ఈ పోలిక చాలా మంది భారత క్రికెట్ వీరాభిమానులకు రుచించకపోవచ్చు కానీ.. టీమిండియా క్రికెట్ జట్టు ప్రస్తుత ఫామ్, ప్రదర్శన ఒకప్పటి ఆస్ట్రేలియా జట్టును గుర్తు చేస్తోంది. సరిగ్గా చెప్పాలంటే.. 1999 నుంచి 2003ల మధ్యన ప్రపంచ క్రికెట్ జట్లను గడగడలాడించిన ఆస్ట్రేలియా జట్టును ప్రస్తుత టీమిండియా గుర్తు చేస్తోంది.
భారత క్రికెట్ జట్టు కూడా ఇప్పటికే చాలా రకాల్ పీక్స్ ను చూసింది. ఎన్నో మరపురాని విజయాలను సాధించింది. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, ధోనీ కెప్టెన్సీల్లో ఇండియాకు ఎన్నో మరపురాని గురుతులే ఉన్నాయి. ఎన్ని ఉన్నా.. ఇండియాతో పెట్టుకుంటే ఇంతే అనే పరిస్థితి మాత్రం ప్రత్యర్థి జట్లకు అంత ఎదురుకాలేదు! టీమిండియా పోరాడి సాధించిన విజయాలు పాతవైతే.. ఇండియన్ క్రికెట్ జట్టు అరివీర స్థాయి ప్రదర్శనతో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది.
2019 క్రికెట్ వరల్డ్ కప్ లోనూ అంతకు ముందు 2015 వరల్డ్ కప్ లో కూడా టీమిండియా ప్రదర్శన చెప్పుకోదగిన స్థాయిలో ఉంది. 2015లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంఫియన్ గా ఇండియా సెమిస్ వరకూ వెళ్లింది. సెమిస్ లో ఆస్ట్రేలియాతో ఓటమి పాలై.. ఇంటి బాట పట్టింది. ఇక 2019లో ఇంగ్లండ్ లో జరిగిన ప్రపంచకప్ లో కూడా నాకౌట్ దశవరకూ ఇండియా పరిస్థితి మెరుగ్గానే కనిపించింది. అయితే సెమిస్ లో ఓటమితో మరోసారి ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. అప్పుడూ టీమిండియా బలంగానే ఉంది. అయితే దుర్బేధ్యంగా కాదు! అప్పుడు జట్టు కూర్పులోనే కొన్ని విమర్శలు వచ్చేవి.
ప్రత్యేకించి 2019 ప్రపంచకప్ లో అయితే నాలుగో నంబర్ బ్యాట్స్ మన్ గా ఎవరనే అంశం తరచూ చర్చకు వచ్చేది. అందుకు సరైన అటగాడిని లేకుండానే ప్రపంచకప్ కు టీమిండియా వెళ్లిందనే విమర్శ చెరిగిపోదు. ప్రత్యేకించి రాయుడుకు స్థానం కల్పించకపోవడం, ఇండియా ఓడిన సెమిస్ లో కూడా నాలుగో నంబర్ బ్యాట్స్ మన్ లోటు స్ఫష్టంగా కనిపించడంతో ఆ విమర్శ శాశ్వతంగా మిగిలిపోయింది. అయితే స్వదేశంలో ఇప్పుడు టీమిండియా ప్రత్యర్థి జట్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది.
ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక ఇలా జట్టు ఏదనేది పాయింటే కాదు, ఇండియాతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు పిల్లి మొగ్గలు వేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. లీగ్ దశలో టీమిండియా తన సూపర్ ఫామ్ తో టాప్ పొజిషన్లో ఉంది. సెమిస్ లో స్థానం ఖరారు చేసుకుంది. స్వదేశంలో జరిగే ప్రపంచకప్ లో టీమిండియా సత్తా చూపించడం కొత్త కాదు. 2011లో ఇండియాలోనే జరిగిన ప్రపంచకప్ లో ఇండియా ఘన విజయం సాధించింది, చాంఫియన్ గా నిలిచింది. అప్పటి వరకూ ఆతిథ్య జట్లు ప్రపంచకప్ గెలిచిన సందర్భాలు లేవు! ఆ సెంటిమెంట్ ను ఇండియా చేధించింది. ఆ తర్వాత 2015లోనూ, 2019లో కూడా ఆతిథ్య జట్లే ప్రపంచ చాంఫియన్ లుగా నిలవడం గమనార్హం! మరి అదే సెంటిమెంట్ కొనసాగితే… ఈ సారి ఇండియా మరోసారి ప్రపంచ చాంఫియన్ గా లాంఛనమే!
అయితే గత రెండు ప్రపంచకప్ లలో ఇండియాకు సెమిస్ దశలో తగిలిన షాక్ లు అలాంటిలాంటివి కావు! ఇప్పుడంతటి స్థాయిలో కాకపోయినా.. అప్పుడు కూడా లీగ్ దశలో ఇండియా బాగానే ఆడింది. తీరా నాకౌట్ మ్యాచ్ లలో చేతులెత్తేసింది. అలాంటి పరిస్థితి ఈ సారి రాకూడదనేది ప్రతి ఇండియా క్రికెట్ అభిమాని కోరిక! ప్రస్తుతం ఇండియా ఉన్న భీకర ఫామ్ ను బట్టి చూస్తే.. అచ్చం 2003 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా ప్రత్యర్థి జట్లన్నింటినీ చిత్తు చేసి విజేతగా నిలిచిన తరహాలో విజేతగా నిలిచేలా కనిపిస్తోంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా సూపర్ ఫామ్ లో కనిపించారు. ఊహకు అందని తరహాలో ఆడారు, ప్రత్యర్థి జట్ల డ్రస్సింగ్ రూమ్ లలో ప్రకంపనలు పుట్టించారు. ఇప్పుడు ఇండియా జట్టు అదే ఫీట్ ను రిపీట్ చేస్తోంది!