అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్ కందా
ఓ న్యూస్ ఐటమ్ + ఓ సిఎం = ఓ ట్రాన్స్‌ఫర్
నేను కృష్ణా జిల్లా కలక్టరుగా వుండగా (1979-80) ఓ సారి ఓ పేపరు రాసేసింది – 'పై వారి ఒత్తిడికి లొంగి కలక్టరుగారు యీ జిల్లాలో ఆ ట్రాన్సుపోర్టు పథకాన్ని అమలు చేయడం లేదు' అని.
నిజానికి ఆ పథకం ఆ జిల్లాలో అమలు కావటం లేదని నాకు తెలియనే తెలియదు. అప్పటికి అమలు చేయాలని అనుకోనూ లేదు, చేయవద్దని నాపై ఒత్తిడీ లేదు. కానీ వీళ్లు రాసేశారు. పేపర్లో చదివి ఇదేమిట్రా అని తీగ లాగితే డొంకంతా కదిలింది.
డొంకే కాదు, ఆ వూరికి వచ్చి 8 నెలలు కాకుండానే నా పీఠమూ కదిలింది.
ఒత్తిళ్ల ప్రభావం అలా వుంది మరి!
xxxxxx
మీడియా చురుకుదనం గురించి ఈ రోజుల్లో అందరూ భయపడుతున్నారు. ఇంతదాన్ని అంత చేస్తుందని, ఒకటి చెప్తే మరోటి రాస్తుందని, వక్రభాష్యాలు చేస్తుందని.. యిలా ఎన్నో ఆరోపణలు. తెలుగులో న్యూస్ ఛానెల్స్ ఎక్కువ కావడం వలననే యిలా జరుగుతోందని అంటున్నారు కొంతమంది. నిజానికి యిది యివాళ్టి సమస్య కాదు. టీవీ ఛానెల్స్ కాదు ప్రింట్ మీడియా వుండే రోజుల్లో కూడా చాలా టక్కరితనంగా రాసే విలేఖరులు వుండేవారు. నిజంగా జరిగిందో లేదో కానీ ఓ బిషప్ సంగతి జోక్‌గా చెప్తూ వుంటారు.
ఒక ఇటాలియన్ బిషప్ మతప్రచారానికై అమెరికాకు మొదటిసారి వెళ్తున్నాట్ట. పోప్ వద్దకు వెళ్లి ఇలా వెళ్తున్నాను, నేనేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని అడిగాడు. అమెరికన్ ప్రెస్‌తో చాలా జాగ్రత్త, రూల్సు అవీ పాటించరు. చాలా జిత్తులమారి వాళ్లు. జాగ్రత్తగా వుండాలని ఆయన చెప్పారు. ఆఁ నాకేం భయం? నేను అబద్ధాలు చెప్తేగా! అనుకుంటూ ఆయన అమెరికాకు వెళ్లాడు. న్యూయార్క్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే విలేఖరులు చుట్టుముట్టారు. ప్రశ్నలు, సమాధానాలు జరుగుతూండగానే ఎవరో అదాటున ''మీరు నైట్‌క్లబ్స్ ఎప్పుడు దర్శించబోతున్నారు?'' అని అడిగారు. మతగురువులు నైట్ క్లబ్స్‌కు వెళతారా? వెళ్లినా చెప్తారా? కావాలని వేసిన కొంటె ప్రశ్న అది.
వాళ్ల తెలివితేటలకు యీయన నవ్వుకుంటూ ''నైట్ క్లబ్సా? అవి యీ వూళ్లో వున్నాయా!?'' అని ఆశ్చర్యం ప్రకటిస్తూ ఎదురు ప్రశ్న వేశాడు. 'అసలు నైట్ క్లబ్స్ అనేవి యీ వూళ్లో వుంటాయా, లేదా అన్న విషయం పట్టించుకోకుండానే యీ వూరికి వచ్చాను, అయినా వాటితో నాకేం పని? అది గ్రహించి యీ పిచ్చిప్రశ్నలు మాను బాబూ' అనే వెక్కిరింత ధ్వనించేట్లా గొప్పగా సమాధానం యిచ్చాను అని ఆయన మురిసిపోయాడు. ''నేను నైట్‌క్లబ్స్‌ను దర్శించను'' అని సీదాసాదాగా చెప్తే డోసు చాలదనుకుని మంచి ఎఫెక్టివ్‌గా చెప్పాననుకుని ఆనందించినా అది మర్నాడు పొద్దున్న పేపర్లు చూసేవరకే నిలిచింది !
ఎందుకంటే మర్నాడు పేపర్లో పడిన వార్త – ''అమెరికాలోకి అడుగుపెడుతూనే ఈ వూళ్లో నైట్ క్లబ్స్ ఎక్కడున్నాయని వాకబు చేసిన బిషప్..'' అని వ్యాఖ్య రాసి ఈయన ఫోటో వేశారు. ఏ ప్రశ్నకు బదులుగా ఈ ప్రశ్న వేశారు అన్న వివరం పేపరువాళ్లు వేయరుగా ! పైగా ఆశ్చర్యార్థకాలు, కామాలు, యితర విరామ చిహ్నాలు లేకుండా మనం చెప్పినది రాస్తే యిలాగే అఘోరిస్తుంది. ఇది చూడగానే ఆయన గుండెలు బాదుకున్నాడు. పోప్ చెప్పిన మాటలు మననం చేసుకుని ప్రెస్‌వాళ్లతో వ్యంగ్యాల జోలికి పోకుండా, అతి తెలివిగా వ్యవహరించకుండా, బతిమాలే ధోరణిలో వుంటే మంచిదనుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం ఓ సమావేశం జరిగింది. ఈయన తన ఉపన్యాసం ముగించాక విలేఖరులు ఎవరైనా వున్నారా? అని అడిగాడు. ముగ్గురు, నలుగురు చేతులెత్తారు.
''చూడండి నాయనలారా, నేను దేశమంతా అనేక ప్రాంతాలలో పర్యటించాలి. అన్నిచోట్లా వేరేవేరే ఉపన్యాసాలు యివ్వలేను కదా! కొన్ని ఉదంతాలతో, స్వీయానుభవాలతో, ఉదాహరణలతో ఉపన్యాసం తయారుచేసుకుని వచ్చాను. అదే అన్ని చోట్లా యివ్వాలి. అందువలన మీరు దయచేసి నా ఉపన్యాసం పూర్తిపాఠం వేయకండి. పూర్తిగా వేస్తే అది పేపర్లో చదివేసిన తర్వాత వేరే వూర్లో వాళ్లకు ఉపన్యాసం యివ్వబోతే వినేవాళ్లకు బోరు కొట్టేస్తుంది.''అని చాలా మర్యాదగా వేడుకున్నాడు.
మర్నాడు పేపర్లో వచ్చింది ''బిషప్ చాలా స్వీయానుభవాలే చెప్పారు. కానీ వాటిని అచ్చు వేయలేం. (బిషప్ టోల్డ్ మెనీ టేల్స్ బట్ దే ఆర్ అన్‌ప్రింటబుల్)'' అని.
xxxxxx
మీరు ఏం చేసినా మీడియాతో నెగ్గుకు రాలేరన్నది నీతి. మీడియాతో వచ్చిన చిక్కేమిటంటే వాళ్లకు తెలిసినది కొంత ఐతే ఊహ చాలా చేస్తారు. ఈ పని జరిగిందంటే ఫలానావాళ్లు యిలా చేయమని చెప్పి వుంటారు, ఇది జరగలేదంటే ఫలానావాళ్లు అడ్డుపడి వుంటారు ..యిలా ఏవేవో వూహించుకుని వార్తలు రాసేస్తారు. దానివలన వచ్చే కష్టనష్టాలు మనం భరించాలి.
ఆ కథేమిటో చెప్పాలంటే ఆనాటి పథకం గురించి చెప్పాలి.
అప్పట్లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి సూచన మేరకు రాష్ట్రప్రభుత్వం ఓ పథకం పెట్టింది. నిరుద్యోగ యువతకు ఉపాధికల్పన పథకం క్రింద కొన్ని రూట్లు వారికై కేటాయించి వాళ్లను బస్సులు నడుపుకోమంది. అవి ప్రయివేటు ఆపరేటర్లు బస్సులు తిప్పుకునే రూట్లన్నమాట. వాటిలో ఆర్‌టిసి ఎలాగూ బస్సులు నడుపుకోవడం లేదు. ప్రయివేటు వాళ్లెవరో బస్సులు ఆపరేట్ చేసే బదులు ఆర్‌టిసి సహాయంతో నిరుద్యోగులు నడిపితే వారికీ లాభం, ఆర్‌టిసికీ లాభం. రాష్ట్రమంతా యీ పథకం అమలైంది కానీ విజయవాడ ఒక్కదానిలోనే అమలు కాలేదు. కారణం – ప్రయివేటు ఆపరేటర్లు, వ్యాపారస్తులు, స్థానిక రాజకీయ నాయకులు, ఆర్టీసి అధికారుల అలసత్వం, జిల్లా అధికారుల ఉదాసీనత – ఏదైనా కావచ్చు, అన్నీ కావచ్చు. ఏది ఏమైతేనేం, విజయవాడ మాత్రం యీ పథకానికి అతీతంగా, సుదూరంగా వుంది.
