హైదరాబాద్ లో నిన్నటికి నిన్న ఓ సందడి ముగిసింది. సాఫ్ట్ వేర్ హబ్ లాంటి గచ్చిబౌలి ప్రాంతంలోని అత్యంత విశాలమైనదిగా పేర్కొంటున్న శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో ఏషియన్ మహేష్ బాబు మల్టీ ఫ్లెక్స్ ప్రారంభమైంది. దాదాపు రెండేళ్లకు పైగానే పట్టింది దీని నిర్మాణానికి. అసలు అంకురార్పణ జరిగిన నాటి నుంచి లెక్క వేసుకుంటే నాలుగేళ్ల పైమాటే.
అత్యంత విశాలమైన మాల్ లో 60వేల చదరపు అడుగుల్లో ఎఎంబి మల్టీ ఫ్లెక్స్ ఏర్పాటయింది. ఈ అరవై వేల చదరపు అడుగుల్లో ఏడు స్క్రీన్ లు ఏర్పాటు చేసారు. వీటిలో ఒకటి త్రీడీ స్క్రీన్. ఒకటి కేవలం 52 రిక్లయినర్లతో కూడిన విఐపి స్క్రీన్. మరొకటి లేజర్ ప్రొజెక్షన్ స్క్రీన్. సౌత్ ఇండియాలో ఇలాంటిది ఇదే ప్రధమం. ఇండియాలో ఇది రెండోది. మొత్తం స్క్రీన్ లు అన్నీకలిసి 1636 సీటింగ్ కెపాసిటీ.
ఈ మల్టీ ఫ్లెక్స్ ఇంటిరీయర్ మొత్తం విదేశీ కన్సెల్టెన్సీల సహకారంతో ముంబాయి నిపుణులు వర్క్ చేసారు. ఆద్యంతం సెవెన్ స్టార్ హోటల్ సదుపాయాలు, లుక్ వుండేలా మల్టీ ఫ్లెక్స్ ను తీర్చిదిద్దారు. ఇదిలా వుంటే ఈ మొత్తం మల్టీ ఫ్లెక్స్ కు 80 కోట్లు ఖర్చయిందని తెలుస్తోంది.
మాల్ లోని 60 వేల చదరపు అడుగులను అన్ డివైడెడ్ షేర్ లెక్కన ఏకంగా కొనుగోలు చేసేసారు. లీజ్ కి తీసుకోలేదు. స్వంతంగా కొనేసారు. దానికి ప్లస్ మొత్తం మల్టీ ఫ్లెక్స్ గా కన్వెర్ట్ చేయడానికి 80 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం ప్రాజెక్టులో ఏషియన్ సునీల్-మహేష్ బాబు మాత్రమే భాగస్వాములు అని తెలుస్తోంది. కాదు, మరో ఒకరిద్దరు కూడా కొంత స్టేక్ పెట్టారని కూడా వినిపిస్తోంది.
ఏషియన్ మహేష్ బాబు మల్టీ ఫ్లెక్స్ ఓపెనింగ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి