ఎమ్బీయస్‍: డెమోక్రాట్ల వైఫల్యం

అమెరికా వంటి నాగరిక దేశంలో ట్రంప్ వంటి అనాగరికుడు అధ్యక్షుడిగా ఎన్నిక కావడమేమిటి, వింత కాకపోతే అనిపిస్తుంది, బయట ఉన్న మనకు. కానీ అక్కడ వాళ్లకున్న ప్రత్యామ్నాయం ఏమిటి?

అమెరికా వంటి నాగరిక దేశంలో ట్రంప్ వంటి అనాగరికుడు అధ్యక్షుడిగా ఎన్నిక కావడమేమిటి, వింత కాకపోతే అనిపిస్తుంది, బయట ఉన్న మనకు. కానీ అక్కడ వాళ్లకున్న ప్రత్యామ్నాయం ఏమిటి? అనేది కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. చివర్లో కమలా హేరిస్ ప్రత్యర్థిగా అవతరించింది కానీ చాలాకాలం పాటు బైడెనే కదా ట్రంప్‌కు బదులుగా డెమోక్రాట్లు చూపించిన ఆల్టర్నేటివ్! నాలుగేళ్ల క్రితం బైడెన్ పోటీ చేసినప్పుడు ‘ముసలివాడు, మతి తప్పినవాడు, అంతటి బాధ్యతలను మోయడానికి ఆనర్హుడు’ అంటూ వ్యాఖ్యలు వచ్చాయి. అయినా వ్యక్తిగతంగా ట్రంప్ కంటె మెరుగు అంటూ ఓట్లేశారు. అతను పూర్తి పదవీకాలం జీవించి ఉండడని, మధ్యలో పుటుక్కుమంటే కమలా గద్దె కెక్కుతుందని, ఆ విధంగా మన భారతీయులందరూ లక్కీ (!?) అని కూడా కొందరు ఊహాగానాలు చేశారు. కానీ బైడెన్ నాలుగేళ్లూ లాక్కొచ్చాడు. ఈసురోమని యీడుస్తూ వచ్చాడు.

ఈసారి తర్వాతి తరానికి ఛాన్సిస్తూ హుందాగా తప్పుకుంటాడేమో ననుకుంటే అబ్బే దిగనన్నాడు. పార్టీ కూడా ‘చేసింది చాలు కానీ, యికనైనా దిగు’ అని గట్టిగా అనలేదు. అవతల ట్రంప్ట్‌ను చూడబోతే పార్టీ తనను ఎంపిక చేసేదాకా ఆగకుండా, తనంతట తనే అభ్యర్థిగా ప్రకటించేసుకుని బుల్లీ చేసుకుంటూ వచ్చేశాడు. ఇవతల బైడెన్ బహిరంగ ప్రకటనలు చేయకపోయినా పార్టీని గుప్పిట్లో పెట్టుకున్నాడని అనుకోవాలి. ఏదో ఆ డిబేట్ ధర్మమాని బైడెన్ శారీరక, మానసిక పరిస్థితి ఎలా ఉందో బయట పడిపోయి, విధి లేని పరిస్థితుల్లో తను తప్పుకుని కమలాకు ఛాన్సిచ్చాడు.

దాని పర్యవసానం మాట అటుంచండి, ప్రపంచానికే ప్రధాన దేశమైన, 80 దేశాల్లో సైనిక స్థావరాలున్న అమెరికా నాలుగేళ్లగా యిటువంటి దుర్బలుడి చేతిలో ఉందా అన్న విషయం తేటతెల్లమై భయాన్ని కలిగించింది. శారీరక దుర్బలత అనేది పెద్ద విషయం కాదు. బైడెన్ విషయంలో చిత్తచాంచల్యం కూడా కనబడుతోంది. ఇటువంటి మానసిక స్థితితో అతను ఉక్రెయిన్ యుద్ధం, గాజా యుద్ధం వంటి అంతర్జాతీయ వ్యవహారాలు, బలహీన పడుతున్న దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి దేశ సమస్యలు పరిష్కరించడానికి చూశాడన్న మాట, అందుకే అవి అలా అఘోరించాయి అని తెలిసి వచ్చింది. ట్రంప్ వచ్చి ఏం చేస్తాడో తెలియదు కానీ దుష్ట సేనాపతి (డీప్ స్టేట్) చేతిలో కీలుబొమ్మగా ఉన్న యీ కుంటి రాజు దిగడమే మంచిది అనిపిస్తోంది.

మన కథల్లో కుంటి రాజులు సాధారణంగా మంచివాళ్లయి ఉంటారు. ఈ బైడెన్‌లో అదీ కనబడలేదు యివాళ. ట్రంప్‌కు నీతి, నియమం లేదు, అడ్డగోలు, అడ్డదార్ల మనిషని యిన్నాళ్లూ అనుకుంటూ వచ్చాం కానీ యీ బైడెన్ మాత్రం ఏ విధంగా మెరుగు? తన కొడుకు నేరస్తుడని కోర్టు నిర్ధారించి, శిక్షాకాలం త్వరలోనే ప్రకటిస్తామని చెప్పిన తరుణంలో సంపూర్ణ క్షమాభిక్ష, అదీ పదేళ్ల కాలానికి యివ్వడమేమిటి? బైడెన్ కొడుకు హంటర్‌పై పన్ను ఎగవేత గురించి 9 కేసులు (17 ఏళ్ల శిక్ష) మాదక ద్రవ్యవాడకంపై 3 కేసులు (25 ఏళ్ల శిక్ష) ఉన్నాయి. శిక్షాకాలమెంతో చెపుతూ తీర్పు పూర్తిగా యిచ్చేస్తే బైడెన్ క్షమాభిక్ష పెట్టేస్తాడోమోనని వెల్లడించడం ఆలస్యం చేస్తున్నారు అనుకుంటున్నారు. అలాటి భయమేమీ అక్కర లేదు, నేను న్యాయ వ్యవస్థ పని తీరులో కలగ చేసుకోను అంటూ యిన్నాళ్లు పత్తిత్తు కబుర్లు చెప్పి యిప్పుడిలా చేశాడు.

మన దేశాధ్యక్షుడూ క్షమాభిక్షలు ప్రసాదిస్తారు, కానీ బంధువులకు కాదు. అమెరికాలో బంధువులకు యిస్తున్నారు. బిల్ క్లింటన్ తన సవతి సోదరుడికి, ట్రంప్ తన వియ్యంకుడికి క్షమాభిక్ష పెట్టారు. కానీ తను అలాటివాణ్ని కానని చెప్పుకుంటూ, ప్రతిజ్ఞలు చేస్తూ వచ్చిన బైడెన్ హఠాత్తుగా యిలా చేయడమేమిటి? పైగా దీనికి సంజాయిషీ ఏమిటంటే – ‘న్యాయప్రక్రియలో రాజకీయాలు చొరబడి, న్యాయం జరగకుండా చేశాయట (మిస్‌కారేజ్ ఆఫ్ జస్టిస్)!’ కొన్ని కేసుల్లో హంటరే తను తప్పు చేశానని ఒప్పేసుకున్నాడు. అలాటప్పుడు అవి రాజకీయప్రేరితమని బైడెన్ ఎలా అనగలడు?

ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా బైడెన్ చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఉక్రెయిన్‌కు ఏడాదిన్నర క్రితం అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణుల్ని యిచ్చాడు, ప్రమాదకరమైన మందుపాతరలను సరఫరా చేశాడు. కానీ వాటిని వినియోగించడానికి అనుమతి యివ్వలేదు. ఇప్పుడు ట్రంప్ తాను వచ్చి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తానని అనగానే, ఆ పని జరగకూడదను కున్నాడో ఏమో, నవంబరు మూడో వారంలో ఉక్రెయిన్‌కు యీ అనుమతి యిచ్చి, చేయ్, యింకా యుద్ధం చేయ్ అని ప్రోత్సహించాడు. తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులు స్టార్మ్ షాడోలను రష్యాపై ప్రయోగించడానికి బ్రిటన్ నిరుడు అనుమతించినప్పుడు బ్రిటన్‌ను వారించిన బైడెనే యిప్పుడా పని చేయడమేమిటని అందరూ ముక్కున వేలేసుకున్నారు.

అంతేనా? అంటూ డిసెంబరు 1న 1.1 బిలియన్ డాలర్ల ఆయుధ ప్యాకేజి యిచ్చి రష్యాలో టార్గెట్స్‌ను కొట్టు అంటున్నాడు. ఇది యుద్ధోన్మాదం కాదా? ప్రజలు తన ఉక్రెయిన్ విధానాలను తిరస్కరించారని తేటతెల్లమయ్యాక కూడా యిలా చేయడమేమిటి? ఈ నిర్ణయం తీసుకునే ముందు సెనేట్ సలహా కూడా తీసుకోలేదు. ఇలాటి బైడెన్‌కు తన పార్టీలోనే వ్యతిరేకత వచ్చి ఉండాలి. ఈ నాలుగేళ్లూ ఎలాగూ భరించాం, యిప్పటికైనా దిగు అని ఉండాల్సింది కదా! ఎందుకలా చేయలేదు? తమ పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని ఎందుకు గ్రహించలేదు? దీనికి కారణం డెమోక్రాటిక్ పార్టీ స్వభావం మారుతూ రావడమే అంటున్నారు పరిశీలకులు.

ఒకప్పుడు రిపబ్లికన్లు అంటే ధనిక వర్గాలకు, యుద్ధోన్మాదులకు, శ్వేతజాత్యహంకారులకు అనుకూలమని అనుకునేవారు. డెమోక్రాట్లంటే మధ్యతరగతి, కార్మిక పక్షపాతులని, ఉదారవాదులని, యితర జాతుల పట్ల కరుణ చూపేవారని, యితర దేశాల పట్ల సామరస్యంగా వ్యవహరించే వారనీ పేరుండేది. డెమోక్రాట్లు భారత్‌కు అనుకూలమని, రిపబ్లికన్లు కాదని చాలా మంది మన దగ్గర అనుకుంటూ ఉంటారు. గమనించండి, అమెరికాలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సైన్యావసరాల దృష్ట్యా పాకిస్తాన్‌కే అనుకూలంగా ఉంటుంది. చైనాతో వైరం పూనానని చెపుతూనే వారితో వాణిజ్యబంధాన్ని తెంపుకోదు. మన దేశాన్ని తన వాణిజ్యావసరాలకై వాడుకుందామని చూస్తుంది తప్ప మనకు ఏమీ ఒరగబెట్టదు.

