‘మా’.. ఏమిటీ వైపరీత్యం.?

నిజంగానే ఇది వైపరీత్యం. వెయ్యి మంది సభ్యులు కూడా లేని ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. సాధారణ రాజకీయాల్లోలానే ‘మా’ రాజకీయాలు కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అధ్యక్ష పదవి…

నిజంగానే ఇది వైపరీత్యం. వెయ్యి మంది సభ్యులు కూడా లేని ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. సాధారణ రాజకీయాల్లోలానే ‘మా’ రాజకీయాలు కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అధ్యక్ష పదవి కోసం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ‘ఎన్నికల వరకే ఈ గొడవలు.. ఎన్నికల తర్వాత అందరం కలిసి పనిచెయ్యాల్సిందే..’ అంటూ కొందరు సినీ నాయకులు చెబుతున్నారంటే, ఎవరి కోసం ఈ గొడవలు.? అన్న అనుమానం రాకుండా వుంటుందా.?

మురళీమోహన్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోగానే సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌, ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. రాజేంద్రప్రసాద్‌ సినీ రంగంలో అందరికీ కావాల్సిన వ్యక్తి. ఆయన మీద గౌరవంతో ఇంకెవరూ పోటీలో నిలవకుండా వుండాల్సింది. కానీ, మురళీమోహనే స్వయంగా జయసుధను తెరపైకి తీసుకొచ్చారు. నేను పోటీ చేయడంలేదు, జయసుధను పోటీలో నిలబెడ్తున్నాను.. అని మురళీమోహన్‌ చెప్పి వుంటే ఇంత వివాదం జరిగి వుండేది కాదు.

సినిమా పబ్లిసిటీ కోసం నానా తంటాలూ పడ్తుంటారు దర్శకులు, నిర్మాతలు, నటులు.. అచ్చం అలానే తయారైంది ‘మా’ ఎన్నికల వ్యవహారం కూడా. పబ్లిసిటీ స్టంట్‌ని తలపించేలా వుంది ఈ మొత్తం ప్రక్రియ. ఎవరో తెరవెనుక వుండి నడిపిస్తున్నారని కొందరు, అంతా కుట్రపూరితం.. అని ఇంకొందరు.. దుమ్మెత్తిపోసుకుంటోంటే, సగటు సినీ అభిమాని ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ఒకాయన ఓ అడుగు ముందుకేసి కోర్టును ఆశ్రయించాడు. దాంతో ఎన్నికలు జరుపుకోండి, ఫలితం మాత్రం చెప్పొద్దు.. అని న్యాయస్థానం షాక్‌ ఇచ్చింది.

ఇంత సినిమా అవసరమా.? ఇంత పబ్లిసిటీ దేని కోసం.? ఈ హంగామా వెనుక అసలు ఉద్దేశ్యమేంటి.? అందరూ కలిసి గూడు పుఠానీ చేస్తున్నారా.? ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకోవడం నిజమేనా.? ఇలా ఎన్నెన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెరసి ఇటు జయసుధ మీదా, అటు రాజేంద్రప్రసాద్‌ మీదా.. ఇప్పటిదాకా జనానికి వున్న పాజిటివ్‌ ఫీలింగ్‌ అయితే ఇప్పుడు కన్పించడంలేదు. మరీ ముఖ్యంగా మురళీమోహన్‌ విషయంలో ఈ ఎఫెక్ట్‌ గట్టిగానే కన్పిస్తోంది.