ఎమ్బీయస్‍: నా యిష్టం… ఇష్టం నాదేనా?

నా బతుకు, నా యిష్టం వచ్చినట్లు బతుకుతాను అనుకోవడం మనకు అత్యంత ఆనందదాయకమైన సంగతి.

నా బతుకు, నా యిష్టం వచ్చినట్లు బతుకుతాను అనుకోవడం మనకు అత్యంత ఆనందదాయకమైన సంగతి. ఎవరో చెప్పినట్లు చేయడమేమిటి, నాన్సెన్స్, నాకు నచ్చితేనే నేను చేస్తాను, అది ఎంత కష్టమైనా సరే, ఎన్ని నష్టాలు తెచ్చినా సరే అనేది మనకు ఒక ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. అయితే ఆ యిష్టమనేది ఎలా ఏర్పడుతుందో తరచి చూసుకోమంటూ ఆ మధ్య ఒక ఆర్టికల్ వచ్చింది, చాలా ఆలోచనలు రేకెత్తించింది. అసలు మన యిష్టమనేది ఎలా వ్యక్తపరుస్తాం? పలు ఆప్షన్స్ ముందు పెట్టి ఛాయిస్ యిచ్చినపుడు వాటిలోంచి ఎంపిక చేసుకోవడం ద్వారా! మనకు ఛాయిస్ ఉన్నపుడే యిష్టాన్ని వ్యక్తీకరించగలం. కాఫీయా, టీయా, ఏం కావాలి? అన్నపుడు ‘ఇప్పుడైతే కాఫీ తాగాలనిపిస్తోంది’ అనవచ్చు మనం. ‘ఇక్కడ టీ తప్ప మరేమీ దొరకదు’ అన్నపుడు యిక మనకు ఛాయిస్ ఏముంది? తాగితే టీ తాగాలి, లేకపోతే నోరు కట్టుకోవాలి.

మనకు ఛాయిస్ యిచ్చినపుడే మనకు ఆనందం కలుగుతుంది. చిన్న పిల్లల నుంచి యిది మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఎంత మంచిదైనా సరే, ‘ఇదే తిను, యీ బట్టే కట్టుకో’ అంటే వాడు ఏడుస్తాడు, గునుస్తాడు. అదే షాపుకి తీసుకెళ్లి ఛాయిస్ యిచ్చి, ఎంచుకో అంటే మహదానంద పడతాడు. కానీ ఛాయిస్ యిచ్చిన దాకా ఉండి, అదీ కావాలి, యిదీ కావాలి అని పేచీ పెడితే తల్లిదండ్రులు కళ్లెర్ర చేస్తారు, ఉరిమి చూస్తారు, ఎవరూ చూడకుండా గిల్లుతారు. అప్పటికీ వినకపోతే బయటకు తీసుకుని వచ్చేస్తారు. ఓ సారి ఓ ఫ్రెండు చెప్పాడు. ఓ షాపింగ్ మాల్ లిఫ్ట్‌లో తల్లీ, ఆరేళ్ల పిల్లాడు కనబడ్డారట. వాడు తెగ ఏడ్చేస్తున్నాడు. వాడికి కావలసిన డ్రెస్ తల్లి కొనలేదు లాగుంది. అందరూ ఆ అబ్బాయి కేసే చూస్తున్నా, తల్లి నిర్వికారంగా నిల్చుంది.

లిఫ్ట్ ఆగింది. బయటకు వచ్చాక తల్లి వాణ్ని ఓ ఐస్‌క్రీమ్ పార్లర్ దగ్గరకు తీసుకెళ్లి ఏం కావాలో తీసుకో అంది. వాడి ఏడుపు ఠక్కున ఆగిపోయింది. ఏ ఫ్లేవర్ కొనాలా అన్న మీమాంసలో పడిపోయి, చివరకు ఏదో కొనిపించుకుని తిని ఆనందించాడు. పోనీ ఏదో ఒక విషయంలో తన యిష్టం చెల్లింది కదాన్న ఆనందం వాడిది. తక్కిన సమయాల్లో అయితే వాడు ఐస్‌క్రీమ్ అడిగితే ‘వద్దు, జలుబు చేస్తుంది’ అనేదేమో ఆవిడ. అవేళ మాత్రం యిది చూపించి డ్రస్ ఛాయిస్ బాధ మరిపించింది. ఛాయిస్ అంటూ లభించినప్పుడు వ్యక్తి స్వేచ్ఛను ఫీలవుతాడంటారు సైకాలజిస్టులు. ఆ స్వేచ్ఛ దుర్వినియోగం జరగకుండా చూసుకోవలసినది ఒక స్టేజి వరకు తల్లిదండ్రులు, తర్వాత కుటుంబసభ్యులు. ఎంచుకునే హక్కు చిన్నప్పటి నుంచి యివ్వడం మంచిదని, తమ బాగోగులు వాళ్లకు తెలియనే భావనతో, భయంతో, జాగ్రత్తతో వారి జీవితాల్ని కంట్రోలు చేయబూనడం, స్వేచ్ఛను నియంత్రించడం దుష్పరిణామాలకు దారి తీస్తుందని కూడా అంటారు.

ఒక అమ్మాయి కేసు చదివాను. చిన్నప్పటి నుంచి ఆమె విషయాలన్నీ తండ్రి అదుపాజ్ఞల మేరకే జరిగాయి. ఏం చదవాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ సినిమా చూడాలి, ఫ్రెండ్స్‌గా ఎవరుండాలి, ఏ ఉద్యోగం చేయాలి, జీతాన్ని ఏం చేయాలి.. సమస్తం తండ్రి చెప్పినట్లే చేసింది. తండ్రి కూడా మా అమ్మాయి బుద్ధిమంతురాలు, నేను గీసిన గీత దాటదు అనే ఆనందంలో ఉన్నాడు. ఇలాటి అమ్మాయి తన కొలీగ్‌తో ప్రేమలో పడింది. కనీసం యీ విషయంలోనైనా తన స్వేచ్ఛను ఉపయోగించా లనుకుంది. కొన్ని నెలలు ఓపిక పట్టి, చివరకు ధైర్యం చేసి, వెళ్లి తండ్రికి చెప్పింది. ఇది నా యిష్టం, దాని ప్రకారం చేస్తాను. కాదూకూడదని మీరంటే కుటుంబంతో సంబంధాలు తెంపుకుంటాను అంది.

ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది. తన కూతురేనా, యిలా మాట్లాడుతోంది అని ఆశ్చర్యపడ్డాడు. మొదట కోపం తెచ్చుకున్నాడు. తర్వాత అతి స్ట్రిక్ట్‌గా పెంచి, తప్పు చేశానేమో అనుకున్నాడు. సరే, ఆ అబ్బాయిని కలిసి మాట్లాడితే ఒక అభిప్రాయం ఏర్పుడుతుంది కదా అనుకున్నాడు. చూడబోతే ఆ అబ్బాయి, తన కూతురికి అస్సలు నప్పేట్లు లేడు. అభిరుచుల్లో, స్వభావంలో, ప్రాధాన్యతల్లో యిద్దరివీ భిన్నధృవాలు. మీ యిద్దరి మధ్య పొసగదు అని కూతురికి చెప్పాడు. అయినా నా యిష్టాన్ని నేను ఆచరణలో పెట్టి చూపిస్తాను అందామె. పెళ్లి చేసుకుంది, ఓ కూతుర్ని కంది. రెండేళ్ల తర్వాత దంపతులు విడిపోయారు. మా మధ్య సర్దుకోలేనంత గ్యాప్ ఉందని కోర్టులో చెప్పుకున్నారు.