రిపబ్లికన్లు వలసలను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వారేదో మనకు ద్రోహం చేసినట్లు ఫీలవ్వాల్సిన పనేమీ లేదు. వాళ్ల దేశం బాగు అనేది వాళ్లకు ముఖ్యం. వాళ్లు బాగు పడితేనే వలస వెళ్లిన మన వాళ్లలో ఏ కొద్దిమందైనా బావుకుంటారు. లేకపోతే వాళ్లు రానిచ్చీ ప్రయోజనం లేదు. మనమెంతసేపూ మనల్ని రానిస్తాడా, ఉండనిస్తాడా అనే ఆలోచన వదిలి వాళ్ల వైపు నుంచి ఆలోచించి చూడాలి. 34.5 కోట్ల జనాభాలో శ్వేత జాతీయులు 59%, హిస్పానియన్లు 19%, ఆఫ్రో అమెరికన్లు 13%, ఆసియన్లు 6% ఉన్నారని అంచనా. మొత్తం జనాభాలో 2 కోట్ల మంది అక్రమ వలసదారులున్నారని ట్రంప్ అంటాడు. 1.10 కోట్లే అని కొందంటున్నారు. పోనీ మధ్యేమార్గంగా ఏ 1.25 కోట్లో అనుకుందాం. వీరి వలన స్థానికులకు ఉద్యోగావకాశాలు దెబ్బ తింటాయన్నది, ఆ కారణంగా వారికి కోపం పెరుగుతుందన్నది సహేతుకం.

అమెరికా పరిస్థితి బాగున్నంత కాలం బయట నుంచి ఎంతమంది వచ్చినా స్థానికులు అభ్యంతరాలు చెప్పలేదు. మన కడుపు నిండుతోందిగా, మనం తినగా మిగిలింది వాణ్నీ తిననీయ్ అనుకున్నారు. ఆ యాటిట్యూడ్ వలననే అమెరికా ప్రపంచ మేధావులందర్నీ ఆకర్షించ గలిగింది. కానీ యిప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఆదాయం లేక, ధరల పెరుగుదలను తట్టుకోలేక అల్లాడుతున్నారు. ఈ పరిస్థితికి దారి తీసిన కారణాలను లోతుగా అధ్యయనం చేయలేక, ట్రంప్ అనుచరుల ప్రచారానికి ప్రభావితులై తమ దుస్థితికి వలసదారులనే నిందిస్తున్నారు. ఈ వర్గాల ప్రతినిథిగా పేరు బడిన డెమోక్రాటిక్ పార్టీ వారి ఆవేదనను అర్థం చేసుకుని, వారి తరఫున వలసలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఓ మేరకైనా ప్రొటెక్షనిజం ఉండాలి అని వాదించి, కర్షకులను ఆకట్టుకోవాలి.

కానీ కొన్నేళ్లగా తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు వారు. వలసదారుల వలన లబ్ధి పొందుతున్న కార్పోరేట్ వర్గాలకు అనుకూలమైన విధానాలను పాటిస్తున్నారు. ఆ విధంగా తమ కారెక్టరుకు భిన్నంగా వ్యవహరించి, తమ ఓటు బ్యాంకును చేజార్చుకున్నారు.

అలా అని కార్పోరేట్లు పూర్తిగా డెమోక్రాట్ల పక్షాన ఉన్నాయా? లేదే! బైడెన్ అభ్యర్థిగా ఉన్నంతకాలం దీనికి గెలిచే ఛాన్సు లేదంటూ నిధులివ్వలేదు. కమలా వచ్చి, నెగ్గుతుందేమోనన్న ఆశ కలిగాక అప్పుడు నిధులు కురిపించారు. నిజానికి ప్రపంచంలో ఏ పార్టీ ఫలానా సిద్ధాంతానికంటూ కట్టుబడి లేదు. ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా యించుమించు అవే విధానాలు కొనసాగుతున్నాయి. ఆ కొద్దిపాటి తేడాయే జయాపజయాలను నిర్ణయిస్తోంది. ఆర్థిక విధానాలకు వస్తే, కరోనా టైములో ట్రంప్ నోట్లు ఎక్కువ ముద్రించి, ఉత్తి పుణ్యాన కార్పోరేట్లకు డబ్బు పంపిణీ చేశాడు. అందరి చేతుల్లో డబ్బు ఆడడంతో కరెన్ విలువ తగ్గి, వస్తువు ధర పెరిగి, ద్రవ్యోల్బణం వచ్చి పడింది. తర్వాత వచ్చిన బైడెన్ కరోనా తొలగిపోయాక కూడా యిదే విధానాన్ని అవలంబించడ మెందుకో ఎవరికీ తెలియలేదు. కానీ వలన ధరలు మరింత పెరిగి, సామాన్యుడి నడ్డి విరిగింది.

కమలా వైస్ ప్రెసిడెంటుగా చెప్పుకోదగ్గ పని ఏదీ చేయలేదు. పైగా రాడికల్ ప్రోగ్రెసివ్‌గా ఆమె కున్న యిమేజి, కన్సర్వేటివిజం వైపు మొగ్గుతున్న అమెరికన్ ఓటరుకు మరింత దూరం చేసింది. బైడెన్ ఆర్థిక విధానాలను తిరగతోడి, స్థితి మెరుగుపరుస్తానని ఆమె అనలేక పోయింది. ‘‘బైడెన్ కంటె మీ ప్రభుత్వం ఎలా తేడాగా ఉండబోతోంది?’’ అని అడిగితే ‘‘ఏమీ తేడాగా ఉండదు.’’ అందామె. ఇంకెందుకు నీకు ఓటేయడం? అనుకున్నారు ఓటర్లు.

దీనికి తోడు విదేశీ వ్యవహారాల్లో బైడెన్ విధానాలు ఆర్థిక పరిస్థితిని మరింత కృంగతీశాయి. అఫ్గనిస్తాన్ వదుల్చుకోవడం మంచిదే. ఇప్పుడది పూర్తిగా తాలిబాన్ల వశం అయిపోయింది కదా అనుకోవచ్చు. కానీ అలా కాకుండా చూసుకోవలసిన బాధ్యత యావత్తు ప్రపంచానిది, అమెరికా ఒక్కటే ఆ భారం మోయనక్కర లేదు కదా. పోనీలే మంచి పని చేశాడు అనుకుంటూండగానే ఉక్రెయిన్ భారం నెత్తి కెత్తుకున్నాడు. ఆ పై నెతన్యాహూకి గుడ్డి సపోర్టు. బైడెన్ ఓడిపోయి, ట్రంప్ అల్టిమేటమ్ యివ్వగానే నెతన్యాహూ వెంటనే హెజ్‌బొల్లాతో యుద్ధవిరమణ ఒప్పందం కుదుర్చుకున్నాడు, చూడండి. అంటే అమెరికాకు యుద్ధం ఆపే లేదా తీవ్రత తగ్గించే శక్తి ఉంది. కానీ బైడెన్ అది వాడలేదు.

అమెరికన్ భారతీయులంటే డెమోక్రాట్లకు సహజ మద్దతుదారులు అనే అభిప్రాయం ఉంది. అది ఎంతవరకు నిజం, అసలు అమెరికాలో అమెరికన్-భారతీయుల స్థితిగతులేమిటి అనే డాటాను 30-10-24 నాటి ‘‘ద హిందూ’’ యిచ్చింది. యుఎస్ సెన్సస్ బ్యూరో నుంచి, కార్నిజీ ఎండోమెంట్స్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ నుంచి 2019-2023 నాటి యీ డేటా తీసుకున్నారు. అమెరికాలో సగటు వార్షిక కుటుంబాదాయం 2023లో 78 వేల డాలర్లుంటే (2019లో 66) భారతీయులది 157 (127), చైనా వారిది 105 (86), కేవలం శ్వేత జాతీయలది 83 (70). పేదరికం సంగతికి వస్తే అమెరికన్ సగటు 8.8 (8.6) కాగా బ్లాక్స్ లేదా ఆఫ్రికన్-అమెరికన్లలో 17 (17.4), కేవలం శ్వేతజాతీయులలో 6.2 (6.8), భారతీయులలో 4 (3.7). దీన్ని బట్టి తెలిసేదేమిటి? సగటు భారతీయుడి ఆదాయం సగటు అమెరికన్ కంటె రెట్టింపు! భారతీయుల్లో కూడా పేదలున్నారు కానీ వారి శాతం నల్లవారితో పోలిస్తే నాలుగో వంతు కంటె తక్కువ!

భారతీయుల్లో 28% మంది ప్రొఫెషనల్, సైంటిఫిక్, మేనేజ్‌మెంట్, ఎడ్మినిస్ట్రేటివ్ వృత్తుల్లో ఉన్నారు. 21.7% ఎడ్యుకేషనల్, హెల్త్‌కేర్ సర్వీసెస్‌లో ఉన్నారు. మాన్యుఫేక్చరింగ్‌లో 10.9%, రిటైల్ ట్రేడ్‌లో 9.1%, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, రెంటల్ లీజింగ్‌లో 10.3%, ఆర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎకామడేషన్, ఫుడ్ సర్వీసెస్‌లో 4.4%, ట్రాన్స్‌పోర్టేషన్, వేర్‌హౌసింగ్‌లో 4.1% ఉన్నారు. తక్కిన వారు మిగతా వృత్తుల్లో ఉన్నారు. వీరి రాజకీయాభిమానాలకు వస్తే 2019లో 56% డెమోక్రాట్లను, 15% రిపబ్లికన్లను, 22% స్వతంత్రులను అభిమానించారు. 2023 వచ్చేసరికి యిది 47- 21- 26గా మారింది. అంటే యీ నాలుగేళ్లలో డెమోక్రాట్లకు 9% తగ్గి, రిపబ్లికన్లకు 6% పెరిగిందన్నమాట!

