కుంబ్లే.. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌.!

అనిల్‌ కుంబ్లే.. పరిచయం అక్కర్లేని పేరిది. ప్రపంచ క్రికెట్‌లో తనదైన ప్రత్యేకతను చాటుకున్న ఈ భారత మాజీ క్రికెటర్‌.. భారత క్రికెట్‌కి వన్నె తెచ్చిన ఆటగాళ్ళలో ఒకడు. బంతితో మైదానంలో ‘మాయ’ చేయడం ఎలాగో…

అనిల్‌ కుంబ్లే.. పరిచయం అక్కర్లేని పేరిది. ప్రపంచ క్రికెట్‌లో తనదైన ప్రత్యేకతను చాటుకున్న ఈ భారత మాజీ క్రికెటర్‌.. భారత క్రికెట్‌కి వన్నె తెచ్చిన ఆటగాళ్ళలో ఒకడు. బంతితో మైదానంలో ‘మాయ’ చేయడం ఎలాగో తెలిసిన అతి కొద్ది మంది బౌలర్లలో కుంబ్లే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా స్పిన్‌ బౌలింగ్‌ని అత్యంత ఖచ్చితత్వంతో, అత్యంత వేగంతో ప్రత్యర్థులపైకి సంధించడంలో కుంబ్లే దిట్ట.

టెస్ట్‌ క్రికెట్‌లో 619 వికెట్లు తీసిన కుంబ్లే, ఒక టెస్ట్‌ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన ఘనుడు. అది కూడా ఆషామాషీ జట్టు మీద కాదు.. పాకిస్తాన్‌ మీద ఈ ఫీట్‌ సాధించాడంటే కుంబ్లే ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తలకి గాయమై.. రక్తం కారుతున్నా, నెత్తికి కట్టు కట్టుకుని మరీ బౌలింగ్‌ చేసిన ‘పోరాట యోధుడు’ అనిల్‌ కుంబ్లే. జీవం లేని పిచ్‌లపై వికెట్లు రాబట్టడంలో కుంబ్లే తర్వాతే ఎవరైనా.

ఇంత గొప్ప క్రికెటర్‌కి ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో సభ్యత్వం ఇచ్చి గౌరవించనుంది. భారత్‌ తరఫున ఇప్పటిదాకా ఈ గౌరవం దక్కించుకున్నవారిలో కపిల్‌ దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌, బిషన్‌ సింగ్‌ బేడీ తదితరులు మాత్రమే వున్నారు. ప్రస్తుతం ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు కుంబ్లే. ఆదివారం జరగబోయే భారత్‌ ` సౌతాఫ్రికా మ్యాచ్‌ తర్వాత కుంబ్లేని ఐసీసీ ఈ గౌరవంతో సత్కరించనుంది.