వీకెండ్ వస్తే థియేటర్లకు వెళ్లాలనుకునే ప్రేక్షకులు ఎక్కువమంది. అందుకే వారం మొత్తం ఈగలు తోలుకునే థియేటర్లు, వారాంతం వచ్చేసరికి కళకళలాడతాయి. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ వారాంతం ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఆదివారం సినిమాకెళ్దామంటే ఒక్కటంటే, ఒక్క సినిమా కూడా లేదు.
మొన్న శుక్రవారం.. విమానం, టక్కర్, అన్ స్టాపబుల్ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒక్కటి కూడా ఆకట్టుకునేలా లేదు. అంతకుముందు వారం రిలీజైన నేను స్టూడెంట్ సర్, అహింస లాంటి సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. అంతకంటే ముందు వారం రిలీజైన మేమ్ ఫేమస్, మళ్లీ పెళ్లి సినిమాలు ఎప్పుడో దుకాణం సర్దేశాయి.
కాస్త క్లిక్ అయ్యాయనుకున్న బిచ్చగాడు-2, 2018 సినిమాల థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. వీటిలో 2018 సినిమా ఓటీటీలోకి సైతం వచ్చేసింది.
ఇలా గడిచిన 3 వారాలుగా సరైన సినిమా ఒక్కటి కూడా పడలేదు. దీంతో, ఈ వీకెండ్ బాక్సాఫీస్ వెలవెలబోతోంది. ఏదైనా సినిమాకెళ్దామని ఆసక్తి చూపించే ప్రేక్షకులు సైతం, మార్కెట్లో ఉన్న మూవీస్ చూసి వెనకడుగు వేస్తున్నారు. ఆదిపురుష్ వచ్చేవరకు పరిస్థితి ఇలానే ఉంటుంది.