ఎమ్బీయస్‌ : ఆశారాం బాపురే!

ఆశారాం బాపు 2013 ఆగస్టు నుండి జోధ్‌పూర్‌ జైల్లోనే వున్నారు. కానీ అక్కణ్నుంచే ఏదో మాయామంత్రంతో తనకు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చినవారిని హాంఫట్‌ చేసేస్తున్నాడు. అతనికి వ్యతిరేకంగా వున్న రెండు బలాత్కార కేసుల్లో వున్న 10…

ఆశారాం బాపు 2013 ఆగస్టు నుండి జోధ్‌పూర్‌ జైల్లోనే వున్నారు. కానీ అక్కణ్నుంచే ఏదో మాయామంత్రంతో తనకు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చినవారిని హాంఫట్‌ చేసేస్తున్నాడు. అతనికి వ్యతిరేకంగా వున్న రెండు బలాత్కార కేసుల్లో వున్న 10 మంది సాక్షులలో ముగ్గురు హత్యకు గురయ్యారు. ఒకతను మూణ్నెళ్లగా కనబడకుండా పోయాడు. తక్కినవాళ్లు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతుకు యీడుస్తున్నారు. తమకు రక్షణ కల్పించమని పోలీసులను బతిమాలుతున్నా వాళ్లు కదలటం లేదంటే ఆశారామ్‌ పలుకుబడి ఎంత బలంగా వుందో అర్థమవుతుంది. 

ఆశారామ్‌కి గతంలో వైద్యుడిగా పనిచేసి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన అమృత్‌ ప్రజాపతిని రాజ్‌కోట్‌లోని అతని క్లినిక్‌లోనే 2014 మే 23 న కాల్చి చంపారు. ఆశారాం అనుచరులు ఆరుగుర్ని నిందితులకుగా అరెస్టు చేశారు. అయినా ఆశారాంను యీ విషయమై యింటరాగేషన్‌ చేయలేదు. 

ఆశారామ్‌కు వ్యక్తిగత సహాయకుడు, వంటవాడు అయిన అఖిల్‌ గుప్తా ఆశారామ్‌ తన అహ్మదాబాద్‌ ఆశ్రమంలో ఒక అమ్మాయిని రేప్‌ చేశాడని సాక్ష్యం చెప్పిన నాలుగు నెలలకు 2015 జనవరి 11 న ముజఫర్‌ నగర్‌లో అతను యింటికి మోటార్‌ సైకిలుపై వస్తూండగా కాల్చి చంపారు.

