లవ్‌లెటర్‌ 2 శంకరన్న: అమ్మగుడికి జాగా కొనలేవా?

డియర్‌ శంకరన్నా.. Advertisement నీదు భక్తిప్రపత్తుల్‌… నీదు అత్యద్భుత కీర్తనల్‌.. నీ స్తోత్ర పాఠావళిన్‌, భజనలున్‌.. వర్ణింప నేనెంత.. గమనింపుమో అన్నా.. అంటూ.. పద్యాలు పాడాలనిపిస్తా ఉన్నదన్నా… నిన్ను జూస్తాంటే. చానాచానా ముచ్చటేస్తండాది. సోనియమ్మకు…

డియర్‌ శంకరన్నా..

నీదు భక్తిప్రపత్తుల్‌… నీదు అత్యద్భుత కీర్తనల్‌.. నీ స్తోత్ర పాఠావళిన్‌, భజనలున్‌.. వర్ణింప నేనెంత.. గమనింపుమో అన్నా.. అంటూ.. పద్యాలు పాడాలనిపిస్తా ఉన్నదన్నా… నిన్ను జూస్తాంటే. చానాచానా ముచ్చటేస్తండాది. సోనియమ్మకు గుడి కట్టిస్తాం.. కట్టిస్తాం… అంటూ నీబోటి తె-కాంగ్రెస్‌ అన్నయ్యలు చాలా మందే చెప్పారు గానీ.. ఒక్కడంటే ఒక్కడైనా నిజంగా ఒక అడుగు ముందుకేశాడా అనేది నా పెశ్న. ఆ మాటకొస్తే.. నువ్వొక్కడే గదన్నయ్యా.. దైర్నంగా అమ్మ గుడి కడతా.. జాగా ఇవ్వండి అంటా అడిగింది. అందుకే నీకు సెభాష్‌ అనాల్సిందేనన్నా. 

మిగతా వాళ్లంతా దొంగలన్నయ్యా. పైసా కర్చు కాకుండా గుండెల్లో గుడి కట్టుకోండి.. ఇళ్లలో పోటో ఎట్టుకోండి.. అంటూ దొంగమాటలు మాటాడతా ఉండారు. 

సోనియమ్మ గుడి కట్టడం అనేది ఇప్పుడు చాలా హాట్‌ టాపిక్‌ గా తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయ వర్గాల్లో నడుస్తోండాదన్నా. తమరు ఈ టాపిక్‌ను టేకప్‌ లేవదీయడం వలన.. ఇది కామెడీ టాపిక్‌ గా మారిపోయినట్లు ఎవరికైన అనిపిస్తే గనుక.. దానికి ఎవ్వరూ పూచీ కాదు. కానీ మొత్తానికి తమరు మాత్రం ఈ టాపిక్‌ ను భిన్నమైన శైలిలోనే టేకప్‌ చేశారనేది సత్యం. తమ నియోజకవర్గంలోనే గుడి కట్టించాలని అత్యంత ఉత్సాహపడుతున్న తాము క్లాక్‌ టవర్‌ వద్ద గానీ రైల్వే స్టేషను ముందుగానీ అమ్మ గుడి కట్టాలనేది నీ కోరిక. బాగానే ఉన్నాది గానీ అన్నయ్యా.. అందుకు నువ్వు లెటర్రాసిన సంగతిని జనం నమ్మతారో లేదోనని.. ఆ లెటరు గూడా ప్రత్యేకంగా ప్రెస్‌మీట్లో చూపించినావు బాగానే ఉండాది! 

అయితే అన్నయ్యా నాదో డౌటు! సోనియమ్మ మీద అంత బక్తి ఉండేటోడివి.. నువ్వు అదాట్న అలా అమ్మను తీస్కోచ్చి బజారు పాల్జేసినట్టుగా.. నిత్యం ట్రాఫిక్కుతో వేగిపోతూ ఉండే చోట్ల గుడికట్టడం ఎందుకు. నాకు ఊరికే జాగా ఒద్దు.. గవర్నమెంటు రేటుకిస్తే కొనుక్కుంటా అంటా.. నువ్వు అదికార్లను దేబిరించడం ఎందుకు? అయినా నువ్వు ప్లాన్‌ చేసిన జాగాల్లో వాళ్లు పర్మిషను ఇచ్చినా గూడా.. ఏదో పిచిక గూడు అంత గుడి వస్తాదే తప్ప.. జనం నిలబడి మొక్కేంత గుడి ఎట్టా వొస్తాదీ అని నా డౌటు!

అయినా అన్నయ్యా.. నీ బక్తి నికార్సుగా పది కాలాలపాటూ నిలబడాలంటే.. స్టేటు ఇచ్చినదానికి అమ్మ గుడి కడితే ఎలా ఉండాల? చూసేటోళ్లకి దిమ్మదిరిగి బొమ్మలాట ఆడినట్లుడాల. సిటీకి శివార్లలో ఓ పదెకరాల జాగా కొని.. డిల్లీలో లోటస్‌ టెంపుల్‌ లాంటి వాటి తలదన్నేల బెమ్మాండమైన గుడి కట్టు. 

అప్పుడు రాముడి గుడికోసం బీజేపోళ్లు ఊరికొక్క ఇటుక తెప్పించినారే ఆమాదిరిగా, ఇప్పుడు సర్దార్‌ పటేల్‌ బొమ్మ కోసం ఊరూరా ఇనుము పంపించమని అడుగుతున్నారే ఆ మాదిరిగా.. తెలంగాణలో ప్రతి మనిషినుంచి చందాలు పోగుజెయ్యి. అందరి చేతులు కలిస్తే.. అద్భుతమైన గుడి వస్తాది ఏటంటావు? అప్పుడు అమ్మ కూడా మురిసిపోతాది. ఇంత పని నెత్తిన బెట్టుకోని పూర్తిచేసినందుకు నీగ్గూడా కలకాలం పేరుంటాది. 

సోనియమ్మను బజారు పాల్జేయకుండా.. మాంఛి అతిపెద్ద గుడి కట్టడం మీదనే మనసెట్టు ప్లీజ్‌

ప్రేమతో

కపిలముని

[email protected]