షాకులెక్కువ.. సక్సెస్ లు తక్కువ

మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఫ్లాప్ అవ్వగా.. ఏమాత్రం అంచనాల్లేకుండా వచ్చిన కమిటీ కుర్రోళ్లు, ఆయ్ సినిమాలు సక్సెస్ సాధించాయి.

ఆగస్ట్ లో 37 సినిమాలొచ్చాయి. ఎప్పట్లానే ఈసారి కూడా చేదు ఫలితాలే. భారీ అంచనాలతో వచ్చిన డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన 2 చిన్న సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఓవరాల్ గా ఆగస్ట్ నెలలో షాకులెక్కువ.. సక్సెస్ లు తక్కువ.

మొదటివారం ఏకంగా 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రాజ్ తరుణ్ నటించిన తిరగబడరాసామీ సినిమాతో పాటు, దర్శకుడు విజయభాస్కర్ కొడుకు నటించిన ఉషా పరిణయం, వరుణ్ సందేశ్ నటించిన విరాజి, అశ్విన్ చేసిన శివం భజే, అల్లు శిరీష్ బడ్డీ సినిమాలొచ్చాయి.

ఈ సినిమాలన్నింటికీ గట్టిగా ప్రచారం చేశారు. కానీ ఆడియన్స్ థియేటర్లకు రాలేదు. దీంతో ఈ సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్స్ గా మిగిలాయి. అల్లు శిరీష్ నటించిన బడ్డీ కోసమైతే అమాంతం టికెట్ రేట్లు తగ్గించినా ఫలితం దక్కలేదు.

రెండో వారమైతే ఏకంగా 10 సినిమాలొచ్చాయి. మూడోవారంలో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలు ఉండడంతో.. సింబా, సంఘర్షణ, కమిటీ కుర్రోళ్లు, తుఫాన్, భవనమ్ లాంటి సినిమాలన్నింటినీ రెండోవారమే రిలీజ్ చేశారు.

వీటిలో కమిటీ కుర్రోళ్లు సినిమా హిట్టయింది. నిహారిక నిర్మించిన ఈ సినిమాకు ప్రమోషన్ కలిసొచ్చింది. ఈ సినిమా కోసం నిహారిక తన పరిచయాలన్నీ వాడేసింది. దీనికితోడు కంటెంట్ కూడా కనెక్ట్ అవ్వడంతో కమిటీ కుర్రోళ్లు, బ్రేక్ ఈవెన్ సాధించగలిగారు. విజయ్ ఆంటోనీ చేసిన తుపాన్ తో పాటు సింబా లాంటి మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.

ఇక పంద్రాగస్టు కానుకగా డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలపై అంచనాలున్నాయి. ఎందుకంటే హరీశ్-రవితేజ కాంబోలో మిస్టర్ బచ్చన్ రాగా.. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వచ్చింది.

కానీ ఆశ్చర్యంగా ఈ రెండూ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. రీమేక్ పేరిట మిస్టర్ బచ్చన్ ను రీమిక్స్ చేసి పడేశాడు హరీశ్ శంకర్. ఆ తర్వాత ట్రిమ్మింగ్ చేసినా ఫలితం శూన్యం. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. అటు డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఈ సినిమా సక్సెస్ తో కోలుకోవాలని చూసిన పూరి జగన్నాధ్, రామ్ ఆశలు గల్లంతయ్యాయి. డబ్బింగ్ మూవీ తంగలాన్ కూడా తెలుగులో ఫ్లాప్.

ఆశ్చర్యంగా ఆగస్ట్ 15 బరిలో నిలిచిన ఆయ్ సినిమా హిట్టయింది. తక్కువ బడ్జెట్ లో తీసి, పక్కా ప్రమోషన్ తో రిలీజ్ చేసిన ఈ సినిమా థియేటర్లలో ఆడియన్స్ కు నవ్వులు పంచింది. నార్నె నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాతో నిర్మాత బన్నీ వాసు సక్సెస్ కొట్టాడు.

ఆ తర్వాత వారం మారుతీనగర్ సుబ్రమణ్యం రిలీజైంది. రావు రమేష్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా కూడా ఓ మోస్తరుగా ఆకట్టుకొని, థియేటర్లలో నవ్వులు పూయించింది. ఈ మూవీతో పాటు వచ్చిన యజ్ఞ, రేవు లాంటి సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.

ఆగస్ట్ చివరి వారంలో సరిపోదా శనివారం రిలీజైంది. నాని హీరోగా నటించిన ఈ సినిమానే, నెల మొత్తానికి పెద్ద సినిమా. 29న రిలీజైన ఈ సినిమా రిజల్ట్ అప్పుడే చెప్పలేం. ఎందుకంటే, సినిమా బాగుందంటున్నారు కొంతమంది. మరికొంతమంది లెంగ్త్ ఇష్యూ అంటున్నారు. ఓవైపు టాక్ ఇలా నడుస్తుంటే, రెండో రోజుకు ఆక్యుపెన్సీ తగ్గింది. మూడో రోజు వర్షాలు దెబ్బేశాయి. ఫైనల్ రిజల్ట్ తెలియాలంటే మరో 2 రోజులు ఆగాలి.

స్ట్రయిట్ రిలీజెస్ తో పాటు.. ఆగస్ట్ లో రీ-రిలీజ్ లు కూడా సందడి చేశాయి. మహేష్ నటించిన మురారి, చిరంజీవి ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలు మళ్లీ వచ్చాయి. రీ-రిలీజ్ లో ఇవి హిట్టయ్యాయా, ఫ్లాప్ అయ్యాయా అనే చర్చ అనవసరం. ఈ సినిమాలతో ఆయా హీరోల ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

ఓవరాల్ గా ఆగస్ట్ నెలలో కచ్చితంగా హిట్టవుతాయనుకున్న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఫ్లాప్ అవ్వగా.. ఏమాత్రం అంచనాల్లేకుండా వచ్చిన కమిటీ కుర్రోళ్లు, ఆయ్ సినిమాలు సక్సెస్ సాధించాయి.

13 Replies to “షాకులెక్కువ.. సక్సెస్ లు తక్కువ”

  1. రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ వార్తలను కూడా పట్టించుకోవాలని Editor గారికి నా మనవి.

Comments are closed.