అయ్యో, చెయ్యక చెయ్యక ఒక్క విషయంలో ఆమె తన ఛాయిస్‌ ప్రకారం చేస్తే యిలా అయిందేమిట్రా అనిపిస్తుంది మనకు. కానీ యీ కేసు గురించి రాసిన సైకలాజిస్టు, ‘ఆ అబ్బాయి ఎంపిక ఆమె ఛాయిస్ కాదు, అది ఒక రియాక్షన్ మాత్రమే’ అని వాదించాడు. చిన్నప్పణ్నుంచి తండ్రి తన యిష్టాయిష్టాలను లెక్క చేయకుండా అణచివేయడంతో ఆయనపై ప్రతీకార చర్యగా, ఒక ధిక్కరింపుగా తీసుకున్న నిర్ణయం తప్ప, తన యిష్టాన్ని బట్టి తీసుకున్నది కాదని వివరించాడు. చిన్నప్పటి నుంచి స్నేహితులను ఎంచుకునే హక్కు ఆమెకు తండ్రి యిచ్చి ఉంటే, ఆ ఎంపికలో పొరపాట్లు చేసి దిద్దుకునే అవకాశాన్ని ఆమెకు కల్పించి ఉంటే, ఆమె ఆ దిశగా అనుభవం సంపాదించి, ఏది తనకు యిష్టమో, ఎవరిష్టమో, ఏది రియాక్షనో అర్థం చేసుకునేది. చిన్నప్పటి నుంచి వాళ్ల నాన్న ఎవరితోనూ కలవనీయక పోవడంతో ఎవరు తనకు నప్పుతారో, ఎవరు నప్పరో తెలియకుండా పోయింది. ఇన్నాళ్లకీ అబ్బాయి కనబడగానే నప్పుతాడనుకుని మొండిగా ముందుకెళ్లి పోయింది. నష్టపోయింది.

మనలో కొంత మంది తల్లిదండ్రులు చేసే పొరపాటిది. స్ట్రిక్ట్‌గా పెంచుతున్నామనుకుని, పిల్లల యిష్టాలను అణచివేస్తారు. వాళ్లు సొంత కాళ్లపై నిలబడగానే మా యిష్టం అంటూ ధిక్కరిస్తే బాధపడతారు. మొదటి నుంచి తర్ఫీదు యిస్తే యీ సమస్య యింత తీవ్రంగా ఉండేది కాదు. అసలు మన యిష్టమంటూ వ్యక్తపరిచేది, ఛాయిస్‌లు అందుబాటులో ఉన్నపుడు కదా! మనకు చిన్నప్పణ్నుంచి కాఫీ, టీలు మాత్రమే ముందు పెట్టి ఏదో ఒకటి ఎంచుకో, నీకేది యిష్టం అని అడుగుతున్నారు. కాఫీయో, టీయో అంటున్నారు. వాటితో పాటు అంబలి, గంజి, తాటికల్లు, కొబ్బరి కల్లు వగైరాలు కూడా అందుబాటులో పెట్టి, ఎంపిక చేసుకో అంటే మనం ఏం చేసుకునే వాళ్లమో! మన కుండే ఆప్షన్లు మతరీత్యా, ప్రాంతాల రీత్యా, సంప్రదాయాల రీత్యా, అలవాట్ల రీత్యా కుదించుకుని పోతాయని యిక్కడ గమనించాలి.

‘నీకు పాము మాంసం యిష్టమా? కప్ప మాంసం యిష్టమా?’ అని ఎవరైనా అడిగితే ‘నీ కంటికి నేనెలా కనబడుతున్నానేమిటి?’ అంటూ కోపగించుకుంటాం. ఏ రామగోపాల వర్మో వచ్చి ‘నువ్వు వాటిని రుచి చూడందే యిష్టమో, కాదో ఎలా చెప్పగలవ్?’ అంటూ లాజిక్కు లాగగలడు. గోమాంసం, పంది మాంసం యిలాటివి నోట పెట్టకుండానే యాక్ అంటాం. ఇక దానిపై యిష్టాయిష్టాలు వ్యక్తం చేసే హక్కు మనకెలా వస్తుంది? బీఫ్, పోర్క్ నాకు యిష్టం లేదు అనకూడదు, యిష్టం ఉందో లేదో తెలుసుకునే యిష్టం కూడా లేదు అనాలంతే. నేను ఉప్పుడు బియ్యం తినేవాణ్ని కాను. కలకత్తాలో ఉండగా రా రైస్ మంచిది దొరక్క, ఓ సారి ట్రై చేద్దామని తిన్నాను. కుక్కర్ మూత తెరిచినప్పుడు గుప్పున కొట్టే వాసన బాగుండేది కాదు కానీ, రుచి మాత్రం ఫరవా లేదనిపించింది. ఇక అక్కడున్ననాళ్లూ అదే యిష్టంగా తిన్నాం.