నిజానికి విజయవాడలో కూడా కొన్ని రూట్లు అప్పటికే గుర్తించి నిరుద్యోగులలో కొంతమందిని ఎంపిక చేసి వారికి యివ్వడానికి అంతా సిద్ధంగా పెట్టారు. కానీ వాళ్లకు యివ్వడం లేదు. ఎందుకివ్వరు? ఎందుకింత ఆలస్యం అని వాళ్లు ఆందోళన చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీవారు వారికి అండగా నిలిచారు. అందరూ కలిసి నిరసనలు తెలుపుతున్నారు. నేను కృష్ణాజిల్లాకు కలక్టరుగా కొత్తగా వచ్చాను. కెవి రావు అని నా జూనియర్, మంచి సమర్థుడైన శిష్యుడు వుండేవాడు. కావాలని అతన్ని విజయవాడ సబ్ కలక్టర్‌గా వేయించుకున్నాను. అన్నీ జాగ్రత్తగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మేం అనుకుంటూండగా ఓ రోజు పేపర్లో పైన చెప్పిన వార్త వచ్చింది – ''కలక్టరుగారు పై వాళ్ల ఒత్తిడితో యీ పథకం అమలు చేయడం లేదు. నిరుద్యోగులు నష్టపోతున్నారు.'' అని.
పేపరు చదవగానే నాకు ఒళ్లు మండిపోయింది. అసలు నాకు యీ పథకం యిక్కడ అమలు కావటం లేదనే సంగతే తెలియదు. చేద్దామనుకోవడమూ లేదు, దానికి వేరెవరో అడ్డుపడడమూ లేదు, అందువలన నేను నా ప్రయత్నం విరమించుకోవడమూ లేదు. అంతా ఊహాగానమే. వెంటనే మా స్టాఫ్‌ని పిలిచి అడిగితే వివరాలన్నీ బయటకు వచ్చాయి. ఇంత మంచి పథకం యిక్కడ మాత్రం ఎందుకు అమలు కాకపోవాలి, చేద్దాం అని నిశ్చయించుకుని కెవి రావుని పిలిచి. ''మనకు ఎవరితోను ఎటువంటి మొహమాటం లేదు. ఇదోదే మంచిపని. జరగాలి. దీనివలన ఎవరికి నష్టం, ఇందులో ఎవరు కలగజేసుకుంటారు అనేవి మనకు అనవసరం. చెయ్యాల్సిన పని చేద్దాం'' అని చెప్పాను.
''రైఠో'' అన్నాడతను. హుటాహుటిన సూపరిండెంట్ ఆఫ్ పోలీస్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్, నేను – మొత్తం నలుగురు ప్లస్ ఒక నాన్ అఫీషియల్ అంటే అనధికారితో కలిసి కమిటీగా ఏర్పడి అందరం కళ్లార్పే లోపున ఆ రూట్లను ప్రైవేట్ హస్తాలనుండి విడుదల చేస్తూ సంతకాలు పెట్టేశాం. సెలక్టయిన యువకులకు అప్పగించేశాం. అప్పటికే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ వచ్చి ''అయ్యా, మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించి చేయాలి'' అని చెప్పబోయారు. ''ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా ఆలోచించవలసిన పని లేదు.'' అని మాట తుంచేశాను.
ఆ తర్వాత ఆ శాఖలో ఓ ఉన్నతాధికారి హైదరాబాదునుండి ఫోన్ చేసి ''మోహన్, యిదేదో ముందూ వెనకా ఆలోచించుకుని చేస్తే మంచిది. దీని వెనకాల చాలా మంది పెద్ద పెద్దవాళ్ల ప్రయోజనాలున్నాయి…'' అంటూ చెప్పడం మొదలు పెట్టాడు.
''ఫర్వాలేదండి, నేను చూసుకుంటాను. మీరేం వర్రీ కాకండి.'' అన్నాను శాంతంగా.
