2024 ఆంధ్ర ఎన్నికలలో అత్యధికంగా వినబడుతున్న పదం – ఆపరేషన్ కాపు! కాపుల ఓట్లు ఎవరికి పడితే వాళ్లదే గెలుపు అనే అభిప్రాయం కలిగించింది మీడియా. దాంతో వాళ్ల ఓట్ల గురించే ప్రతీ వాళ్లూ మాట్లాడసాగారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గత పదేళ్లలో ఎన్నడూ చూపించనంత చురుకుదనాన్ని యీ ఎన్నికలలో చూపించడంతో ఆయన కాపుల ఓట్లని ప్రభావితం చేస్తాడని అనసాగారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఉండగానే గోదావరి జిల్లాలు ఎవరివైపు మొగ్గు చూపితే వారిదే గెలుపుగా ఉండేదని, ఆంధ్ర ఏర్పడ్డాక అది మరీ ప్రస్ఫుటమైందని, యీసారి ఎప్పటి కంటె ఎక్కువగా గోదావరి జిల్లాలే ఫలితాలను నిర్ణయిస్తాయని వ్యాఖ్యానించ సాగారు. దానితో పాటే గోదావరి జిల్లాలంటే కాపుల జిల్లాలేనని, కాపులు ఏ పార్టీ వైపుంటే, దాని పక్షానే గోదావరి జిల్లాలు, తద్వారా యావత్తు రాష్ట్రం ఉంటుందని తీర్మానిస్తున్నారు.
ఇక్కడ చాలామంది విస్మరిస్తున్నదేమిటంటే కాపులు గోదావరి జిల్లాలలో పెద్ద సంఖ్యలో ఉన్నారు కానీ గోదావరి జిల్లాలంటే కాపులు మాత్రమే కాదు. అన్ని కులాల వారూ ఉన్నారు. రెడ్లు తక్కువ కానీ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ, వెలమ వగైరా అగ్రకులాల వారు గణనీయంగా, బలంగా ఉన్నారు. సంఖ్యాపరంగా బిసిలు, ఎస్సీలూ కూడా చాలామంది ఉన్నారు. కులపరమైన జనాభా గణన జరిగి ఉంటే సరైన లెక్కలు తెలిసేవి. అవి లేకపోయినా వాటిని కాపు జిల్లాలుగా ముద్ర కొట్టడం సరి కాదు. ప్రతి నియోజకవర్గంలో వారిని ఢీకొనే యితర కులాలున్నాయి. ఇక గోదావరి జిల్లాలు యావత్తు రాష్ట్రపు పబ్లిక్ మూడ్‌ను నిశ్చయించవు. ప్రతిబింబిస్తాయంతే. అందువలన గోదావరి జిల్లా కాపులే రాష్ట్రంలో గెలుపెవరో నిర్ణయిస్తారని భావించడం సరి కాదు.
అసలు కాపులు మూకుమ్మడిగా ఓటేస్తారన్న గ్యారంటీ లేదు. కాపులు అని సామూహికంగా వాడడమే తప్ప, వారిలో ఎన్నో ఉపకులాలు. ఎక్కువ, తక్కువ ఫీలింగ్స్ ఉన్నాయి. ఒకరితో మరొకరికి వివాహబంధాలు లేవు. కలిసికట్టుగా, గంపగుత్తగా ఓటేసే అలవాటు బొత్తిగా లేదు. వారందరి ఆర్థిక స్థితి ఒకటి కాదు. జమీందార్ల నుంచి పాలేర్ల దాకా అన్ని వర్గాల వారూ ఉన్నారు. అత్యున్నత విద్యావంతుల నుంచి, దాదాపు నిరక్షర రాస్యుల దాకా ఉన్నారు. అలాటప్పుడు అందరి ఆలోచనా ధోరణి ఒకేలా ఉంటుందని, ఒకేలా ఓటేస్తారని ఎలా అనుకోగలం? అనగలం? కొత్త ప్రాంతాలకు లేదా నగరాలకు వలస వెళ్లినపుడు కాపులంతా ఒకే చోట స్థలాలు కొనుక్కుని, ఖాళీగా ఉన్నవి తమ వాళ్ల చేతనే కొనిపించి, తమ స్థావరంగా మార్చుకున్న సందర్భాలు నేను చూడలేదు. కొన్ని కులాలలో అది చూశాను. కాపులు ఎవరికి నచ్చిన చోట వారు కొనుక్కుని స్థిరపడతారు కానీ మన కాలనీలో మనవాళ్లే ఉండేట్లు చూడాలి అనే తాపత్రయం వారిలో కానరాదు.
ఇతర ప్రాంతాల్లో సంఘాలు ఏర్పాటు చేసి, తమ కులస్తులకు మేలు చేయాలనే ప్రత్యేక శ్రద్ధ కూడా నేను గమనించలేదు. సంఖ్యాపరంగా చూస్తే కాపుల సంఖ్య అంత ఎక్కువగా ఉన్నపుడు, నగరాల్లో పదుల సంఖ్యలో వారి సంఘాలు కనబడాలి. కనబడుతున్నాయా? వారంతా ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తారు. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో, సినిమాల్లో రాణించిన వారంతా సొంతంగా ఎదిగినట్లే కనబడుతుంది తప్ప వారి ఎదుగుదలకు కులం ఫ్యాక్టర్ ఉపయోగపడినట్లు తోచదు. వ్యక్తిగతంగా కొందరికి ఉపకారబుద్ధో, పక్షపాతమో ఉండవచ్చు కానీ జనరల్‌గా చూస్తే అది కొట్టవచ్చినట్లు కనబడదు. రాజకీయాల్లో కూడా స్వయంప్రతిభతో రాణించినవారు రాణించారు, లేనివారు లేదు. ముఖ్యమంత్రి పదవి తప్ప తక్కిన పదవులన్నీ అనుభవించారు. అందువలన కాపులు ఏదో నష్టపోయారని, వారికి ఎవరో పని గట్టుకుని ద్రోహం చేశారనీ అనడానికి లేదు.
వారిని బిసిలలో చేర్చాలని కాపుల పేరు మీద రాజకీయం చేయాలనుకున్న కొందరు డిమాండ్ చేస్తారు కానీ సాధారణ కాపు ఎవరూ తను సామాజికంగా వెనకబడిన వాడినని ఒప్పుకోరు. తమ వారిలో కొందరు పేదలున్నారని అంగీకరిస్తారు. ఈ మాట ప్రతి కులం వాడూ ఒప్పుకోవలసినదే! ధనికులు, ఉన్నతోద్యోగాల్లో ఉన్న ఎస్సీలకు రిజర్వేషన్ సౌకర్యం లభించడం పట్ల తక్కినవారందరికీ ఫిర్యాదు ఉంది. బిసిలకు క్యాప్ పెట్టారు కానీ అది చాలా ఎక్కువ. బిసి రిజర్వేషన్ పెట్టగానే మామూలుగా తమది పెద్దకులం అని చెప్పుకునేవారు కూడా, రిజర్వేషన్ డిమాండు దగ్గరకు వచ్చేసరికి మమ్మల్ని సామాజికంగా తక్కువగా చూస్తారని చెప్పుకోవడం చూసి విస్తుపోవాల్సిందే. ఇవన్నీ చూసి కడుపు మండుతూ వచ్చిన అగ్రవర్ణాలను చల్లార్చడానికి మోదీ ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ యిచ్చింది. నిజంగా పేదలైతే ఏ కులం వారికి యిచ్చినా ఎవరికీ ఆక్షేపణ ఉండదు కాబట్టి దీన్ని అందరూ ఆమోదించారు.
కాపుల విషయానికి వస్తే తమను బిసిలుగా చెప్పుకోవడం వాళ్లకు రుచించకపోయినా రిజర్వేషన్ సౌకర్యం వస్తే కనీసం తమలో పేదలు బాగు పడవచ్చనే భావన ఉంది. కానీ దాని గురించి గట్టిగా ఉద్యమించేటంత పట్టుదల వారిలో లేదు. ఇతర రాష్ట్రాలలో వీరి లాటి వారే అయిన మరాఠాలు, జాట్లు, గుజ్జర్లు రిజర్వేషన్ల కోసం నెలల తరబడి ఉధృతమైన ఉద్యమాలు చేయడాలు, ఒక్కోప్పుడు అవి హింసాత్మకంగా మారడాలూ జరిగాయి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విడిపోయాక ఆంధ్రలో కానీ కాపులు అటువంటి ఉద్యమం చేయలేదు. కాపు గర్జన వంటి సమావేశాలలో దీని గురించి ఉపన్యాసాలు, తీర్మానాలు చేయడాలతో, పత్రికా ప్రకటనలతో సరిపెట్టారు. కానీ రిజర్వేషన్ అనేది ఒక పెద్ద అంశమని, దాన్ని ఎఱ వేసి ఎన్నికలలో కాపుల ఓట్లు దండుకోవచ్చనీ రాజకీయ పార్టీలు భ్రమ పడుతూ ఉండడం ఆశ్చర్యంగా తోస్తుంది నాకు. ఇప్పుడు నడుస్తున్న ‘ఆపరేషన్ కాపు’లో యీ రిజర్వేషన్ కూడా భాగం చేస్తారేమో చూడాలి.
గతంలో కాంగ్రెసు, ప్రస్తుతం వైసిపి రెడ్ల పార్టీగా, టిడిపి కమ్మల పార్టీగా ముద్ర పడిన నేపథ్యంలో కాపు ఓట్లను సంఘటితం చేస్తే మూడో ప్రత్యామ్నాయం ఆవిర్భవిస్తుందని చాలాకాలంగా లెక్కలు వేస్తూ వచ్చారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు కొందరు కాపులు ఉత్సాహపడిన మాట వాస్తవం. కానీ చిరంజీవికి వచ్చినవన్నీ కాపుల ఓట్లు కాదు. కాపులందరూ ఆయనకు వేయలేదు. రాజకీయ అభిమానాల పరంగానే ఓటింగు సాగింది. మీడియా తనపై కాపు ముద్ర కొట్టి, పరిమితం చేయాలని చూస్తూండడంతో ఒళ్లు మండిన చిరంజీవి తాను అందరి వాడనని ప్రకటించారు. తన పార్టీ తరఫున బిసిలకే ఎక్కువగా టిక్కెట్లు యిచ్చారు. చాకచక్యం, ఓపిక లేకపోవడం చేత చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి చేతులు దులుపుకున్నారు.
మోదీ-అమిత్‌ల శకం వచ్చాక, ఆంధ్రలో బిజెపిని చంద్రబాబునాయుడు – వెంకయ్యనాయుడు నీడలోంచి తప్పించి, విడిగా అస్తిత్వం కల్పించడానికి కాపు కార్డు వాడదామనుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ బాబు బాటలో నడుస్తున్నారని గమనించి సోము వీర్రాజుని తెచ్చారు. అదీ లాభం లేకపోవడంతో యిప్పుడు కమ్మ కులస్తురాలు పురంధేశ్వరికి రాష్ట్ర నాయకత్వం అప్పగించారు, టిడిపి పతనమైతే దాన్ని వీడదా మనుకున్నవారిని ఆకర్షించడానికేమో! 2019 నుంచి ఎన్నికలలో పోటీకి దిగిన జనసేనను 2009 నాటి ప్రజారాజ్యం నీడ వెంటాడుతోంది. తన పార్టీపై కాపు ముద్ర పడితే మంచిదో, పడకపోతే మంచిదో తేల్చుకోలేక పవన్ ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు. పవన్-బాబు చేతులు కలిపితే, బిజెపి కలిసి వచ్చినా రాకపోయినా, కమ్మ-కాపు ఓట్ల బదిలీ జరిగి, వైసిపిని ఓడించ గలుగుతాయని కొందరు విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. పవన్‌ను ఒక టెర్మ్ ముఖ్యమంత్రిగానో, కనీసం ఉప ముఖ్యమంత్రిగానో ఎన్నికలకు ముందే ప్రకటిస్తే తప్ప ఆ ఓట్ల బదిలీ జరగదని మరి కొందరు విశ్లేషకుల భావన.
2019 ఎన్నికలలో జనసేనకు పెర్‌ఫామెన్స్ ఘోరంగా ఉన్నా, పవన్ కాపుల ఓట్లకు ప్రతినిథి అని, ఆయన ఎటుంటే కాపుల ఓట్లు అటుంటాయని చెప్పేవారికి లోటు లేకుండా ఉంది. గతంలో కాపులకు మేలు చేసిన చరిత్ర ఏదీ పవన్‌కు కానీ ఆయన కుటుంబానికి గానీ లేదు. రంగా హత్య సమయంలో కానీ, ముద్రగడపై నిరాహారదీక్ష సమయంలో టిడిపి జులుం సమయంలో కానీ యీయన నోరు విప్పలేదని, కాపు ఉద్యమాలలో పాలు పంచుకోలేదని, జైలుకి వెళ్లినవారిని ఆదుకోవడం కాదు కదా, పరామర్శించ కూడా లేదని యిలాటి విమర్శలున్నాయి. అందువలన కాపుల కోసం అంతో యింతో చేసిన వారిని, కాపు కులస్తులైన మేధావులను జనసేనలోకి ఆకర్షిస్తే కాపు ఓట్లను ఆకర్షించవచ్చనే ఆలోచన బలం పుంజుకుంది.
నిజానికి జనసేన ఏర్పడగానే పవన్ ఆవేశం అదీ చూసి, యితను సాంప్రదాయక రాజకీయ నాయకులకు భిన్నమైనవాడు అనుకుని కాపు మేధావులు చాలామంది పార్టీలోకి చేరారు కానీ త్వరలోనే అతనికి నిజాయితీ లేదని, అహంకారం ఎక్కువని భావించి బయటకు వచ్చేశారు. అసలు దర్శనమే యివ్వడని, యిచ్చినా చెప్పిన మాట వినడని, పార్టీ నడపాలన్న సీరియస్‌నెస్ లేదని, అసలు దాన్ని పార్టీగా తీర్చిదిద్దుదామన్న ఆలోచనే లేదని, సినిమాలు మానేసి రాజకీయాలకు పూర్తి సమయం వెచ్చిస్తానన్న మాట నిలుపుకోలేదని, మానిఫెస్టో గురించి, ఎన్నికల ప్రచారం గురించి పట్టించుకోడని, యువత కేరింతలు చూసి మురిసి, పార్టీ నిర్మాణంపై శ్రద్ధ పట్టడని, మొత్తం బాధ్యతంతా మనోహర్‌కు అప్పగించి, తను సినిమాలలో కూరుకుపోతున్నాడని… యిలా అనేక ఫిర్యాదులు చేశారు వాళ్లు.
వాళ్లందరూ వెనక్కి జనసేనలోకి వస్తారన్న నమ్మకం లేదు. ప్రస్తుతం జనసేనలోకి వస్తున్నవారు వైసిపి టిక్కెట్లు దక్కనివారు. జగన్ వైఖరి పట్ల అసంతృప్తి చెందినవారైతే కనీసం రెండేళ్ల క్రితమే వచ్చి ఉండాలి. ఇన్నాళ్లూ సహించి, యిప్పుడు వస్తున్నారంటే టిక్కెట్ల కోసమే వస్తున్నారనుకోవాలి. 40 ఏళ్ల పార్టీ ఐన టిడిపిలోకి వెళదామంటే దానికి ప్రతి నియోజకవర్గంలో పాతుకుపోయిన నాయకులున్నారు కాబట్టి టిక్కెట్టు దొరకడం కష్టం. టిడిపి జనసేనకు 30-40 సీట్లు కేటాయించవచ్చు కాబట్టి, జనసేనలో అభ్యర్థుల కొరత ఉంది కాబట్టి దానిలోకి వెళితే టిక్కెట్టు లభించే అవకాశాలు మెండుగా ఉంటాయన్న లెక్క వేసి ఉండవచ్చు. వచ్చేవారిలో కొందరు కాపులున్నా వీరి వలన కాపు ఓట్లు పూరాగా వస్తాయన్న గ్యారంటీ లేదు. అందువలన ప్రముఖులైన కాపు నాయకులను తేవాల్సిన అవసరం జనసేనకు ఉంది. వెళ్లదలచిన కాపు నాయకులను నిరోధించి, జనసేన బలపడకుండా చూడవలసిన అవసరం వైసిపికి ఉంది. ఈ సందర్భంగా యిద్దరు కాపు నాయకులు, ముద్రగడ పద్మనాభం, వంగవీటి రాధాలపై ఫోకస్ బాగా పడింది. వీరు నిజంగా కాపు ప్రతినిథులా అనే విషయాన్ని పరికిద్దాం.
