కెసియార్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారా? కారా? అనే ప్రశ్నపై చాలామంది చాలా రకాలుగా విశ్లేషిస్తున్నారు. 9 ఏళ్లలో ప్రభుత్వ వ్యతిరేకత గూడు కట్టుకుంది కాబట్టి, రేవంత్ సారథ్యంలో టిడిపి సాయంతో కాంగ్రెసు దూసుకుపోతోంది కాబట్టి తెరాస ఓడిపోతుందని కొందరంటున్నారు. అబ్బే, కెసియార్‌కు ఎదురు లేదు అని మరి కొందరు అంటున్నారు. రకరకాల సర్వేలు వస్తున్నాయి. ప్రజలు ఆసక్తిగా వాటిని చూస్తున్నారు. కొందరు విశ్లేషకులు వాటిని ఉటంకిస్తున్నారు. నేను ఏ సర్వేలు చేయించలేదు. గ్రామాల్లో తిరిగి, ఓటర్లను ప్రశ్నలడగనూ లేదు. నియోజకవర్గాల వారీగా ఎవరికి ఎక్కడ ఎంత బలముందో లెక్కలు తీయనూ లేదు. కేవలం కామన్‌సెన్స్‌తో, చాలాకాలంగా రాజకీయాలు పరిశీలించిన అనుభవంతో యీ వ్యాసం రాస్తున్నాను. అందువలన దీనిలో నేను చేసిన అబ్జర్వేషన్స్, వేసే లెక్కలు కచ్చితమనే హామీ ఏమీ లేదు.
ఇది చదివే ముందు ‘‘ఎమ్బీయస్: తెలంగాణలో కాంగ్రెసు స్థితి’’. ‘‘ఎమ్బీయస్: తెలంగాణ యిచ్చిన కాంగ్రెస్’’ ఆర్టికల్స్ చదివితే కాంగ్రెసు పార్టీ అవకాశాలపై నా అభిప్రాయాలు తెలుస్తాయి. దానికి ఎన్ని సీట్లు వస్తాయో నా అంచనా చెప్పబోయే ముందు కెసియార్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యం అని చెప్పదలుస్తున్నాను. నా లెక్క సింపుల్. భారాసకు ప్రస్తుతం ఉన్న బలం 99 మంది ఎమ్మెల్యేలు. అది సగానికి తగ్గిపోయి 50 సీట్లే గెలిచినా, కెసియార్ ‘మామ’ కోసం మజ్లిస్ తన 6-7 ఎమ్మెల్యేలతో కదిలి వస్తుంది. కాంగ్రెసును అధికారానికి దూరంగా ఉంచడం కోసం బిజెపి భారాసకు సహకరిస్తుంది. గవర్నరు పాత రుసరుసలను పక్కనపెట్టి కెసియార్‌ను ఆహ్వానించి విశ్వాస పరీక్షకు నిలబడమంటుంది. బిజెపి అసెంబ్లీకి గైరు హాజరవుతుంది. ముఖ్యమంత్రిగా కుదురుకోగానే కాంగ్రెసు నుంచి పది, పదిహేను మంది గోడ దూకి వచ్చి, సొంతబలంపై భారాస ప్రభుత్వం నిలబడేట్లు చేస్తారు.
భారాసకు 50 సీట్లు మాత్రమే వచ్చిన సందర్భంలో పై సీను జరుగుతుంది. అన్ని కూడా రావు అని అనేక సర్వేలు చెప్తున్న విషయమూ, కాంగ్రెసు గెలుపే తమ గెలుపు అని భావించే టిడిపి మద్దతుదారులు వాటిని హుషారుగా ప్రచారం చేస్తున్న సంగతీ నాకు తెలుసు. అయినా నాకు తోచినది నేను రాస్తున్నాను. భారాస బలాన్ని 50కి పరిమితం చేయాలంటే కాంగ్రెసుకు దాదాపు అన్ని సీట్లు రావాలి. ఎందుకంటే 119 స్థానాల్లో బిజెపి, మజ్లిస్, యితరులు, రెబెల్స్ అందరూ కలిపి 19 పట్టుకుపోతారంటే 100 సీట్లను భారాస, కాంగ్రెసు పంచుకోవాలి. కాంగ్రెసుకు 60 సీట్లు వచ్చి సింపుల్ మెజారిటీ వచ్చేస్తే గవర్నరు వాళ్లను పిలవక తప్పదు. ముఖ్యమంత్రి ఎవరాని పార్టీలో తర్జనభర్జనలు పడుతూంటే మాత్రం, ఆ సందట్లో భారాస కొందర్ని లాగేస్తుంది.
