ఎమ్బీయస్‍: కమెడియన్స్‌లో లెజెండ్ జెరీ లూయిస్

తెలుగునాట కూడా ఒక తరం వారికి బాగా పరిచితమైన పేరు – జెరీ లూయిస్. అతను 20 ఏళ్లకు పైగా హాలీవుడ్‌ను ఓ ఊపు ఊపాడు. ‘‘కింగ్ ఆఫ్ కామెడీ’’ అనిపించుకున్నాడు.

తెలుగునాట కూడా ఒక తరం వారికి బాగా పరిచితమైన పేరు – జెరీ లూయిస్. అతను 20 ఏళ్లకు పైగా హాలీవుడ్‌ను ఓ ఊపు ఊపాడు. ‘‘కింగ్ ఆఫ్ కామెడీ’’ అనిపించుకున్నాడు. మొత్తం 59 సినిమాల్లో నటించాడు. మన దేశంలో హాస్యనటులుగా పేరు తెచ్చుకున్న మెహమూద్, నాగేశ్ వంటి వారు తామూ జెరీ అభిమానులమని చెప్పుకున్నారు. వారు జెరీని అనుకరిస్తారని విమర్శకులు అంటూండేవారు. హాలీవుడ్ కమెడియన్స్‌లో జెరీ అగ్రస్థానంలో చాలాకాలం ఉన్నాడు. కానీ తన నటజీవితంలో ఎన్నో ఉత్థాన పతనాలను ఎదుర్కొన్నాడు. ఒక రంగంలో అంతా అయిపోయిందను కున్నప్పుడు కొత్త రంగంలో తన ప్రతిభను కనబరచాడు. ‘నెవర్ సే డై’ అని ఇతని లాటి వాళ్లను చూసే అంటా రనిపిస్తుంది అతని జీవితం నుంచి మనం గ్రహించ వలసినది అదే. 2017లో 91 ఏళ్ల వయసులో మరణించే వరకు అతను వార్తల్లోనే ఉన్నాడు.

జెరీ లూయీస్ తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. అమెరికాలోని న్యూ జెర్సీలోని నెవార్క్‌లో 1926 మార్చి 16‌న పుట్టినపుడు అతని పేరు జోసెఫ్ లెవిచ్. రష్యన్ సామ్రాజ్యం నుండి అమెరికాకు తరలి వచ్చిన యూదు కుటుంబానికి చెందినవాడు. తండ్రి కూడా కళాకారుడే. జెరీకి 19 ఏళ్ల వయసున్నపుడు తన కంటె 8 ఏళ్లు పెద్దవాడైన డీన్ మార్టిన్ అనే గాయకుడితో జట్టు కట్టి 1945 నుండి ప్రదర్శన లివ్వసాగేడు. నైట్‌క్లబ్‌లలో, నాటక వేదికలపై, టెలివిజన్‌పై ఇద్దరూ కలిసి ఝంఝామారుతంలా చుట్టుముట్టారు. హుందా ఐన అందగాడిగా డీన్, వెకిలి చేష్టలు చేసే తిక్క మనిషిగా జెరీ కలిసి అందించిన కొత్త రకం హాస్యం చూసి జనాలు వెర్రెక్కిపోయారు. డీన్ మార్టిన్ మంచి పాటగాడు కాబట్టి ఉన్నట్టుండి పాట అందుకునేవాడు. జెరీ ఓ చిన్నపిల్లవాడు హఠాత్తుగా పెద్దవాడయిపోతే ఎలా ఉంటాడో అలా నటించేవాడు. (‘‘హాఫ్ టికెట్’’) సినిమాలో కిశోర్ కుమార్ ఇలాటి పాత్రే వేసాడు). జెరీ ముఖవికారాలు ఎక్కువగా ప్రదర్శిస్తే, డీన్ మార్టిన్ అందంతో, చక్కని గాత్రంతో ఆకట్టుకునేవాడు.

