ఉడ్తా టాలీవుడ్‌: ‘పార్ట్‌ 2’ వుందా.? లేదా.?

'డ్రగ్స్‌ విక్రయించడం, కలిగివుండడమే కాదు, వాటిని తీసుకున్నా నేరం చేసినవారే అవుతారు..'  Advertisement – తెలంగాణ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌  'డ్రగ్స్‌ విక్రయించడం, కలిగి వుండడమే నేరం. వాటిని తీసుకున్నవారు నేరస్తులు…

'డ్రగ్స్‌ విక్రయించడం, కలిగివుండడమే కాదు, వాటిని తీసుకున్నా నేరం చేసినవారే అవుతారు..' 

– తెలంగాణ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ 

'డ్రగ్స్‌ విక్రయించడం, కలిగి వుండడమే నేరం. వాటిని తీసుకున్నవారు నేరస్తులు కారు, బాధితులవుతారు..' 

– తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. 

ఇంతకీ, ఏది నిజం.? డ్రగ్స్‌ కలిగి వుండడం, విక్రయించడం మాత్రమే నేరమా.? డ్రగ్స్‌ని సేవించడం కూడా నేరమేనా.? తెలంగాణ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సినీ పరిశ్రమకు చెందిన 12 మంది వ్యక్తులకు డ్రగ్స్‌ కేసులో నోటీసులు పంపించడంతో 'కలకలం' రేగింది. మామూలుగా, డ్రగ్స్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు అరెస్టుల పర్వం నడిచినా, సినీ పరిశ్రమకీ డ్రగ్స్‌కీ 'లింక్‌' దొరికిన ప్రతిసారీ పెద్దయెత్తున 'రచ్చ' జరుగుతుంటుంది. ఇప్పుడూ అదే జరిగింది. 

గతంతో పోల్చితే, ఈసారి ఏకంగా 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు అందడం, మరికొంతమంది పెద్దలకు డ్రగ్స్‌తో లింకులున్నాయంటూ సాక్షాత్తూ తెలంగాణ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ ప్రకటించడంతో దుమారం మరింత ముదిరి పాకాన పడింది. అప్పట్లో ఆయన ఆ పెద్దల పేర్లు చెప్పడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. 

ఎలాగైతేనేం, 'అంతా ఉత్తదే' అన్నవారూ విచారణకు హాజరయ్యారు. అయితే, పూరి జగన్నాథ్‌ విచారణ ప్రారంభానికి ముందు వున్నంత 'హాట్‌నెస్‌', ఆ తర్వాత అంటే ఛార్మి న్యాయస్థానాన్ని ఆశ్రయించాక లేకుండా పోవడం ఆశ్చర్యకరమే. చివరికొచ్చేసరికి మొత్తం వ్యవహారం నీరుగారిపోయింది. ఆగండాగండీ, నీరుగారిపోయిందంటే మళ్ళీ అధికారులకి కోపమొచ్చేస్తుంది. కానీ, అకున్‌ సబర్వాల్‌ మాటలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి మాటలొచ్చాక, కేసు నీరుగారిపోయిందనక, ఇంకేమనాలి.? 

మొత్తమ్మీద, 12 మంది సినీ ప్రముఖుల విచారణ పూర్తయ్యింది. ఇప్పుడిక రెండో లిస్ట్‌ వుంటుందా.? లేదా.? ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. 'డ్రగ్స్‌ తీసుకున్నవారినీ నిందితులుగానే చూడాలి..' అంటూ పలువురు రాజకీయ ప్రముఖులు హడావిడి షురూ చేసేశారు. ఏ చిన్న ఛాన్స్‌ దొరికినా అధికారపక్షంపై విరుచుకుపడ్డం విపక్షాలకు మామూలే. మరి, విపక్షాల డిమాండ్లకు తలొగ్గి, డ్రగ్స్‌ తీసుకున్నవారూ నిందితులే అవుతారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త పల్లవి అందుకుంటారా.? అందుకుంటే మాత్రం, 'ఉడ్తా టాలీవుడ్‌'లో సెకెండ్‌ ఎపిసోడ్‌ చూడాల్సి రావొచ్చు. 

చూద్దాం.. ఈ కేసు ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో.. అసలంటూ ములుపులు తిరుగుతుందో లేదో.!