చాలామందికి వేసవి కాలం వచ్చినప్పుడు మాత్రమే కొబ్బరినీళ్లు గుర్తొస్తాయి. ఆల్రెడీ చాలా పట్టణాల్లో కొబ్బరిబొండాలకు గిరాకీ పెరిగింది కూడా. కానీ కొబ్బరినీళ్లు ప్రతి రోజూ తాగితే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎలాంటి కల్తీ లేకుండా దొరికే కొబ్బరి నీళ్ల వల్ల శరీరానికి చాలా ఉపయోగాలున్నాయని చెబుతున్నారు.
నీరసం, అలసటను దూరం చేసే గొప్ప లక్షణం కొబ్బరినీళ్లలో ఉంది. రోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. ఒంటిలో ఉష్ణోగ్రతను ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో అత్యథికంగా ఉండే మాంగనీస్, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఏ రోజైతే మీరు కొబ్బరినీళ్లు తాగుతారో, ఆ రోజుకు శరీరానికి అవసరమైన మినరల్స్ మీరు అందించినట్టే.
కొబ్బరినీళ్లను తరచుగా తాగడం వల్ల కిడ్నీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు దూరమౌతాయి. ఇందులో ఉండే పొటాషియం, కండరాల సమస్యను పరిష్కరిస్తుంది. దీంతోపాటు శరీరానికి సహజసిద్ధంగా కాల్షియం, మెగ్నీషియం అందించినట్టవుతుంది.
ఇక కొబ్బరినీళ్లు తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. డీ-హైడ్రేషన్ ను తగ్గించడంతో పాటు చర్మ కాంతిని ఇది మెరుగుపరుస్తుంది. కొబ్బరినీళ్లు తాగడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగైనట్టు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది.
అయితే ఎప్పుడో ఓసారి కొబ్బరినీళ్లు తాగి తృప్తి పడకుండా.. ఓ టైమ్ టేబుల్ ప్రకారం పద్ధతిగా కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్టులు. రెగ్యులర్ గా లేదా రోజు తప్పించి రోజు.. కచ్చితమైన సమయాల్లో కొబ్బరినీళ్లు తాగడం వల్ల మంచి ఫలితాలు అందుకోవచ్చని సూచిస్తున్నారు.