మళ్లీ హైకోర్టుకు బన్నీ

ఈ కేసుపై రేపోమాపో అల్లు అర్జున్ ను కూడా పోలీసులు విచారించబోతున్నారనే ఊహాగానాల మధ్య, బన్నీ కూడా హైకోర్టును ఆశ్రయించాడు

హీరో అల్లు అర్జున్ మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తనపై నమోదుచేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాల్సిందిగా హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు బన్నీ.

పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా ఫ్యాన్స్ తో కలిసి సినిమా చేసేందుకు సంధ్య థియేటర్ కు వచ్చాడు అల్లు అర్జున్. విపరీతంగా జనం రావడంతో షో మధ్యలోనే వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోతూ ఫ్యాన్స్ కు అభివాదం చేశాడు.

ఆ క్రమంలో థియేటర్ వద్ద భారీ తొక్కిసలాట జరిగింది. ఆ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా.. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

ఫిర్యాదు ఆధారంగా సంధ్య థియేటర్ యజమాని, జనరల్ మేనేజర్ తో పాటు, సెక్యూరిటీ మేనేజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

దీనిపై సంధ్య థియేటర్ యాజమాన్యం ఇప్పటికే కోర్టుకెక్కింది. జరిగిన తొక్కిసలాటతో తమకు ఎలాంటి ప్రమేయం లేదని, ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతినిచ్చిందంటూ పిటిషన్ లో పేర్కొంది. అయినప్పటికీ తమ బాధ్యతగా బందోబస్తు కల్పించామని కోర్టుకు విన్నవించారు.

ఈ కేసుపై రేపోమాపో అల్లు అర్జున్ ను కూడా పోలీసులు విచారించబోతున్నారనే ఊహాగానాల మధ్య, బన్నీ కూడా హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోర్టును కోరాడు.

ఏపీ ఎన్నికల టైమ్ లో నంధ్యాల వెళ్లిన సందర్భంలో, ఎలక్షన్ కోడ్ ను అతిక్రమించాడంటూ బన్నీపై కేసు నమోదైంది. హైకోర్టు చొరవతో ఆ కేసు నుంచి గత నెల్లోనే బయటపడ్డాడు బన్నీ. ఇప్పుడు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుతో మరోసారి ఆయన హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

4 Replies to “మళ్లీ హైకోర్టుకు బన్నీ”

Comments are closed.