కలకత్తాలో అన్నీ ఆవ నూనెతో చేసేవారు. మా మలయాళీ కొలీగ్ వాంతి చేసుకున్నంత పని చేసేవాడు. ‘మీ కొబ్బరి నూనెకి తీసిపోయిందా నాయనా’ అనుకునేవాణ్ని. మొదటిసారి కొబ్బరి నూనెతో వేసిన దోసె తిన్నప్పుడు, నోట్లోకి వెంట్రుకలు వచ్చినట్లు ఫీలయ్యాను, కొబ్బరి నూనెను తలనూనెతో ఐడెంటిఫై చేస్తూ వచ్చాను కాబట్టి! కొబ్బరి నూనె, ఆవ నూనె యిలాటివి నాకు యిష్టం అనను కానీ సర్దుకోగలుగుతాను. కానీ కొందరు తీవ్ర అయిష్టాన్ని వ్యక్తపరుస్తారు. ఆ యిష్టం వ్యక్తిగతం అనే అనుకుంటున్నారు కానీ అవి కుటుంబపు అలవాట్ల నుండి ఏర్పడినవి అనే విషయం మర్చిపోతారు. అసలు ప్రకృతే మన యిష్టాయిష్టాలను, ఎంపికను మూసపోస్తుంది. వేసవి కాలంలో మామిడిపళ్లు ఒంటికి మంచిది కాబట్టి, అప్పుడే అవి పండేట్లా, మనకు రుచిగా తోచేట్లా చేస్తుంది. అవి మాకిష్టం అంటూ మన చేత తినిపించి, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రాజస్థాన్‌లో ఉల్లిపాయలు ఎక్కువగా పండేట్లు చేస్తుంది, ఎందుకంటే వేడిమి నుంచి ఉల్లి శరీరాన్ని రక్షిస్తుంది. రాజస్థానీలు ఎరుపు వంటి బ్రైట్ కలర్స్ బట్టలు ఎందుకు వేసుకుంటారో తెలుసా? ఎడారిలో వాళ్లను గుర్తుపట్టి, రక్షించడం సులభమని! అదే ఏ లైట్ కలరో వేసుకుంటే యిసుక రంగులో కలిసిపోతుంది, మంచులో తెల్ల కారుని వెతికినట్లవుతుంది. వాళ్లు సర్వైవ్ కావాలంటే అలాటి డ్రస్సులు వేసుకోవాలి. అందువలన ప్రకృతే వాళ్లకు బ్రైట్ కలర్ టేస్టు మప్పుతుంది. ఇవన్నీ చెప్పి, ‘‘తిండి, బట్ట, సంగీతం, అభిరుచులు, మేనరిజమ్స్ విషయంలో మన ఛాయిస్‌లు జన్యుపరంగా వచ్చే లక్షణాలపై ఆధారపడి ఉంటాయి.’ అంటారు సోషల్ సైంటిస్టులు.

పరిస్థితుల ప్రభావం చేత, పెంపకం చేత సహజంగా ఏర్పడే యిష్టాల మాట సరే, కానీ మన యిష్టాలను వేరే వాళ్లు ప్రభావితం చేస్తున్న విషయం కూడా మనం గుర్తించాలి. అది ఎంత లాఘవంగా చేస్తారంటే, అదేదో మన యిష్టమే అని అభిప్రాయాన్ని కలిగిస్తారు వాళ్లు. మనకు లభ్యం చేసేవాటి సంఖ్యను నియంత్రించడం ద్వారా మన యిష్టమేదో మనం పూర్తిగా గ్రహించలేకుండా కూడా చేస్తారు. చిన్నపుడు ఎయన్నార్, ఎన్టీయార్‌ల మధ్యే మా ఛాయిస్. తర్వాతి రోజుల్లో వచ్చిన కృష్ణ, శోభన్‌బాబు కూడా అలాటి హిస్ట్రియానిక్స్ ప్రదర్శించి అవే మాకు యిష్టమనే భ్రమ కల్పించారు. అంతలో హిందీలో అమోల్ పాలేకర్, తెలుగులో కమలహాసన్ వంటి వాళ్లు సహజనటనను ప్రదర్శించి. ‘ఓహో, యిదా మనకు యిష్టం!’ అని మాకు మేము గ్రహించేట్లు చేశారు. ఒకసారి యిష్టం కలిగాక అది అలవాటుగా మారుతుంది. దానికి భిన్నంగా వెళితే నచ్చదు.