ఎందుకంటే వైసిపి ముద్రగడను తమ పార్టీలోకి ఆకర్షించి, పవన్ ఎక్కడ నిలబడితే అక్కడ ప్రత్యర్థిగా నిలబెడదా మనుకుంటోంది అనే వార్తలు వచ్చాయి. అలాగే టిడిపిలో ఉన్న వంగవీటి రాధాను కొడాలి నాని ద్వారా వైసిపిలోకి లాక్కుని వచ్చి వంగవీటి రంగా అభిమానుల ఓట్లు కొల్లగొడదామని చూస్తోంది అని కూడా వార్తలు వచ్చాయి. రాధా విషయం ఏమీ తేలలేదు కానీ పద్మనాభం వైసిపి వైపు వెళ్లకుండా జనసేన సరైన సమయంలో చక్రం తిప్పి, ఆయనను తమ పార్టీలోకి వచ్చేందుకు ఒప్పించింది అనే వార్త వచ్చింది. ముద్రగడ కుమారుడు జనసేన వైపే మొగ్గు చూపుతున్నారనీ, టిడిపి అంటే నిన్నటిదాకా నిప్పులు కక్కుతూ వచ్చిన ముద్రగడ కూడా జనసేన-టిడిపి పొత్తుకు అభ్యంతర పెట్టటం లేదనీ ప్రస్తుత సమాచారం. తనను ఆహ్వానించిన వైసిపితో ముద్రగడ తనకు ఒక పార్లమెంటు సీటు, తన కొడుక్కీ, సహచరుడికీ చెరో అసెంబ్లీ సీటు అడిగారని, దాంతో వైసిపి దణ్ణం పెట్టిందని కూడా వార్త వచ్చింది. ఇప్పుడు జనసేనలో చేరబోతున్నారు కాబట్టి, వారు యీ షరతులకు ఒప్పుకున్నారని అనుకోవాలి.
ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం బలాబలాల గురించి కాస్త తెలుసుకోవాలి. తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడి గ్రామంలోని భూస్వామి కుటుంబానికి చెందిన కాపు కులస్తుడాయన. ఆయనకూ, వాళ్ల కుటుంబానికీ నిజాయితీపరులుగా చాలా మంచి పేరుంది. కాపులే కాక యితరులు కూడా ఆయనంటే చాలా గౌరవం చూపుతారు. వాళ్ల నాన్నగారు స్వతంత్ర అభ్యర్థిగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మూడోసారి ఓడిపోయారు. ఈయన అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయ్యారు. ఒకసారి కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనపై అవినీతి మచ్చ లేదు. పదవులను పూచికపుల్లగా చూసి, రాజీనామాలు చేస్తూ వచ్చారు. ఏ విధమైన ప్రలోభాలకూ లొంగలేదు. అన్ని కులాలూ ఆయన్ను గౌరవించి, ఆదరించినా, పోనుపోను ఆయన కాపు సంక్షేమం గురించి మాత్రమే మాట్లాడి, కాపు నాయకుడిగా ముద్ర పడి తన ప్రభావాన్ని పరిమితం చేసుకున్నారు. తిక్కమనిషిగా, కోపిష్టిగా, లౌక్యం తెలియని వ్యక్తిగా యిమేజి తెచ్చుకున్నా కాపులు ఆయనను ఒక పెద్దమనిషిగా గౌరవిస్తారు. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయ బలం ఎలాటిది అన్నది కదా ముఖ్యంగా చూడాల్సింది.
ప్రధానంగా చెప్పవలసినది ఆయన రాజకీయంగా స్పెన్ట్ ఫోర్స్. 21 వ శతాబ్దం వచ్చాక ఆయన గెలిచిన ఎన్నిక లేదు. 2004లో కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి, 2009లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయాడు. అప్పణ్నుంచి రాజకీయ సన్యాసమే! 2016లో ఉద్యమం నడిపి, కాడి పారేశానని చెప్పి ఇప్పుడు మళ్లీ యాక్టివైజ్ అవుతాను అంటే యీ లోపున కొత్త నాయకులు ప్రభవించి ఉంటారు కదా! ఇక మధ్యవయస్కుడైన ఆయన కొడుకు యిప్పటిదాకా అసెంబ్లీకైనా పోటీ చేయలేదు. తనతో పాటు అతనికీ, మరో సహచరుడికీ కూడా టిక్కెట్లు యివ్వాలనడం పెద్ద డిమాండే! ఈయనతో పెద్ద యిబ్బంది ఏమిటంటే రాజకీయ స్థిరత లేదు. పార్టీలు మారడానికి ఏ మాత్రం సంకోచించడు.
1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ప్రతిపాడు నుంచి నెగ్గి, 1982లో ఎన్టీయార్ టిడిపి పెట్టగానే దాన్లోకి దూకి, 1983లో, నాదెండ్ల ఉదంతం తర్వాత 1985లో ఎమ్మెల్యేగా నెగ్గారు. ఎన్టీయార్ మంత్రి పదవి యిస్తే, రంగా హత్య తర్వాత అలక పూని రాజీనామా చేసి యింటికి వచ్చేశారు. ఎన్టీయార్ దూతలను పంపినా వినలేదు. తర్వాత కెఇ కృష్ణమూర్తి, జానారెడ్డిలతో కలిసి తెలుగు నాడు పార్టీ పెట్టారు. వాళ్లతో చెప్పకుండా చాటుగా వెళ్లి కాంగ్రెసులో చేరారు. 1989 ఎన్నికలలో కాంగ్రెసు అభ్యర్థిగా ప్రతిపాడు నుంచి 7 వేల మెజారిటీతో గెలిచి, మళ్లీ మంత్రి అయ్యారు. 1994లో టిడిపి ప్రభంజనంలో 21వేల తేడాతో ఓడిపోయారు. గత 30 ఏళ్లగా ఆయన ప్రతిపాడు నుంచి మళ్లీ పోటీ చేయలేదు. అక్కడ ఓటర్లను యీయన ప్రభావితం చేసినట్లూ కనబడదు.
1994 ఓటమి తర్వాత దాసరితో కలిసి తెలుగుతల్లి ప్రాంతీయ పార్టీ పెడతానంటూనే, ఆయనతో చెప్పకుండా వెళ్లి టిడిపిలో చేరిపోయారు. ఆ తర్వాత వెళ్లి బిజెపిలో చేరారు, అక్కడో నాలుగేళ్లు ఉండి, మళ్లీ టిడిపికి వచ్చి 1999లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు. 2004లో మళ్లీ పోటీ చేసి, 57 వేల తేడాతో ఓడిన తర్వాత టిడిపిలోంచి బయటకు వచ్చారు. 2009లో పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మూడో స్థానం దక్కింది. 2015లో కాపు రిజర్వేషన్ల అంశంపై అధికారంలో ఉన్న టిడిపితో పెద్ద పేచీయే పెట్టుకున్నారు. 2016లో జనవరిలో తుని రైలు బోగీల దగ్ధం సంఘటన జరిగింది. దాని తర్వాత తన యింట్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినపుడు దాన్ని భగ్నం చేయడానికి టిడిపి సర్కారు పంపిన పోలీసులు హేయంగా ప్రవర్తించారంటూ గత నెల దాకా చెప్తూనే ఉన్నారు.
ఉద్యమం నుంచి విరమించుకుంటానని యిన్నాళ్లూ చెపుతూనే హఠాత్తుగా యిప్పుడు టిడిపి నేస్తమైన జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారుట. రాజకీయాల్లో యివి సహజం. పాత విషయాలు సులభంగా దులిపేసుకుంటారు. బయటివాళ్లే పట్టుకుని వేళ్లాడతారు. అయితే కాపు రిజర్వేషన్ అనే అంశం, ఆయన తన వెంట తెచ్చే గుదిబండ. ఆయన కాపులకు చేసిన మేలేమిటో నాకు స్పష్టంగా తెలియదు. ఎవర్నడిగినా పెద్దమనిషి, మర్యాదస్తుడు అంటారు తప్ప ఓ ట్రస్టు పెట్టి కాపు యువతకు చదువులు చెప్పించాడనో, వ్యాపారాలకు ఋణం యిచ్చాడనో చెప్పటం లేదు. ఆయనకు వచ్చినదల్లా మా కాపు జాతి (ఓ కులాన్ని పట్టుకుని జాతి అనడమేమిటో? ఇది తెలుగు జాతిలో భాగమా? విడిగా వేరే జాతా?) అనడం, కాపులకు రిజర్వేషన్లు యిచ్చి తీరాలనడం!
ఆయన వైసిపిలో చేరతానన్నాడనుకోండి ‘కాపులకు రిజర్వేషన్లు యివ్వడం సాధ్యం కాదని కరాఖండీగా చెప్పిన జగన్ పార్టీలో ఎలా చేరావ్?’ అని అడిగితే ఏం సమాధానం చెప్తాడు? జనసేనలో చేరితే ‘అది టిడిపితో పొత్తు పెట్టుకుంటోంది కదా. టిడిపి-జనసేన మానిఫెస్టో లేదా కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో కాపులకు రిజర్వేషన్లు యిస్తామన్న హామీ పెట్టిస్తావా? పెట్టించినా అమలు చేయిస్తానన్న హామీ యిస్తావా? గతంలో బాబు యిలాగే చెప్పి మాట తప్పారని కదా నీ బాధ, యిప్పుడు మళ్లీ అలా జరగకుండా ఉండడానికి నువ్వు తీసుకునే జాగ్రత్తలేమిటి?’ అని అడగవచ్చు. ఈయన్నే కాదు, యీయన్ని చేర్చుకునే పార్టీ అధినేతలను కూడా యీ ప్రశ్న అడుగుతారు – ముద్రగడ తన రిజర్వేషన్ డిమాండు ఒదులుకుని మీ పార్టీలో చేరారా? అని.
కాపులను బిసిలుగా ప్రకటించి, రిజర్వేషన్లలో భాగం యిస్తానంటే బిసిలకు కోపం వస్తుంది, మా వాటా తగ్గిపోతుందంటూ! బిసిలను యిప్పటికే జగన్ అతిగా దువ్వుతున్నాడు. తనను యిన్నాళ్లూ ఆదరించిన రెడ్లకు ఆగ్రహం వచ్చినా ఫర్వాలేదనుకుంటూ, వారి స్థానాల్లో బిసిలను నిలబెడ్తున్నాడు. వారిని వైసిపి నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న టిడిపి-జనసేన కూటమి కాపులకు బిసిల కోటాలో వాటా యిస్తామని ప్రకటించి, రిస్కు తీసుకుంటుందా? రిజర్వేషన్లు యిస్తానంటే బిసిలకు కోపం, యివ్వనంటే కాపులకు కోపం. ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య. తన హయాంలో యిలాటి డైలమాలో పడి బాబు ఆ వాటాను అగ్రవర్ణ పేదల కోటా నుంచి తీసుకోబోయారు. సమస్త అగ్రవర్ణాలకు 5శాతం, కాపులకు మాత్రం 5శాతం అన్నారు. దాంతో అగ్రవర్ణాలకు కోపం వచ్చింది. మళ్లీ ఎగదీస్తే, దిగదీస్తే సిచ్యువేషనే. బాబు దృష్టిలో తాము ఒసిలమో, బిసిలమో తెలియక కాపులు గందరగోళ పడ్డారు.
రిజర్వేషన్ యింతటి వివాదాస్పద అంశం కాబట్టి దాని జోలికి పోకుండా మానిఫెస్టో తయారు చేసుకుందాం అంటే ముద్రగడకు ప్రతీ ప్రెస్‌మీట్‌లోనూ యీ ప్రశ్న ఎదురౌతుంది. ఆయన తప్పించు కుందామని చూస్తే ఉన్న పరువు పోతుంది. అప్పుడు ముద్రగడను పార్టీలోకి తీసుకునీ ప్రయోజనం లేదు. ఇక ఆయన జిల్లాలోని తక్కిన నియోజకవర్గాలను ఏం ప్రభావితం చేయగలుగుతాడు? ముద్రగడ ఎంతసేపూ తనను ప్రొజెక్టు చేసుకుందామనే చూస్తాడు. పట్టువిడుపు లేదు. పైగా ‘హోలియర్ దేన్ దౌ’ (నీ కంటె నేను పవిత్రుణ్ని) యాటిట్యూడ్ ఒకటి. అందుకే అందరూ దూరం నుంచి దణ్నం పెట్టి ఊరుకుంటారు తప్ప వెంట నడవరు. ప్రముఖ జర్నలిస్టు చిల్లగట్టు శ్రీకాంత్ ‘జనసేనలోకి ముద్రగడ..?’ అనే యూట్యూబు వీడియోలో ముద్రగడ ప్రస్థానాన్ని చక్కగా వివరిస్తూ చివర్లో ఒక మాట అన్నారు. ‘తన ఆగ్రహానుగ్రహాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపులందరూ స్పందించాలని కోరుకునే ముద్రగడ, కాపులకు ఏదైనా యిబ్బంది వస్తే మాత్రం తనకు సంబంధం లేదనుకుంటారు.’ అని.
‘‘కిర్లంపూడి కిరికిరి’’ అనే పుస్తకం రాసిన భోగాది వెంకట రాయుడు అనే సీనియర్ జర్నలిస్టు తుని ఘటనను పరామర్శిస్తూ ముద్రగడ ధోరణిని తూర్పారబట్టారు. ఆ సభకు సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది కాపు ప్రముఖులెందరూ వచ్చి, తమ ఉపన్యాసాలతో శ్రోతలను ఉత్తేజితులను చేయాలని అనుకుంటే ముద్రగడ తొలి ఉపన్యాసం చేస్తూనే మధ్యలో విరమించి, వెళ్లి రైలు పట్టాలపై కూర్చుని మొత్తమంతా రసాభాస చేశారన్నారు. ఆ దగ్ధకాండకు కారణమెవరు అనేది వేరే చర్చ. తన ఆహ్వానంపై వచ్చిన తక్కిన వక్తల పట్ల, ప్రముఖ నాయకుల పట్ల ముద్రగడ ఎలా వ్యవహరించారన్నది యిక్కడ గమనార్హం. ఇలాటి ముద్రగడ యిప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వస్తే ఉభయ గోదావరి జిల్లాలలోని కాపులందరూ మురిసిముక్కలై ఆయను చెప్పినట్లే ఓటేస్తారని అనుకోవడం సమంజసంగా లేదు.
ఇక కాపు ప్రతినిథిగా చర్చించబడుతున్న మరో వ్యక్తి వంగవీటి రాధా. 35 ఏళ్ల క్రితం 1985-88 మధ్య ఎమ్మెల్యేగా చేసి, కాపులను సంఘటితం చేద్దామని చూసిన రంగా కొడుకుగా తప్ప యితనికి ఏ గుర్తింపు ఉంది? ముద్రగడలా యితనికీ రాజకీయ స్థిరత్వం తక్కువ. 2004-09 మధ్య కాంగ్రెసు పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత ప్రజారాజ్యం పార్టీ, ఆ తర్వాత 2012లో వైసిపి, 2019 నుంచి టిడిపి. 15 ఏళ్లగా అధికారంలో లేనే లేడు. తండ్రి వారసత్వాన్ని కొనసాగించే చురుకుదనం లేదు. ఇలాటివాళ్లు ఎక్కడున్నా ఏమీ తేడా పడదు. వీళ్లు ఫలానా పార్టీ వైపు చూస్తున్నారని, వీళ్ల వైపు ఫలానా పార్టీ చూస్తోందని.. యిలాటి న్యూస్ అంతా కాలక్షేపానికే తప్ప మరొకందుకు పనికి రాదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2024)