ఆగడు సినిమా నుంచి ప్రకాష్ రాజ్ ఔట్ అయ్యాడు. దానిపై రకరకాల కథనాలు వచ్చాయి. ప్రకాష్ రాజ్ ఓ అసిస్టెంట్ డైరక్టర్ ను దూషించాడని, దానిపై దర్శకుల సంఘానికి ఫిర్యాదు అందిందని, చర్య రెడీ అవుతోందని వార్తలు వినవచ్చాయి. ఇలాంటి సమయంలో ప్రకాష్ రాజ్ ఫైర్ బ్యాక్ అయ్యాడు. తనది కాదు తప్పని, తనను ఎవరు టార్గెట్ చేస్తున్నారో తెలుసుని, ఆ ఒక్కరి పేరు బయటపెడతానని ప్రకటించారు. ఆ ఒక్కరు ఎవరై వుంటారు. దర్శకుడు శ్రీనువైట్ల తప్ప.
ఎందుకంటే సినిమా నుంచి ప్రకాష్ రాజ్ ను తప్పించే అధికారం ఇద్దరికే వుంటుంది. ఒకరు హీరో మహేష్ బాబు, రెండవది దర్శకుడు శ్రీనువైట్ల. మహేష్ పేరు ఈ వ్యవహారంలో మొదట్నించీ వినిపించడం లేదు. అందువల్ల మిగిలిన శ్రీను వైట్లనే. అదీ కాక, శ్రీను వైట్ల అనుమతి లేకుండా ఓ అసిస్టెంట్ తనంతట తాను ఫిర్యాదు చేసేంత సీన్ టాలీవుడ్ లో లేదు. దానా దీనా అన్ని వేళ్లూ శ్రీను వైట్ల వైపే చూపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కోన వెంకట్ వివాదం కూడా గుర్తుకువస్తోంది. గతంలో రెగ్యులర్ గా శ్రీను వైట్లతో పనిచేసిన సినిమాటోగ్రాఫర్ కూడా మారిపోయాడు. శ్రీనువైట్ల తనటీమ్ సభ్యులతో ఎందుకిలా వివాదం కోరి తెచ్చుకుంటున్నాడని అనుకుంటున్నారు సినిమా జనాలు. ఒక్క గొడవ అయితే ఎవరి తప్పు అన్న అనుమానం వస్తుంది. ఒకే వ్యక్తి అందరితో గొడవ పడుతుంటే, జనం అనుమానం సహజంగా ఆ వ్యక్తివైపే వెళ్తుంది. ఇకనైనా శ్రీను వైట్ల జాగ్రత్తగా డీల్ చేసుకుంటే బెటరేమో?