లవ్‌లెటర్‌ 2చంద్రబాబు : మీ జిల్లా గొంతు తడపవా?

డియర్‌ చంద్రబాబూ! Advertisement నీకు కళ్లు రెండు ఉన్నాయనే సంగతి మాకు తెలుసు! అందులో ఒకటి తెలంగాణ అని, మరొకటి సీమాంధ్ర అనే సంగతి కూడా మాకు తెలుసు. ఈ రెండు కళ్లను కాపాడుకునే…

డియర్‌ చంద్రబాబూ!

నీకు కళ్లు రెండు ఉన్నాయనే సంగతి మాకు తెలుసు! అందులో ఒకటి తెలంగాణ అని, మరొకటి సీమాంధ్ర అనే సంగతి కూడా మాకు తెలుసు. ఈ రెండు కళ్లను కాపాడుకునే ప్రాసెస్‌లోనే తమరు రాష్ట్రం ఎలా తగలబడిపోతూ ఉన్నా సరే.. అభినవ నీరో చక్రవర్తిని తలపిస్తూ ఫిడేలు వాయించుకుంటూ కూర్చుంటున్నారనే సంగతి కూడా మాకు చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. ఇంకా ఇలాంటి పితలాటకపు సమస్యలు ఎన్ని వచ్చినా సరే.. తమకు రెండు కళ్లు మాదిరిగానే రెండు చెవులు, రెండు చేతులు, రెండు కాళ్లు.. రెండు ముక్కు రంధ్రాలు అన్నీ ఉన్నాయనే సంగతి కూడా మాకు తెలుసు. కానీ చంద్రబాబూ తమరికి మాతృమూర్తి మాత్రం ఒక్కరేకదా! ఏమో తీరా సమస్యను నివేదించిన తర్వాత.. అందులో కూడా తమరు కొత్త సత్యాలు చెప్పగలరన్న భయంతో ముందే ప్రస్తావించడం జరిగింది. మన్నించండి. 

తమరికి సొంతూరు, సొంత జిల్లా ఒకటే ఉన్నదనే మేం అనుకుంటున్నాం. తమ జిల్లా చిత్తూరు గొంతు ఎండిపోతూ నానా పాట్లు పడుతున్నది. ఆ సత్యం తమకు తెలియనిది కాదు. తమరు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఏలుబడి సాగించినా సరే.. జిల్లా దాహార్తిని తీర్చడానికి ఏమైనా చేయవచ్చునని ఆలోచన తమకు కలగలేదంటే అది ఆ జిల్లా వాసులు చేసుకున్న పాప ఫలితమే అనుకోక తప్పదు. అయితే మంచోచెడో.. లేదా, ఎటూ తన అధికారం గతించిపోతున్నది గనుక.. ఏదో కాస్త చరిత్రలో మిగులుదామనే తపనో గానీ.. కిరణ్‌కుమార్‌రెడ్డి కండలేరు రిజర్వాయరు నుంచి.. చిత్తూరు జిల్లాకు తాగునీటిని తరలించే ప్రాజెక్టును ప్రకటించారు. ఇది కార్యరూపం దాలిస్తే.. మీ సొంత జిల్లా దాహార్తి కాస్త తీరే అవకాశం ఉంటుంది. 

అయితే, నీటి యుద్ధాలు వస్తాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి  విభజన అనంతర పరిణామాల గురించి పదేపదే హెచ్చరిస్తూ ఉండవచ్చు గాక.. సమైక్యం కోరుతున్న పార్టీల వారు ఎవ్వరైనా కూడా  ఇదే తీరులో స్పందిస్తూ ఉండవచ్చు గాక.. కానీ విభజన పూర్తయ్యేవరకు వ్యవధి ఎక్కడుంది? నీటి యుద్ధాలు ఇప్పుడే మొదలైపోయాయి. ఎండిపోతున్న చిత్తూరు జిల్లావాసుల దాహార్తిని తీర్చడానికి సేద్యానికి మేం వాడుకునే కండలేరు నీటిని తరలిస్తారా? ఎంత కండకావరం అంటూ.. నెల్లూరు జిల్లాలోని నీ పార్టీ నాయకులే అడ్డుపుల్లలు వేస్తున్నారు చంద్రబాబూ! ఈ విషయంలో తమరు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది!!

ఇక్కడ తమరే కాదు, తమ పార్టీ కి చెందిన సింహపురి దండనాయకులు కూడా గుర్తించాల్సిన విషయం ఒకటుంది! వీరంతా కొట్టుకుంటున్నది కేవలం కృష్ణా లోని మిగులు జలాలలో వాటాల కోసం. నికర కృష్ణా జలాల్లో ఎలాగూ దిక్కులేదు. కాకపోతే.. మిగులు జలాల విషయాల్లో కూడా కాట్లాడుకోవడం ఏంటి? తమరు పార్టీ శ్రేణులకు ఏ కొంచెమైనా దిశానిర్దేశం చేయగల స్థితిలో ఉన్నారా లేదా? ప్రస్తుతం సంకల్పించిన ప్రాజెక్టు చిత్తూరు జిల్లాకు తాగునీటిని అందించడానికి ఉద్దేశించినది మాత్రమే. ఇక్కడ తాము సేద్యం చేసుకునే నీళ్లు ఆమేరకు తగ్గిపోతాయి గనుక.. పొరుగున ఉన్న చిత్తూరు జిల్లాకు తాగడానికి కూడా నీళ్లివ్వం అంటూ మొండికేస్తున్న మీ పార్టీ వారిని దారిన పెట్టగల స్థితిలో తమరున్నారా లేదా చంద్రబాబు గారూ!

రాష్ట్ర విభజన విషయంలో మాదిరిగా ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే కొట్టుకుని కొట్టుకుని వారికే అలుపు వచ్చి ఊరుకుంటార్లే అనే సిద్ధాంతాన్నే తమ సొంతజిల్లా విషయంలోనూ అనుసరిస్తారా? లేదా, కనీసం పొరుగుజిల్లా తాగునీటికి కూడా సహకరించకుండా భీష్మించుకుంటే అది ఏపాటి మానవత్వం అవుతుందని వారికి బుద్ధి చెప్పగలరా? దయచేసి కాస్త ఆలోచించుకోండి. చంద్రబాబుగారూ.. తమరు ప్రేక్షకుడు కాదు… నాయకుడు! అని మీరు అనుకున్నా అనుకోకపోయినా.. రాష్ట్రంలోని కొందరు ప్రజలు అనుకుంటున్నారు. కనీసం వారి ఊహలకు అనుగుణంగా  అయినా స్పందించండి.

ప్రేమతో

కపిలముని

[email protected]