‘‘ద ఆర్ట్ ఆఫ్ చూజింగ్’’ అనే పుస్తకం రాసిన రచయిత్రి జపాన్‌ రెస్టారెంట్‌లో తన అనుభవం గురించి చెప్పింది. గ్రీన్ టీ ఆర్డరిచ్చి, దానితో పాటు సుగర్ తెమ్మనమంటే సర్వర్ కుదరదన్నాట్ట. నాకు కావాలని యీవిడ పట్టుబడితే వాళ్ల మేనేజర్ని పిలుచుకుని వచ్చి జపాన్‌లో గ్రీన్ టీతో పాటు సుగర్ యివ్వరని, యివ్వకూడదని చెప్పించాట్ట. అదే అమెరికాలో అయితే గ్రీన్ టీతో పాటు సుగర్ అడిగితే కళ్లెగరేసి పట్టుకుని వచ్చి పడేసేవారు. కానీ జపాన్‌లో అదేదో అపచారం అన్నంత హంగామా చేశారట. తమ అలవాటుని అవతలివాళ్లపై రుద్దే ప్రయత్నం చేశారు. చివరికి యీవిడ కాఫీ ఆర్డరిచ్చి, దానితో పాటు వచ్చిన సుగర్ పొట్లాన్ని గ్రీన్‌ టీలో కలుపుకుని తాగి బయట పడిందట. అంటే తన యిష్టాన్ని ప్రగాఢంగా వ్యక్తపరచడానికే నిశ్చయించుకుంది తప్ప సర్దుకుపోవాలని అనుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఎమోషన్స్ మన ఛాయిస్‌ను గైడ్ చేస్తాయి.

ఎవరైనా కారు లేదా టివి కొంటే ఎందుకు కొన్నారని అడగండి, సాంకేతిక పరమైన కారణాలు చెప్పేవారు తక్కువ, మా ఫ్యామిలీ మొత్తానికి అదే యిష్టమండీ అంటారు. టీవీల్లాటి విషయాల్లో యింట్లో ఆడవాళ్ల, పిల్లల యిష్టాలే రాజ్యం చేస్తున్నాయని గ్రహించి, దశాబ్దాల క్రితమే ఒనిడా టీవీ వాడు ‘ఓనర్స్ ప్రైడ్, నైబర్స్ ఎన్వీ’ అనే స్లోగన్‌తో ముందుకు వచ్చాడు. మా టీవీ చూసి పక్కవాళ్లు కుళ్లుకుని ఛస్తారు అనే ఆశతో యిరుగువారు కొంటే, అదే అంచనాతో పొరుగువారూ కొన్నారు. ఎవర్ని చూసి ఎవరు కుళ్లుకున్నారో సర్వే చేసిన వారు లేరు. ఇక్కడ మనం గ్రహించ వలసినది దాన్ని మన యిష్టప్రకారం కొనలేదు. అవతలివాణ్ని అసూయాగ్రస్తుణ్ని చేస్తున్నామన్న లెక్కతో కొన్నాం.

కలర్ టీవీలు కొత్తగా వచ్చిన రోజుల్లో ఇసిటివి, అప్‌ట్రాన్, కెల్ట్రాన్ వంటివి సాంకేతిక నాణ్యత కలవని తెలిసినవారు చెప్పగా నమ్మి, కొనడానికి షాపులకు వెళ్లేవాణ్ని. సేల్స్‌మెన్ అప్పటికి మార్కెట్లో ఫాస్ట్‌గా మూవ్ అయ్యే టీవీల గురించే చెప్పేవారు. ‘మీకు వాటిలో మార్జిన్ ఎక్కువా?’ అని అడిగేవాణ్ని. ఒకసారి ఒకతను విపులంగా చెప్పాడు. ‘అది యిస్యూయే కాదు. వాటి విషయంలో కస్టమరు ఆల్‌రెడీ సెట్ మైండ్‌తో వస్తాడు. మార్కెటింగ్ ప్రభావానికి లోనై, ఆ టీవీ అంటే నాకిష్టం అనే భావనతో ఉంటాడు. మీ కిష్టమైనది, మీకు మంచిది కూడా అని నాలుగు మాటలు చెప్తే చాలు, చప్పున అమ్ముడు పోతుంది. మీలా ఎవడైనా తగిలితే పిక్చర్ ట్యూబ్ లైఫ్, కంపెనీ గ్యారంటీకి తోడు మేమిచ్చే గ్యారంటీ అదీ యిదీ అంటూ చాలా సేపు చెప్పాల్సి వస్తుంది. ఈ టైములో వాళ్లకు మూడు అమ్మవచ్చు.’ అని చెప్పాడు.

