ధోనీకి కోహ్లీ ఎసరుపెడ్తాడా.?

అనూహ్యంగా టీమిండియా కెప్టెన్సీ అందుకున్నాడు మహేంద్రసింగ్‌ ధోనీ ఒకప్పుడు. ఆ టైమ్‌లో అసలు ధోనీకి కెప్టెన్సీ వస్తుందనే ఎవరూ ఊహించలేదు. క్రికెట్‌ విశ్లేషకులు సైతం ధోనీకి కెప్టెన్సీ రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే…

అనూహ్యంగా టీమిండియా కెప్టెన్సీ అందుకున్నాడు మహేంద్రసింగ్‌ ధోనీ ఒకప్పుడు. ఆ టైమ్‌లో అసలు ధోనీకి కెప్టెన్సీ వస్తుందనే ఎవరూ ఊహించలేదు. క్రికెట్‌ విశ్లేషకులు సైతం ధోనీకి కెప్టెన్సీ రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ధోనీ అంచనాల్ని అందుకున్నాడు.. టీమిండియాని విజయపథాన నడిపించాడు. కొన్ని పరాజయాలూ ధోనీ నేతృత్వంలో టీమిండియా చవిచూడాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే విషయం.

ఇక, ఇప్పుడు తాజాగా ధోనీ కెప్టెన్సీకి విరాట్‌ కోహ్లీ చెక్‌ పెట్టేలా వున్నాడన్నది క్రికెట్‌ విశ్లేషకుల అభిప్రాయం. అండర్‌`19 నుంచీ విరాట్‌ కోహ్లీ సంచలనాలు సృష్టిస్తూనే వున్నాడు. అయితే స్ట్రాంగ్‌ కెప్టెన్‌ ధోనీ పుణ్యమా అని విరాట్‌ కోహ్లీకి కెప్టెన్సీ అప్పుడప్పుడూ మాత్రమే దక్కుతోంది తప్ప.. ఫుల్‌ టైమ్‌ కెప్టెన్‌గా కోహ్లీకి అవకాశమే రావడంలేదు.

గత కొంతకాలంగా వరుస గాయాలతో ధోనీ ఇబ్బంది పడ్తున్న దరిమిలా, కోహ్లీనే కెప్టెన్‌ని చేయడం మంచిదన్న అభిప్రాయాలు మాజీ క్రికెటర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. అడపా దడపా కోహ్లీ సారధ్యంలో టీమిండియా కొన్ని మ్యాచ్‌లను ఆడుతుండడం.. కొన్నిట్లో విజయాలు, మరికొన్ని మ్యాచ్‌లలో పరాజయాల్ని చవిచూస్తోంది.

ధోనీ కూల్‌ కెప్టెన్‌. అదే టీమిండియాకి ప్లస్‌ అయ్యింది. కోహ్లీ అలా కాదు.. చాలా ఎగ్రెసివ్‌. ఎమోషన్స్‌ని అస్సలు కంట్రోల్‌ చేసుకోలేడు. దాంతో కోహ్లీకి కెప్టెన్సీ ఇవ్వడం అంత మంచిది కాదన్న అభిప్రాయాలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ, ధోనీకి ఎసరు పెట్టే పరిస్థితులు ప్రస్తుతానికైతే లేకపోవచ్చు. కానీ సమీప భవిష్యత్తులో ‘తత్వం’ విరాట్‌ కోహ్లీకి బోధపడితే.. పరిస్థితులు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఒక్కటి మాత్రం నిజం. కెప్టెన్సీ మోజు కాదు. కెప్టెన్సీ అంత వీజీ అసలే కాదు. గంగూలీ, ద్రావిడ్‌, సచిన్‌.. కెప్టెన్లయ్యాక మైదానంలో వ్యక్తిగత ప్రదర్శన విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి, కోహ్లీకి ఫుల్‌ టైమ్‌ కెప్టెన్సీ ఇస్తే.. అతని ఆటతీరుపై ప్రభావం పడకుండా వుంటుందా.? దానిమీదనే అతని ఫుల్‌ టైమ్‌ కెప్టెన్సీ ఆశలు ఆధారపడి వున్నాయి.