ప్రస్తుతం యువత తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్య ఒత్తిడి. పైకి కనిపించని ఈ మానసిక సమస్య, ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణం అవుతోంది. ఎంతోమంది యువత దీని వల్ల తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయం ఒకటి బయటపడింది.
రోజూ వెజిటబుల్స్, పండ్లు తినే వాళ్లలో ఒత్తిడి శాతం గణనీయంగా తగ్గినట్టు ఆస్ట్రేలియాకు చెందిన ఈసీడబ్ల్యూ యూనివర్సిటీ కనుగొంది. తమ దేశానికి చెందిన 8,600 మందికి పైగా వ్యక్తులపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని నిర్థారించింది. వీళ్లలో 25 ఏళ్ల నుంచి 91 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులు ఉన్నారు.
రోజూ 470 గ్రాముల వెజిటబుల్స్, పండ్లు తీసుకున్న వ్యక్తులు.. ఇతరుల కంటే 10శాతం తక్కువగా ఒత్తిడి కలిగి ఉన్నారని ఈ అధ్యయనంలో తేలింది. దీంతో తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉన్నట్టు చూసుకుంటే ఒత్తిడిని తగ్గించుకోవచ్చనే విషయం శాస్త్రీయంగా నిరూపితమైంది.
స్వల్పకాలిక ఒత్తిడి నుంచి యువత తొందరగానే బయటపడుతోంది. అయితే ఇలాంటి ఒత్తిడులన్నీ కలిపి దీర్ఘకాలికంగా ప్రభావం చూపిస్తున్నాయనేది అధ్యయనంలో తేలింది. ఇలా దీర్ఘకాలిక ప్రభావం పడకుండా ఉండాలంటే.. ప్రతి రోజూ 470 గ్రాముల కూరగాయలు, పండ్లు తీసుకోవాలని అధ్యయనం సూచిస్తోంది.
తినే ఆహారంలో ఫ్రూట్ సలాడ్స్, వెజిటబుల్ సలాడ్స్ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు.. శాకాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవితకాలం పెరుగుతుందనే విషయాన్ని వీళ్లు గుర్తుచేస్తున్నారు.