నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు

నటుడు సిద్దార్థ్ ఎక్కడుంటే అక్కడ చిన్నపాటి వివాదం ఉంటుంది. గతంలో తన సినిమా ప్రచారం కోసం మీడియా ముందుకొచ్చినప్పుడు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు, పేరు చెప్పకుండా కొంతమంది సినీ ప్రముఖులపై ఆరోపణలు చేశాడు.…

నటుడు సిద్దార్థ్ ఎక్కడుంటే అక్కడ చిన్నపాటి వివాదం ఉంటుంది. గతంలో తన సినిమా ప్రచారం కోసం మీడియా ముందుకొచ్చినప్పుడు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు, పేరు చెప్పకుండా కొంతమంది సినీ ప్రముఖులపై ఆరోపణలు చేశాడు.

ఈసారి ఏకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరుస్తూ అతడు కామెంట్స్ చేశాడనే ప్రచారం జరిగింది. భారతీయుడు-2 ప్రచారంలో మాట్లాడిన సిద్దార్థ్.. “ప్రతి నటుడికి సామాజిక బాధ్యత ఉంటుంది. మా బాధ్యత ప్రకారం మేం పని చేస్తాం. ఏ ముఖ్యమంత్రి కోరినా మేం చేస్తాం. మేం చెప్పింది చేస్తేనే మీకు మేం సాయం చేస్తామని ఏ సీఎం చెప్పడు.” అంటూ స్పందించాడు.

దీనిపై కొంతమంది తలో రకంగా రాసుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సిద్దార్థ్ మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. దీనిపై వెంటనే స్పందించాడు సిద్దార్థ్.

“భారతీయుడు-2 ప్రెస్ మీట్ లో ఓ ప్రశ్నకు సమాధానం చెబుతున్నప్పుడు నా మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. దాన్ని క్లియర్ చేయడం కోసం మీ ముందుకొచ్చాను. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిగారికి నేను పూర్తిగా మద్దతు తెలుపుతున్నాను. ప్రభుత్వాలు మాత్రమే కాకుండా, మనం కూడా పిల్లల భవిష్యత్తును కాపాడాలి. అది మన కర్తవ్యం.”

నటీనటుల్ని ప్రభుత్వాలు బలవంతం చేయవని, నటులంతా స్వచ్ఛందంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారని, అది తమ కర్తవ్యమని మాత్రమే తను చెప్పానని.. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్స్ చేయలేదని సిద్దార్థ్ క్లారిటీ ఇచ్చాడు.