జోధ్‌పూర్‌ ఆశ్రమంలో రేప్‌కు గురైన అమ్మాయి తల్లీ, తండ్రి యుపిలోని షహజాన్‌పూర్‌లో వుంటారు. తమను నోరు విప్పవద్దని ఆశారాం పనివాడు అర్జున్‌ (పంకజ్‌ అనే మారుపేరు వుంది) బెదిరించాడని వాళ్లు ఫిర్యాదు చేస్తే అర్జున్ని జోధ్‌పూర్‌ పోలీసులు 2014 జులై 18న అరెస్టు చేశారు. కానీ అతను వెంటనే బెయిల్‌ మీద బయటకు వచ్చేశాడు. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పినా విచారణ ముందుకు సాగటం లేదు. తండ్రికి కృపాల్‌ సింగ్‌ అనే ఎల్‌ఐసి ఏజంటు మిత్రుడున్నాడు. వెళ్లి అతనితో మొత్తుకున్నాడు. అతను పోలీసుల వద్దకు వెళ్లి కాస్త హడావుడి చేశాడు. దాంతో ఆశారాం అతన్ని పిలిపించుకుని 'డబ్బిస్తే తండ్రి కేసు విరమించుకుంటాడేమో, ఎడ్వాన్సుగా పది లక్షలిస్తాం, అతని ఉద్దేశం కనుక్కో' అన్నాడు. వారితో పాటు రామశంకర్‌ సింగ్‌ అనే కృపాల్‌ ఫ్రెండు కూడా వున్నాడు. తమ మధ్య జరిగిన 20 ని||ల సంభాషణను కృపాల్‌ సింగ్‌ టేపుపై రికార్డు చేశాడు. దాన్ని తండ్రి పోలీసులకు అప్పగించాడు. పోలీసులకు యిప్పటిదాకా టేపుపై వాయిస్‌ అసలుదో, నకిలీదో పరీక్షించలేదు. పరీక్షించడానికి మూడు రోజులకు మించి పట్టదు. కానీ వారికా ఉద్దేశమే లేదు. ఒక టీవీ ఛానెల్‌ దాన్ని ప్రసారం చేసేసింది. ఆశారాం అనుచరులు ఆ ఛానెల్‌పై పరువునష్టం దావా వేయలేదు. నేను ఎలాగోలా బయటకు వచ్చేస్తానని అమ్మాయి తండ్రి గమనిస్తే మంచిది అనే ధ్వనిలో ఆశారాం 'నాకు మధ్యంతర బెయిల్‌ రావడానికి డాక్టర్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకుంటున్నాను' అని చెప్పినది కూడా ఆ టేపులో వుంది. తర్వాత నిజంగానే జోధ్‌పూర్‌ డాక్టర్లు అతనికి మెడికల్‌ సమస్య వుందని సర్జరీ చేయాలని సర్టిఫికెట్టు యిచ్చారు. తండ్రి దానిపై సుప్రీం కోర్టుకి వెళ్లాడు. అప్పుడు వాళ్లు ఎయిమ్స్‌ డాక్టర్లను నిర్ధారించమన్నారు. వారు రిపోర్టులు పరీక్షించి ఆపరేషన్‌ అక్కరలేదని చెప్పడంతో జోధ్‌పూర్‌ డాక్టర్ల రిపోర్టు తప్పని తేలి, బెయిలు ఆగిపోయింది. 

అమ్మాయి తండ్రికి మద్దతు యిస్తూ నరేంద్ర యాదవ్‌ తన జర్నలిస్టు ''దైనిక్‌ జాగరణ్‌'' పత్రికలో 'ఆశ్రమ్‌ ఆఫత్‌ మే హై' అనే పేరుతో వరుసగా వ్యాసాలు రాశాడు. అవి ఆపేయమని ఆశారామ్‌ పనివాళ్లు నారాయణ్‌ పాండే, సంజయ్‌ కుమార్‌ అతనికి రూ. 10 లక్షలు లంచం యివ్వచూపారు. తిరస్కరిస్తే చంపేస్తామని బెదిరించారు. కానీ అతను మాట వినకపోవడంతో 2014 సెప్టెంబరు 17 న అతనిపై దాడి చేశారు. ఆ కేసు కూడా ముందుకు సాగలేదు. పోలీసులు నిరాసక్తంగా వున్నారు. 2015 జులై 10 న కృపాల్‌ సింగ్‌పై షహజాన్‌పూర్‌లోని అతని యింటికి వెళుతూండగా దాడి జరిగింది. ముగ్గురు వచ్చి కాల్పులు జరిపారు. రెండు రోజుల తర్వాత మరణిస్తూ తనపై దాడి చేసినవారిలో అర్జున్‌, రాఘవ్‌, సంజయ్‌ కుమార్లు వున్నారని అతను తన మరణవాంగ్మూలంలో చెప్పాడు.

