రివ్యూ: 24 కిస్సెస్
రేటింగ్: 1/5
బ్యానర్: సిల్లీ మోంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్, రెస్పెక్ట్ క్రియేషన్స్
తారాగణం: ఆదిత్ అరుణ్, హెబా పటేల్, రావు రమేష్, నరేష్, అదితి మ్యాకాల్ తదితరులు
సంగీతం: జోయ్ బారువా
కూర్పు: ఆలయం అనిల్
ఛాయాగ్రహణం: ఉదయ్ గుర్రాల
నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్
కథ, కథనం, దర్శకత్వం: అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి
విడుదల తేదీ: నవంబర్ 23, 2018
చిన్న పిల్లల సినిమాలు తీసే దర్శకుడికి తన తదుపరి చిత్రానికి బడ్జెట్ రాదు. ఫండింగ్ లేక 'పౌష్టికాహార లోపం' గురించి తీయాలనుకుంటోన్న తన కలల చిత్రాన్ని ఎలా తీయాలనేది అతనికి తోచదు. కమర్షియల్ సినిమా తీయమంటూ టీమ్ ఒత్తిడి తెస్తుంటారు. కానీ విలువలని చంపుకుని సినిమా తీయలేనంటాడు. '24 కిస్సెస్' కథానాయకుడు ఆనంద్ కథ ఇది. ఈ చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్‌కి ఈ పాత్ర ప్రతిబింబమేమో అనిపిస్తుంది. 'మిణుగురులు' చిత్రంతో అవార్డులు గెలుచుకున్న అయోధ్య కుమార్‌పై కమర్షియల్ సినిమా తీయాలనే ఒత్తిడిలోంచి '24 ముద్దులు' వచ్చాయా? వాణిజ్య పరమైన అంశాల కోసమని చొప్పించిన అడల్ట్ కంటెంట్ తన విలువలని ప్రశ్నిస్తోందనే సందిగ్ధంలో హీరోని ఛైల్డ్ యాక్టివిస్ట్‌గా చూపించాడా?
ఏ దర్శకుడికి అయినా ఎలాంటి సినిమా తీయాలనే దానిపై స్పష్టత కావాలి. అయితే, వాణిజ్య పరంగా ఆలోచించి డబ్బులు చేసుకోవడానికి చూడాలి. లేదా, విలువల వైపు నిలబడి ప్రయోజనాత్మక చిత్రాలపై దృష్టి పెట్టాలి. వెళితే రోడ్డుకి అటో ఇటో వెళ్లాలి కానీ… అటు, ఇటు కూడా వెళ్తాను అంటే ఆ ప్రయాణం ఇలాగే అడ్డదిడ్డంగా వుంటుంది. ఆ ప్రయత్నం ఈ విధంగా అధోగతి పాలవుతుంది. అమ్మాయిలతో శారీరిక వాంఛలు తీర్చుకుంటూ, ఎలాంటి కమిటెడ్ రిలేషన్ కోరుకోని వ్యక్తి… మరోవైపు బాలలు, వారి హక్కులు అంటూ మాట్లాడడం, విలువలు లేని సినిమాలు తీయనని చెబుతుండడం తనని తానే కాంట్రడిక్ట్ చేసుకున్నట్టు వుంది.
సెక్స్, సోషల్ అవేర్‌నెస్ రెండూ కలిపి ఒక కథలో నిక్షిప్తం చేయవచ్చుననే ఐడియానే సిల్లీగా అనిపిస్తుంది. ఒక వైపు కనీస అవసరాలు లేని పిల్లల కోసం తపించిపోయే హీరో, మరోవైపు స్త్రీ స్పర్శ కోసం పరితపించిపోయే టీనేజర్‌లా బిహేవ్ చేయడం చూస్తే 'చెప్పేవి శ్రీరంగ నీతులు…' సామెత చెప్పినట్టు అనిపిస్తుంది. వ్యాపార పరంగా డబ్బులు తెచ్చిపెడుతూనే మరోవైపు తను నమ్మే 'మిణుగురుల' నీతిని నిలిపే సినిమా ఎలా తీయాలనే అయోమయంలోంచి అయోధ్య కుమార్ తయారు చేసిన ఈ చిత్రం ఆద్యంతం గమ్యం లేకుండా అక్రమంగా సాగుతుంటుంది.
అసలు ప్రేమకథకి బేస్‌గా పెట్టుకున్న '24 కిస్సెస్' అనే టాపిక్కే గందరగోళంగా స్టార్ట్ అవుతుంది. యథాలాపంగా కథానాయకుడు ఆమె కురులని ముద్దాడితే… 'ముద్దు పెట్టారు కదా' అంటూ కన్‌ఫర్మ్ చేసుకుని వెళ్లి ముద్దుల గురించి గూగ్లింగ్ మొదలు పెడుతుంది. ఆమె పక్కనే వున్న అపరజ్ఞాని అసందర్భంగా 'ఇరవై నాలుగు ముద్దులు' అంటూ ఏదో క్లాస్ పీకడంతో ఆ ముద్దులని లెక్క పెట్టుకోవడం మొదలు పెడుతుంది. ఇంకా ఎలాంటి కెమిస్ట్రీనే లేకుండా సరాసరి ముద్దుల్లోకి వెళ్లిన వాడిని మామూలుగా అయితే మొహం పగలగొడతారు.
కానీ ఇక్కడ మాత్రం దానినే రొమాన్స్ అనుకోమంటారు. నెమ్మదిగా ఆ ముద్దులు హద్దులు దాటుకుంటూ కురులు, కంధరము దాటి ఫ్రెంచి కిస్, ఎస్కిమో కిస్‌గా ఎలా పరిణితి చెందుతాయనేది ఒకవైపు నడుస్తుంటుంది. మధ్యలో ఈ ముద్దుల తాలూకు వర్ణన, వివరణలతో తెరపిస్ట్‌తో (రావు రమేష్) కాలయాపన వుంటుంది. మరోవైపు బాలలు, వారు తాగాల్సిన నీళ్లు, తినాల్సిన గుడ్లు అంటూ 'ఎన్‌ఈసిసి' డాక్యుమెంటరీలాంటిది వస్తూ పోతుంటుంది. ఈలోగా చుంబనం నుంచి సంభోగము వరకు వెళ్లిపోయిన జంటకి తమ మధ్య వున్నది ఇష్టమో, ఆకర్షణో, ఆరాధనో కూడా ఇంకా తెలియకుండా పోతుంది.
ఇరవై మూడు ముద్దులతో పాటు సర్వం పూర్తయిన తర్వాత అతగాడి అసలు లక్షణాలని తెలుసుకుని బ్రేకప్ చెప్పి వెళ్లిపోయిన అమ్మాయితో ఆ ఇరవై నాలుగవ ముద్దుతో ఎలా శుభం కార్డు పడుతుందనేది కథ. ఇరవై మూడు ముద్దుల తర్వాత అతగాడికి వున్న అవలక్షణం తెలుసుకున్న కథానాయకి అతడిని ఛీత్కరించుకోవడమో లేదా దూరంగా పోవడమో చేయదు. ