వ్యాపార, వాణిజ్య రంగాలపై వార్తల విషయంలో మనం ఒకటి గమనించవచ్చు. ఒక కంపెనీ అక్రమాలకు పాల్పడిందని ఏదైనా ప్రభుత్వ, ప్రయివేటు, విదేశీ సంస్థ లేదా ఒక రాజకీయ నాయకుడు ఆరోపించినా, లేక నిరూపించినా దాన్ని పత్రికలు వార్తగానే వేస్తున్నాయి తప్ప దాని నిజానిజాల జోలికి వెళ్లటం లేదు. ఎందుకు వేశావని ఆ కంపెనీలు గద్దిస్తే ‘ఆ వార్త బయటకు వచ్చింది కాబట్టి అచ్చు వేయక తప్పలేదు’ అని సంజాయిషీ చెప్పుకోవచ్చని!

క్రాస్‌ చెకింగ్‌ ఏది?: ‘ముఖ్యమంత్రి దావోస్‌ వెళ్లారు లేదా రాష్ట్రంలో పారిశ్రామిక సదస్సు పెట్టారు. దానిలో వందలాది ఎంఓయులు కుదిరాయి, లక్షల కోట్ల పెట్టుబడి రానున్నది, లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రానున్నవి..’ అంటూ మంత్రి ప్రకటించినపుడు, ఏ పత్రికా ఆ యా కంపెనీల వద్దకు వెళ్లి ‘ఆ ఒప్పందం ప్రకారం ఎంత పెట్టుబడి పెడతారు? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఎప్పటికి పెడతారు?’ వంటి ప్రశ్నలు అడగనే అడగదు. పోనీ గత సంవత్సరం యిలాటి సదస్సులో ప్రకటించిన ఎంఓయులలో కనీసం 30శాతమైనా మెటీరియలైజ్‌ అయ్యాయా అని పరిశ్రమల శాఖ వద్దకు వెళ్లి కనుక్కోనైనా కనుక్కోదు. అంతా గప్‌చుప్‌! ప్రభుత్వం ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది. మేం వేశాం. ఖతమ్‌. మా బాధ్యత ఏమీ లేదు.’ యిదీ పత్రికల యాటిట్యూడ్‌! ఇలా లోతుగా వెళ్లి పరిశోధించి వేస్తే ప్రభుత్వం యాడ్స్ ఆపేయవచ్చు.

వాణిజ్యరంగం విషయంలో యీ ‘టచ్‌ మీ నాట్‌’ ధోరణి వలన పర్యవసానం ఏమిటంటే మంచి పనులు చేసిన సంస్థల గురించి కూడా వార్తలు, వ్యాఖ్యలు రాయటం లేదు. ‘ఆ కంపెనీ గురించి బాగా రాశావ్‌, మా గురించి ఎందుకు రాయలేదు? ఏం మా కంపెనీ యాడ్స్‌ అక్కరలేదా?’ అని తక్కిన వాళ్లు అంటారని భయం. అందువలన ‘ఎవరి గురించి మంచి రాయం. అంతగా ఏ కంపెనీ ఐనా తను చేసిన మంచి గురించి చెప్పుకోవాలంటే ‘ఎడ్వర్టోరియల్‌’ విభాగం కింద తీసుకుని డబ్బు తీసుకుంటాం.’ అనే పాలసీ పెట్టుకున్నాయి పత్రికలు. అంటే న్యూసులా భ్రమింపచేసే యాడ్స్‌ అన్నమాట. దానిలో కంపెనీ ఎన్ని అతిశయోక్తులు, అసత్యాలు చెప్పుకున్నా, పత్రికకు ఏ బాధ్యతా లేదన్నమాట!

వ్యాపారస్తుల పత్రికలు: పాత్రికేయులు పత్రికలు నడిపిన రోజుల్లో అవి ప్రజల కోసం పని చేస్తూ, ఆదాయాన్ని సంపాదించేవి. ఇప్పుడు వ్యాపారస్తులు పత్రికలు నడిపే రోజులు వచ్చాక ప్రకటనల ద్వారా ఆదాయం, తమ వ్యాపార సామ్రాజ్యపు పరిరక్షణే ప్రధాన ధ్యేయం అయిపోయింది. తమ వర్గానికి వ్యతిరేకంగా తామే ఎందుకు వార్తలు రాస్తారు? పెద్ద ఎస్టాబ్లిష్‌మెంట్‌తో పెట్టిన పత్రిక యాజమాన్యాల గొడవ యిది. కానీ చిన్న పత్రికలైతే నికార్సుగా ఉండగలవు. జర్నలిస్టులుగా మీరు ప్రజాపక్షం వహించగలిగితే, ప్రజాహితం కోరితే చిన్న పత్రికలు పెట్టి ప్రజలను సరైన దిశలో ఎడ్యుకేట్‌ చేయగలరు.

సింగిల్‌ జర్నలిస్టులు పెట్టుకునే చిన్న పత్రికల మనుగడ కష్టమని నాకూ తెలుసు. కానీ భిన్న రంగాల్లో నిష్ణాతులైన కొందరు జర్నలిస్టులు ఒక కోఆపరేటివ్‌గా ఏర్పడి పత్రిక నడిపితే గ్రూపు సినర్జీతో అత్యంత సమర్థవంతంగా పత్రికను నడుపుతూ పాఠకులను ఆకట్టుకోగలరు. ఈనాటి పత్రికలలో నిష్పాక్షికత కొరవడిందనే నిస్పృహతో ఉన్న పాఠకుడు ‘ప్రింట్‌’, ‘వైర్‌’ వంటి ఆంగ్ల వెబ్‌సైట్‌లను, యూట్యూబులను ఆశ్రయిస్తున్నాడు. మీరు ఎవరికీ కొమ్ము కాయకుండా ఉన్నదున్నట్లు రాయగలిగితే ప్రింట్‌ మీడియాలో మీకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది.

తిమింగలాల వంటి పెద్ద పత్రికలు మమ్మల్ని తినివేయవా? అని మీరడగవచ్చు. సముద్రంలో తిమింగలాలకూ, చేపలకూ అన్నిటికీ చోటుంది. చిన్న చేపలకు తిమింగలాలను తప్పించుకుని తిరిగే నేర్పు ఉంటుంది. కొంతకాలానికి వాటిని ఎదిరించే ధైర్యమూ, సామర్థ్యమూ తెచ్చుకుంటాయి. మా శాంతా బయోటెక్నిక్స్‌ ఎదుగుదలే దానికి ఉదాహరణ!

ఇదే వేదికగా టీవీ ఛానెళ్ల గురించి కూడా నా అభిప్రాయాలు చెప్పేస్తాను. ఎందుకంటే మీలో కొందరు ఎలక్ట్రానికి మీడియా వైపు కూడా వెళ్లి ఛానెల్ పెట్టవచ్చు. ఇంగ్లీషు పుస్తకం, తెలుగు పుస్తకం నా ఎదురుగుండా పెడితే తెలుగు పుస్తకం వైపే నా చేయి సాగుతుంది. పత్రికలలో కూడా తెలుగు పత్రికయే నన్ను ముందుగా ఆకర్షిస్తుంది. మరి టీవీ ఛానెల్స్ విషయానికి వచ్చేసరికి నేను తెలుగు టీవీ ఛానెళ్లు చూడడానికి పెద్దగా యిష్టపడను. ఎందుకంటే మన దగ్గర న్యూస్ పెద్దగా జనరేట్ కాకపోయినా 24 బై 7 ఛానెళ్లు పెట్టేశారు. అదీ ఒకటీ రెండూ కాదు, పదుల సంఖ్యలో పెట్టేశారు. చిన్నప్పుడు రోజూ ఉదయం ఓ పావుగంట, సాయంత్రం ఓ పావుగంట రేడియో వార్తలు వింటే సరిపోయేది. ఇప్పుడు దాన్నే రోజంతా సాగతీయడంతో వస్తోంది చిక్కు.

ప్రతీ ఛానెలూ ఏదో ఒక సెన్సేషన్‌ కలిగిద్దామనే ప్రయత్నించడం చాలా చికాకు కలిగిస్తుంది. మన తెలుగు పత్రికలకు ఓ దీర్ఘకాలిక వ్యాధి వుంది. హెడ్‌లైన్సు క్యాచీగా వుండాలని, స్పైసీగా వుండాలని ఏదో కాప్షన్‌ పెడతారు. లోపల విషయం చూడబోతే అది మరోలా వుంటుంది. ఈ జాడ్యం టీవీలకు వచ్చేసరికి బాగా ముదిరిపోయింది. పత్రికలలో లాగానే, న్యూస్‌ ఒకలా వుంటుంది, కింద కాప్షన్‌ మరొకటి వుంటుంది. ప్రాస కోసం ప్రయాస పడడం, కవిత్వం అల్లడానికి కష్టపడడం కనిపిస్తుంది తప్ప యాక్యురసీ వుందా లేదా అని చూడరు.

ఇక న్యూస్‌ చూడబోతే – పత్రికల లాగానే గల్లీ న్యూస్‌కే ప్రాధాన్యం. ఎవరో అమ్మాయిని ఎవడో మోసం చేస్తే అది రోజున్నర న్యూస్‌. పొరుగున వున్న తమిళనాడు వార్తలు కూడా మనకు రావు. అక్కడి ఛానెల్స్‌తో టై-అప్‌ పెట్టుకుని న్యూస్‌ సేకరించడం అనే పద్ధతి వున్నట్టు కనబడదు. ఇక జాతీయవార్తలు, అంతర్జాతీయ వార్తల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఒకటి రెండు ముక్కలు చెప్పినా నేపథ్యం వివరించడం అస్సలు వుండదు. అవినీతిని బయటపెట్టేస్తున్నాం అంటూ పదివేలు లంచం పట్టిన వాడిని ఎక్స్‌పోజ్‌ చేసి చంకలు గుద్దుకుంటారు. పెద్ద కార్పోరేట్లలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణాలు వీళ్లెవరైనా బయట పెట్టారా? పోనీ విషయం బయటకు వచ్చాకైనా మోసం జరిగిన తీరులోని టెక్నికల్‌ విషయాలను సామాన్యుడికి అర్థమయ్యేట్లా చెప్పగలిగారా? ఇలాటి సాంకేతిక విషయాలు టీవీ జర్నలిస్టులకే తెలియదనుకుంటా, వారింకేం చెప్పగలరు?

ఇక బర్నింగ్‌ టాపిక్స్‌పై వారు చేసేదేమిటంటే – ఓ చర్చావేదిక పెట్టడం! ఓ గుప్పెడు మందే ఆ వేదికల మీద కనబడతారు. వారిని చూసి ఆంధ్రదేశంలో మేధావులందరూ హైదరాబాదులోనే గూడు కట్టుకుని వున్నారనుకో కూడదు మనం. బయట వూళ్లనుంచి పిలిస్తే ఖర్చులవుతాయి. అందువలన ఊళ్లో వాళ్లనే పిలిస్తే కప్పుకాఫీతో సరిపెట్టవచ్చు. పేరుకి అది చర్చావేదికే కానీ నిజానికి అది జగడాల రచ్చబండ. అవతలి వాళ్లు చెప్పేది వినకుండా వారి కంటె గట్టిగా అరవగల కంఠబలం వున్నవారినే పిలుస్తారు. వీళ్లిద్దరి మధ్యా కొట్లాట పెట్టి ఇద్దరూ అరుచుకుంటూ వుంటే వీరు చాలనట్టు యాంకర్ మధ్యలో ఫోన్‌ ద్వారా మరొకర్ని పిలుస్తారు. ఆయన మాట్లాడుతూంటే టైమ్‌ లేదంటూ మధ్యలో కట్‌ చేస్తారు. చివరకు ఏ విషయం గురించి మనకు ఏ సమాచారం అందకుండానే కార్యక్రమం ముగుస్తుంది.

వార్తల విషయానికి వస్తే, తెలుగు ఛానెల్స్‌కు మరోపేరు అతిశయోక్తులు. ఇద్దరు పోతే ఇరవై మంది పోయారని అనుకుంటున్నారంటారు. నలుగురు పాల్గొన్న నిరసన ప్రదర్శన దిగ్విజయంగా సాగిందని చెప్తారు. ఎప్పుడో పొద్దున్న జరిగి పదినిమిషాల్లో జరిగి సమసిపోయిన గొడవను రాత్రి దాకా రిపీట్‌ చేస్తూనే వుంటారు. ఇక విజువల్స్‌ విషయానికి వస్తే ది లెస్‌ సెడ్‌ ది బెటర్‌. ఒక్క ఛానెల్‌కు కూడా లైబ్రరీ వున్నట్టు కనబడదు. ఎవరితోనూ టై-అప్‌ వున్నట్టు కనబడదు. మూడు సెకండ్ల విజువల్‌ను ముప్ఫయి సార్లు చూపిస్తారు.

ఇక క్రింద యిచ్చే స్క్రోలింగ్‌లో ఎన్నో తప్పులు. తెలుగు కూడా సరిగ్గా రాయరు. న్యూస్‌ కాంటెంట్‌లో క్రయిమ్‌కు, నెగటివ్‌ వార్తలకు యిచ్చిన ప్రాధాన్యత పాజిటివ్‌ న్యూస్‌కు యివ్వరు. అమలు అవుతున్న, లేదా అవటం లేని ప్రభుత్వ పథకాల గురించి డాక్యుమెంటరీలు, ఫ్యాక్ట్ చెక్‌లు కానరావు. ప్రఖ్యాత సంస్థల గురించి, ఎన్‌జివోల గురించి పరిచయాలు వుండవు. కెమెరాను వుపయోగించడంలో ఔచిత్యం పాటించరు. మనిషి పోయి ఏడుస్తూ వుంటే యింట్లోకి కెమెరా పట్టుకుపోయి ఏడ్చేవాళ్ల మొహం మీద ఫోకస్‌ చేయడం సభ్యత కాదు.

