పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన హీరో

కన్నడ హీరో కిచ్చా సుదీప్ ఆఖరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నాడు. తను భారతీయ జనతా పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశాడు. అంతేకాదు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తను పోటీ చేయడం లేదని కూడా…

కన్నడ హీరో కిచ్చా సుదీప్ ఆఖరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నాడు. తను భారతీయ జనతా పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశాడు. అంతేకాదు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తను పోటీ చేయడం లేదని కూడా ప్రకటించాడు. అయితే తను బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్టు, రాబోయే ఎన్నికల్లో ప్రచారం కూడా చేయబోతున్నట్టు తెలిపాడు.

ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తో కలిసి మీడియా ముందుకొచ్చాడు సుదీప్. బొమ్మైతో తన సాన్నిహిత్యాన్ని బయటపెట్టిన సుదీప్, ఆయన కోసం పార్టీకి ప్రచారం చేయబోతున్నట్టు తెలిపాడు.

ఆఖరి నిమిషంలో యూటర్న్

నిజానికి ఈరోజు ముఖ్యమంత్రి సమక్షంలో కాషాయ కండువా కప్పుకోవాలి సుదీప్. ఈ మేరకు ఆయన మేనేజర్ స్వయంగా అన్ని మీడియా సంస్థలకు సమాచారం అందించారు. అయితే ఆఖరి నిమిషంలో ఆ నిర్ణయం నుంచి వెనక్కి తప్పుకున్నాడు సుదీప్.

ఆయన పార్టీలో చేరుతారనే వార్త బయటకొచ్చిన వెంటనే, ఓ గుర్తుతెలియని ఉత్తరం బహిర్గతమైంది. అందులో సుదీప్ కు బెదిరింపులున్నాయి. సుదీప్ కు చెందిన ప్రైవేట్ వీడియోలు, అభ్యంతరకర ఫొటోల్ని సోషల్ మీడియాలో విడుదల చేస్తామని ఆ లేఖలో ఉంది.

దీనిపై వెంటనే సుదీప్ మేనేజర్ జాక్ మంజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ లేఖ బయటకొచ్చిన వెంటనే, సుదీప్ తన నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. తను బీజేపీలో చేరనని, కేవలం ప్రచారం మాత్రం నిర్వహిస్తానని, ఆయన ముఖ్యమంత్రి సమక్షంలో వెల్లడించారు.

కిచ్చా సుదీప్ కు కన్నడనాట భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా ఓ ప్రభావవంతమైన వర్గానికి చెందిన వ్యక్తి అతడు. అందుకే అతడి పొలిటికల్ ఎంట్రీపై చాలా చర్చ నడిచింది. మే 10న కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.