''అంటే దీనివలన హెచ్చుతగ్గులు వస్తే అంతా నీదే బాధ్యత సుమా, నాదేం లేదు. ఎవరైనా అడిగితే నువ్వే చేశావ్ అని చెప్పేస్తాను.'' అంటూ వేరే ధోరణిలో మాట్లాడుతున్నాడు.
''అయ్యా, నేను మీకు ఫోన్ చేయలేదు కదా, నేనేమీ మీ సాయం కోరలేదు కదా, ఈ విషయంలో నా పనేదో నేను చేసుకుంటున్నాను. కష్టమో, నష్టమో భరిస్తాను. మీరే ఫోన్ చేసి యిలా బెదిరిస్తే ఎలా? నేను చేసే పని సరైనదే అని నాకు పూర్తి నమ్మకం..'' అని ఫోన్ పెట్టేసాను.
xxxxx
మర్నాటినుండే కొత్త ఆపరేటర్ల బస్సులు నడవడం మొదలు పెట్టాయి. నాలుగు రోజులకే చెన్నారెడ్డిగారు విశాఖపట్నం వెళుతూ మధ్య దారిలో విజయవాడలో దిగాలి. కానీ ఆయన విమానం గన్నవరంలో దిగలేకపోవడంతో నేరుగా విశాఖపట్నం వెళ్లిపోయారు. తిరుగుప్రయాణంలో గన్నవరంలో ఆగింది. నేనూ, మా జిల్లా సూపరిండెంట్ రామావతార్ యాదవ్ ముఖ్యమంత్రిగారితో గన్నవరం ఎయిర్‌పోర్టులో లాంజ్‌లో కూర్చున్నాం.
చెన్నారెడ్డిగారు ఎంతో సమర్థుడైన ముఖ్యమంత్రి. అయినా కోపం వస్తే మాత్రం ఆపుకోలేరని, అవతలివాళ్లు ఎవరనేది చూడకుండా పరుషంగా మాట్లాడతారని సీనియర్ అధికారులు అనుకునేవారు. దానికి కొంతమంది అధికారులు కొంత కారణమనీ, వాళ్లు ముఖ్యమంత్రితో ఎలా వుండాలో అలా వుండకుండా అతివినయం ప్రదర్శించడం వలననే ఆయనకి తన ధోరణి మార్చుకునే అవసరం ఆయనకు పడలేదనీ అంటూండేవారు.
అటువంటి చెన్నారెడ్డిగారు ఆ రోజు చాలా సౌమ్యంగా ''ఏం మోహన్, బాగున్నావా?'' అని పలకరించి ''ఉద్యోగం ఇంట్రస్టింగ్‌గా వుందా?'' అని అడిగారు.
ఐయేయస్ లెవరికైనా జిల్లాలో కలక్టరుగా పనిచేయాలని వుంటుంది. గుంటూరు జిల్లా కలక్టరుగా నాలుగు నెలలు పనిచేశానో లేదో గవర్నరు శారదా ముఖర్జీగారు తనకు కావాలంటే పట్టుకుపోయారు. ఆవిడ వెళ్లిపోయాక ఆ స్థానంలో వచ్చిన కెసి అబ్రహాంగారు ఇంకో ఏడాది ఆయన వద్ద వుండాలని చేతిలో చెయ్యి వేయించుకుని మాట తీసుకోవడం వలన నేను అనుకున్నదాని కంటె ఆలస్యంగా కలక్టరుగా వచ్చాను.
మంచి ఉత్సాహంగా వున్నాను. హుషారుగా ఏవేవో అనేక పథకాలు మొదలుపెట్టాం. ఇలాటి టైములో ఉద్యోగం బాగా లేదని ఎందుకంటాను?
''చాలా బాగుందండి.'' అన్నాను.
''మరి నీకు ఫిషరీస్ కార్పోరేషన్‌లో యింట్రస్ట్ వుందని ఎవరో చెప్పారే!?'' అన్నారు.
xxxxxx
దీనికి ఓ నేపథ్యం వుంది. సంజీవరావుగారని యిప్పటి కేంద్రమంత్రి పళ్లంరాజుగారి తండ్రి. ఆయన అప్పట్లో ఫిషరీస్ కార్పోరేషన్‌కి చైర్మన్‌గా వున్నారు. మా బావగారికి స్నేహితుడు కూడా. నేను వైస్ చైర్మన్‌గా వస్తే బాగుండునని ఆయన ఉద్దేశం. ఆయన ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రిగారు చీఫ్ సెక్రటరీ ఎస్ ఆర్ రామ్మూర్తిగారికి చెప్పారు.
రామ్మూర్తిగారు ఫోన్ చేసి నన్నడిగారు.
''అదేమిటి, యిప్పుడేగా జిల్లాకు వచ్చింది? ఫిషరీస్ అవీ ఏమీ వద్దు.'' అన్నాను.
''సరేనయ్యా, అయితే ఏదైనా సందర్భం వస్తే నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు అని గట్టిగా చెప్పేయ్. లేకపోతే నువ్వే కావాలని అడిగావనుకుంటారు. సందిగ్ధంలో వుంచడం కంటె క్లారిఫై చేసేస్తే మంచిది కదా.'' అన్నారు.
అది గుర్తుకు తెచ్చుకుని అదంతా చెన్నారెడ్డిగారికి విపులంగా చెప్పి, ''ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకు ఫిషరీస్‌పై ఏ మాత్రం ఆసక్తి లేదు. నాకు యీ జిల్లా కలక్టరుగా కొనసాగడమే యిష్టం.'' అన్నాను.
ఆయన యింకేమీ మాట్లాడలేదు. సాలోచనగా చూస్తూ వుండిపోయారు.
విమానం బయలుదేరే వేళయింది. విమానం వైపు నడుస్తున్నారు. వెనక్కాల నేనూ, యాదవ్ నడుస్తున్నాం. ఆయన సడన్‌గా ఆగి ''మరి ఫిషరీస్ కార్పోరేషన్‌కి వేస్తే వెళతావా?'' అన్నారు.
అసలు చెన్నారెడ్డిగారు పోస్టింగ్ వంటి చిన్న విషయాలపై యింతసేపు మాట్లాడడమే అరుదు. పైగా యింత సౌమ్యంగా…! ఒక జిల్లా కలక్టర్‌తో…!!
ఆయనపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు వున్నాయో ! తన యిష్టానికి వ్యతిరేకంగా ఆ ఒత్తిళ్లకు లొంగడమూ యిష్టం లేదేమో! నేను చేస్తున్న పనుల్ని తప్పుపట్టే ఉద్దేశమూ లేదులా వుంది. అంతర్మథనానికి గురవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన పరిమితులు ఆయనకుంటాయి అనుకుంటూ –
''నా ఉద్యోగధర్మంగా ఎక్కడికి వేస్తే అక్కడికి వెళతానండి. తిరస్కరించే ప్రశ్నే లేదు. మీరేదో యిష్టాయిష్టాలు అడిగారు కాబట్టి చెప్తున్నాను కానీ…'' అన్నాను దృఢస్వరంతో.
ఆయన విమానం ఎక్కేశారు.
నాలుగు రోజుల్లో నాకు బదిలీ ఆర్డర్ వచ్చేసింది – ఫిషరీస్ డిపార్టుమెంట్ వైస్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరక్టర్‌గా పోస్ట్ చేస్తూ.
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. అలాగ మీడియాలో వచ్చిన ఒక వార్త వలన మొదలైన ప్రకంపనాలు చివరకు నా స్థానచలనానికి దారి తీశాయి.
కొసమెరుపు – ఒంగోలులో ప్రత్యేకాంధ్ర ఉద్యమం జరిగే రోజుల్లో ఓ జర్నలిస్టు పోలీసువాళ్లను బ్లాక్‌మెయిల్ చేయబోయాడు. ''మీరు ఆందోళనకారులను హింసిస్తున్నారు. ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావుగారు పర్యటనకు రాబోతున్నారు కదా, ఆయన ఎదుట మీపై చెప్పి పరువుతీస్త్తాను' అంటూ. తీరా చూస్తే ముఖ్యమంత్రి వచ్చినపుడు యితను కనబడనే లేదు. ''ఏమైంది, మనసు మార్చుకున్నాడా? ఇది పద్ధతి కాదని తెలుసుకున్నాడా?'' అని జిల్లా ఎస్పీ రామస్వామిని అడిగాను. ''ఏమో, కనుక్కుందాం'' అంటూ టౌను సిఐ ని పిలిచి అడిగారాయన.
''అతనా? ఆ రోజుంతా పబ్లిక్ న్యూసెన్సు కేసు కింద (వీధిలో మూత్రవిసర్జన చేసే కేసు లాటిది) పోలీసుస్టేషన్‌లో వున్నాడట!'' అన్నాడాయన.
ఎవరి టెక్నిక్‌లు వాళ్లవి!
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version