2015 ఫిబ్రవరి 2 న ఆశారామ్‌పై వున్న బలాత్కారం కేసులో ప్రధాన సాక్షి రాహుల్‌ సచన్‌ జోధ్‌పూర్‌ కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వస్తే ఆశారామ్‌ అనుచరుడు సత్యనారాయణ్‌ గ్వాలా అతన్ని కత్తితో పొడిచాడు. అలా కత్తితో పొడవమని ఆశారామే సైగ చేశాడని సచన్‌ తన స్టేటుమెంటులో చెప్పాడు. అయినా పోలీసులు ఆశారామ్‌ను యీ విషయమై ప్రశ్నించలేదు. ఆ కత్తిపోటుతో సచన్‌కి కొద్దిపాటి పక్షవాతం వచ్చింది. అప్పుడప్పుడు మతిమరుపు కూడా వస్తోంది. తనకు రక్షణ కావాలని లఖనవ్‌కి వెళ్లి పోలీసులను కోరాడు. వాళ్లు రోజంతా గార్డుని యివ్వడం కుదరదని చెప్పి కేవలం రోజులో 8 గంటలపాటు బాడీ గార్డు నిచ్చారు. అంటే ఎవరైనా దాడి చేయాలంటే ఆ 8 గంటల్లోనే చేయాలన్నమాట! ఆశారామ్‌పై వ్యాసాలు రాస్తూన్న నరేంద్ర యాదవ్‌తో సచన్‌ 'తన మామ, భర్త కలిసి చేసిన అత్యాచారాలను రెండు రోజుల్లో ఆశారామ్‌ కోడలు జానకి మీడియా ముందు వెల్లడిస్తుంది. దాంతో భూకంపం వస్తుంది చూడండి.' అని 2015 నవంబరు 23 న చెప్పాడు. అలా చెప్పిన రెండు రోజులకు సచన్‌ 2015 నవంబరు 25 న మాయమైపోయాడు. అతనికి బాడీగార్డుగా వున్న అమిత్‌ కుమార్‌ అతను కనపడటం లేదని ఫిర్యాదు చేయడానికి అక్షరాలా 17 రోజులు పట్టింది. ఇది వింతగా లేదా అని సబ్‌యిన్‌స్పెక్టరును మీడియావారు అడిగితే అతను కాజువల్‌గా ''సచన్‌ కావాలనే ఎక్కడికో వెళ్లిపోయాడు. తనే తిరిగి వచ్చేస్తాడని మా నమ్మకం'' అని జవాబిచ్చాడు. 

అతన్ని చంపేసి వుంటారు అంటాడు మహేంద్ర చావ్‌లా. అతను ఆశారామ్‌ కొడుక్కి వ్యక్తిగత సహాయకుడిగా వుండేవాడు. సాక్షిగా మారాడు. పానిపట్‌ వద్ద యింట్లోనే వున్న అతనిపై 2015 మే 13న తుపాకీ కాల్పులు జరిగాయి. అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. తను నోరు విప్పకుండా వుండడానికి రూ. 2 కోట్లు లంచం యిస్తానన్నారని, ఆశారామ్‌ అనుచరుడు  నిశాంత్‌ ఘంఘాస్‌ తనకు సూటుకేసులో డబ్బు చూపించాడని చెప్పాడు. పోలీసులు వెంటనే ఘంఘాస్‌ను అరెస్టు చేసి అతనిపై ఎంత బలహీనమైన కేసు పెట్టారంటే మూడు రోజుల్లో అతనికి బెయిలు వచ్చేసింది. దీని గురించి మీడియా అక్కడి పోలీసులను అడిగితే 'విచారణ సాగుతోంది' అని జవాబిచ్చారు. రాష్ట్రం ఏదైనా కానీయండి, ఆశారామ్‌ సాక్షికి రక్షణ లేదు. వాళ్లపై దాడి జరిగినా పోలీసులు కళ్లు మూసుకుంటున్నారు. జైలు నుంచే ఆశారాం అడలగొడుతున్నాడు. కేసు విచారణకు వచ్చేసరికి ప్రాణాలతో మిగిలివున్న సాక్షులు నోరు విప్పకపోయినా, సాక్ష్యం మార్చేసినా తప్పు వాళ్లది కాదు, వ్యవస్థది. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016) 

[email protected]