“ప్రచారానికి మాకు పవన్ కల్యాణ్ పర్మిషన్ ఇవ్వలేదు. అటు ఒక కాలు, ఇటొక కాలు వేయొద్దన్నారు. మాకు కూడా రాజకీయంగా అంత పరిజ్ఞానం లేదు కదా. కల్యాణ్ గారి మాట దాటి నేను వెళ్లను. ఆయన అనుమతి ఇవ్వలేదు కాబట్టే నేను ప్రచారానికి వెళ్లలేదు.”
జనసేన ఎన్నికల ప్రచారంపై సాయితేజ్ రియాక్షన్ ఇది. పవన్ వద్దన్నాడు కాబట్టి తను ప్రచారానికి వెళ్లలేదంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, పవన్ కు వడదెబ్బ తగిలి పడిపోయినప్పుడు మాత్రం తేజూ ఓసారి వెళ్లి ఉండాల్సింది. అప్పుడు వస్తానంటే పవన్ వద్దనడు కదా. పైగా పరామర్శకు పర్మిషన్ అక్కర్లేదు కదా.
పవన్ కు వడదెబ్బ తగిలిన వెంటనే రామ్ చరణ్ విజయవాడ వెళ్లాడు. పవన్ ను పలకరించాడు. ఒక పూటంతా అతడితోనే గడిపాడు. తర్వాత బన్నీ కూడా వెళ్లాడు. పవన్ ను పరామర్శి, అతడితో పాటు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నాడు. ఏం మాట్లాడకపోయినా పక్కన నిల్చొన్నాడు. ప్రచారం ఆఖరి రోజున వరుణ్ తేజ్ కూడా పవన్ ను కలిశాడు.
సాయితేజ్ కూడా అలానే చేసి ఉండొచ్చు కానీ అతడు మాత్రం పూర్తిగా దూరంగా ఉన్నాడు. అరడజను ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఈ హీరో, ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం చిత్రలహరి సినిమాపైనే పెట్టాడు. ఇది అతడి కెరీర్ కు చాలా కీలకం. అందుకే పూర్తిగా ఈ సినిమాపైనే దృష్టి పెట్టాడట తేజూ. ఇతర ఆలోచనలేవీ పెట్టుకోలేదట.