కపిలముని : ఎవరికోసమీ కంచిగరుడసేవ?

దాన వీర శూరకర్ణ సినిమా గుర్తుందా? మహాభారత యుద్ధం జరగబోతున్నదని ఫైనలైజ్‌ అయిన తర్వాత.. కురు పాండవులు విడివిడిగా.. ఇతర రాజుల మద్దతును కూడగట్టుకోవడంలో బిజీ అవుతారు. ఇర వర్గాలకు కావల్సిన వాడు అయిన…

దాన వీర శూరకర్ణ సినిమా గుర్తుందా? మహాభారత యుద్ధం జరగబోతున్నదని ఫైనలైజ్‌ అయిన తర్వాత.. కురు పాండవులు విడివిడిగా.. ఇతర రాజుల మద్దతును కూడగట్టుకోవడంలో బిజీ అవుతారు. ఇర వర్గాలకు కావల్సిన వాడు అయిన కృష్ణుడి సాయం పొందడానికి పాండవుల తరఫున అర్జునుడు, కౌరవుల తరఫున దుర్యోధనుడి కృష్ణుడి సముఖానికి చేరుకుంటారు. వారు తన వద్దకు వస్తున్న సంగతి గ్రహించి.. నిద్ర నటిస్తాడు కృష్ణుడు. దుర్యోధనుడు ముందు వచ్చి గొల్లవాడి కాళ్ల దగ్గర మనం కూర్చోవడం ఎందుకు అని తలవైపు కూర్చుంటాడు. అర్జునుడు వచ్చి కాళ్ల దగ్గర కూర్చుంటాడు. కృష్ణుడు లేచి అర్జునుడిని తొలుత చూసి.. ముందు కోరుకునే ఛాన్సు అర్జునిడికి ఇస్తూ.. అరివీర భయంకరులైన యాదవ సైన్యం అంతా ఒక ఎత్తు, తానొక్కడినీ ఒక ఎత్తు.. ఎవరు కావాలో కోరుకోమని అంటాడు. పైగా తాను ‘ఆయుధము ధరింపనని,  యుద్ధము సేయనని, ఊరక సాయము మాత్రమే’నని కూడా సెలవిస్తాడు. ఆ సందర్భంలో.. యుద్ధం చెయ్యకుండా, ఆయుధం పట్టకుండా.. ‘ఆల మందలతో ఆలుమందలతో గడిపే  ఈ పశుపాలకుడి కంచిగరుడ సేవ ఏరికి కావలె?’ అనకుంటూ ఈసడిస్తాడు దుర్యోధనుడు.

ఉపోద్ఘాతం సుదీర్ఘం అయిపోయింది కానీ.. నిజానికి తెలంగాణ బిల్లు మీద శాసనసభలో చర్చ అనేది కూడా ఇంచుమించు అదే మాదిరిగా కనిపిస్తున్నది. బిల్లులోని అన్ని అంశాలపై, విడివిడిగా.. అంశాలవారీగా విపులంగా చర్చ జరిపి పంపించాలని దిగ్విజయసింగ్‌ కూడా చెబుతున్నారు. అయితే శాసనసభలో బిల్లులోని ప్రతి అంశాన్ని విడివిడిగా చర్చించవచ్చు గాక.. కానీ ఆ చర్చకు కేంద్రం వద్ద విలువ ఉంటుందా లేదా అన్నది చాలా కీలకం. వీరి చర్చకు ఎలాంటి మన్నన దక్కని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి అంశం మీద విడివిడిగా అభిప్రాయాలు తీసుకుంటారు గానీ.. ఖచ్చితంగా మెజారిటీ అభిప్రాయం ప్రకారం.. ఆ అంశం విషయంలో  కేంద్రం మార్పు చేర్పులకు సిద్ధంగా ఉంటుందని మాత్రం ఎవ్వరూ హామీ ఇవ్వడం లేదు. 

మరింక మెజారిటీ అభిప్రాయం ప్రకారం బిల్లులో మార్పుచేర్పులు ఉంటాయనే నిర్దిష్టమైన హామీ కేంద్రం నుంచి లేనప్పుడు.. ఈ వృథా కంచిగరుడ సేవ వంటి చర్చకు విలువేముంది. కనీసం ప్రతి అంశం మీద.. విడివిడిగా తీర్మానం చేయించి.. మెజారిటీ తీర్మానాల ప్రకారం బిల్లులో మార్పు చేర్పులు ఉంటాయనే విషయాన్ని అయినా కేంద్రం నిర్ధారిస్తే బాగుంటుంది. సబబుగా ఉంటుంది. అలాంటి కసరత్తు ఏమీ లేకుండా.. మీ అభిప్రాయాలు మీరు వ్యక్తంచేసి పంపండి. మీరు చర్చ జరిపి పంపండి. మీరు ఏం చర్చించారో ఏమాత్రం పట్టించుకోకుండా మళ్లీ మా చిత్తం వచ్చినట్లు మేం అందులో మార్పు చేర్పులు చేసుకుని.. రాష్ట్రాన్ని చీల్చేస్తాం.. అని అతి భయంకరమైన దురహంకారంతో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. 

కాంగ్రెస్‌ తెలంగాణలోని ఎంపీసీట్ల మీద అత్యాశతో ఈ దురాగతానికి పాల్పడుతుండడం ఒక ఎత్తు. అదే సమయంలో.. అత్యంత హేయమైన రీతిలో ప్రదర్శిస్తున్న ఈ దురహంకారాన్ని పార్లమెంటులో ప్రతిపక్షాలు కూడా ఈసడించే అవకాశం ఉంది. ఆ మాటకొస్తే స్వపక్ష సభ్యులూ ఇప్పటికే ఈసడిస్తున్నారు. అధికారపక్షానికి మద్దతిస్తున్న  ఎస్పీ వంటి పార్టీలు కూడా ఈసడిస్తున్నాయి. కాంగ్రెసు స్వార్థపోకడలను మాత్రం అడ్డుకుంటాం అంటూ భాజపా నర్మగర్భంగా హెచ్చరిస్తోంది. 

ఒకవేళ తెలంగాణ బిల్లు పార్లమెంటు ముంగిట ఆగిపోయే పరిస్థితి వస్తే.. దానికి కేంద్రం అనుసరిస్తున్న ఇలాంటి దురహంకార, ఏకపక్ష, నిరంకుశ వ్యవహార సరళే కారణం అని అనుకోవాలి. 

-కపిలముని

[email protected]