కాంగ్రెసుకు 60 రావాలంటే 2018లో తెచ్చుకున్న 19కి 3 రెట్లకు పైగా తెచ్చుకోవాలి. ప్రస్తుతం ఉన్న 7కి రమారమి 9 రెట్లు తెచ్చుకోవాలి. దాదాపు అసాధ్యం. కాంగ్రెసు బ్రహ్మాండంగా పెర్‌ఫామ్ చేస్తుందనుకున్నా దానికీ, భారాసకు సమానంగా చెరో 50 వస్తాయి అనుకోవచ్చు. కానీ పెర్‌ఫామ్ చేసే అవకాశాలు లేవని నా భావన. అందువలన ఆ 100 సీట్లను 2:1 నిష్పత్తిలో విభజించి అక్కణ్నుంచి లెక్క మొదలు పెట్టవచ్చు. ఆ లెక్కన భారాసకు 65, కాంగ్రెసుకు 35 వస్తాయి. భారాస బలాన్ని, కాంగ్రెసు బలహీనతలను తరచి చూస్తే అది 70, 30గా మారినా మారవచ్చు. మంచి పోల్ మేనేజ్‌మెంట్‌తో భారాస తన హవా కనబరిస్తే భారాస తక్కిన పార్టీల నుంచి కూడా కొన్ని తీసుకుని 75కి చేరినా నేను ఆశ్చర్యపడను. కాంగ్రెసుకు 30 కంటె ఎక్కువ వస్తాయంటే మాత్రం ఆశ్చర్యపడతాను.
ప్రస్తుతం ఉన్నవి 7 స్థానాలే కదా, నాలుగు రెట్ల కంటె ఎక్కువ స్థానాలు వస్తాయని మాత్రం ఎందుకను కుంటున్నావ్ అని మీరు అడగవచ్చు. కాంగ్రెసు ఎన్నో ఏళ్లగా కాంగ్రెసులో ఉండి, బలమైన స్థానిక నాయకులను ఏర్పాటు చేసుకుంది. వారు నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తూ పేరు తెచ్చుకుని ఉన్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత అది బలహీన పడింది కానీ పూర్తిగా లేకుండా పోలేదు. అందుకే 2018లో టిడిపితో కలిసినా 28.4శాతం ఓట్లు తెచ్చుకుంది. నెగ్గిన 19 మంది పార్టీలోనే ఉండి ఉంటే అది యింకా పెరిగి ఉండేది. కానీ విభజనానంతరం బిటి (బంగారు తెలంగాణ) బ్యాచ్ అని ఒకటి తయారైంది. ఏ పార్టీ నుంచి గెలిచినా భారాసలోకి దూకి ఆ బంగారాని పంచుకునే బ్యాచ్. గతంలో యిలా ఉండేది కాదు, ప్రతిపక్షంలో ఉంటూ మర్యాద కాపాడుకునే వారు. కెసియార్ వచ్చాక వాళ్లను ప్రలోభ పెట్టి టిడిపిని లుప్తం చేసేశారు. కాంగ్రెసును క్షీణింప చేసేశారు.
2014 తర్వాత ఆంధ్రలో కూడా 23 మంది వైసిపి ఎమ్మెల్యేలు గోడ దూకేశారు. అయితే 2019 ఎన్నికలలో వారికి, వారిని తీసుకున్న పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో ఫిరాయింపుల జోరు అక్కడ తగ్గింది. ఇప్పుడీ ఎన్నికలలో ఆ బిటి బ్యాచ్ వాళ్లకు ఓటర్లు బుద్ధి చెపితే, యీ ట్రెండ్ ఆగవచ్చు. ఆంధ్రలో వైసిపి 23 మంది ఎమ్మెల్యేలను, 3గ్గురు ఎంపీలను పోగొట్టుకున్నా పార్టీ నిలబడింది. అలాగే యిప్పుడు టిడిపి 23 (లెక్కకు) మంది ఎమ్మెల్యేలు, 3గ్గురు ఎంపీలతో మిగిలినా పార్టీ నిలబడి పోరాడుతోంది. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ భారాస తప్ప మరో పార్టీ లేదు (మజ్లిస్ గూడు వదిలేయండి), కెసియార్ తప్ప మరో నాయకుడు లేడు అనే పరిస్థితి ఏర్పడింది. తొమ్మిదేళ్లగా మత్తుగా పడి ఉండి, హఠాత్తుగా యిప్పుడు నిద్ర లేచి మేం బతికేవున్నామర్రోయ్ అని కాంగ్రెసు గావుకేకలు వేస్తే ప్రజలంతా నిజమని నమ్మేస్తారా? అబ్బో, మీరు మొనగాళ్లుస్మీ అంటూ వెంట నిలుస్తారా?
‘కెసియార్ హాట్రిక్ కొట్టలేడు, ఎందుకంటే దక్షిణాదిన మూడుసార్లు వరుసగా ముఖ్యమంత్రి కావడం చరిత్రలో లేదు’ వంటి రికార్డులు అనవసరం. 9 ఏళ్ల ప్రభుత్వం అంటే ప్రజల్లో ఫాటిగ్ (విసుగు, వేసట) వస్తుంది లాటివి నేను నమ్మను. గుజరాత్‌లో బిజెపి, బెంగాల్‌లో లెఫ్ట్ కూటమిని గుర్తు చేసుకోండి. అంతెందుకు మోదీ మూడోసారి ప్రధాని కాలేడని ఎవరైనా అనగలరా? ఎప్పటి పరిస్థితులు అప్పటివే. మరి భారాస గెలుపు కోసం అంతగా శ్రమిస్తోందెందుకు, దాని నెర్వస్‌నెస్‌కు అది సంకేతం అని కొందరంటున్నారు. పాము చిన్నదైనా, పెద్ద కర్రతో కొట్టాలనే బిజెపి సిద్ధాంతమే భారాస అవలంబిస్తోంది. యుపిలో గెలుపు తథ్యం అని తెలిసినా, బిజెపి ఎంత హడావుడి చేస్తుందో చూడండి. కెసియారూ అంతే, ఎన్నికలలో తీవ్రంగా పోరాడడం, గెలిచాక మెజారిటీ ఉన్నా ప్రతిపక్షాలను బలహీన పర్చడానికి ఫిరాయింపు దారులను తీసుకోవడం! బిజెపి చేస్తే నెర్వస్‌నెస్ అననప్పుడు భారాస విషయంలోనూ అదే కొలబద్ద వాడాలి.
ఆంధ్రులను కెసియార్ అడ్డమైన తిట్లూ తిట్టాడు. ఆంధ్రావాలే భాగో అన్నాడు. కానీ తెలంగాణ కాంగ్రెసు వాళ్లూ తక్కువ తినలేదు. తెలంగాణ బిజెపి వాళ్లు సౌమ్యమైన భాష ఉపయోగించారు కానీ వాళ్లూ ఆంధ్రులను దోపిడీదారులనే అన్నారు. రాష్ట్రం కలిసి ఉన్నంతకాలం ఏ పార్టీలోనైనా సరే, అంధ్రులదే పైచేయి ఉంటుందని, తాము పార్టీలో పైకి రావాలంటే విడిపోవాల్సిందేనని ప్రతీ రాజకీయ నాయకుడూ యిదే ధోరణి కనబరిచాడు. ప్రతీ పార్టీ ఆంధ్ర, తెలంగాణ విభాగాలుగా చీలిపోయింది. ఆంధ్ర టిడిపి ఎంపీని తెలంగాణ టిడిపి ఎంపీలు పార్లమెంటులో చావబాదారు. అందువలన ఆంధ్రద్వేషమంతా కెసియార్‌లోనూ, హరీశ్‌లోనూ మాత్రమే గూడు కట్టుకుందని అనడానికి లేదు. రేపు కాంగ్రెసు ఓడిపోతే రేవంత్ ‘ఆంధ్ర కాంట్రాక్టర్ల సొమ్ముతో కెసియార్ ఓట్లు కొనేసి మమ్మల్ని అక్రమంగా ఓడించాడు’ అని ఆరోపించవచ్చు. భారాస ఓడిపోతే వాళ్లూ ఆంధ్రుల మీదనే నింద వేస్తారు.
ఇప్పుడు కెసియార్ అంటున్నాడు కత్తి ఆంధ్రోడిదైనా పొడిచినవాడు తెలంగాణ కాంగ్రెసు వాడే అని. నల్గొండలో ఫ్లోరైడ్‌కు, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో దుర్గతికి కారణం స్థానిక నాయకులే కదా. కానీ ఉద్యమ సమయంలో ఆ నింద ఆంధ్రులపై వేశారు. తెలంగాణ కాంగ్రెసు బలమైన ప్రతిపక్షం కాబట్టి కెసియార్ వాళ్ల పేరు మాత్రమే చెప్పాడు. నిజానికి టిడిపిని కూడా కలపాలి, అదీ 16 ఏళ్లు పాలించింది కదా! ఆంధ్రులను పాపాల భైరవులుగా నిలబెట్టి ప్రతీ తెలంగాణ నాయకుడూ సమైక్యవాదం పేరు ఎత్తడానికి కూడా భయపడేట్లు చేశారు. ఆంధ్రులు వెళ్లిపోతే వాళ్ల ఉద్యోగాలన్నీ మనవే అని కెసియార్ ఒక్కడే కాదు, ప్రతీ తెలంగాణ నాయకుడూ అన్నాడు. వ్యాపారాలు, ప్రయివేటు కాలేజీలు అన్నీ మనవే అన్నారు. కెసియార్ యింటింటికీ ఓ ఉద్యోగం అన్నాడనే జనాలకు గుర్తుంది. కాంగ్రెసు, టిడిపిలు యిచ్చిన హామీలూ తక్కువేమీ కావు. మానిఫెస్టోలు చూడండి. ఆ ఎన్నికలలో భారాసకు వచ్చినవి 63 మాత్రమే! సింపుల్ మెజారిటీ కంటె 3 మాత్రమే ఎక్కువ!
ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ వస్తుందని, ఆంధ్రులందరినీ తరిమి వేసి తమకు పోటీ లేకుండా చేస్తారని, స్థానిక ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ద్వారా తమకు ఉద్యోగాలు వస్తాయని, నమ్మిన యువతకు, వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు ఆశాభంగం కలిగి ఉండవచ్చు. తొమ్మిదేళ్ల పాలన తర్వాత కూడా ఉద్యోగాలు రాని నిరుద్యోగులు ఆగ్రహంగా ఉండవచ్చు. కానీ కెసియార్ అధికారంలోకి వస్తే ప్రాంతీయ విద్వేషాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని భయపడిన నాబోటి వాళ్లం హమ్మయ్య అనుకున్నాం. ఉద్యమకాలం నాటి కెసియార్‌ను చూసి శివసేన వాళ్లను మించిపోతాడని అనిపించింది. కానీ అధికారంలోకి రాగానే తాళంచెవులు చేతికి దొరికిన దొంగలా శాంతించాడు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలోలా ఆంధ్రులపై, ఆంధ్ర కాలనీలపై, ఆంధ్రుల ఆస్తులపై, వ్యాపారాలపై భౌతిక దాడులు జరగలేదు. పరిస్థితి యథాతథంగా ఉంది. డబ్బున్నవాళ్లకు, లంచాలిచ్చిన వాళ్లకు ప్రాంతీయతతో సంబంధం లేకుండా పనులు జరుగుతున్నాయి.
రాజకీయ అవసరాల కోసం అప్పుడప్పుడు ఆంధ్రులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసినా, ఆచరణలో విద్వేషం చూపటం లేదు. ప్రతిపక్షంలో ఉంటే ఏం చేసేవాడోనని యిప్పటికీ భయం ఉంది. తక్కిన పార్టీలతో కూడా ఆ భయం ఉంది కానీ, వాళ్లంతా కెసియార్, అతని కుటుంబసభ్యులంత ప్రభావం చూపించలేరు. కుటుంబసభ్యులంటే గుర్తుకు వచ్చింది, భారాసది కుటుంబపాలన పార్టీ అంటున్నారు. అదొక్కటేనా? అనేక పార్టీల్లో నాయకుల వారసులుగా వాళ్ల కుటుంబసభ్యులే వస్తున్నారు. భారతీయ సమాజం వాళ్లలో చాలామందిని ఆమోదిస్తోంది కూడా. ఆమోదించని సందర్భాలలో వాళ్లు పక్కకు తప్పుకుంటున్నారు. కెసియార్ కుటుంబ సభ్యులు తమ ప్రతిభావిశేషాలతో ప్రజాక్షేత్రంలో నిరూపించుకుని వెలుగుతున్నారు, అడ్డదారిలో ఎమ్మెల్సీలుగా రాలేదని మనం గుర్తించాలి. కుటుంబసభ్యులకు ప్రాముఖ్యత లభించడమనేది సహజపరిణామంగానే ఓటరు భావిస్తాడు.
తెలంగాణ వచ్చాక కెసియార్ కుటుంబం మాత్రమే బాగుపడింది అనడం కరక్టు కాదు. చాలామంది ఎమ్మెల్యేలూ బాగుపడ్డారు, ఆశ్రితగణమూ బాగుపడ్డారు. ఏమాట కా మాట చెప్పాలంటే అనేక ప్రాంతాల ప్రజలూ బాగుపడ్డారు. దానికి కారణం రాష్ట్రం పారిశ్రామికంగానూ, వ్యవసాయికంగానూ చక్కటి అభివృద్ధి సాగించడం. భారాస వస్తే బ్రాండ్ హైదరాబాదు యిమేజి నాశనమై పోతుందనుకున్నా. కానీ అలా కాలేదు. అభివృద్ధి కంటిన్యూ అవుతూ, పెరిగింది కూడా. కొత్తకొత్త పరిశ్రమలు వస్తున్నాయి. ఐటీ బాగా పెరిగింది. నగరంలో ఎన్నో ఫ్లయిఓవర్లు అవీ వచ్చాయి. ట్రాఫిక్ యిబ్బందులు కొనసాగడానికి కారణం ఆంధ్ర నుంచి, యితర రాష్ట్రాల నుంచి వచ్చే వలసలు ఆగకపోవడం!
రజనీకాంత్ హైదరాబాదును మెచ్చుకున్నప్పుడు నిజానికి ఆ క్రెడిట్‌లో మూడో వంతు కెసియార్‌కు పోతుంది. వడ్డించిన విస్తరి యిస్తే యీ మాత్రం చేయడం గొప్పా? అని అడగవచ్చు. అదీ గొప్పే అంటాను. గ్రోత్‌ను సస్టయిన్ చేయడం, ఏక్సిలరేట్ చేయడం కూడా ఒక కళే. చేతకాకపోతే తగలేయవచ్చు. అంతమాత్రం చేత ఆంధ్రను ఎద్దేవా చేయాలని లేదు. బంగారుబాతు ఐన హైదరాబాదును చేజిక్కించుకుని, ఎపి అని ఉన్నచోటల్లా టిఎస్ అని స్టాంపు గుద్దుతూ, విభజన ఒప్పందం ప్రకారం యివ్వవలసినవి ఆంధ్రకు యివ్వకుండా తొక్కిపెట్టి, అన్యాయం చేస్తూ, పైగా వెక్కిరింతలు కూడానా! అది తప్పు. ఇవే కాదు, అనేక సందర్భాల్లో చేసిన ఆంధ్ర వ్యతిరేక వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఎప్పుడూ ఖండించలేదు. ఇప్పుడు ఆంధ్రమూలాల వారి ఓట్లతో గెలిచేద్దామని ఆశ పడుతున్న సమయంలోనైనా రేవంత్ నోరు విప్పాల్సింది. అదీ లేదు. మరి యిక ఏం చూసి వారు ఓట్లేయాలి?
కెసియార్ కాక మరొకరెవరైనా అయితే యింతకంటె సమర్థవంతంగా, యింతకంటె ఉదారంగా, యింతకంటె ప్రజాస్వామ్యయుతంగా ఉండేవారు అని వాదిస్తే నా దగ్గర సమాధానం లేదు. వారెవరో తెలుసుకోవాలని నాకూ కుతూహలంగా ఉంది. రేవంత్ అని మాత్రం చెప్పకండి ప్లీజ్. అమరావతి వంటి ఫెయిల్యూర్ ప్రయోగాన్ని ఈనాడు ఫిల్మ్ సిటీకి దగ్గర్లో రాచకొండ రిపీట్ చేస్తానని భయపెడుతున్నాడు. అదే జరిగితే, లాండ్ పూలింగు విధానంలో నష్టపోయిన అమరావతి రైతులు, ప్రస్తుతం కర్ణాటక రైతుల్లా, వచ్చి రాచకొండ రైతులను ఎలర్ట్ చేస్తారు.
హైదరాబాదు, చుట్టూ ప్రాంతాలను అభివృద్ధి చేయడం, ఐటీ ఎగుమతులను 57 వేల కోట్ల నుంచి 241 వేల కోట్ల దాకా తీసుకుపోవడం అంత గొప్ప విషయం కాదనవచ్చు కానీ యిరిగేషన్ విషయంలో కెసియార్ ముందుచూపు, పట్టుదల మాత్రం శ్లాఘనీయం. వ్యవసాయాన్ని కిట్టుబాటు వ్యాపారంగా చేస్తే నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉండదు. అది ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. చెఱువులు బాగు చేయించడం, మైనర్ యిరిగేషన్ పనులు చేయించి, వేలాది ఎకరాలను సాగుయోగ్యంగా చేయడం, (131 లక్షల ఎకరాల నుంచి 268 లక్షల ఎకరాలకు పెరిగిందట), వరి ఉత్పాదన 68లక్షల టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకు పెరిగేట్లా చేయడం, తద్వారా భూముల విలువ పెరిగేట్లు చేయడం.. యివన్నీ కెసియార్ కిరీటంలో తురాయిలే. తలసరి ఆదాయం రూ.1.24 లక్షల నుంచి రూ.3.17 లక్షల వరకు పెరిగిందని ప్రభుత్వం అంటోంది.
ఈ అంకెలు తప్పని వాదించేవారుండవచ్చు. నీతి ఆయోగ్, గ్లోబల్ డేటా, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలు ఆధారంగా 201123 నాటి ‘‘హిందూ’’లో యిచ్చిన గణాంకాలు యిస్తున్నాను. తలసరి ఎన్ఎస్‌డిపి (నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్టు) విషయంలో 2021-22లో తెలంగాణ స్థానం 27 రాష్ట్రాల్లో 4. అదే సంవత్సరంలో ఆర్థికస్థితి పరంగా జనాభాను ఐదు వర్గాలుగా విడగొడితే ఆఖరి రెండు వర్గాల్లో ఉన్న పేదలు 26 శాతం. 30 రాష్ట్రాలలో యిది 13 వ స్థానం. 2020లో మాన్యుఫేక్చరింగ్ జివిఏ పరంగా 30 రాష్ట్రాలలో 17వ స్థానం. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ పరంగా 30 రాష్ట్రాలలో 17వ స్థానం.