చివరగా చెప్పేది – ఏ వర్గానికీ కొమ్ము కాయవద్దు. కొమ్ములు తిరిగినవారిని కూడా వంచగల కలం మీ సొత్తు. ప్రజల పక్షాన మీరుండండి, మీ పక్కన వారుంటారు. అన్యాయాలపై గళమెత్త వలసిన తరుణంలో ఆదాయం రాదన్న భయంతో మౌనంగా ఉండకండి. ఏ వాణిజ్యానికి, ఏ పరిశ్రమకూ లేనంత మార్కెట్‌ మధ్యతరగతికి, నిష్పక్షపాత వైఖరిని హర్షించే జనబాహుళ్యానికి ఉందనే వ్యాపారసూత్రం గ్రహించండి.

2022 ఆగస్టులో జర్నలిస్టు అసోసియేషన్‌ సమావేశంలో చేసిన ప్రసంగవ్యాసమిది. రెండున్నరేళ్లలో పరిస్థితి మెరుగు పడలేదు. మీడియా మరింత ఏకపక్షమై పోయింది. ప్రతి పత్రిక ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. టీవీల విషయానికి వస్తే, అప్పటి నుంచి యిప్పటివరకు టీవీ ప్రోగ్రాముల క్వాలిటీ పెరిగినట్లు కనబడటం లేదు కానీ చర్చావేదికల విషయంలో మార్పు వచ్చింది. గ్రహణం, గ్రహకూటమి ప్రభావం వంటి విషయాల్లో అవి రచ్చావేదికలుగా మిగిలాయి కానీ రాజకీయ విషయాల్లో ధోరణి మారింది. ఇప్పుడు టీవీ ఛానెళ్లు పార్టీల పరంగా ప్రస్ఫుటంగా చీలిపోయాయి. మేనేజ్‌మెంట్‌ భావాలతో విభేదించే వారిని చర్చలకు పిలవడమే లేదు. అసలు చర్చలే ఉండవు. పాల్గొన్న వారందరూ ఒకే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ బృందగానం చేస్తున్నారు.

నేను ఆశించిన మార్పులు పత్రికలలో, టీవీ చానెళ్లలో రాకపోవడం చేత కాబోలు, వాటిని చదివేవారు, చూసేవారు తగ్గిపోయి, యూట్యూబు ఛానెళ్లకు ఆదరణ పెరిగింది. యూట్యూబు వీడియోలు చూసేవారు యిబ్బడిముబ్బడిగా పెరగడంతో సోషల్‌ మీడియా ఇష్టారాజ్యంగా మారింది. వాళ్లలో చాలామంది ఏ మర్యాదలూ, ముఖ్యంగా థంబ్ నెయిల్స్ పెట్టే విషయంలో, పాటించటం లేదు. అదో యిబ్బంది. నిష్పక్షంగా రాసే వెబ్‌సైట్‌లకు మార్కెట్ పెరుగుతున్నట్లుంది. ‘‘ద వైర్’’ వెబ్‌సైట్ తెలుగు వెర్షన్ కూడా ప్రారంభమైంది. మరి కొన్ని స్వతంత్ర వెబ్‌సైట్లు కూడా తెలుగు వెర్షన్లతో మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చు. సకాలంలో మేల్కొని, తెలుగు మీడియా సరిదిద్దుకోకపోతే అచ్చమైన తెలుగు మీడియాకు ఆదరణ, ఆదాయం తగ్గిపోవచ్చు.

– కె.ఐ. వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్)

21 Replies to “కెవి: పాత్రికేయులూ, ఒక పక్కే చూడకండి!”

  1. Well written article- exposed the biased news media- Totally agree with every line of this article. Its been a couple of decades since I read a real news paper – The current daily news papers/ media are just carrying their own agenda/ or the party they support- No importance to positive news- highlighting negative news- no common sense while covering ‘accidents/ deaths-

  2. మీ విశ్లేషణ బాగుంది సర్.కానీ సమాజాన్ని 1980 ముందు,తర్వాత,2000 ముందు,తర్వాత అనే స్థితిలో మార్పులు చూస్తే మనం ఎటు వె డుతున్నామో అవగతం అవుతుంది.

  3. Sir, మీరంటే మా అందరికీ గౌరవం, you are visionary, hero in your field!! plz sir, don’t let your pen down by writing for this filthy, shitty website!! sorry!!

  4. కల్లు కాంపౌండ్ లొ కూర్చొని శ్రిరంగనీతులు చెప్పినట్టు ఉంది… ఈ GA లొ రాస్తూ పతికలూ, మీడియా గురించి నీతులు వళ్ళించటం!

    .

    1. మీకు ఉన్న పెరుని ఇలా పడుచెసుకొవద్దు!

      కాలీగా ఉంటె ఇంట్లొ రామకొటి రాసుకొంటి, కులాల కుంపట్లు పెట్టె గలీజు GA లొ మాత్రం వద్దు!

Comments are closed.