ఎస్తేరు తర్వాతి అధ్యాయమైన మక్కబీయులు (Maccabees) అన్ని బైబిళ్లలో కనబడదు. కాథలిక్, ఆర్థోడాక్స్, ఓరియంటల్ ఆర్థోడాక్స్ చర్చిల బైబిళ్లలో మాత్రమే కనబడుతుంది. ఒక యూదు రచయిత హీబ్రులో రాసి దానిలో కలిపాడంటారు. దీనిలో ఈజిప్టు, గ్రీకు రాజులు యూదులను ఎలా హింసించారో, వారిని వీరెలా ఎదిరించారో కొందరు వీరుల జీవితచరిత్ర ద్వారా చెప్పడం జరిగింది. దీనిలో ఆసక్తి కలిగించే అంశమేమిటంటే చరిత్రలో మనకు కనబడే అలెగ్జాండరు, ఈజిప్టు రాజులైన టాలమీ వగైరాలు దీనిలో ప్రస్తావనకు వస్తారు. ''యూరోప్ గాథలు''లో క్లియోపాత్రా భర్త 13 వ టాలమీ గురించి చెప్పాను కదా, దీనిలో ఆరవ టాలమీ, అతని రాజ్యకాంక్ష గురించి, పర్షియా రాజుల వారసత్వపు పేచీల గురించి చెప్తారు. అందువలన యుద్ధాల గురించి తక్కువ చెప్పి, ఆ రాజరికపు వ్యవహారాల గురించి ఎక్కువగా చెప్పి అధ్యాయాన్ని త్వరగా ముగిస్తాను.
మాసిడోనియా రాజైన ఫిలిప్ కుమారుడు అలెగ్జాండర్ (క్రీ.పూ. 356-323) దండెత్తి వచ్చి పారశీకంతో సహా అనేక దేశాలను స్వాధీనం చేసుకున్నాడు. అతను పన్నెండేళ్లు పాలించాక చనిపోయే ముందు తన సామ్రాజ్యాన్ని విభజించి ఒక్కో సేనాపతికి ఒక్కో భాగాన్ని యిచ్చాడు. సిరియాకు సెల్యూకస్ (Selecus IV Philopator) క్రీ.పూ. 218- 175) రాజుగా వుండగా రోమ్‌కు పెద్దమొత్తంలో బాకీపడ్డాడు. డబ్బుకోసం జెరూసలెంకు తన మంత్రి హెలియోడొరస్ (Heliodorus)ను పంపి యూదు దేవాలయం సంపదను దోచుకోమన్నాడు. హెలియోడొరస్ అలాగే దోచుకుని తిరిగి వచ్చి, రాజు సెల్యూకస్‌ను చంపి, అతని కుమారుడైన దెమెత్రియసు ను రోమ్‌లో ఖైదీగా వుంచి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. అయితే సెల్యూకస్ తమ్ముడైన నాల్గవ ఆంటియోకసు (Antiochus IV Epiphanes) హెలియోడొరస్ ను చంపి తనే రాజయ్యాడు. శత్రుశేషం వుంచకూడదని అన్నగారి చిన్న కుమారుణ్ని కూడా వధించాడు. అన్నగారు జెరూసలెం సంపదను దోచుకుంటే యితను ఓ అడుగు ముందుకేసి జెరూసలెంపై దండెత్తి అనేక మంది యూదులను చంపివేశాడు.
ఇవన్నీ చూసి యూదుల్లో చాలామంది 'మనం అన్యజాతి ప్రజలతో కలవకుండా వేరే మతాన్ని అవలంబించడం చేతనే యిన్ని యిక్కట్లు వస్తున్నాయి. మనం వారి లాగే జీవిద్దాం, సున్నతి వంటి సంప్రదాయాలు కట్టిబెడదాం, గ్రీకు దేశస్తుల లాగానే ఆడిటోరియంలో బహిరంగంగా దిగంబరంగా ఆటలాడుదాం. వారితో వివాహబాంధవ్యాలు ఏర్పరచుకుందాం' అనుకుని రాజుతో చెపితే అతను సంతోషంగా అనుమతించాడు. వారి మద్దతుతో సంప్రదాయవాదులైన యూదులను అణచి వేయసాగాడు. యూదు దేవాలయాల్లో విగ్రహాలు స్థాపించసాగాడు. అతను మహాసైన్యాన్ని పోగు చేసుకుని ఈజిప్టు రాజైన టాలమీపై దండెత్తాడు. టాలమీ భయంతో దేశం విడిచి పారిపోయాడు. ఆ సమయంలో మత్తతీయ (Mattathias) అనే ఒక పూజారి జెరూసలెంను విడిచి మోదేను నగరంలో వున్నాడు. అతను రాజుపై యుద్ధం ప్రకటించాడు. అతని తర్వాత అతని ఐదుగురు కొడుకుల్లో కొందరు యుద్ధం సాగించారు. అలా సాగించిన వారిలో యూదా, జోనాథన్‌లు ముఖ్యులు. ఈ యుద్ధాలు క్రీ.పూ. 175 నుంచి క్రీ.పూ. 134 వరకు సాగాయి. ఈ అధ్యాయంలో ఆ యుద్ధాల చరిత్ర కనబడుతుంది.
గ్రీకు పాలకుడి ఆజ్ఞ మేరకు ఒక యూదుడు దేవాలయంలో నెలకొల్పిన విగ్రహానికి బలి యిస్తూండడం చూసిన మత్తతీయ అతన్ని అక్కడే నరికి చంపాడు. అతనితో బాటు రాజోద్యోగిని కూడా! ఆ తర్వాత రాజాగ్రహానికి వెరచి, బంధుమిత్రులతో కలిసి సమీపంలో వున్న అరణ్యంలోకి పోయి దాగున్నాడు. వారిని పట్టుకోవడానికి సైన్యం వెళ్లినపుడు ఒక వెయ్యి మంది వున్న యూదుబృందం వారి కంటపడింది. ఆ రోజు సబ్బాత్ విశ్రాంతి తీసుకోవలసిన పవిత్రదినం కాబట్టి యుద్ధం చేయకూడదనే నియమాన్ని అనుసరించి యూదులు ఆయుధాలు పట్టలేదు. గ్రీకులకు అలాటి నియమం లేదు కాబట్టి వారందరినీ వధించి వెళ్లిపోయారు. ఆ తర్వాత మత్తతీయ విశ్రాంతిదినం నాడు కూడా యుద్ధం చేయాలని అందర్నీ ఒప్పించాడు. యుద్ధాలు సాగుతూండగానే అతను కొన్నేళ్లకు మరణించాడు. అతని తర్వాత అతని కొడుకు యూదా (Juda Maccabees), అతని సోదరుల సహాయంతో పోరాటాన్ని కొనసాగించాడు. క్రీ.పూ. 165లో తొలి విజయం సిద్ధించి జెరూసలెం ఆలయాన్ని తిరిగి సంపాదించుకోగలిగారు. అది విని యితర ప్రాంతాల్లో వున్న అన్యజాతివారు అక్కడి యూదులను చంప నారంభించారు. వారిని కాపాడడానికి యూదా ఆ ప్రాంతాలపై దండెత్తాడు.
రాజుగా వున్న ఆంటియోకసుకు యుద్ధాలలో అపజయాలు ప్రాప్తించసాగాయి. దానితో అతను జబ్బుపడ్డాడు. అంతిమకాలంలో తనకు మిత్రుడైన ఫిలిప్పు అనే అతన్ని రాజ్యానికి సర్వాధికారిని చేసి, తన కుమారుడైన ఐదవ ఆంటియోకస్‌కు విద్యాబుద్ధులు నేర్పించి సింహాసనం అప్పగించమని కోరాడు. ఐదవ ఆంటియోకస్ గద్దె కెక్కాడు కానీ సెల్యూకస్ కుమారుడైన దెమెత్రియసు (Demetrius I Soter) రోమ్ నుంచి తప్పించుకుని వచ్చి అతన్ని చంపించి, తను రాజై పోయాడు. అతను యూదులను మరింతగా హింసించ సాగాడు. గ్రీకుల్లో ఎవరు రాజైనా తమ పట్ల సుముఖంగా లేరని గ్రహించిన యూదా రోము వారితో సఖ్యత కుదుర్చుకున్నాడు. చివరకు బెరెయా యుద్ధంలో దెమెత్రియసు సేనాని అయిన బఖిడసు (Bacchides) చేతిలో క్రీ.పూ. 160 లో యూదా మరణించాడు. అతని తమ్ముడు జోనాథన్ (Jonathan Apphus) యూదు సైన్యాధిపతి అయ్యాడు కానీ సమయం తమకు అనుకూలంగా లేదని గ్రహించి ఎడారిలోకి పారిపోయాడు. అయినా బఖిడసు అతన్ని వెంటాడాడు. జోర్డాన్ నది వద్ద యుద్ధం జరిగింది. జోనాథన్, అతని అనుచరులు నది యీది పారిపోయారు. బఖిడసు తిరిగివచ్చి జెరూసలెంకు ఒక కీలుబొమ్మ గవర్నరును నియమించి వెనక్కి తన దేశానికి వెళ్లిపోయాడు. ఆ గవర్నరు కొంతకాలానికి చచ్చిపోవడంతో ఓ రెండేళ్ల పాటు శాంతి నెలకొంది. ఆ సమయంలో జోనాథన్ సైన్యసమీకరణలో నిమగ్నుడై తన బలాన్ని పెంచుకున్నాడు. రెండేళ్ల తర్వాత బఖిడసు తిరిగి యుద్ధానికి వచ్చి జోనాథన్ గెరిల్లా యుద్ధంతో విసిగి అతనితో సంధి చేసుకున్నాడు. జోనాథన్ యికపై రాజకీయంగా బలపడ్డాడు.
