ఎమ్బీయస్‌: రేవంత్‌ అంశం ఎంతదూరం వెళుతుంది?- 2

లంచం యివ్వడానికి స్వయంగా వెళ్లడంలో రేవంత్‌ అడాసిటీ చూపించారు. అది వట్టి దుస్సాహసమే కాదు, బేపర్వాతో కూడినది, ఎవరేమనుకుంటే నాకేం యిలాటిది ఎంతమంది చేయటం లేదు కనుక, మనం పట్టుబడం, ఒకవేళ పట్టుబడినా తక్కినవాళ్లు…

లంచం యివ్వడానికి స్వయంగా వెళ్లడంలో రేవంత్‌ అడాసిటీ చూపించారు. అది వట్టి దుస్సాహసమే కాదు, బేపర్వాతో కూడినది, ఎవరేమనుకుంటే నాకేం యిలాటిది ఎంతమంది చేయటం లేదు కనుక, మనం పట్టుబడం, ఒకవేళ పట్టుబడినా తక్కినవాళ్లు చేయటం లేదా అని దబాయించవచ్చు అనే ధీమాతో ముందుకు వెళ్లారు. స్వయంగా వెళ్లి పని చేసుకుని వచ్చిన ఆనందాన్ని పొందుదామనుకున్నారో, లేక తను వెళ్లకపోతే అవతలివ్యక్తి నమ్మడనుకున్నారో తెలియదు. టిడిపి-తెరాస మధ్య నడిచే వార్‌ నడుస్తోందని తెలుసు, వేరే వారిని పంపించి తనను పట్టిస్తారన్న భయం ఆ ఎమ్మెల్యేకు కూడా వుండవచ్చు కదా.  'నేను కూడా యిన్వాల్వ్‌ అయ్యాను, నిన్ను బయటపడితే నేనూ చిక్కుల్లో పడతాను, అంతా రహస్యంగానే వుంచుదాం' అని ధైర్యం చెప్పడానికి రేవంత్‌ స్వయంగా వెళ్లారనుకోవాలి. అయితే అవతలివాళ్ల ప్లాను వేరేగా వుండడంతో ఆయన పవిత్రుడు అయిపోయాడు, యీయన పాపి అయిపోయాడు. 

దొరికేదాకా ప్రతీవాడూ దొరే. దొరికిపోయాక కూడా దొరలా మీసం మెలేసిన ఘనత మాత్రం రేవంత్‌దే. సాధారణంగా అలాటి సందర్భాల్లో రుమాలుతో మొహం కప్పుకుంటారు, నాకు ఛాతీలో నొప్పిగా వుందంటూ స్ట్రెచ్చర్‌ ఎక్కేస్తారు, లేకపోతే గంభీరంగా మొహం పెట్టి మా లాయరు వచ్చేదాకా నేనేమీ మాట్లాడను అంటారు. ఇలా మీసం మెలేయడం వెరైటీగా వుంది. సాధారణంగా భయం వేసినపుడు జనాలు ఒకలా నవ్వుతారు. కెమెరాలు దాచి భయపెట్టిన సందర్భాల్లో చూడండి, భయపడుతూనే నవ్వుతారు. భయాన్ని ఎడ్జస్ట్‌ చేసుకోవడానికి శరీరం అలాటి నవ్వును ప్రేరేపిస్తుందేమో, నాకు తెలియదు. సిగ్గు పడవలసిన సందర్భంలో రేవంత్‌ నవ్వడం (యింకా నయం తొడగొట్టలేదు), భవిష్యత్తులో యిదే పోలీసుల చేత కెసియార్‌ను అరెస్టు చేయిస్తానని చెప్పడం వింతగా వుంది. రేపటి మాట సరే, యీ రోజు నువ్వు పట్టుబడ్డావు కదా, జైల్లోకి వెళుతున్నావు కదా, దాని గురించి మాట్లాడకుండా, కెసియార్‌ అరెస్టు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా వుంది. 'రేపు' సి. నరసింహారావుగారు మానసిక విశ్లేషణలో దిట్ట. ఈ మీసం మెలివేత గురించి వ్యాసం రాస్తారేమో చూడాలి. 

రేవంత్‌ ఎంత అడాషియస్‌గా ప్రవర్తించారో కెసియార్‌ కూడా అంతే అడాషియస్‌గా ప్లాన్‌ చేశారని చెప్పాలి. సాధారణంగా రాజకీయ నాయకులందరూ ఒకరి నొకరు రక్షించుకుంటూ వుంటారు. మన వీనులకు విందు చేయాలని 'మేం అధికారంలోకి వస్తే ప్రస్తుతం అధికారంలో వున్న అవినీతి పరులైన నాయకుల భరతం పడతాం, స్విస్‌ బ్యాంకుల్లో దాచిన డబ్బును కక్కిస్తాం, వాళ్ల ఆస్తులు స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతాం' అని ప్రకటనలు చేస్తారు కానీ అలా చేసిన నాయకులను ఎవర్నీ చూడలేదు. (ఒక్క మినహాయింపు – కరుణానిధి-జయలలిత! కరుణానిధి-ఎమ్జీయార్‌ల మధ్య సైతం ఒప్పందమో, రాజీయో వుండేది) కేసులు పెడితే రాజకీయంగా కక్ష సాధించారని అవతలి వాళ్లు అంటారు, ప్రజలు అది నమ్మి వారిపై సానుభూతి పెంచుకుంటారన్న భయం కాబోలు అనుకునేవాణ్ని. అదేమీ కాదని తర్వాత అర్థమైంది. ప్రతిపక్షంలో వున్న వైయస్‌ బాబుపై కేసులు పెట్టారు, మళ్లీ ఎందుకోగాని విత్‌డ్రా చేసేసుకున్నారు. అలా అని బాబు మంచివాడని సర్టిఫికెట్టు యిచ్చారా? లేదు. అసెంబ్లీలో హోరాహోరీ తిట్టేసుకుంటూనే వచ్చారు. బాలకృష్ణ యింట్లో కాల్పుల కేసును ఎంత దారుణంగా కామాపు చేశారో చూశాం. అధికారంలో వున్న పార్టీ చొరవ లేకుండా అలా జరిగేదా? రాజకీయ ప్రతికకక్షులు యిలా సహకరించు కోవడమేమిటి? టిడిపి అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. జగన్‌ లక్షకోట్లను బయటకు లాగడం గురించి చేసిన ఎన్నికల వాగ్దానం దిశగా ఒక్క అడుగేనా పడిందా? ఆరోపణ అబద్ధమనీ అనరు, అతిశయోక్తి అనీ అనరు, మళ్లీ మళ్లీ దాన్నే అసెంబ్లీలో, టీవీ చర్చల్లో ప్రస్తావిస్తూనే వుంటారు. కానీ చట్టానికి పట్టిచ్చే దిశగా ఏమీ చేయరు. ఎందుకిలా? 

మాఫియా నాయకుల మధ్య నిశ్శబ్ద నియమం (ఒమెర్తా) వుంటుంది – ఒకరి పనులపై మరొకరు మాట్లాడకూడదని. రాజకీయనాయకుల మధ్య  వుండే నియమం యిలాటిదే కానీ కాస్త తేడా వుంటుంది – పైకి మాట్లాడతాం, కానీ ఏమీ చేయం – అని. నాది నువ్వు సాక్ష్యాలతో బయటపెడితే, నీది నేను సాక్ష్యాలతో బయటపెడతా అన్న బెదిరింపు అంతర్లీనంగా వుంటుంది. అందుకని ఒకరు ఆరోపణ చేస్తారు, అవతలివాళ్లు ఆధారాలు చూపించండి అని గర్జిస్తారు, వీళ్లు సరైన టైములో పోలీసులకు ఆధారాలు యిస్తాను అంటారు, సమయం గడిచిపోతుంది, వాళ్లు అడగరు, వీళ్లు యివ్వరు, పోలీసులు కూడా వచ్చి మీ దగ్గరేవో ఆధారాలున్నాయట యివ్వండి అని అడగరు, కోర్టులో అనేక విషయాలు సుమోటో (తమంతట తామే) చేపడతాయి కానీ యిలాటి వాటి జోలికి వెళ్లరు. ప్రభుత్వ ఆస్తులు, దేవాలయ భూములు, వక్ఫ్‌ స్థలాలు, చెఱువులు – యివన్నీ కబ్జా అయిపోయాయి. మేం అధికారంలోకి రాగానే వాళ్ల దుంప తెంపుతాం అన్నవారెవరూ ఆ ఆక్రమణదారులపై కేసులు పెట్టిన దాఖలాలు లేవు. తమ ఎమ్మేల్యేలు అవతలి పార్టీలో మారిపోయినప్పుడు వారిని ప్రలోభపెట్టారని ఆరోపించి వూరుకుంటారు తప్ప ఆ ప్రలోభమేమిటో సాక్ష్యాధారాలతో నిరూపించడానికి ఎవరూ పూనుకోరు. ఎందుకంటే  ఆ తీగ లాగితే తమ డొంక కూడా కదులుతుందని భయం. ఇది ఎన్నో ఏళ్లగా చూస్తూ వచ్చాం. ఈ రోజు కెసియార్‌ చేసినది దీనికి పూర్తిగా విరుద్ధంగా వుంది. 

టిడిపి ఎమ్మేల్యేలను కొంటోందని పబ్లిగ్గా అల్లరి పెడితే, ఆ ఆరోపణ తిరిగి వచ్చి తమకు తగులుతుందన్న భయం వుండాలి. తాము పట్టిచ్చినట్టే,  వాళ్లూ తమను పట్టిస్తే ఘోరావమానమన్న జంకు వుండాలి. నిజానికి కెసియార్‌ యీ మేరకు తెగించడం యితర రాజకీయనాయకులకు కూడా రుచించదు. 'చూసీ చూడనట్లు వదిలేయాలి తప్ప, యిలా బయటపెట్టుకుంటే ప్రజలకు మనందరి మీదా అసహ్యం వేయదా?' అని వాళ్లు మందలిస్తారు కూడా. ఇప్పుడు వ్యవహారం తన మెడకు చుట్టుకుంటోంది కాబట్టి చంద్రబాబు జాతీయ నాయకుల చేత కెసియార్‌కు చెప్పించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మోదీ చేత.. కనీసం వెంకయ్య నాయుడు చేత! వాళ్లు కూడా కెసియార్‌ చర్యను దుందుడుకు చర్యగానే చూస్తారు. తమను యిబ్బందికర పరిస్థితిలోకి నెట్టినందుకు చికాకు పడతారు.  తెలంగాణకు రావలసిన నిధులపై, కేంద్రసహాయంపై దాని పర్యవసానం ఎలా వుంటుందో, యిప్పుడు ఎవరూ వూహించలేరు. ఎన్టీయార్‌ యిలాటి దుస్సాహసపు పనులు చాలా చేశారు కానీ దానికి కారణం రాజకీయాల్లో ఆయన అనుభవరాహిత్యం! కానీ రాజకీయాల్లో తలపండిన కెసియార్‌ యివన్నీ ముందే లెక్కేసుకుని వుంటారు. అయినా దూకుడుగా ముందుకు వెళ్లారు. దెబ్బకు చంద్రబాబును రాజకీయంగా ఫినిష్‌ చేయలేక పోయినా నిర్వీర్యం చేసేద్దా మనుకుంటున్నారేమో! అది సాధ్యమా? కాలమే చెప్పాలి. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2015)

[email protected]

Click Here For Part-1