గీతా ఆర్ట్స్ అంటే అల్లు అరవింద్.. జీఏ-2 (గీతా ఆర్ట్స్ 2) అంటే బన్నీ వాస్. మొన్నటివరకు ఈ లెక్క, తండేల్ నుంచి మరో లెక్క.
గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ పై నిర్మాతగా అల్లు అరవింద్ పేరు కాకుండా, బన్నీ వాస్ పేరు పడింది. ‘అల్లు అరవింద్ ప్రజెంట్స్’ అని మాత్రమే ఉంది. దీనికి వెనక కారణం ఏంటి?
గీతా ఆర్ట్స్ ను తర్వాతి తరానికి అందించే సమయం వచ్చిందంటున్నారు అరవింద్. గట్టిగా ఎవరైనా డిమాండ్ చేస్తే తప్ప, ఇకపై తన బ్యానర్ లో నిర్మాతగా తన పేరు వేసుకోనని ఆయన ప్రకటించారు.
“నిర్మాతగా చాలా సినిమాలు చేశాను. సక్సెస్ ఫుల్ జర్నీ నాది. ఇప్పుడు గీతా ఆర్ట్స్ లో నా స్థానం మిగతా వాళ్లకు ఇచ్చే సమయం వచ్చింది. నా తర్వాత గీతా ఆర్ట్స్ లో బన్నీ వాసు, విద్యా మాధురి ఉన్నారు. ఏదైనా సినిమాకు నిర్మాతగా నా పేరు మాత్రమే ఉండాలని భారీ డిమాండ్ వస్తే తప్ప, ఇకపై నా పేరు వేసుకోను. అందుకే నా స్థానాన్ని బన్నీ వాసుకు ఇచ్చేస్తున్నాను.”
ఒక విధంగా చెప్పాలంటే అల్లు అరవింద్ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. నిర్మాతగా తన వారసత్వాన్ని ఆయన బన్నీ వాస్ కు ఇచ్చినట్టయింది. బన్నీ వాస్ ను ఆయన ఎంత నమ్ముతారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.
బన్నీ వాస్ ను తను కేవలం ఓ ఉద్యోగిగా చూడనంటున్నారు అల్లు అరవింద్. తనకు ఏదైనా సలహా కావాల్సి వస్తే వెంటనే బన్నీ వాస్ ను అడుగుతానని అన్నారు. తండేల్ విషయానికొస్తే, ఈ కథను బన్నీ వాస్ తెచ్చాడని, అతడే డెవలప్ మెంట్ లో ఉన్నాడని, పైగా నాగచైతన్యకు కూడా మంచి ఫ్రెండ్ అని, అందుకే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాతగా బన్నీ వాస్ పేరును తండేల్ సినిమా నుంచే మొదలుపెడుతున్నట్టు ప్రకటించారు.