ఈ వరల్డ్ కప్ షెడ్యూల్ వేసింది ఎవడ్రాబాబూ..!

ప్రపంచకప్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 12 రోజులు గడిచిపోయాయి. అయితే ఇంత వరకూ టీమిండియా ఆడింది రెండంటే రెండే మ్యాచ్ లు! టోర్నీ స్టార్ట్ అయ్యి 14 రోజులు గడిచాకా ఇండియా మూడో మ్యాచ్…

ప్రపంచకప్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 12 రోజులు గడిచిపోయాయి. అయితే ఇంత వరకూ టీమిండియా ఆడింది రెండంటే రెండే మ్యాచ్ లు! టోర్నీ స్టార్ట్ అయ్యి 14 రోజులు గడిచాకా ఇండియా మూడో మ్యాచ్ ఆడుతుంది. ఇండియా తన రెండో మ్యాచ్ ను గత ఆదివారం ఆడింది.. తరువాతి మ్యాచ్ ను శనివారం ఆడబోతోంది. మనటీమ్ తొలి మ్యాచ్ ను  రెండో మ్యాచ్ కు వారం రోజుల ముందు ఆడింది. స్థూలంగా వారానికి ఒక మ్యాచ్ అనమాట.

మరి ఇన్ని జట్లూ ఇలా ఆడుతున్నాయా.. అంటే అదీ లేదు. వెస్టిండీస్ టీమ్ నే తీసుకొంటే మంగళవారం రోజున ఆ టీమ్ జింబాబ్వేతో ఆడింది. మళ్లీ శుక్రవారం రోజున ఆ టీమ్ మరో మ్యాచ్ ఆడనుంది. దక్షిణాఫ్రికాను ఢీ కొననుంది. అంటే  రెండు రోజుల మాత్రమే గ్యాప్!

గత ఆదివారం మ్యాచ్ ఆడిన శ్రీలంక గురువారం రోజున బంగ్లాదేశ్ తో ఆడింది… అదే అదివారం శ్రీలంకతో తలపడిన అప్ఘానిస్తాన్ కూడా తన తరువాతి మ్యాచ్ ను ఆడేసింది. అయితే ఆ ఆదివారం మ్యాచ్ ఆడిన ఇండియా, దక్షిణాఫ్రికాలు మాత్రం వేరు ప్రత్యర్థులతో తమ తరువాతి మ్యాచ్ లు ఆడటానికి ఇంకా ఎదురుచూస్తున్నాయి! 

మొత్తం ప్రపంచకప్ షెడ్యూల్ ను పరిశీలిస్తే ఇలాంటి సిత్రాలెన్నో కనిపిస్తాయి. కొన్ని జట్లు వరసగా మ్యాచ్ లు ఆడేస్తాయి.. మళ్లీ వాటికే వారం పది రోజుల పాటు గ్యాప్ వస్తుంది. ఆ టైమ్ లో మిగతా జట్లు వరసగా మ్యాచ్ ఆడేస్తాయి. షెడ్యూల్ లో ఒక క్రమపద్ధతి అంటూ ఏమీ లేదు. ఇష్టానుసారం షెడ్యూల్ వేసేశారంతే!

మరి ఇలాంటి షెడ్యూల్ టోర్నీ మీద కొంత ఆసక్తిని తగ్గించి వేస్తుంది. టీవీలో మ్యాచ్ లు చూసే వాళ్ల ఆదరణ తగ్గుతుంది. అక్కడికీ చిన్న జట్లుగా భావించబడ్డ ఐర్లాండ్ , జింబాబ్వే వంటి దేశాలు కూడా తమ సత్తా చాటుకొంటూ అంతో ఇంతో వినోదాన్ని ఇస్తున్నాయి కాబట్టి సరిపోయింది కానీ.. ఆ జట్లు గాని విసిగెత్తిచ్చి ఉంటే… ప్రపంచకప్ మరింత బోర్ అయ్యేది!