బన్నీ వాస్ అంటే సినిమా జనాలకు తెలుసుకానీ, జనరల్ పబ్లిక్ కు అంతగా తెలియదు. కానీ ఆ మధ్య ఆంధ్ర నంది అవార్డుల ప్రకటన సందర్భంగా కాస్త వివాదాస్పద ప్రకటనలు చేసి వార్తల్లోకి వచ్చారు. మళ్లీ ఇప్పుడు మరో మాంచి ట్వీట్ చేసారు.
సినిమా హాళ్లు ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా, రోజుకు ఏడు షోలు వేసుకునేలా ప్రభుత్వం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కోసం ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు ఆంధ్రలో థియేటర్లు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయి.
బన్నీ వాస్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇలా చేయడం వల్ల ఆంధ్రలో సినిమా పరిశ్రమ వృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. అంతటితో ఆగకుండా ఈ పద్దతి ఇలా కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు. ఇక్కడే అసలు విషయం దాగి వుంది. ప్రస్తుతం బన్నీ వాస్ భాగస్వామిగా అల్లు అర్జున్ హీరోగా, నా పేరు సూర్య సినిమా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఈ సమ్మర్ లో విడుదల కాబోతోంది. అది కూడా భారీ సినిమానే. ఆ సినిమాను కూడా కాస్త గట్టిరేట్లకే అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల అక్కడ కూడా బయ్యర్లు గట్టెక్కాలన్నా, అలాగే మాంచి లాభాలు రావాలన్నా ఇదే విధంగా రోజుకు ఏడు షోలు ఇస్తే మంచిది.
అందుకే కావచ్చు, బన్నీ వాస్ ఈ పద్దతి ఇలా కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు. అంటే నా పేరు సూర్య టైమ్ లో కూడా 24గంటల పాటు సినిమాలు వేసుకునేలా అనుమతి అడిగితే ఇవ్వాలనే అండర్ కరెంట్ మెసేజ్ బన్నీ వాస్ ట్వీట్ లో కనిపిస్తోంది.
కానీ నంది అవార్డుల టైమ్ లో బన్నీ వాస్ కామెంట్ లపై తెలుగుదేశం పెద్దలకు కోపం వచ్చినది వాస్తవం. మరి అవన్నీ మరిచిపోయి, ఈ ప్రాక్టీస్ కొనసాగిస్తారా? లేదు ఏదో సాకు చూపి ఇవ్వడం మానేస్తారా? అన్నది ఇప్పుడే తెలిసేది కాదు. పైగా ఈ సినిమాకు మరో అసలు భాగస్వామి లగడపాటి శ్రీధర్. ఆయన మాజీ ఎంపీ, చంద్రబాబుకు, వెంకయ్యకు సన్నిహితుడైన లగడపాటి రాజగోపాల్ కు స్వయానా సోదరుడు. అందువల్ల ఇవ్వడానికే ఎక్కువ అవకాశం వుంటుందేమో?