ఆర్థికపరమైన సూచికల్లో ముందంజలో ఉన్నా, సామాజిక అంశాల్లో వెనకబడి ఉందని ఆ రిపోర్టు చెప్తోంది. బడికి వెళ్లే బాలికల విషయంలో 2019-21లో 30 రాష్ట్రాల్లో 30వ స్థానం. బరువు తక్కువున్న పిల్లల విషయంలో 30 రాష్ట్రాలలో 19వ స్థానం. అభివృద్ధి సమాజంలోని అన్ని వర్గాలకూ చేరటం లేదని అర్థమౌతోంది. సంక్షేమ పథకాల ద్వారా వారి స్థితిని పెంచవలసిన అవసరం కనబడుతోంది. వైద్యరంగంలో ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితులు చాలా మెరుగు పడ్డాయి. బెడ్స్ 18 వేల నుంచి 68 వేలకు పెరిగాయి. మెడికల్ కాలేజీలు ఆరు రెట్లు పెరిగాయి. అంకెల మాట ఎలా ఉన్నా ప్రాస్పరిటీ మాత్రం ఎల్లెడలా కనబడుతోంది. దాంతో పాటు అవినీతీ తాండవం చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం పెరిగిందనే అంటున్నారు. విపక్షాలు సహజంగానే దాన్ని ఎన్‌క్యాష్ చేసుకుంటున్నాయి. కాంగ్రెసు వాళ్లు వస్తే అవినీతంతా మటుమాయం అవుతుందని నేననుకోవటం లేదు.
కర్ణాటకలో పరిపాలన చూసి, యిక్కడ ఓటేయమనడం కూడా ఓ తమాషా. అక్కడ పూర్తిగా అమల్లోకి వచ్చిన పథకం మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం. ఆర్‌టిసిపై దాని భారం ఏడాది చివరకు తెలుస్తుంది. ఇక అన్నభాగ్య కింద 10 కిలోలు యిస్తామన్నారు. 5కిలోలు బియ్యం యిచ్చి, 5 కిలోల బియ్యం ఖరీదును ఖాతాల్లోకి వేస్తున్నారు. మహిళలకు నెలకు రెండు వేలు యిచ్చే పథకం గత మూడు నెలలుగానే ప్రారంభించారు. ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం చాలా యిబ్బందులు తెచ్చింది. గతంలో రైతులకు ఏడు గంటలు యిచ్చే కరంటు యిప్పుడు 5 గంటలు మాత్రమే యివ్వగలుగుతున్నారు. బెంగుళూరులో కూడా పవర్‌కట్స్ ఉంటున్నాయట. ఈ సమస్యలను క్రమేపీ అధిగమిస్తారేమో తెలియదు కానీ యీలోపునే వాటిని గొప్పగా చూపడం హాస్యాస్పదంగా ఉంది.
అన్నిటికీ కీలకమైన విద్యుత్ విషయంలో ఉత్పత్తి తెలంగాణలో 7778 మెగా వాట్ల నుంచి 18567 మె.వా.లకు పెరిగిందని ప్రభుత్వం చెపుతోంది. (తెలంగాణ ఏర్పడ్డాక విద్యుత్ ఉత్పాదన ఒక్క యూనిట్ కూడా పెరగలేదని కొందరంటూంటారు) కానీ గత 9 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలకై రూ.97321 కోట్లు ఖర్చు పెట్టానని తెలంగాణ ప్రభుత్వం చెపుతోంది. ‘2014లో 19.03 లక్షల వ్యవసాయ విద్యుత్ కనక్షన్లు ఉంటే ఈ 9 ఏళ్లలో మరో 8.46 లక్షలు చేరి 27.49 లక్షలు అయ్యాయి. ఇతర రంగాల్లో 67 లక్షల అదనపు కనక్షన్లు యివ్వడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 1.78 కోట్ల కనక్షన్లు ఉన్నాయి. ఈ 9 ఏళ్లలో తలసరి విద్యుత్ వినియోగం 1196 యూనిట్ల నుంచి 2140 యూనిట్లకు పెరిగింది. జాతీయ సగటు 1255 కంటె యిది 70శాతం ఎక్కువ!…’ అని కూడా చెప్పుకుంటోంది.
రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం తెస్తానంటున్నాడు. ఆవిడ పోయి దాదాపు 40 ఏళ్లు. ఇందిరా కాంగ్రెసు రాజ్యం యిక్కడ 1978 నుంచి 83 వరకు నడిచింది. చెన్నారెడ్డి పాలన అవినీతికి పేరు తెచ్చుకుంది. దాంతో ఆయన్ను మార్చారు. తర్వాత మరో ముగ్గుర్ని మార్చారు. ప్రజలకు విసుగెత్తి ప్రభుత్వాన్నే మార్చేసి ఎన్టీయార్‌కు అప్పగించారు. అలాటి రాజ్యం మళ్లీ తెస్తానంటా డేమిటీయన? కాంగ్రెసు అనగానే అస్థిరత, బహునాయకత్వం గుర్తుకు వస్తాయి. ఎవరి మీదా ఎవరికీ అదుపు ఉండదు. ప్రజాస్వామ్యం పేరుతో క్రమశిక్షణారాహిత్యం చూసి దేశప్రజలు విసుగెత్తి పోయారు. కాంగ్రెసును తరిమేసి, యితర ప్రతిపక్షాలకు అధికారం అప్పగించినప్పుడల్లా వాళ్లు అంతఃకలహాలలో మునిగి, పాలనను పట్టించుకోక పోవడంతో తిరిగితిరిగి కాంగ్రెసును తెచ్చుకునేవారు. ఇప్పుడు కాంగ్రెసు స్థానంలో బిజెపి వచ్చింది. మోదీ పాలన నచ్చకపోయినా, సుస్థిరత అయితే ఉంది కదా, ఇండియా కూటమిని ఎన్నుకుంటే దేశం గతి ఏమవుతుందనే భయంతోనే సామాన్యుడు మోదీని మూడోసారి ప్రధానిని చేయబోతున్నాడు.
రాష్ట్రంలో కెసియార్ పరిస్థితీ అదే. అతనికి ప్రత్యామ్నాయం ఎవరూ కానరావటం లేదు. అతని పార్టీలో హరీశ్ తిరుగుబాటు చేస్తాడని ఎన్నాళ్లు ఎదురు చూసినా ఏ లాభమూ లేకుండా ఉంది. రాష్ట్రం మొత్తం మీద కెసియార్‌తో సరిసమానమైన దక్షత, రాజకీయ చాతుర్యం గల నాయకుడు కనబడటం లేదు. కాంగ్రెసు ప్రొజక్ట్ చేస్తున్న రేవంత్ అతని భుజాల దాకా కూడా రాడు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో సొంత నియోజకవర్గంలో ఓడిపోయాడు. 2019 పార్లమెంటు ఎన్నికలలో టిడిపి వాళ్లు మద్దతిచ్చినా 11వేల ఓట్ల మెజారిటీ మాత్రం వచ్చింది. ఈ ఎన్నికల తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలను నిలుపుకోగలడో తెలియదు. ఎన్నికలు లేనప్పుడు కూడా ప్రజా ఉద్యమాలు చేస్తూ ఉంటేనే ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. నన్ను పార్టీ అధ్యక్షుణ్ని చేస్తేనే కదులుతాను అంటే యితనికి ఎక్కడ పేరొస్తుందోనని తక్కినవాళ్లు అడ్డు పడుతూంటారు.
వీళ్లంతా యిలా అఘోరించారు కాబట్టే కెసియార్‌కు అహంకారం తలకెక్కింది. సెక్రటేరియట్‌కు వెళ్లకపోవడం దగ్గర్నుంచి, ఎమ్మెల్యేలకైనా ఎపాయింట్‌మెంట్ యివ్వకపోవడం దగ్గర్నుంచి, ఎవరినైనా సరే ఎంతమాట పడితే అంత మాట అనడం దాకా, అన్నీ అవలక్షణాలే. నవాబులు కూడా యింత పొగరు చూపించి ఉండరు. ఇతని చేతికి అధికారం అప్పగిస్తే ప్రజా తెలంగాణ ఏర్పడుతుందని ఉద్యమ సమయంలో ఊదరగొట్టిన వామపక్ష మేధావులు ప్రస్తుతం బిత్తరపోయి, కిక్కురుమనకుండా పడి ఉన్న పరిస్థితిని చూసి నాకు నవ్వు వస్తూంటుంది. ఏ మాట కా మాట చెప్పాలంటే ఫాంహౌస్‌లోనే పడుక్కున్నా, సెక్రటేరియట్‌కు వెళ్లకపోయినా పరిపాలనైతే సాగిపోతోంది. ఆర్ట్ ఆఫ్ డెలిగేషన్ తెలుసన్నమాట. ఏదీ ఆగటం లేదు. అన్ని విషయాలూ క్షుణ్ణంగా తెలుసుకుంటూ వేస్తున్న రాజకీయపు ఎత్తుగడల్లో కూడా ఏ కొరవా కనబడటం లేదు.
2009లో దీక్ష చేసినప్పుడే కెసియార్‌కు కాన్సర్, త్వరలో చావు ఖాయం అన్నారు. ముఖ్యమంత్రి అయితే మందు కొట్టి పడుక్కుంటాడు తప్ప ఏమీ చేతకాదు అన్నారు. కానీ యిప్పటికీ ఎన్నికల సభలకు వస్తూనే ఉన్నాడు, రోజుకి నాలుగు సభల్లో పాల్గొంటున్నాడు, గంటల తరబడి మాట్లాడ గలుగుతున్నాడు. పార్టీని పక్క రాష్ట్రాలకు విస్తరించే ప్లాన్లు వేస్తూనే ఉన్నాడు. అతనికి ఉన్న గొప్ప ఎసెట్, ఫ్యామిలీ మెంబర్లు, విశ్వాసపాత్రులైన అనుచరులు అందరూ సమర్థులు. మేధావులు, వాక్శూరులు, కార్యశూరులు. అహంభావంతో కెసియార్ ఈటలను అవమానించి నప్పుడు ప్రజలు ఉపయెన్నికలో కాల్చి వాత పెట్టారు. దురదృష్టవశాత్తూ తెలంగాణ రాజకీయ నాయకుల్లో ఈటల వంటి వారు ఎక్కువమంది లేరు. అందుకే కెసియార్ ఆటలు సాగుతున్నాయి.
ధరణి పోర్టల్ పని చేయటం లేదని, మేడిగడ్డ పిల్లర్లు కృంగాయని యిలాటి సాంకేతిక లోపాలు ఏ ప్రభుత్వంలోనైనా జరిగేవే! గత ఏడాది ఇన్‌కమ్ టాక్స్ వెబ్‌సైట్‌లో సమస్య వచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు యిచ్చిన యింటర్వ్యూలో కెటియార్ యిలాటి అనేక వివరణలు యిచ్చాడు. మొత్తం మీద చూస్తే కెసియార్ పాలనపై కొన్ని విషయాలలో అసంతృప్తి ఉంది కానీ ప్రజల్లో ఆగ్రహం కానరావటం లేదు. నేను పథకాల గురించి మాట్లాడటం లేదు. వాటి ప్రభావం తప్పకుండా ఉంటుంది. కానీ దానికీ ఓ లిమిటు కూడా ఉంటుంది. ఓవరాల్‌గా పరిపాలన కూడా బాగుండాలి. ఉపాధి అవకాశాలు ఉండాలి. తెలంగాణలో అవి ఉన్నాయి. ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఎమోషనల్ యిస్యూ ఏమైనా ఉందా అంటే అదేమీ లేదు. తెలంగాణ అనే సెంటిమెంటూ లేదు. పని తీరు చూసే ఓటేయాలి.
ఆ విధంగా చూస్తే నేను భారాసకే ఓటేయాలి. ఎందుకంటే అది హైటెక్ యిండస్ట్రీస్ తేవడంతో పాటు, వ్యవసాయాన్నీ చాలా అభివృద్ధి చేసింది. భారాసకు బదులు కాంగ్రెసు వస్తే యిది కొనసాగుతుందన్న నమ్మకం నాకు కలగటం లేదు. భారాస ఆవిర్భావం నుంచి దానిపై నాకు చాలా ఫిర్యాదులున్నాయి. అది చెప్పిన అబద్ధాలపై, వక్రీకరణలపై చాలా కోపం ఉంది. కానీ ఆ విషయంలో తెలంగాణ ఉద్యమ నాయకులూ, జర్నలిస్టులూ అనేకమంది దోషులే. పుణ్యాత్ములు చాలా తక్కువ మంది. రాష్ట్రం విడిపోకుండా ఉండాల్సింది. కానీ విడిపోయాక వాట్ నెక్స్‌ట్? అని ఆలోచించినప్పుడు రాష్ట్ర ప్రగతిని, శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని భారాసకు ఓటేస్తున్నాను.
నేను వేయకపోయినా వాళ్లు గెలవవచ్చు. కానీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు చూసి, క్లిష్టకాలంలో ఆయన తన ప్రజలకై నిలబడిన తీరు చూసి ఓటేద్దా మనుకుంటున్నాను. అలా వేయకుండా నోటాకు వేయడం న్యాయం కాదు. పని చేసే వాళ్లను ఓటుతో అభినందించక పోతే వాళ్లకు పని చేసే ఉత్సాహం ఎక్కణ్నుంచి వస్తుంది? రాష్ట్రస్థాయిలో కూడా జరిగే మంచి పనులకు మన అంగీకారాన్ని తెలపాలి కదా, లేకపోతే తర్వాత వచ్చేవాడు వీటిని రివర్స్ చేయవచ్చు. ఇది చూసి వాళ్లు చేసే చెడుపనులకు కూడా ప్రజామోదం ఉందని పాలకులు పొరబడితే వాళ్ల ఖర్మ, మన ఖర్మ. నాలా ఆలోచించే వాళ్లు ఎక్కువగా ఉంటే భారాసకు 70-75 వచ్చినా ఆశ్చర్యం లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2023)