పాకిస్తాన్ ఎప్పుడు టీమిండియా మీద వరల్డ్ కప్ పోటీల్లో గెలుపొందలేదు. ఇది చరిత్ర.. ఈ చరిత్రను సజీవంగా వుంచుతోంది టీమిండియా. సౌతాఫ్రికా మీద టీమిండియా ఇప్పటిదాకా గెలవలేదు వరల్డ్ కప్ పోటీల్లో. నిన్నటిదాకా ఇది చరిత్ర. ఇప్పుడు దాన్ని తిరగరాసింది టీమిండియా. వరల్డ్ కప్ పోటీల్లో సఫారీల్ని నిలువరించగల సత్తా టీమిండియాకి వుందని ధోనీ సేన నిరూపించింది.
మెల్‌బోర్న్ మైదానంలో ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై టీమిండియా విజయం సాధించింది. సాదా సీదా విజయం కాదిది. 130 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది టీమిండియా. బ్యాట్స్‌మన్ దుమ్ము రేపితే, బౌలర్లు మైదానంలో ప్రత్యర్థిని గింగరాలు తిప్పారు. బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు, మెరుపు ఫీల్డింగ్‌తో సఫారీలకు చుక్కలు చూపించారు భారత ఆటగాళ్ళు.
మొత్తమ్మీద చరిత్రను టీమిండియా తిరగరాయడంతో భారత క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. అన్నట్టు, శిఖర్ ధావన్ సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్‌లోనూ టీమిండియా విజయం సాధించింది. ఆ సెంటిమెంట్ మరోమారు నిజమయ్యింది. అశ్విన్ తిప్పేశాడు.. షమీ, మొహిత్ శర్మ తోడయ్యారు.. జడేజా ఓకే అన్పించాడు.. వెరసి సఫారీ జట్టు కుప్ప కూలింది.
ఇక, తాజా విజయంతో టీమిండియా పూల్`బిలో టాప్ ప్లేస్‌లోకి చేరింది పాయింట్ల పరంగా.