ప్రేక్షకుల్లో వస్తున్న మార్పు ఆనందం కలిగిస్తోంది

రవితేజ…ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. ఆయనతో మాట్లాడుతుంటే ఓ ఇడియట్ చంటిగాడితోనో, దుబాయ్ శీనుతోనో, అత్తిలి సత్తిబాబుతోనో మాట్లాడుతున్నట్లుంటుంది. అడిగిన వాటికి తడుము కోవడం ఆయనకు అలవాటు లేదు. చెప్పాలని చెప్పడం అంతకన్నా అలవాటు లేదు..తనకు…

రవితేజ…ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. ఆయనతో మాట్లాడుతుంటే ఓ ఇడియట్ చంటిగాడితోనో, దుబాయ్ శీనుతోనో, అత్తిలి సత్తిబాబుతోనో మాట్లాడుతున్నట్లుంటుంది. అడిగిన వాటికి తడుము కోవడం ఆయనకు అలవాటు లేదు. చెప్పాలని చెప్పడం అంతకన్నా అలవాటు లేదు..తనకు తోచింది చెప్పేయడమే. ఆలోచన, ముందు వెనుక అసలే వుండదు. దటీజ్ రవితేజ. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ కిక్ 2 ప్రేక్షకుల ముందుకు ఈ వారం వస్తోంది. ఈ సందర్భంగా ఆయనతో 'గ్రేట్ ఆంధ్ర' చిట్ చాట్. 

సీక్వెల్ చేయాలి అన్నంత బలమైన పాయింట్ కిక్ లో కానీ కిక్ 2 లో కానీ ఏముంది?

నిజం చెప్పనా..కిక్ చేసినపుడు చివర్న 2 అని ఎందుకు వేసామో మాకే తెలియదు. వేసాం అంతే. ఆ తరువాత ఆ సంగతి మరిచిపోయాం. ఎవరి పనుల్లో వారు పడిపోయాం. కానీ ఓ రోజు వక్కతం వంశీ మంచి పాయింట్ తో వచ్చాడు. బాగుందని డెవలప్ చేసాం. తీరా చేసిన తరువాత అదే కిక్ 2 అయితే బాగుంటుంది అనిపించింది. అంతే రెడీ అయిపోయాం.పార్ట్ 2 కి బ్యానర్ మారినట్లుంది. కళ్యాణ్ రామ్ కు ఓ సినిమా చేయాల్సి వుంది. పైగా సురేందర్ రెడ్డి వాళ్ల బ్యానర్ లోనే పరిచయం అయ్యాడు. సో, అలా సెట్ చేసాం.

సాధారణంగా మీ సినిమాల్లో తక్కువగా కనిపించే ఎమోషన్లు, హ్యూమన్ ఏంగిల్ కిక్ లో వుంది. ఇక్కడ కూడా అదే లైన్ లో వెళ్లారా?

విక్రమార్కుడు లో కూడా మీరన్న యాంగిల్ వుంది. అయితే అది ఒక్కటే వుంటే జనం రవితేజ సినిమాను ఓకె అనరు. అక్కడ అత్తిలి సత్తిబాబు కూడా వున్నాడు. వుండాలి. సో. నా నుంచి ప్రేక్షకులు కోరుకునేది ప్లస్, మరి కాస్త వుండాలి. ఈ సినిమా కూడా అలాగే వుంటుంది.

అంటే, ప్రేక్షకులు మిమ్మల్ని ఓ ఇమేజ్ చట్రంలో బిగించారా? లేక మీరే అందులోంచి రాలేకపోతున్నారా?

సరిగ్గా చెప్పాలంటే, రెండూ కాదు. ఈ తరహా క్యారెక్టరైజేషన్ ను తయారు చేసింది పూరి జగన్నాధ్. అది ఇడియట్ లో. అది జనాలకు నచ్చింది. అక్కడి నుంచి జనం నన్ను ఆ తరహా పాత్రల్లో చూడడం అలవాటు చేసుకున్నారు. అది అలా, నా సినిమా అంటే ఇలాగే వుంటుంది..వుండాలి..అనే వరకు వెళ్లింది. నేను కొన్ని ట్రయ్ చేసాను. కానీ జనం అంగీకరించలేదు. 

ఇక ఇలాగే కొనసాగాలంటే ఎంత కాలం సాధ్యం కావచ్చు.?

