గతేడాదిలానే ఈ ఏడాది కూడా సెలబ్రిటీల పెళ్లిళ్లు జోరుగా సాగాయి. ఇంకా చెప్పాలంటే, గతేడాది కంటే 2024లోనే ఎక్కువమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు. నాగచైతన్య, రకుల్, కీర్తిసురేష్, కిరణ్ అబ్బవరం, మేఘా ఆకాష్.. ఇలా చెప్పుకుంటూపోతే 2024లో పెళ్లిపీటలెక్కిన సెలబ్రిటీల లిస్ట్ చాలా పెద్దది.
ఈ ఏడాది అందర్నీ ఆకర్షించిన పెళ్లి నాగచైతన్యది. సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తొందరగానే శోభితకు కనెక్ట్ అయ్యాడు నాగచైతన్య. ఇద్దరూ సీక్రెట్ గా ప్రేమించుకున్నారు. ప్రేమ విషయం బయటకొచ్చే టైమ్ కు ఈ జంట పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అలా ఈ ఏడాది ఆగస్ట్ లో నిశ్చితార్థం చేసుకొని డిసెంబర్ లో ఇద్దరూ కలిసి కొత్త జీవితం ప్రారంభించారు.
కరోనా టైమ్ లో తన ప్రేమను బయటపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా 2024లో పెళ్లి చేసుకుంది. ప్రియుడు జాకీ భగ్నానీని తన జీవితంలోకి ఆహ్వానించింది. గోవాలో 3 రోజుల పాటు వీళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సిక్కు, సింధి సంప్రదాయాల్లో రెండుసార్లు ఈ జంట పెళ్లి చేసుకుంది.
సిద్దార్థ్-అదితి కూడా పెళ్లితో ఒకటయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట, ఈ ఏడాది సెప్టెంబర్ లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2 నెలలు గ్యాప్ ఇచ్చి మరోసారి పెళ్లి చేసుకోవడం విశేషం. మొదటిసారి దక్షిణ భారత సంప్రదాయంలో, రెండోసారి రాజుల సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు.
రీసెంట్ గా కీర్తిసురేష్ కూడా పెళ్లి చేసుకుంది. నాలుగేళ్లుగా ఈమె పెళ్లిపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు తన స్నేహితుడు ఆంటోనీ తటిల్ ను ఆమె గోవాలో వివాహమాడింది. కీర్తిసురేష్, ఆంటోనీ కలిసి దాదాపు ఏడేళ్లు చదువుకున్నారు. ఆంటోనీ తటిల్ కు పలు వ్యాపారాలున్నాయి.
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న స్టార్స్ జాబితాలో తాప్సి, మేఘా ఆకాశ్, కిరణ్ అబ్బరవం కూడా ఉన్నారు. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ మథియాస్ బోను ఉదయ్ పూర్ లో పెళ్లాడింది తాప్సి. వీళ్లు దాదాపు పదేళ్లు ప్రేమించుకొని మరీ పెళ్లి చేసుకున్నారు. ఇక కిరణ్ అబ్బవరం, తన తొలి సినిమా హీరోయిన్ రహస్యను పెళ్లి చేసుకున్నాడు. అటు మేఘా ఆకాష్ కూడా తన పెళ్లిపై ఏళ్లుగా వస్తున్న పుకార్లకు ఈ ఏడాది ఫుల్ స్టాప్ పెట్టింది. బాయ్ ఫ్రెండ్ సాయివిష్ణుతో మేఘా ఆకాష్ వివాహం చెన్నైలో గ్రాండ్ గా జరిగింది.
హీరోయిన్లు కృతి కర్బందా, వరలక్ష్మి శరత్ కుమార్, సోనాక్షి సిన్హా కూడా 2024లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కృతి కర్బందా, పుల్కిత్ సమ్రాట్ నాలుగేళ్లు ప్రేమించుకొని ఈ ఏడాది సమ్మర్ లో పెళ్లి చేసుకున్నారు. అటు వరలక్ష్మి శరత్ కుమార్, ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త నికొలాయ్ సచ్ దేవ్ ధాయ్ లాండ్ లోని ఓ బీచ్ రిసార్ట్ లో పెళ్లి చేసుకున్నారు. మరోవైపు సోనాక్షి సిన్హా, తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను పెళ్లాడింది. అపర్ణా దాస్, అక్ష, మీరా చోప్రా, ఐశ్వర్య అర్జున్ కూడా ఈ ఏడాది పెళ్లిళ్లు చేసుకున్న తారల జాబితాలోకి చేరిపోయారు.
దర్శకుడు క్రిష్ కూడా ఈ ఏడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను ఆయన వివాహం చేసుకున్నాడు. అటు క్యారెక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజు కూడా స్రవంతి అనే అమ్మాయిని అమెరికాలో పెళ్లి చేసుకున్నాడు. దర్శకుడు సందీప్ రాజ్, హీరోయిన్ చాందినీ రావును పెళ్లాడగా.. నటుడు సాయికిరణ్, సీరియల్ నటి స్రవంతిని వివాహం చేసుకున్నాడు. పుష్ప ఫేమ్ డాలీ ధనుంజయ కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకున్నాడు.
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న తారలే కాదు, కొత్త ఏడాదిలో పెళ్లి రెడీ అయిన తారల జాబితా కూడా పెద్దగానే ఉంది. హీరో అఖిల్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. నారా రోహిత్ కూడా పెళ్లికి రెడీ అయ్యాడు. తమన్నా ఆల్రెడీ తన ప్రేమను బయటపెట్టింది. కొత్త ఏడాదిలో కచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది. అటు మరో హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కూడా 2025లో పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటాడని భావించిన ప్రభాస్, తన పెళ్లిని మరో ఏడాది వాయిదా వేశాడు.