థియేటర్లు కావాలా నాయనా?

టాలీవుడ్ లో భలే చిత్రమైన పరిస్థితి వుంటుంటుంది ఒక్కోసారి. మొన్నటి దాకా థియేటర్లు ఖాళీ లేవు. పండగకు వచ్చిన మూడు సినిమాలు ఆ తరువాత కాస్త గ్యాప్ తీసుకుని వచ్చిన మరో మూడు సినిమాలు…

టాలీవుడ్ లో భలే చిత్రమైన పరిస్థితి వుంటుంటుంది ఒక్కోసారి. మొన్నటి దాకా థియేటర్లు ఖాళీ లేవు. పండగకు వచ్చిన మూడు సినిమాలు ఆ తరువాత కాస్త గ్యాప్ తీసుకుని వచ్చిన మరో మూడు సినిమాలు అన్నీ కలిసి థియేటర్లలో తిష్ట వేసుకుని కూర్చున్నాయి. కానీ ఇప్పుడు మళ్లీ సీన్ మారిపోయింది. థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. సినిమాలు విడుదల కావాలే కానీ థియేటర్లు రెడీ. 

ఖైదీ నెంబర్ 150, శాతకర్ణి, శతమానం భవతి సినిమాలు విడుదలై నెల దాటిపోయింది. శతమానం భవతి అక్కడక్కడ సింగిల్ స్క్రీన్స్ లో ఫరవాలేదు కానీ, మొత్తం మీద మూడు సినిమాలకు షేర్ ఏమీ రావడంలేదు. శాతకర్ణి సినిమాను చాలా చొట్ల లేపేసారు. ఖైదీ సినిమాను మాత్రం 50 రోజుల సెంటర్ల కోసం సాగదీస్తున్నారు. కానీ ఇంకా మూడు వారాలు సాగదీయాలి అంటే కాస్త కష్టమే. అందువల్ల కొన్ని సెంటర్లన్నా ఖాళీ అవుతాయి. 
శాతకర్ణి థియేటర్లలో కొంత వరకు ఓం నమో వెంకటేశాయకు వచ్చాయి. ఆ సినిమా ఈ సోమవారం నుంచి ఎలా వుంటుందో చూడాలి.

పాజిటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్లు పెద్దగా లేవు. సింగం ఫరవాలేదు. నేను లోకల్ ఈ వీక్ కూడా ఓకె. మొత్తం మీద చూసుకుంటే ఈ ఫ్రైడే నాటికి థియేటర్లు చాలా వరకు కొత్త సినిమాల కోసం చూసే స్టేజ్ లోకి వచ్చేస్తున్నాయి. ఈ ఫ్రైడే ఘాజీ వస్తోంది. మరీ మాస్ మసాలా కమర్షియల్ సినిమా కాదు. మహా అయితే రెండు రాష్ట్రాల్లో కలిసి రెండు నుంచి మూడు వందల సెంటర్లు ఎక్కువ.

ప్రెస్జీజ్ కోసం మరీ ఎక్కువ సెంటర్లు వేసుకున్నా షేర్ లాస్ తప్ప వేరు కాదు. ఆ పై వారం యెమన్, విన్నర్ సినిమాలు వున్నాయి. అప్పటికి థియేటర్లు కాస్త ఫుల్ కావచ్చు. వీటన్నింటి రిజల్ట్ ను బట్టి, థియేటర్లు టైట్ అవుతాయా?  సినిమాల కోసం ఎదురుచూస్తాయా? అన్నది ఆధారపడి వుంటుంది. ప్రస్తుతానికైతే థియేటర్లకు సినిమాలు కావలెను.