టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకీ, మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లేకీ అస్సలేమాత్రం పొసగలేదు. ఆ కారణంగానే 'జంబో', టీమిండియా 'కోచ్' పదవికి దూరమయ్యాడు. కోచ్‌తో ఆధిపత్య పోరులో భాగంగానే, ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్‌కి 'కోహ్లీ సేన' అప్పనంగా కట్టబెట్టేసిందనే విమర్శలు అప్పట్లో చాలా చాలా గట్టిగా విన్పించాయి.
'ఆటగాళ్ళపై కోచ్ పెత్తనం వుండకూడదు..' అని పరోక్షంగా కోహ్లీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. 'కుంబ్లే కోచ్‌గా వుంటే, మేం సరిగ్గా ఆడలేం..' అని కోహ్లీ సహా టీమిండియాలో కొందరు ఆటగాళ్ళు తేల్చేయడంతో, చేసేది లేక కోచ్ బాధ్యతల నుంచి కుంబ్లే తప్పుకునేలా చేశారు బీసీసీఐ పెద్దలు. అది గతం. ప్రస్తుతానికి వస్తే, తాజాగా కోహ్లీ – అనుష్క వెడ్డింగ్ రిసెప్షెన్‌లో కుంబ్లే దంపతులు కన్పించారు.
విబేధాలు పక్కన పెట్టి, కుంబ్లే – కోహ్లీ ఒక్కటయ్యారని అంతా అనుకున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది కూడా. ఇంతలోనే కొత్త బాంబు పేలింది. ఈసారి 'రోహిత్' బాంబ్ పేల్చాడు కోహ్లీపైన మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్. పరిమిత ఓవర్ల క్రికెట్లో (అంటే వన్డేలు, టీ20 మ్యాచ్లన్నమాట) కోహ్లీ కంటే రోహిత్ ది బెస్ట్ అని తేల్చేశాడాయన. ఎవరి అభిప్రాయం వాళ్ళది అనుకోవడానికి లేదిక్కడ.
ఎందుకంటే, మాజీ క్రికెటర్ల కామెంట్లు, ఒక్కోసారి టీమిండియాని 'షేక్' చేసేస్తుంటాయి. టీమిండియాలో కొత్త వివాదాలకు కారణమవుతాయి. కోహ్లీ, పెళ్ళి కోసం రెస్ట్ తీసుకుంటే అతని స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్, లంకతో వన్డే, టెస్ట్ సిరీస్‌లను గెలిపించిన విషయం విదితమే. పైగా వన్డేల్లో డబుల్ సెంచరీ, టీ20ల్లో సెంచరీ చేసి సత్తా చాటాడు. దాంతో రోహిత్‌ని అంతా ఆకాశానికెత్తేస్తున్నారు. నో డౌట్, రోహిత్ చాలా గొప్ప ఆటగాడు.
కానీ, ఇక్కడ కోహ్లీతో రోహిత్‌ని పోల్చడమే సందీప్ పాటిల్ చేసిన పెద్ద పొరపాటేమో.! అసలే, కోహ్లీకి 'తనకన్నా గొప్ప' ఇంకెవరూ వుండకూడదనే ఫీలింగ్. కుంబ్లే కోచ్‌గా వున్నప్పుడు, టీమిండియా విజయాల క్రెడిట్ కెప్టెన్ కోహ్లీ ఖాతాలో కాకుండా, కుంబ్లే కోచింగ్ ఖాతాలో మాజీ క్రికెటర్లు వేసెయ్యడమే ఇద్దరి మధ్యా వివాదం రాజుకోవడానికి కారణం. మరి, ఇప్పుడు సందీప్ పాటిల్ వ్యాఖ్యలతో రోహిత్ మీదా కోహ్లీ 'ప్రతాపం' చూపుతాడా.? అన్నదే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్.