అంటే ఏమిటన్నమాట? కస్టమర్ల యిష్టాన్ని ఆ టీవీకి బ్రాండ్ ఎంబాసిడర్‌గా చేసే సినీ తారో, తారడో మోల్డ్ చేసి, సిద్ధం చేసి షాపుకి పంపాడన్నమాట. దాన్నే వాళ్లు తమ యిష్టంగా భ్రమిస్తున్నారు. నిజంగా వీడియోకానో, సోనోవిజనో మన కిష్టమైన బ్రాండే అయి వుంటే యిప్పటికీ లాయల్‌గా అదే కొంటూ ఉండాలి. కానీ ఎల్జీ, సామ్‌సంగ్ వగైరాలకు షిఫ్ట్ అయిపోయాం. ఈ రోజుల్లో మనం చూస్తున్నది, రేటింగులు, రివ్యూలు. అంటే సినీతారలకు తోడు వీళ్లూ వచ్చి చేరారన్నమాట. సినిమా వాళ్లు డబ్బు తీసుకునే బ్రాండ్ అంబాసిడర్లగా పని చేస్తున్నారని తెలుసు. ఈ రివ్యూయర్లు నిస్వార్థంగా చేస్తున్నారో, లేక ప్రణాళికతో చేస్తున్నారో, అసలు నిజంగా ఉన్నారో, రోబోలో కూడా తెలియదు. మేం యూనిట్‌కు వెళ్లి నాణ్యత చెక్ చేసి స్వయంగా చెప్తున్నాం అని యాడ్‌లో చెప్పే నటుడికి కానీ, యీ రివ్యూయర్‌కు కానీ సాంకేతిక నిపుణత ఏమీ లేదు. అయినా మన అభిప్రాయాన్ని మోల్డ్ చేస్తున్నారు.

ఎలా చేయగలుగుతున్నారు? నటుడిగానో, ఆటగాడిగానో వారిపై మనకున్న యిష్టాన్ని వారు మార్కెట్ చేసే ఉత్పాదనపై యిష్టంగా తర్జుమా చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కి బ్రాండ్ ఎంబాసిడర్‌గా పని చేసిన తారలపై కేసులు పెడుతున్నారు. పరోక్షంగా గుట్కాను ప్రచారం చేసే వారిపై మాత్రం ఎందుకు పెట్టకూడదు? వీళ్లు చెప్పడం బట్టి కొందరు వాటిని రుచి చూసి అలవాటు పడి, కాన్సర్ తెచ్చుకుంటున్నారేమో! సోషల్ మీడియా యుగంలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ పేర చాలామంది పుట్టుకుని వచ్చి, వీక్షకులను తాము అనుకున్నట్లు ఆడిస్తున్నారు. మరి వాళ్లపై ఎవరి ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది? వీళ్లు కొంతమంది ప్రేక్షకులను నేరాల వైపు, ఆత్మహత్యల వైపు కూడా ప్రేరేపించ గలుగుతున్నారు. అదే నీకు యిష్టం, అదే నీ ఛాయిస్ అని హిప్నటైజ్ చేయగలుగుతున్నారు.

ముక్తాయింపుగా చెప్పాలంటే – పిల్లలను పెంచేటప్పుడు ఛాయిస్ యిచ్చి, వాళ్ల యిష్టవ్యక్తీకరణకు దోహద పడడమే మంచిందంటున్నారు సైకాలజిస్టులు. అయితే టూ మచ్ ఛాయిస్, కన్‌ఫ్యూజన్‌కు దారి తీస్తుందట. ఛాయిస్‌ యివ్వడంతో పాటు, ఎలా ఎంపిక చేసుకోవాలో కూడా పిల్లలకు తర్ఫీదు యిస్తే, వాళ్లు మైండ్ అప్లయి చేయడం నేర్చుకుంటారు. లేకపోతే అభిమాన నటుడో, అభిమాన క్రికెటరో, యూట్యూబు యిన్‌ఫ్లుయెన్సరో చెప్పినది యథాతథంగా తలకెక్కించుకుని, అదే తన యిష్టమనుకునే భ్రమలో పడే ప్రమాదం ఉంది.

– ఎమ్బీయస్ ప్రసాద్

25 Replies to “ఎమ్బీయస్‍: నా యిష్టం… ఇష్టం నాదేనా?”

  1. మీ రచనలంటే చాలా ఇష్టమండి..ఎందుకంటే మీలా రాసే వాళ్ళు ఇప్పుడు కనిపించడం లేదు..ధన్యవాదాలు.

  2. మా వాడు పసిపిల్లాడిగా ఉన్నప్పుడు బజారుకి తీసికెళ్తే ఒక పర్టిక్యులర్ బ్రాండ్ సాంబారు పొడి కొనమని ప్రాణం తీసేవాడు. వాడసలు సాంబారు తినేవాడు కాదు కానీ ఆ advertisement లో వచ్చే పిల్లలతో తెగ connect అయిపోయాడు…😀 Good article అండీ!

  3. ఈ వ్యాసం నాకు చాలా బాగా నచ్చింది. ఆలోచనాత్మకంగా ఉంది. కానీ ఒక సందేహం: నిన్ననో మొన్ననో నేను చదివిన ఒక వార్త: ఇండియాలో పుట్టి, రెండేళ్ల వయసులో తల్లితండ్రుల వెంట అమెరికా వెళ్ళి, అక్కడే పెరిగిన సుధీక్ష అనే ఒక ఇరవై ఏళ్ల తెలుగు యువతి తన ఫ్రెండ్స్ తో కలిసి డొమినికన్ రిపబ్లిక్ వెళ్ళి అక్కడ అప్పుడే పరిచయమైన ఒక అబ్బాయితో కలిసి బీచ్ కి వెళ్ళి కనిపించకుండా పోయిందని, ఆమె చనిపోయిందో లేదో కూడా తెలియడంలేదని చూశాను. ఆ యువతికి చిన్నప్పటినుండే స్వేచ్చా దొరికిందని అనుకుంటున్నాను. ఆమె ఆ స్వేచ్చని దురుపయోగం చేసుకుంటే తప్పు ఎవరిది?

    1. ఆమెకు ఇచ్చిన స్వేచ్ వలన ఇలా జరిగింది అని చెప్పలేము ఎందుకంటే, తెల్లవారు జామున 4 గంటలు ఆల్కహాల్ తగి, బీచ్ కెళ్ళి అక్కడ వేవ్స్ ఆటలాడటం స్వేచ్ కన్నా, ఆమె సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది. ఆ హోటల్ వాళ్ళ నిర్లక్షయం కూడా లేకపోలేదు, ఆ టైం లో బ్యాచ్ ని మూసి ఉంచకపోవడం లేక లైఫ్ గార్డ్ ని ఉంచకపోవడం.

      1. సరైన నిర్ణయం తీసుకునే పరిపక్వత లేని వారికి స్వయం నిర్ణయాధికారం ఇవ్వడం సమంజసమేనా?

      2. సరైన నిర్ణయం తీసుకునే సమర్థత లేనివారికి ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఇవ్వవచ్చా?

  4. బాగా రాసారు. పిల్లలను పెంచడం చాల కష్టమైన పని. మన పిల్లలు ఎలా వుండాలనుకుంటున్నామో, మనం ముందు అలా ఉండాలి. వాళ్ళు మనల్ని చూసి ఎములేట్ చేసుకుంటారు. సిగరెట్, మందు, తల్లి తండ్రుల అక్రమ సంబంధాలు, తండ్రి అవినీతి ఇవి మనకు తెలియకుండా, పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి.

    1. ఇది కొంత వరకు మాత్రమే నిజం.

      సాత్విక, సజ్జన జీవన విధానం వున్న తల్లి తండ్రులు పిల్లలు యే ఎక్కువగా చెడు ప్రభావాల కి లోనవుతున్నారు,చుట్టూ పక్కల చూస్తుంటే.

      మీడియా ప్రింట్ రూపంలో వున్న టైమ్ లో అశ్లీల సమాచారం కేవలం పెద్దలకి మాత్రమే అని కన్ట్రోల్ చేయడం అవకాశం వుండేది.

      తల్లి తండ్రుల కంటే, మన అదుపు లో లేని మీడియా ( ఇంటర్నెట్) వలన ఇప్పుడు ఇన్ని అనర్థాలు అని అభిప్రాయం.

    2. మంచి వ్యక్తుల యొక్క పిల్లలు కూడా చెడూ కి ఆకర్షి*తులు అవుతున్నారు అండి.

      తల్లి తండ్రుల కంటే కూడా, మన అదుపు లో లేని మీడి*యా ప్రభావం ఎక్కువగా వుంది.

  5. mimmalni kuda baga strict ga penchinatlu unnaru. anduke meeru ja ga n ni support chestunnaru. meeku kuda chinnapatinunchi option inchi unte bagunde di.yenduku ante ja ga n ni support cheyyatam anedi frustaration lonchi vachina oka reaction.

  6. ఆడపిల్ల లా తల్లి తండ్రుల జీవితం ఇప్పటి రోజుల్లో చాలా కష్టంగా మారింది.

    దురదృష్ట వశాత్తూ ప్రకృతి కూడా గర్భం ఆడవారిలో మాత్రమే జరిగేటట్లు చేసింది.

    చుట్టూ పక్కల మీడియా కూడా ఆడది(చిన్న, పెద్ద అనే తేడా లేదు) కనిపిస్తే చాలు, కేవలం సెక్ కోసమే అన్నట్లు ప్రచారం చేస్తున్నారు

    ఒకవైపు వాళ్ళని మంచి మనిషిగా పెంచాలి అని వాళ్ళకి మంచి అలవాట్లు చేయాలి అని ట్రై చేయడం తగిన స్వేచ్చ ఇవ్వడం, కానీ వాళ్ళు చుట్టూ పక్కల వాళ్ళ ప్రభావానికి లోనయి , దిద్దుకోలేని తప్పులు ( చిన్న వయసు లోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం ) జరగడం చూసి,

    ఇంటో నుండి ఆడపిల్ల బయటకి వెళితే , తిరిగి ఎలా వస్తుందో అని భయం వెంటాడుతూ వున్నది ఈ రోజుల్లో.

    అందుకే అతి జాగ్రత్త పడుతున్నారు.

  7. అసలు చదువుకునే వయసులో , స్వయం ఆర్థిక సంపాదన లేని యువకులకు సెక్ చేసే హక్కు వుందా? ఇది ఇబ్బంది అయిన ప్రశ్న, అయిన బట్టబయలు గా జరుగుతున్న విషయం కాబట్టి అడగక తప్పడం లేదు.

    ఒకవేళ ఛాయిస్ పేరుతో వాళ్ళు దిడ్డుకోలేని తప్పు చేస్తే, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి?

    ఇంకా మన సమాజం లో పిల్లలు మనదే బాధ్యత అని నమ్ముతున్నాం కాబట్టి, తల్లి తండ్రుల కి వేదిస్తున్న ప్రశ్న ఇది.

  8. ఇలాంటి చక్క*ని పరి*శోధన,

    జ*గన్ రె*డ్డి అనే అతను, తన అధి*కారాన్ని అ*డ్డం పెట్టుకుని ఆం*ద్ర లో స్కూ*ళ్ల లో పి*ల్లలకి కూడా గం*జాయి సర*ఫరా చేసి ధనవం*తుడు అయ్యిన విష*యం మీద రా*యండి. మీ*కున్న పరిచ*యాల తో ఈ భయం*కర ని*జం ఈ పా*టికి మీ*కు తెలి*సే వుం*టది.

    అ*తను అలా సంపాదిం*చిన పాపం డ*బ్బు లో గ్రే*ట్ ఆం*ధ్ర కి విసి*రేసిన ఆ బి*చ్చం డ*బ్బు తో న్ వెన*క్త రె*డ్డి గారు మీకు పారి*తోషకం ఇ*చ్చారు.

    1. అం*దరికీ తె*లిస్ట్టే క*ష్టం కదా, డిలీ*ట్ చె*య్యండి కా*మెంట్ నీ. నిజం కనిపె*ట్టడం చా*లా క*ష్టం. డి*లీట్ చె*య్యడం ఈజీ.

Comments are closed.