లేదు. ప్రేక్షకులు మారుతున్నారు. శ్రీమంతుడు చూడండి. జనం మెచ్చారు. అంటే జనం మారుతున్నారు. హీరోలు కాస్త డిఫరెంట్ గా ప్రయత్నిస్తే ఓకె అంటున్నారు. అది చాలా ఆనందం కలిగిస్తోంది. మనం కూడా కాస్త డిఫరెంట్ గా ఏదైనా చేయవచ్చేమో అన్న ధైర్యాన్ని ఇస్తోంది. పైగా మార్కెట్ ఓపెన్ అయింది. అది కూడా మంచి పరిణామమే. 

ఈ జనరేషన్ కుర్రాళ్లలో కొంతమంది అయినా మీ స్టయిల్ ను అనుకరిస్తున్నారు. అప్పుడేమనిపిస్తోంది. మీకెలా వుంది.?

కరెక్ట్ కాదేమో. నా స్టయిల్ ను వాళ్లు అనుకరించడం లేదు. నేను చేస్తున్న తరహా పాత్రలు చేస్తున్నారు. దాని వల్ల నన్ను అనుకరిస్తున్నారేమో అనిపించవచ్చు.

అలా అయితే మీరు చేయాల్సిన సబ్జెక్ట్ లకు కాంపిటీషన్ పెరిగింది అనుకోవాలా?

అదేం లేదండీ…ఎవరి క్యాన్వాస్ వారిది. ఏ కథ అయినా, హీరోను బట్టి, డైరక్టర్ ను బట్టి స్పాన్ మారిపోతుంది. పెద్ద స్పాన్ కావాలనుకుంటే, లేదా నేను కావాలనుకుంటే నా దగ్గరకే వస్తారు కదా?

కిక్ 2 ఎలా వచ్చింది?

చాలా బాగుంది. ఇందులో కూడా ఎమోషన్లు, మెసేజ్ అన్నీ వుంటాయి. 

దీనికి శ్రీమంతుడికి ఏమైనా పోలికలు వున్నాయా? పల్లెటూరి జనాలను ఉద్దరించడం?

అబ్బే..అది వేరు వేరు. అస్సలు పోలికే లేదు.

సన్నబడడం అన్నది న్యూ జనరేషన్ తో పోటీ కోసమేనా?

ఛ..సన్నబడడం అసలు సినిమాల కోసమే కాదు. నా కోసం, నా హెల్త్ కోసం. 

ఇందుకోసం చాలా కష్ట పడ్డట్టున్నారు. నాన్ వెజ్ కూడా మానేసి.?

అంతేం లేదు. నూనెలు, ఫ్యాట్ ఇలాంటివి తగ్గించేసాను. తిండి తింటున్నా కానీ, కాస్త ఫ్యాట్ ఫుడ్ ఆపేసాను. లిక్కర్ ఎప్పుడన్నాే టచ్ చేసేవాడినేమో. అదీ మానేసాను.

మీరు చేసిన చెప్పుల ప్రకటన అంతగా నచ్చలేదని ఫీడ్ బ్యాక్ వుంది?

అవునా..రెండో ఏడ్ చూడండి అది మీకు నచ్చుతుంది.

నిర్మాతలతో తరచు మీకు సమస్యలు ఎందుకు వస్తుంటాయి?

అందరితో రావండీ.. ఎక్కడో ఒకళ్లిద్దరితో. నాకనే ఏంటి ఏ హీరోకైనా వస్తుంటాయి. 

కళ్యాణ్ రామ్ తో ఓకెనా?

వైనాట్..వు ఆర్ హ్యాపీ

బెంగాల్ టైగర్ సంగతులేమిటి?

పక్కా నాన్ వెజిటేరియన్ సినిమా అండీ..అంటే మాస్ మసాలా అన్నమాట. కమర్షియల్ సినిమా. సంపత్ నంది బాగా తీసున్నాడు. 

రకుల్ మీ ఎనర్జీకి సరిపోయిందా?

సూపర్. ఆ అమ్మాయి చాలా కష్టపడుతుంది. ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్ కు ట్రయ్ చేస్తుంది. 

కొత్త ప్రాజెక్టులు?

ఏమీ అనుకోనండీ..వస్తాయి. డిస్కస్ చేస్తాం..బాగుంటే చేసేయడం అంతే.

ఓకె థాంక్యూ

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి