రజనీకాంత్, కమల్ హాసన్.. ఈ ఇద్దరు సూపర్ స్టార్లు కలిసిన ప్రతిసారి కన్నులపండువగా ఉంటుంది. వివిధ సందర్భాల్లో వీళ్లు కలిశారు కూడా. అయితే ఈసారి ఓ అరుదైన సందర్భంలో వీళ్లు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2 సినిమా చేస్తున్నారు కమల్ హాసన్. ఇక జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 170వ సినిమా చేస్తున్నారు రజనీకాంత్. ఒకే స్టుడియోలో వీళ్లిద్దరి షూటింగ్స్ జరగడం, అలా షూటింగ్ స్పాట్ లో కలవడం అరుదైన కలయికగా మారింది. దీనికి చెన్నైలోని ప్రసాద్ స్టుడియో ఎరీనా వేదికగా మారింది.
ఇలా ఒకే లొకేషన్ లో కమల్, రజనీ షూటింగ్ చేసి 21 ఏళ్లయింది. మళ్లీ ఇన్నేళ్లకు, అంటే 2 దశాబ్దాల తర్వాత ఇద్దరూ ఒకే లొకేషన్ లో షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కమల్-రజనీ ఫ్రెండ్లీగా కలిశారు. ఫొటోలకు పోజులిచ్చారు. ఒకరికి ఒకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు.
తన షూటింగ్ స్పాట్‌కి సమీపంలోనే ఇండియన్-2 షూట్ జరుగుతోందని తెలిసుకున్న రజనీకాంత్.. మిత్రుడు కమల్‌హాసన్‌ని షూటింగ్ స్పాట్‌లో కలవటానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కమల్ హాసన్.. వెంటనే ఉదయం 8 గంటలకే రజనీకాంత్ షూటింగ్ స్పాట్‌కి వెళ్లి ‘నేను నా స్నేహితుడిని కలవడానికి వస్తున్నాను’ అంటూ సూపర్‌స్టార్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వటం విశేషం.