ఇవి 2023 అంకెలు. 2024 ఎన్నికలు వచ్చేసరికి డెమోక్రాట్లు యీ 47% ను పెంచుకున్నారా అనేది సందేహం. బైడెన్ అభ్యర్థిగా ఉన్నపుడేమో కానీ కమలా తను అభ్యర్థి కాగానే తన భారతీయ మూలాలను చాటుకుంటుందని అనుకున్నారు. 2020లో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు ఆమె దోసె వేస్తున్న వీడియో చలామణీలోకి వచ్చింది. ఆమె సోదరి, మేనకోడలు వారి తమిళ మూలాల గురించి మాట్లాడారు. ఈసారి అధ్యక్ష అభ్యర్థి కాగానే సౌత్ ఏసియన్ విమెన్ ఫర్ హారిస్ అంటూ తక్కినవాళ్లు కాస్త హడావుడి చేశారు. కానీ కమలా మాత్రం భారతీయ మూలాలను చాటుకోదలచ లేదు. ఆమె రాజకీయ కారణాలు ఆమెకు ఉండవచ్చు కానీ భారతీయులు మాత్రం దగా పడ్డట్టు ఫీలయ్యారు. మరో పక్క ట్రంప్ నమస్తేలు పెట్టేస్తూ ఇండియాతో తన బంధాల గురించి ప్రచారం చేసుకోసాగాడు. పక్కా భారతీయురాలిని (కమలా తల్లి మాత్రమే భారతీయురాలు) పెళ్లి చేసుకున్న జెడి వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా పెట్టుకున్నాడు.

2020లో ట్రంప్‌తో పోలిస్తే బైడెన్‌కు ఓటేసిన లాటిన్ అమెరికన్లు 23% ఎక్కువ అన్నారు. ఈసారి వారు కమలా కంటె ట్రంప్‌కు 8% ఎక్కువ వేశారట. భారతీయ అమెరికన్ పురుషుల్లో 53% కమలకు, 47% ట్రంప్‌కు వేశారట. పైగా యువతలో ట్రంప్‌కు మద్దతు ఎక్కువగా ఉంది. భారతీయులు కమలను పెద్దగా సొంతం చేసుకోలేదు కానీ నల్లవారు మాత్రం చేసుకున్నారు. వారిలో 78% మంది పురుషులు, 92% మంది స్త్రీలు కమలకు ఓటేశారట. మొత్తం మీద చూస్తే విద్యాధికులైన యువతుల్లో మాత్రమే కమలకు ఎక్కువగా ఓట్లు పడ్డాయి.

అమెరికాలో కొన్ని రాష్ట్రాలు సాంప్రదాయకంగా ఒక పార్టీకి ఓటేస్తాయని తెలిసినా, స్వింగ్ స్టేట్స్ ఎటు వేస్తాయా అన్నదే అందరికీ ఆసక్తికరం. రెండు పార్టీలు తమ అడ్వర్జయిజింగ్ ఖర్చులో 80% యీ స్టేట్స్‌లోనే ఖర్చు పెట్టాయి. అంతిమంగా 7 స్వింగ్ స్టేట్స్‌లో – విస్కాన్సిన్, మిషిగన్, జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, నెవాడా, అరిజోనాలలో ట్రంప్ నెగ్గేశాడు. మార్జిన్లు పెద్దగా లేకపోవచ్చు, కానీ నెగ్గడమైతే నెగ్గాడు కదా! గమనించాల్సింది ఏమిటంటే, యివన్నీ ఒకలాటివే కావు. మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లలో శ్వేత జాతీయులు ఎక్కువ. కార్మికులతో పాటు, విద్యావంతులైన వైట్స్ కూడా ఉన్నారు. అరిజోనా, నెవాడాలలో మైనారిటీ జనాభా ఎక్కువ. జార్జియా, నార్త్ కరోలినా ఆఫ్రో-అమెరికన్ ఓటర్లు, మతపరంగా ఓటేసేవారు ఉన్నారు. ఇక్కడ కూడా కమలా ఎక్కువ ఓట్లు తెచ్చుకోలేక పోయింది.

ఆర్థికపరమైన కష్టాల కారణంగా వర్కింగ్ క్లాస్ వారు డెమోక్రాట్లను శిక్షించారని తోస్తోంది. కొన్ని రాష్ట్రాలలో మహిళలు కమలాకు ఎక్కువ సంఖ్యలో ఓటేసినా, మగవాళ్లు ట్రంప్‌కు వేసినంత స్థాయిలో వేయకపోవడంతో ఆ గ్యాప్ పూరించ బడలేదు. మిషిగన్‌ లోని అరబ్-అమెరికన్ జనాభా గాజా విషయంలో ఇజ్రాయేలుని గుడ్డిగా సమర్థించినందుకు డెమోక్రాట్‌లను శిక్షించారు. 2020లో ట్రంప్‌ను చూసి భయపడి, డెమోక్రాట్లు అంతర్గత విభేదాలను మరచి ఒక్కటయ్యారు. 2024లోనూ అదే జరుగుతుందని పార్టీ భ్రమ పడింది. బైడెనే అంటూ చాలా కాలం కాలక్షేపం చేసి, చివరకు టైము లేదంటూ ఏ ప్రైమరీలు జరపకుండా కమలాను నిల్చోబెట్టింది, పార్టీలో ఆమె కున్న బలం గురించి ఏ అంచనా లేకుండానే!

ట్రంప్‌కి యింత మద్దతు ఉన్నా, ఒపీనియన్ పోల్స్‌లో ఎందుకు బయట పడలేదు, చివరిదాకా నెక్ అండ్ నెక్ అంటూ వచ్చారెందుకు? అనే ప్రశ్నలకు కొందరు సమాధానాలు చెప్పారు. ట్రంప్ యిమేజి కారణంగా అతని ఓటర్లు మేం అతనికే ఓటేస్తున్నాం అని బాహాటంగా చెప్పలేదు. అమెరికా ఎంత ఉదారదేశంగా పేరు బడినా, అక్కడ మహిళను అధ్యక్షురాలిగా అంగీకరించే సమాజం రూపొందలేదు. అందుకే హిల్లరీ వంటి గట్టి కాండిడేట్ కూడా నెగ్గలేదు. అబార్షన్ విషయంలో ట్రంప్ వైఖరి అమానుషం, మహిళల పట్ల అతని వైఖరి అవమానకరం, అనాగరికం. అయినా మహిళలు సాటి మహిళను నెగ్గించడం యిష్టం లేక, ట్రంప్‌ను గెలిపించారు. ఈ ధోరణి యివాళ్టిది కాదని తెలిసినా డెమోక్రాట్లు కమలకు బదులు మరో పురుష అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు?

డెమోక్రాట్స్ కేవలం మహిళల హక్కు గురించి మాట్లాడినా బాగుండేది. వాళ్ల ప్రపంచం ఎల్‌జిబిటిక్యూల చుట్టూ తిరిగింది. నేను మగవాణ్నే అయినా ఆడదానిలా ఫీలవుతున్నానంటూ ఆడవాళ్లతో పోటీ పడడం, స్కూలు రోజుల్నుంచి హిమ్, హెర్ అనకూడదని, ‘దే’ అనాలని ఆంక్షలు పెట్టడం.. యిలాటి వెర్రి ధోరణి ఎక్కువై పోయింది. ‘డెమోక్రాట్ల ట్రాన్స్‌జండర్ ఎజెండా దాన్ని సాంప్రదాయక ఓటర్ల నుంచి దూరం చేసింది.’ అని విశ్లేషకులు చెప్పారు. ఈ జండర్ గొడవతో విసిగిన అమెరికన్లు ‘ఈ భావజాలం నుంచి, వలసదారుల ఆక్రమణ నుంచి అమెరికాను విముక్తి చేస్తాన’ని ట్రంప్ పిలుపు నివ్వడంతో ఆకర్షితులయ్యారు. ట్రంప్ యాడ్ ‘కమలా యీజ్ ఫర్ దే/దెమ్, ట్రంప్ ఈజ్ ఫర్ యూ’ వాళ్లకు బాగా నచ్చింది. ఎన్నికలకు ముందు అమెరికన్ మీడియా దీన్ని గుర్తించడానికి నిరాకరించింది. 2022 నాటి ఎబిసి న్యూస్ సర్వే ప్రకారం జనాభాలో 27% మంది తాము డెమోక్రాట్ల మని చెప్పగా జర్నలిస్టుల్లో మాత్రం 36% మంది తాము డెమోక్రాట్లమని చెప్పుకున్నారు. జర్నలిస్టుల్లో 3% మంది మాత్రమే రిపబ్లికన్లమని చెప్పుకున్నారు. 2002లో అది 18% ఉండేది. ఈ లోటుని ఎలాన్ మస్క్ సహాయంతో ట్రంప్ సోషల్ మీడియాలో భర్తీ చేసుకున్నాడు.

ట్రంప్ గెలుపుపై మరి కొన్ని పాయింట్లు సేకరించాను. ట్రంప్ కొత్త టీముపై రాయబోయే వ్యాసంలో వాటిని ప్రస్తావిస్తాను. ప్రస్తుతానికి యీ వ్యాసాన్ని డెమోక్రాటిక్ పార్టీ పొరపాట్లను ఎత్తి చూపుతూ 14-11-24 ఆంధ్రజ్యోతిలో విఎస్ రవి అనే ఆయన రాసిన వ్యాసం సారాంశంతో ముగిస్తాను – ‘మాన్యుఫేక్చరింగ్ యిండస్ట్రీ తరలిపోవడంతో అమెరికాలో 60% కుటుంబాలు ఒక నెల జీతం రాకపోయినా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. ఆర్థిక అసమానతలకూ, కార్పోరేట్ల ధనదాహానికి, రాజకీయాల్లో డబ్బు పాత్రకు వ్యతిరేకంగా 2011లో దేశవ్యాప్తంగా లక్షల మంది ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’ నిరసలను చేస్తే ‘మార్పు తెస్తానంటూ’ డెమోక్రాటిక్ అభ్యర్థిగా ఎన్నికైన ఒబామా క్రూరంగా అణచివేశాడు. దివాళా తీసిన కార్పోరేషన్లకి బిలియన్ డాలర్ల ప్రజాధనం యిచ్చి ఆదుకుంది డెమోక్రాటిక్ పార్టీయే. ఇది చూసి శ్రామిక వర్గాలు పార్టీకి దూరమయ్యాయి.

2016లో ఇండిపెండెంట్ సెనెటర్ బెర్నీ సాండర్స్ డెమోక్రాటిక్ అభ్యర్థిగా ప్రైమరీల్లో నిలబడి కార్పోరేట్ అవినీతిని, ఫార్మా, ఇన్సూరెన్సు కంపెనీలను దుయ్యబట్టాడు. అతని ర్యాలీలకు జనం పోటెత్తారు. మీడియా, కార్పోరేట్లు, పార్టీ నాయకత్వం వ్యతిరేకించినా బెర్నీ 23 రాష్ట్రాలను, 43% ఓట్లను సంపాదించాడు. కానీ పార్టీ హిల్లరీకే మద్దతు పలికింది. ట్రంప్ బూచి చూపిస్తే చాలు, శ్రామిక వర్గం దిక్కులేక తనకే ఓటేస్తారనుకుంది, ఓడిపోయింది. 2020లో బెర్నీ మళ్లీ నిలబడి ఒక్కో రాష్ట్రం గెలుస్తూ పోతూంటే పార్టీ పెద్దలు బైడెన్ తప్ప తక్కిన అందర్నీ తప్పించి, ఒబామా పలుకుబడితో దక్షిణ కరోలినాలో బైడెన్ గెలిచేట్లా చేసి, బెర్నీకి అడ్డుకట్ట వేశారు. బైడెన్ గెలిచి, ద్రవ్యోల్బణానికి కారకుడయ్యాడు. 2024లో పార్టీ ప్రైమరీని పేరుకి మాత్రమే నిర్వహించి బైడెన్‌ను మళ్లీ నిలబెట్టింది.

అతని మానసిక క్షీణత బయటపడడంతో కమలను హఠాత్తుగా రంగంపైకి తెచ్చింది.’ ఫలితం తెలిసినదే! అందుచేత యిది పార్టీ వైఫల్యమే అని ఆయన తేల్చిచెప్పారు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2024)

42 Replies to “ఎమ్బీయస్‍: డెమోక్రాట్ల వైఫల్యం”

  1. డెమోక్రాట్ల వైఫల్యం అనడం కంటే LEFTIST వైఫల్యం లేదా WOKIST వైఫల్యం అని అంటే బాగుంటుంది.

  2. అక్కడ బైడెన్ ఇక్కడ జగన్ .

    ఇద్దరూ ఇద్దరే.

    అందుకే ఓడారు.

    బైడెన్ కూడా మానసిక చికిత్స కోసం తరచూ లండన్ వెళతాడంట.

  3. రాజు కన్నా మొండి వాడు బలవంతుడు అంటారు.

    ఇప్పుడు మొండి వాడే ఏకంగా రెండో సారి రాజు అయ్యాడు.

    చివరి సారి ప్రెసిడెంట్ పదవి కాబట్టి , తనకి మంచివి అనుకున్నది చేస్తాడు.

  4. Biden not only ruined his party but KH and now he did further damage by pardoning his son . There by not only he smudged black mark on his life as well as on the party as a whole . Totally he disgraced Democratic Party and even democratic members are disgusted with his pardon , with this he had given Trump a cushion to pardon all the Jan 6 infiltrators , his SIL and any one he wishes – totally a disastrous decisions at the end of his political career and embedded as a cataclysmic for good in American history like Nixon 

    ReplyForward

    Add reaction

    1. The guy’s a crook from the beginning…He’s collaborated with the Clintons and put folks in prison for smoking weed while his son’s pothead. He’s image was whitewashed by the media to appeal to the unassuming/gullible/indifferent/apolitical voters in the country but anyone who’s aware of his political leanings and his history would never back this guy. He’s a crook thru and thru…just a typical white male’s privilege!

    2. Did you ever check and commented on Why Kash Patel released a hit list? World greatest scientist Anthony getting accused and Republicans want to jail for his 50+ of honest service.

      When a party having vengeance has main agenda, I would take care of my family. If you had a fair justice system I agree that what Biden did is wrong, but not like Trump who sold pardons for money & political gain. Its even disgusting and people are blindly supporting a felon.

  5. Left ayina reight అయినా అంత ఒకటే సంత. ధనమే మూలం. కానీ లెఫ్టిస్ట్ లు మరీ దారుణం గా ఉంటారు . సో ప్రపంచం రైట్ వయిపు నడుస్తుంది. ఇండియా కూడా అంతే .రైట్ ఇంకొన్నల్లి వరకు తెలుగు.లేదు .రైట్ వాళ్ళు పది తిన్న రూపాయి పెడ్తారు అభివృద్ధి చేస్తారు .

  6. <<<2024 పార్టీ పేరుకే ప్రైమరీ నిర్వహించి మళ్ళీ బైడెన్ ను నిలబెట్టింది>>> ఇది కరెక్ట్ కాదనుకుంటా. సాధారణం గ అమెరికా లో ప్రస్తుత అధ్యక్షుడి కి ఆ పార్టీ టికెట్ డైరెక్ట్ గ ఇచ్చేస్తారు. అధికార పార్టీ లో ప్రైమరీలు ఉండవు.

    1. Vaadu asalu 2020 lone elect kabadagga candidate kaadu. Obama and batch veshalu vesi Bernie ni pakkaki tosi, veediki ticket vachhelaga chesaru. Janalu kuda Trump gadiki jadisi veediki vote vesaru 1 term president ni matrame ante. Veedu nenu expect chesinatte mallee sachhe varaku president gane undamanukuni digipodaniki ishtapadaledu. Veedi valakam live lo janalu chusesariki donor batch antha bhayapadi veedu vaddani donations ivvamani behind the scenes gola chesthe, veedu tathsaram chestha vachhi chivariki primaries pette time kuda ayye timeki useless candidate ayina Kamala ni propose chesadu. Dems chesedi leka oppukunnaru…Chivariki desam mottam cheetkarinchina kuda siggu, nijalni kappipuchhadam, gaslight cheyyadam manadam ledu.

    2. లేదు బ్రో. ప్రైమరీల్లో ఎవరైనా సిట్టింగ్ ప్రెసిడెంట్‌ని చాలెంజ్ చెయ్యవచ్చు. ఈ సారి డీన్ ఫిలిప్స్, జేసన్ పామర్ అనే ఇద్దరు చాలెంజ్ చేసారు. ప్రైమరీలు కొన్ని చోట్ల జరిగాయి. పామర్ అయితే ఒక చోట బైడెన్ మీద గెలిచాడు కూడా

  7. పాకిస్తాన్ నుండి వచ్చిన అక్రమ వలసదారుల నివాసం కోసం , న్యూయార్క్ లో ప్లాకిస్తాన్ కే చెందిన 5 స్టార్ హోటల్ లో పాకిస్తాన్ వాళ్ళకే ఎదురు దబ్బు ఇచ్చి అమెరికా ప్రజల పన్ను డబ్బు ఖర్చు పెట్టడం, డెమొక్రాట్ లా విపరీత చర్య.

    మొత్తం 124 ప్రసవాలు, ము*స్లిం జననాలు జరిగాయి, కేవలం 9 నెల*ల్లో ఈ పాకి*స్తాన్ అక్రమ వలసదా*రుల నివాసం ఇచ్చిన హోటల్ లో.

    ఆ పాకిస్తాన్ అక్రమ వాళ్ళేమో, పని లేకుండా, అమెరికా ప్రజల పన్ను డబ్బుతో ఏసీ గదుల్లో తమ ము*స్లిం జనా*భా పెంచే జీహా*ద్ లో భాగంగా పిల్లల్ని పుట్టించ*డం లో బిజీ గా వుండటం , ఉదయాన్నే లెగిస్తే బతకడానికి చెచ్చి చెడి పనులు చేసుకునే సాధా*రణ అమెరికా ప్రజ*లకి కోపం తెప్పించింది.

    తాము తినడా*నికే తిం*డి దొరకనప్పుడు , అసలు పిల్ల*ల్ని ఎ*లా కనబు*ద్దు అవు*తుంది? అదీ నేరమే కదా.

  8. అతను/ ఆమె బదులు వాళ్ళు(they) అనే lbgt సంబోధన నీ స్కూల్స్ లెవెల్ లోనే తేవాలి అని చూడటం , సాధారణ అమెరికన్ మనస్సుని ఇబ్బంది పెట్టింది.

    ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ ఒక కొడుకు కూడా ఇలా స్కూల్ స్థాయి లో నే lbgt మూమెంట్

    ప్రభావం తో లింగ మార్పిడి ఆపరేషన్ చెపించుకుని అమ్మాయి గా మారిపోయి సొంత తండ్రి నే వదిలేసుకున్నా విషయం తో, తన కిన్న అన్ని మార్గాల్ ద్వారా డెమొక్రాట్ లకి వ్యతిరేకం గా ట్రంప్ గెలవదానికి సపోర్ట్ చేశాడు.

  9. మ*స్క్ ట్రం*ప్ కి సపోర్ట్ చేయడానికి ముఖ్య కారణం, మస్క్ కొడుకు స్కూల్ వయస్సు లోనే డెమొ*క్రాట్ లా అనుకూలత వున్న lb*hg మూ*మెంట్ ప్ర*భావం కో లోనయ్యి అ*మ్మాయి గా అపరేషమ్మ్ చేసుకుని సొం*త తం*డ్రి నే వ్యతి*రేకించారు. పేరు*లో తం*డ్రి పేరు కూడా కనిపిం*చకుండా పేరు మార్చు*కున్నాడు.

    దానితో మ*స్క్ కి వొ*ళ్ళు మండి, ట్రం*ప్ కి ఫు*ల్ సపో*ర్టు ఇచ్చాడు.

  10. మా*స్క్ కొడు*కు కూతు*రు గా ట్రా*న్స్ జెం*డర్ మా*రడం అని సం*ఘటన , ముఖ్యంగా మ*స్క్ అప*దమస్తకము నీ కది*లించి, అతను డెమొ*క్రాట్ కి వ్యతి*రేఖంగా , ట్రం*ప్ కి గ*ట్టి స*పోర్ట్ ఇవ్వ*డానికి కార*ణం.

  11. కమలా గెలిస్తే లక్కీ అని ఇండియన్స్ అనుకున్నారా? నాకు తెలిసిన ఒక 60-70 కుటుంబాలు ట్రంప్ కే ఓటు వేశారు. కమలా ని ఇండియన్ అని ఎవరూ అనుకోవట్లేదు, democrats కి ఇండియన్స్ లో సపోర్ట్ లేదు

Comments are closed.