1949 పాటికి వీరి కీర్తి విపరీతంగా పెరిగి పోవడంతో హాల్ వాలిస్ అనే నిర్మాత వీళ్లిద్దరినీ వెండి తెరకు పరిచయం చేద్దామనుకున్నాడు. ఆ విధంగా “మై ఫ్రెండ్ ఇర్మా” అనే సినిమాలో వీరు కామిక్ రిలీఫ్ అందించారు. దాన్ని సినీ ప్రేక్షకులు బాగా ఆదరించడంతో ఆ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన “మై ఫ్రెండ్ ఇర్మా గోస్ వెస్ట్” (1950)లో కూడా నటించారు. ఇక అప్పటి నుండీ వీళ్లకు ఎదురే లేకపోయింది. 1952 లో “రోడ్ టు బాలి”, “జంపింగ్ జాక్స్”, 1953 లో “స్కేర్డ్ స్టిఫ్”, “ద క్యాడీ”, “మనీ ఫ్రమ్ హోమ్”, 1954 లో “త్రీ రింగ్ సర్కస్” ఇలా ఎన్నో చిత్రాలు వీరి ప్రతిభకు అద్దం పట్టాయి. ఈ సినిమాలలో వీరి హాస్యం ఎంత బాగున్నా రంగస్థలంపై వీరి ‘లైవ్’ ప్రదర్శనలలో ఉన్న జీవం వీటిలో కనబడ లేదంటారు విజ్ఞులు. పైగా ఈ సినిమాలలో వీరి పాత్రలు బొత్తిగా మూస పోసినట్టు తయారయ్యాయి.

కానీ వీటివల్ల జెరీ హాస్యచతురత ప్రస్ఫుటంగా అందరికీ తెలియవచ్చింది. ముఖ్యంగా పేర్కొనదగినవి – “ఎట్ వార్ విత్ ద ఆర్మీ” (1950) లో ‘డ్రాగ్’ (ఆడవేషంలో కనబడడం)లో సిల్లీ నటన, “సెయిలర్ బివేర్” (1951) లో బాక్సింగ్, “యూ ఆర్ నెవర్ టూ యంగ్” (1955) లో ఫన్నీగా కోరస్ పాడించడం, “ఆర్టిస్ట్స్ అండ్ మోడల్స్” (1955) లో కామిక్ బుక్ కలలు కనడం, “హాలీవుడ్ ఆర్ బస్ట్” (1956) లో సినిమా ప్రేక్షకులను అనుకరించడం, ఇవన్నీ జెరీ నటనా ప్రతిభకు గీటురాళ్లు. జెరీ, డీన్ జంటకు రీమేకులు కలిసి వచ్చాయి. “యూ ఆర్ నెవర్ టూ యంగ్” పాత “ది మేజర్ అండ్ ది మైనర్” (1942) చిత్రం రీమేకే. 1954 నాటి “లివింగ్ ఇట్ అప్” 1937 నాటి “నథింగ్ సేక్రెడ్” రీమేకే.

విజయం మనుష్యులను, ముఖ్యంగా కళాకారులను, విడదీస్తుంది కాబోలు. డీన్, జెరీల జంట కూడా ఎక్కువకాలం మనలేదు. కొద్ది, కొద్దిగా మనస్పర్థలున్నా పదేళ్లపాటు కొనసాగిన వారి వ్యాపారబంధం చివరికి 1956లో తెగిపోయింది. జెరీ మొదటి సోలో సినిమా “ది డెలికేట్ డెలింక్వెంట్” 1957 లో రిలీజయ్యింది. అంతకు ముందు నుండీ తను వేస్తున్న పాత్రనే డీన్ మార్టిన్ సహాయం లేకుండా విజయవంతం చేయగలనని నిరూపించు కున్నాడు. “ది శాడ్ సాక్”(1957), “రాక్-ఎ-బై బేబీ” (1958), “ద గేషా బాయ్” (1958), “డోంట్ గివప్ ద షిప్” (1959) వెంటవెంటనే వచ్చాయి. సక్సెస్ అయ్యాయి. పారమౌంట్ స్టూడియోకి కనకవర్షం కురిపించాయి.

1960లో జెరీ లూయీస్ డైరక్టరయ్యాడు. అదీ చిత్రంగా, అనుకోకుండా జరిగింది. ఆ ఏడాది క్రిస్మస్ సెలవులలో రిలీజవ్వడానికి జెరీ సినిమా ఏదీ పారమౌంట్ స్టూడియో రెడీ చేయలేక పోయింది. దాంతో అతనే ఒక ఐడియా వేసాడు. మియామీలో ఓ హోటల్లో ఒక బెల్‌బాయ్ కేంద్రబిందువుగా కొన్ని సంఘటనలను గుదిగుచ్చి సినిమాగా తీసాడు. కథ అదీ ఏమీ ఉండదు. షూటింగు జరుగుతూండగానే ఒక వీడియో కెమెరాతో దాన్ని చిత్రీకరింప చేశాడు. అప్పటికప్పుడే కరక్షన్స్ చేసేసుకున్నాడు. ఈ సరికొత్త ప్రయోగంతో సినిమా తీయడానికి జెరీ (అతనే హీరో, అతనే కో-రైటరు, అతనే డైరక్టరు)కు ఒక్క నెల పట్టిందంతే!

సినిమా బ్రహ్మాండమైన హిట్ అయింది. ఆ తర్వాత నుండి ఒకపక్క స్వంత చిత్రాలు తీసుకుంటూ మరో పక్క ఇతరుల దర్శకత్వంలో నటించ సాగాడు. దర్శకులలో కార్టూన్ డైరెక్టరు, అతని మార్గదర్శి ఫ్రాంక్ తష్లీన్ అతని ఫేవరేట్. పోనుపోను జెరీకి అహంకారం పెరిగిపోయి సినిమా అంతా తనే కనబడ సాగేడు. దాంతో హాస్యం తగ్గిపోసాగింది. సినిమాలు ఫెయిలవసాగేయి.

ఆ దశలో వెలువడింది ”ది నట్టీ ప్రొఫెసర్” (1963). ‘డా॥ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్’ కథ జగద్విదితం. మనిషిలో ఉండే ద్వంద్వ ప్రవృత్తి (మంచీ, చెడూ)ని ప్రదర్శించిన నవల అది. డా॥ జెకిల్ అనే ఒక సైంటిస్ట్ అతి సౌమ్యుడు. అతను ఒక మందు తయారు చేసి తాగుతాడు. దానివల్ల అతని భౌతికంగా, మానసికంగా మార్పులు వచ్చి ఇంకొక వ్యక్తిత్వం బయటపడుతుంది. క్రూరత్వానికి ప్రతిరూపమైన ఆ వ్యక్తి పేరు మిస్టర్ హైడ్. మందుకు విరుగుడు తాగడం ద్వారా మిస్టర్ హైడ్ డా॥ జెకిల్‌గా మారిపోతుంటాడు. పెద్దమనిషిగా తను చేయలేని అకృత్యాలన్నీ ఆ సైంటిస్టు మిస్టర్ హైడ్ రూపంలో చేస్తూంటాడు. చివరికి ఆ వ్యక్తిత్వం రెండుగా చీలిపోయి (స్ప్లిట్ పెర్సనాలిటీ అంటారు) మిస్టర్ హైడ్‌ది పైచేయి అయి కథ విషాదాంతమవుతుంది.

ఈ కథను సరదాగా తన దర్శకత్వంలో తీసాడు జెరీ. ముసలి ప్రొఫెసర్ ఒక వేషం. మందు తాగి మారిన కుర్రకారు పాటగాడిగా మరో వేషం. ఈ రెండో పాత్రను డీన్ మార్టిన్ క్యారికేచర్‌గా మలిచేడంటారు కొందరు. వారిద్దరి మధ్య గొడవలొచ్చి విడిపోయేరు కాబట్టి వెక్కిరించినా వెక్కిరించి ఉండవచ్చు. “ద నట్టీ ప్రొఫెసర్” జెరీ మాస్టర్‌పీస్ అంటారు విమర్శకులు. ఆ కథ నాలుగు దశాబ్దాల తర్వాత ఎడ్డీ మర్ఫీకు కూడా ఉపయోగించింది. తన సినిమాలు ఫ్లాప్ అవుతున్న దశలో జెరీ “నట్టీ ప్రొఫసరు”ని పునర్నిర్మించి ఎడ్డీ మర్ఫీ పునర్జీవితం పొందాడు.

సినిమాల నుండి టీవీ వైపుకు దృష్టి మరల్చాడు జెరీ. అంతకు ముందే అతనూ, డీన్ కలిసి ‘ది కాల్గేట్ కామెడీ అవర్’, ‘డీన్ మార్టిన్, జెరీ లూయీస్ షో’లు చేసారు. పేరుప్రఖ్యాతులు సంపాదించారు. తిరిగి టెలివిజన్ రంగానికి వచ్చినప్పుడు, అంటే 1963లో ప్రతీ శనివారం రాత్రి ‘టాక్ అండ్ వెరైటీ ప్రోగ్రాం'(శేఖర్ సుమన్ చేసిన ‘‘మూవర్స్ అండ్ షేకర్స్’’ వంటిది) రెండు గంటలపాటు నిర్వహించడానికి ముందుకొచ్చాడు. ముందు తనే డైరక్టు చేద్దామనుకున్నాడు. కానీ షో ప్రొడ్యూసర్లు ఆఖరి క్షణంలో ‘మీరు డైరక్టు చేయక్కరలేదు లెండి’ అనేశారు. అతని అహం దెబ్బతింది. అది టివి తెర మీద ప్రేక్షకులకు స్ఫుటంగా తెలిసిపోయినట్టుంది. ప్రోగ్రాం అట్టర్ ఫ్లాపయింది. చిన్న తెర మీద కనబడిన అసలైన జెరీ ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఆ ప్రభావం అతని సినిమాల మీద కూడా పడింది. అతని మ్యాజిక్ పనిచేయడం మానేసింది.

కానీ అది అతను గ్రహించలేకపోయాడు. 1970లో “విచ్ వే టు ది ఫ్రంట్?” అనే సినిమా తీసాడు. కోటీశ్వరుడైన ప్లేబాయ్ హిట్లర్‌ను ఎదిరించడానికి సైన్యాన్ని సమీకరించడం అనే కథను అల్లుకుని స్వీయ దర్శకత్వంలో సినిమా నిర్మించాడు. తనే ముఖ్య పాత్రధారి. సినిమా ఘోరంగా దెబ్బతింది. దాంతో పదేళ్ళ పాటు సినిమా తెరకు దూరం అయిపోయాడు. అతను వేషం వేయకుండా డైరక్టు చేసిన ఏకైక చిత్రం “ఒన్ మోర్ టైమ్”(1970). అతని మిత్రుడు శామీ డేవిస్ జూనియర్ అంతకు ముందే “సాల్ట్ అండ్ పెపర్” (1968) అనే ఓ నైట్ క్లబ్ కామెడీ తీసాడు. దానికి సీక్వెల్‌గా ఇది తయారయింది. జెరీ లూయీస్, పీటర్ లాఫోర్డ్ ఇద్దరూ కలిసి దర్శకత్వం వహించారు. అదీ ఫెయిలయింది. 1967 నుండి 1969 దాకా సాగిన ‘జెరీ లూయీస్ షో’ ఒకటే ప్రజాదరణకు నోచుకుంది.

1980లో జెరీ మళ్లీ తల ఎత్తాడు. “హార్డ్‌లీ వర్కింగ్” అనే సినిమా తీసాడు. ఉద్యోగం పోగొట్టుకున్న ఒక సర్కస్ బఫూన్ ఒక దాని తర్వాత మరో ఉద్యోగం చేయబోతాడు. అ సంఘటనలన్నీ (బెల్‌బాయ్ గుర్తుకు వస్తోందా?) కలిపి ఇంచుమించు ‘వన్‌ మాన్ షో’ లాటి సినిమా తయారు చేసాడు. ఆ సినిమా మొదట్లో తన పాత చిత్రాలలోని భాగాలు చూపిస్తే ‘అసలు సినిమా కన్నా అవే బాగున్నాయి’ అన్నారు ప్రేక్షకులు. జెరీ ధైర్యం పుంజుకుని “క్రాకింగ్ అప్” (స్మార్‌గస్‌బోర్డ్ అనే ఇంకో పేరు కూడా ఉంది) అనే సినిమా తీసాడు. తనే హీరో. రకరకాల పాత్రలు వేసాడు. కొన్ని ఊళ్లల్లో ప్రదర్శించాక ఫెయిలవడంతో వెనక్కి తెప్పించేసుకున్నాడు. అతనికి మళ్లీ ఊపిరి పోసినది “ద కింగ్ ఆఫ్ కామెడీ”(1983) అనే సినిమా. దానిలో ఒక టీవీ ఏంకర్-హోస్ట్ (జెరీ లూయీస్) అంటే వెర్రి పెంచుకున్న వీరాభిమాని (రాబర్ట్ డినీరో వేసాడీ పాత్ర) ఆ షోలో పడడానికి ఓ అఘాయిత్యం చేస్తాడు. ఇద్దరు నటులూ అద్భుతంగా అభినయించి సినిమాను హిట్ చేసారు. దీనివల్ల మరిన్ని టీవీ సీరియల్స్ వచ్చాయి.

1988-89ల నాటి “వైజ్ గై” వాటిల్లో ఒకటి. దానితో సినిమా ఛాన్సులు మళ్ళీ వచ్చాయి. “మిస్టర్ సాటర్‌డే నైట్” (1992)లో తన పాత్ర తనే (అంటే జెరీ లూయీస్‌గా జెరీ లూయీస్) వేసాడు. “అరిజోనా డ్రీమ్” (1995), “ఫన్నీ బోన్స్” (1995)లో నటించాడు. ఏది ఏమైనా జెరీ లూయీస్‌ని ఇప్పటికీ స్మృతిపథంలో నుండి చెరిగిపోకుండా చేసినవి అతను నిర్మించిన టీవీ సీరియల్సే! అవి చూసిన వాళ్లందరికీ అతడు ఒక లెజండ్‌గా ఎందుకు నిలిచిపోయాడో అర్థమవుతుంది. 2000 ప్రాంతంలో బాగా పేరు తెచ్చుకున్న జిమ్ క్యారీ ఫిజికల్ కామెడీ జెరీ లూయీస్‌ని జ్ఞప్తికి తెస్తుందని అందరూ అంటారు. అతనికి 34 వ ఏట మొదటి సారి గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత అనేక జబ్బుల పాల పడ్డాడు. చివరకి తన 91వ ఏట 2017లో మరణించాడు. (ఫోటో – జెరీ లూయీస్, అతని టీవీ షో, డీన్ మార్టిన్‌తో, క్రింద – బెల్‌బాయ్‌గా, నట్టీ ప్రొఫెసర్‌గా, రాబర్ట్ డి నీరోతో ‘‘కింగ్ ఆఫ్ కామెడీ’’లో )

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2024)

6 Replies to “ఎమ్బీయస్‍: కమెడియన్స్‌లో లెజెండ్ జెరీ లూయిస్”

  1. అదెంటయ్యా! మీరెదొ అదాని జగన్ ల మీద ఆమెరికాలొ కెసు గురించి మీ ఇన్వెస్టిగెషన్ కదనం రాస్తారు అనుకుంటీ ఈ కామిడీ గురించి రాస్తున్నరు!

    గుండె మీద చెయి వెసుకొని చెప్పండి, ఇదె అభియొగాలు చంద్రబాబు మీద వస్తె మీరు ఇలానె కామెడీ రాసెవారా?

Comments are closed.