క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటిస్తారా.? అన్న ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ ధోనీ స్పష్టమైన సమాధానమిచ్చాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేసిన ధోనీ, వన్డే క్రికెట్‌కి వరల్డ్ కప్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ సర్వత్రా చర్చ జరుగుతోన్న విషయం విదితమే. అయితే దీనిపై ధోనీ సమాధానమేంటంటే, ‘ఆ ఆలోచన ఇప్పట్లో లేనే లేదు..’ అని.
టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానన్నాడు ధోనీ. అంటే, దాని తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కాదు, ఆ తర్వాత ఆలోచిస్తాడని మాత్రమే ఆయన వ్యాఖ్యల్లో అర్థం కన్పిస్తుంది. టీమిండియాకి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించి పెట్టిన ధోనీ, వన్డే వరల్డ్ కప్‌నీ సాధించి పెట్టాడన్నది కాదనలేని వాస్తవం.
తాజా వరల్డ్ కప్‌లో, ధోనీకి ఒక్క బ్యాట్స్‌మన్ అయినా సపోర్ట్ ఇచ్చి వుంటే, సెమీస్‌లో టీమిండియా గట్టెక్కేదే. కానీ దురదృష్టం టీమిండియాని వెంటాడింది. వాస్తవానికి ఈ వరల్డ్ కప్ పోటీల్లో టీమిండియా అంచనాలకు మించి రాణించిందన్న దాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. బౌలింగ్‌లో పరిమితులు, బ్యాటింగ్‌లో పరిమితులు.. వెరసి టీమిండియా జట్టు పరిపూర్ణమైనది కానే కాదు.
షమీ, ఉమేష్ యాదవ్, మొహిత్ శర్మ.. వీళ్లెవరూ టీమిండియాకి వరల్డ్ కప్ సాధించిపెట్టేంత అనుభవం వున్నవాళ్ళు కారుగానీ, అంచనాలకు మించి రాణించారు. అశ్విన్ అయినా అంతే. పెద్దగా అనుభవం లేని ఆటగాళ్ళతో వరల్డ్ కప్ బరిలోకి దిగిన ధోనీ, సెమీస్ దాకా జట్టుని లాక్కు రావడం అంటే చిన్న విషయమేమీ కాదు. ఈ విషయంలో ఆయన్ని అంతా అభినందించాల్సిందే.
ఇక, రిటైర్మెంట్ విషయమంటారా.? దానికి కాలమే సమాధానం చెబుతుంది. అందరూ షాకయ్యేలా టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, వన్డే క్రికెట్‌కి ఎప్పుడు గుడ్ బై చెప్తాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.