ఈ దశలో దెమెత్రియసుకు రాజకీయంగా కష్టాలు వచ్చిపడ్డాయి. మాజీ రాజు నాల్గవ ఆంటియోకసు కొడుకు, తనకు వరుసకు తమ్ముడు అయిన అలెగ్జాండరు బాలాస్ (Alexander Balas) తనే అసలైన వారసుణ్నని ముందుకు వచ్చాడు. ఈజిప్టును సంయుక్తంగా ఏలుతున్న ఆరవ టాలమీ (Ptolemy VI|), అతని సోదరి, భార్య ఐన రెండవ క్లియోపాత్రా (Cleopatra II) అతన్ని సమర్థించసాగారు. ఆ పరిస్థితిలో దెమెత్రియసు తన స్థానం బలపరచుకోవడానికి జోనాథన్‌కు జెరూసలెం వచ్చి కోట కట్టుకుని, సైన్యం సమకూర్చుకుని తనకు అండగా వుండమని కోరాడు. ఆ మేరకు అనుమతులు యిచ్చాడు. ఇది విని అతనికి పోటీగా అలెగ్జాండరు బాలాస్ జోనాథన్‌కు యింకా ఎక్కువ సౌకర్యాలు యిస్తానన్నాడు. అతన్ని జెరూసలెం ఆలయానికి ప్రధానపూజారిగా నియమిస్తానన్నాడు. ఈ విధంగా వారసత్వపు పోటీ వలన యూదుల పరిస్థితి మెరుగుపడింది. అలెగ్జాండరును సమర్థిస్తానని ఒప్పుకుని జోనాథన్ క్రీ.పూ.153లో ప్రధాన పూజారి అయ్యాడు. తర్వాత జరిగిన యుద్ధంలో అలెగ్జాండరు చేతిలో దెమెత్రియసు చనిపోయాడు. అప్పుడు అలెగ్జాండరు ఆరవ టాలమీ వద్దకు రాయబారిని పంపి ''నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసి, సంధి కుదుర్చుకో.'' అని కబురు పంపాడు. దానికి టాలమీ సమ్మతించి కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లివేళ జోనాథన్‌కు విశేషగౌరవాలు దక్కాయి.
ఇది జరిగిన కొన్నాళ్లకు చనిపోయిన దెమెత్రియసు కొడుకు రెండవ దెమెత్రియసు (Demetrius II Nicator) క్రేటు ద్వీపం నుంచి సిరియాకు వచ్చి సింహాసనానికి తనే వారసుణ్ని అనసాగాడు. అతని రాక విని అలెగ్జాండరు భయపడ్డాడు. దెమెత్రియసు సిరియాకు ఆపోలినియస్ (Apollonius) అనే అతన్ని గవర్నరుగా నియమించాడు. అలెగ్జాండరుకు ఆప్తుడు కదాని జోనాథన్‌పై అతను కయ్యానికి కాలుదువ్వాడు. జోనాథన్ అతన్ని యుద్ధంలో ఓడించాడు. ఆ వార్త విని అలెగ్జాండరు సంతోషించి జోనాథన్‌కు అనేక బహుమతులు పంపి, యింకా కొన్ని ప్రాంతాలపై అధికారాన్ని కట్టబెట్టాడు. ఇలా జోనాథన్ అండగా నిలిచినా మావగారైన టాలమీయే తన అల్లుడిపై యుద్ధానికి వచ్చాడు. అంతే కాదు, దెమెత్రియసు వద్దకు రాయబారం పంపి ''మనిద్దరం సంధి చేసుకుందాం. బలవంతాన అలెగ్జాండరుకు కట్టబెట్టిన మా అమ్మాయిని వెనక్కి రప్పించి నీకిచ్చి మళ్లీ పెళ్లి చేస్తాను.'' అని ప్రతిపాదించాడు. అతను ఒప్పుకోవడంతో ఆమెను రప్పించి పెళ్లి చేశాడు కూడా. రెండు సేనలు కలిసి అలెగ్జాండరును ఓడించాయి. అతను అరేబియాకు పారిపోతే అరేబియను జాతివాడు అతని తల నరికి టాలమీకి కానుకగా పంపాడు. ఇంకో రెండు రోజలకు టాలమీ కూడా చచ్చిపోయాడు. దెమెత్రియసు గ్రీసు, సిరియా రాజ్యాలకు రాజయ్యాడు. అయితే జోనాథన్ కొత్త రాజుకి లొంగలేదు. రాజుకి కోపం వచ్చి పెద్ద సేనతో జెరూసలెం వచ్చాడు. పరిస్థితి గమనించిన జోనాథన్ లౌక్యంగా మాట్లాడి అతనికి కానుకలిచ్చి ప్రసన్నుణ్ని చేసుకున్నాడు. అతను యూదులకు మరిన్ని సదుపాయాలిచ్చి మరలాడు. పన్ను మినహాయింపులు, కొత్త ప్రాంతాలు యిచ్చాడు.
ఈ దశలో అరేబియాలో పెరుగుతున్న అలెగ్జాండర్ బాలాస్ మూడేళ్ల కొడుకైన ఆరవ ఆంటియోకస్ అసలైన వారసుడంటూ డియోడోటస్ త్రూఫోను (Diodotus Tryphon) అనే సేనాని అతని పేరుపై తిరుగుబాటు చేశాడు. దెమెత్రియసు జోనాథన్ సహాయాన్ని కోరాడు. జోనాథన్ మూడు వేల మంది సైన్యాన్ని పంపినా, ప్రజలు బాలరాజు పక్షాన వున్నారని గ్రహించి పాతరాజు నుంచి దూరంగా జరిగాడు. తన సోదరులను పంపి దేశంలో వున్న అతని సైన్యశిబిరాలను నాశనం చేయించాడు. బాలరాజు పేర డియోడోటస్ అధికారం చలాయించసాగాడు. జోనాథన్ మరీ బలపడుతున్నాడని గ్రహించి అతన్ని ఎలాగైనా మట్టుపెట్టాలనుకున్నాడు. అతని నగరానికి వెళ్లి 'నీకు 40 వేల మంది సైన్యం ఎందుకు? ఆ సైన్యాన్ని వదులుకుంటే మరో రెండు ప్రాంతాలపై ఆధిపత్యం యిస్తాను' అన్నాడు. జోనాథన్ నమ్మాడు. వెయ్యి మందిని వెంటపెట్టుకుని కొత్త ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ డియోడోటస్ వారందరినీ చంపివేసి జోనాథన్‌ను ఖైదు చేయించాడు. జోనాథన్‌ను విడుదల చేయమని అడగడానికి అతని తమ్ముడు సైమన్ (Simon) వచ్చాడు. జోనాథన్ యిద్దరు కొడుకులను బందీలుగా యిమ్మనమని, నూరు టాలెంట్లు పరిహారం యిమ్మనమని అడిగాడు డియోడోటస్. గత్యంతరం లేక సైమన్ యిచ్చాడు కానీ డియోడోటస్ ఎటువైపు వెళ్లడానికి వీల్లేకుండా దారులు మూసేశాడు. దాంతో కోపం వచ్చిన డియోడోటస్ జోనాథన్‌ను చంపివేసి తన దేశానికి వెళ్లిపోయాడు. జోనాథన్‌ను సైమన్ సమాధి చేశాడు. (సశేషం) (ఫోటో- మక్కబీయులు – చిత్రకారుడు 19 వ శతాబ్దపు స్టాట్లర్ )
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)