ఎమ్బీయస్‍: లతా – వాణీ జయరాం

ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు పైకొస్తారో చెప్పలేం. ఇప్పుడు తిరస్కరిస్తే రేపు వాళ్లు పేరు తెచ్చుకున్నాక సాధించవచ్చు.

చిత్రసీమకు కొత్త గాయనీగాయకులను పరిచయం చేయడానికి మెట్రో-మర్ఫీ కాంటెస్ట్ 1957లో జరిగింది. మహేంద్రకపూర్ ఉత్తమ గాయకుడిగా, ఆరతీ ముఖర్జీ ఉత్తమ గాయనిగా ఎన్నికయ్యారు. రఫీకి శిష్యరికం చేసిన మహేంద్రకపూర్ నిలదొక్కుకున్నాడు. బి. ఆర్. చోప్డా, మనోజ్ కుమార్ వంటివారు నిరంతరం ప్రోత్సహించడంతో బాటు ఓపి నయ్యర్ రఫీ చేత పాడించనప్పుడు, రఫీ దిలీప్ కుమార్‌కు పాడనప్పుడు రఫీ స్థానంలో మహేంద్రకపూర్‌కు చాలా పాటలు పాడే అవకాశం వచ్చింది. కానీ ఆరతీ ముఖర్జీకి ఆ భాగ్యం దక్కలేదు. లతా వారసురాలిగా కాదు, అసలు గాయనిగా కూడా స్థానం నిలుపుకోలేకపోయింది.

ఆ పోటీకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన అయిదుగురు సంగీతదర్శకులు – అనిల్ బిశ్వాస్, నౌషాద్, రామచంద్ర, వసంత్ దేశాయి, మదన్మోహన్ – పోటీలో ఎన్నికయినవారికి తాము ఛాన్సులు ఇస్తామని ప్రకటించివున్నారు. తరువాత సి.రామచంద్ర ‘‘నవ్‌రంగ్’’ (1959) లోమహేంద్ర కపూర్‌కు అవకాశం ఇచ్చినా మహేంద్ర కపూర్, ఆరతీ ముఖర్జీ ఇద్దరికీ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన కంపోజర్ వసంత్ దేశాయి ఒక్కడే. అది లతాకు నచ్చలేదన్న అనుమానం ఒకటుండగా ‘‘ఆశీర్వాద్’’లో ఓ పాట గురించి వసంత్ దేశాయి చేసిన వ్యాఖ్యలు లతాకు కినుక తెప్పించాయి.

హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వెలువడిన ‘‘ఆశీర్వాద్’’ (1968) సినిమాకు సంగీతం ఇచ్చినది వసంత్ దేశాయి. దానిలోని ‘ఏక్ థా బచ్‌పన్’ అనే పాటలో లతా తను అనుకున్న ఎఫెక్టు తీసుకు రాలేదని, కనీసం తీసుకువచ్చే ప్రయత్నం కూడా చేయలేదని వసంత్ దేశాయి బాధపడ్డాడు. పడి వూరుకోకుండా నలుగురి వద్దా అన్నాడు. అది లతా చెవులకు చేరింది. 1967 నాటి లతా లిస్టులో తన పాటలు లేవన్న అక్కసు తోనే వసంత్ దేశాయి అలా ఫీలవుతున్నాడని లతా భావించింది.

‘‘ఆశీర్వాద్’’ హిట్ కావడంతో హృషీకేశ్ ‘‘గుడ్డీ’’ (1971) తీస్తూ సంగీతానికై మళ్లీ వసంత్ దేశాయినే పిలిచాడు. తన పాటలకు లతా న్యాయం చేయటం లేదని అభిప్రాయ పడిన వసంత్ దేశాయి ఈసారి వాణీ జయరాం అనే కొత్త గాయనిని పరిచయం చేశాడు. ఆ సినిమాలో వాణీ చేత స్కూలు ప్రార్థనా గేయం ‘హమ్‌కో మన్‌కీ శక్తి దేనా’ నుండి ‘బోలే రే పపీహరా’ వంటి క్లాసికల్ గీతం నుండి ‘హరీ బిన్ కైసే జియూ రే’ వంటి మీరా భజన్ దాకా అన్నిరకాల పాటలూ వాణీ చేత పాడించి హిట్ చేయించేశాడు.

వాణీ జయరాం ‘బోలే రే పపీహరా’తో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా లతా, ఆశా ఉలిక్కిపడ్డారని ఇండస్ట్రీ అంతా చెప్పుకున్నారు. వాణీ వందకు పైగా పాటలు పాడినా హిందీ సీమలో నిలదొక్కుకోకుండా వారు ప్రయత్నించారని పుకార్లు వచ్చాయి. ‘‘సబూత్’’ సినిమాకై కూర్చిన ‘బడా దుఖ్ దైవే పవన్ పుర్‌వయ్యా’ పాటను ఓప నయ్యర్ వాణీచే పాడించాడు. బియన్ శర్మ రికార్డింగు స్టూడియోలో అది ఫస్ట్‌ టేక్‌లోనే ఓకే అయింది. ఆ విషయం తెలిసిన ఆశా మండిపడి వాణీ చేత పాడించే మాటయితే ఆ స్టూడియోలో రికార్డు చేయనని బెదిరించిందట.

ఓపి నయ్యర్‌తో గొడవ వల్ల ఆశా అలా ప్రవర్తించిందనుకున్నా నౌషాద్ సంగీతం సమకూర్చిన ‘‘ఆయినా’’ (1977) సినిమాలో కూడా ఇది రిపీట్ అయింది. ‘కహో తో ఆజ్ బోల్ దూ’ అనే పాటను ఆశా, వాణీలచే పాడించడానికి నౌషాద్ ప్లాను చేశారు. కలిసి పాడడానికి ఆశా ఒప్పుకోదు కాబట్టి ముందు ఆశాచే పాడించేసి, ఆమె వెళ్లిపోయిన తర్వాత వాణీచే పాడిద్దామని నౌషాద్ ప్లాను. కానీ ఫిలిం సెంటర్లో ఆశా పాడేసి వెళ్లిపోయే సమయానికి వాణీ లోపలకి రావడం జరిగింది. దీనికి ఆశా ప్రతిస్పందన ఎలా ఉంటుందో తెలిసిన ఆర్కెస్ట్రా వాణీ పాట రికార్డు చేయకుండా ఉండడానికి ఒక వాదన లేవనెత్తారు. ఆశా పాడిన పాటకు ఇది కంటిన్యూషన్ కాదనీ, అందువల్ల తమకు మళ్లీ కొత్తగా పేమెంటు చేయాలని వారి వాదన. విసుగెత్తిన నౌషాద్ అప్పటికి రికార్డింగు క్యాన్సిల్ చేసి మహబూబ్ స్టూడియోలో వాణీచే రికార్డు చేయించాడు. అయితే ‘‘ఆయినా’’ డిస్క్‌లో వాణీ గొంతు వినిపించదు. ఎందుకో మరి!

‘‘మీరా’’ సినిమా విషయంలో రవిశంకర్ లతాకు ప్రత్యామ్నాయంగా వాణీని ప్రొజెక్టు చేయబోతే అదీ సఫలం కాలేదు. దానికో కథ ఉంది. రవిశంకర్ కమ్మర్షియల్ హిందీ సినిమాలకు సంగీతం ఇచ్చినది తక్కువే! కెఎ అబ్బాస్ సినిమా ‘‘ధర్తీ కే లాల్’’, చేతన్ ఆనంద్ ‘‘నీచా నగర్’’ కి 1946 ప్రాంతాలలో ఇచ్చాడు. అవి ఫెయిల్ అయ్యాయి. 14, 15 సంవత్సరాల తర్వాత త్రిలోక్ జెట్లీ ‘‘గోదాన్’’ కు, హృషీకేశ్ ‘‘అనూరాధా’’కు ఇచ్చాడు. ఇవీ ఫెయిలే! చాలా ఏళ్ల తర్వాత 1979 లో గుల్జార్ ‘‘మీరా’’కు చేశాడు. అదీ సక్సెస్ కాలేదు. విశ్వవ్యాప్తంగా ఎంత పేరు సంపాదించినా కమ్మర్షియల్ సినిమాకు రవిశంకర్ పనికిరాడని అన్నారందరూ. ‘వీళ్ల మొహం, వీళ్లెప్పుడూ విదేశాల మొహం చూసినవారు కారు. అందుకే అవసరమున్నా లేకపోయినా 30, 40 వయొలిన్లు పెట్టేస్తారు. నేనైతే సరిగ్గా ఎన్ని కావాలో అన్నే పెడతాను’ అంటాడు రవిశంకర్. ‘ఆయన ప్రతిభావంతుడే కానీ కమ్మర్షియల్ సినిమా టెక్నిక్ తెలియదు పాపం’ అన్నాడు నౌషాద్ ఒకసారి. ఓపి నయ్యర్ అయితే మరీ పచ్చిగా ‘ఆయన వాద్యకారుడు తప్ప కంపోజర్ కాదు’ అనేశాడు.

అయినా గుల్జార్ తన దర్శకత్వంలో హేమామాలిని హీరోయిన్ గా తయారవుతున్న ‘‘మీరా’’ (1979) సినిమాకై రవిశంకర్ సంగీతంలో లతా చేత పాడిద్దామని చాలా ప్రయత్నించాడు. దానికి చాలా అవరోధాలు వచ్చాయి. ‘అనూరాధా’ సినిమాలోని ‘సావ్‌రే, సావ్‌రే’ పాట రికార్డింగులో రవిశంకర్, లతాల మధ్య మనస్పర్థలు వచ్చాయి. చివరకు ఆ పాట డబ్బింగు రవిశంకర్ శిష్యుడు, ప్రఖ్యాత వేణు విద్వాంసుడు విజయరాఘవరావు పర్యవేక్షణలో నిర్వహించబడింది. అది జరిగి దశాబ్దంన్నర అయింది కాబట్టి లతా, రవిశంకర్ ఇద్దరూ మర్చిపోయివుంటారనుకున్నాడు గుల్జార్.

గుల్జార్ ‘‘మీరా’’ను ప్లాను చేసినప్పుడు హేమమాలిని రూపం, లతా గళం కలిపితే బ్రహ్మాండమైన హిట్‌పెయిర్ అవుతుందని అంచనా వేశాడు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌లను సంగీతదర్శకులుగా పెట్టుకున్నాడు. లతా ‘‘మీరా’’ ముహూర్తానికి హాజరయింది కానీ సంగీత దర్శకుడిగా తన తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్‌ను పెట్టమంది. తను పాడిన మీరా భజనల ప్రైవేటు ఆల్బమ్స్‌కి హృదయనాథే సంగీతం సమకూర్చాడు కాబట్టి అతనే సరైన వాడని ఆమె వాదన. హృదయనాథ్ ఎంత గొప్పవాడైనా కమ్మర్షియల్‌గా సెల్లింగ్ పాయింటు కాడని గుల్జార్ బాధ. లతా ఉద్దేశం గ్రహించిన లక్ష్మీ-ప్యారేలు ఏదో కుంటిసాకు చెప్పి సినిమానుండి తప్పుకున్నారు. లతాకు కోపం తెప్పించే ఉద్దేశం వారికి ఎంతమాత్రమూ లేదు.

అప్పుడు రవిశంకర్ మీద గుల్జార్ దృష్టిపడింది. రవిశంకర్ పేరు విదేశాలలో బాగా అమ్ముడుపోతుంది కాబట్టి ఓవర్సీస్ మార్కెటుకు ఉపయోగపడుతుందనుకుని ఆయనను అడిగారు. సరేనన్నాడు. లతా పాటలు, రవిశంకర్ సంగీతం అంటే అనూరాధా టైప్‌లో శ్రోతలందరూ ఆకర్షింప బడతారని నిర్మాత, దర్శకుల అంచనా. కానీ లతా, రవిశంకర్‌ల మధ్య నడుస్తున్న తాజా తగాదా వారికి తెలియదు.

లతాకు విదేశాలలో కచ్చేరీలు ఇచ్చే అలవాటు లేదు. 1974లో రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శన సూపర్ హిట్ కావడంతో ఆమె తన కమ్మర్షియల్ వాల్యూ బాగా గుర్తించింది. అప్పటిదాకా అక్కడ రవిశంకరే స్టార్. సితార్‌తో కొత్త, కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రపంచ పౌరులందరినీ ఆకర్షించగల విద్వాంసుడాయన. లతా పరాయివాళ్లు మ్యూజిక్ ఇచ్చిన పాటలే పాడవచ్చు గాక, ఆమె పాటలు భారత ఉపఖండం నుండి వచ్చిన ఇండియన్స్, పాకిస్తానీలు, బంగ్లాదేశీయులకు మాత్రమే నచ్చవచ్చు గాక, ఆమె ప్రదర్శనలు రవిశంకర్ కచ్చేరీల కంటే ఎన్నోరెట్లు కనకవర్షం కురిపించేవి. అందువల్ల ఆమె ఫీజు రవిశంకర్ ఫీజు కంటే ఎక్కువ ఉండేవి. కాస్తో కూస్తో ఎక్కువయితే రవిశంకర్ కూడా ఫీలవకపోదునేమో! కానీ క్రమంగా అది రవిశంకర్ ఫీజు కంటే 15 రెట్లు ఎక్కువగా ఉండే స్టేజికి చేరుకునేసరికి రవిశంకర్‌కి బాధ మొదలయింది.

‘‘మీరా’’కు లతా పాడననేడయంతో రవిశంకర్ ‘వాణీ జయరాం చేత పాడిద్దాం లెండి. ఆవిడ కూడా మంచి సింగరే’ అనేశాడు. ‘మీరోసారి లతాతో మాట్లాడి చూడండి’ అని గుల్జార్ అన్నా రవిశంకర్ అప్పటికి సరేనని తర్వాత కుదర్లేదనేశాడు. వాణీ చేతనే ‘‘మీరా’’ పాటలు పాడించారు. వాటి కోసం రవిశంకర్ విదేశాలనుండి బొంబాయి వచ్చి 14 రోజుల్లో 14 పాటలు రికార్డు చేయించాడు. ‘‘మీరా’’ రికార్డింగు రోజుల్లో ఒకరోజు మెహబూబ్ స్టూడియోలో పక్క రూములో ఖయ్యాం – లతా రికార్డింగు ఉంది. ఇద్దరూ ఎదురయినప్పుడు ఎలా ఉంటుందో అని అందరూ అనుకుంటూండగా ఆ రోజు లతా-ఖయ్యాం రికార్డింగు క్యాన్సిల్ చేశారెవరో! ‘హమ్మయ్య’ అనుకున్నారందరూ.

‘మీరా’లో పాటలు వాణీ జయరాం అద్భుతంగా పాడింది. అయినా సినిమా ఫెయిలయింది. ఇలా టాలెంటు వున్నా వాణీ జయరాంకు హిందీరంగంలో పెద్దగా ఛాన్సులు రాలేదు. వందకు పై చిలుకు పాటలు పాడినా పౌరాణిక చిత్రాలలోను, దక్షిణాది నుండి డబ్ చేసిన సినిమాల లోనూ ఛాన్సులు వచ్చేవి. విసిగిపోయిన వాణీ దక్షిణాది సినిమాల పైనే తన దృష్టిని కేంద్రీకరించింది.

వాణీ విషయంపై హరీష్ భిమానీ అనే రచయిత లతాను అడగడం జరిగింది – ‘ఓ సారి ఓ నిర్మాత నన్ను పాట పాడమన్నాడు, నేను ఊరు వెళుతున్నాను. ఆశా కూడా ఊళ్లో లేదు. నేను వాణీ జయరాం పేరు సూచించాను. వాళ్లు సరేనని ఆమెచే పాట పాడించారు. కానీ నేను ఊరు నుండి తిరిగి వచ్చాక ఆమె పాట తమకు నచ్చలేదని చెప్పి నన్ను పాడమన్నారు. నా యిబ్బంది గమనించండి. నేను పాడాననుకో, వాణీ ఛాన్సు నేను కొట్టేశానని అంటారు. పాడలేదనుకోండి, నా చేత పాడించలేదన్న ఉక్రోషం కొద్దీ నిర్మాతను ఏడిపించానంటారు. ఇదీ నా డైలమా!

అసలు విషయం ఏమిటంటే కొత్త గాయనీగాయకుల గొంతు నచ్చలేదనుకోండి. ఆ విషయం డైరక్టుగా చెప్పరు. ఈ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు పైకొస్తారో చెప్పలేం. ఇప్పుడు తిరస్కరిస్తే రేపు వాళ్లు పేరు తెచ్చుకున్నాక సాధించవచ్చు. అందువల్ల లౌక్యంగా ‘నీకు ఛాన్సిస్తే లతా నొచ్చుకుంటుంది’ అని నెపం పెడతారు. కెరియర్ ప్రారంభదినాల్లో నేనూ అనుభవించాను ఇవన్నీ’ అని సమాధానం ఇచ్చింది లతా! (ఫోటో – వసంత దేశాయి, లతా, యితరులు, ఇన్‌సెట్‌లో రవిశంకర్, వాణీ జయరాం)

– ఎమ్బీయస్ ప్రసాద్

mbsprasad@gmail.com

12 Replies to “ఎమ్బీయస్‍: లతా – వాణీ జయరాం”

  1. లతా రాజకీయాల మూలంగానే తనకి హిందీలో అవకాశాలు లేకుండా పోయాయి అని వాణి జయరాం కూడా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో నర్మగర్భంగా చెప్పారు

    1. మరి సౌత్ తెలుగు, తమిళ భాష లలో కూడా ఎందుకు ఎక్కువ పాడలేదు? తెలుగు లో సుశీల, తమిళ్ లో జానకి వల్ల నా?

  2. లతా రాజకీయాల మూలంగానే తనకి హిందీలో అవకాశాలు లేకుండా పోయాయి అని వాణి జయరాం కూడా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో నర్మగర్భంగా చెప్పారు

  3. ee prasad ki great-andhra kavali, leka pothe eedini yeavvadoo dekadu,

    ee sodi, great(seema) ki kavali, laka pothe eedi pajeelu nindavu !!!

    okappti russian czarla garrnundi mumaith khan make up varaku rodda antha nake telusu annattu rasthadu

  4. Could you please write article on trump tariffs , other countries reaction is right ?

    Why trump is unfairly asking dollar should as trade exchanges. If he has no ethical right to increase tariffs as USA is asking dollar should as trade exchange and they are simply printing money

Comments are closed.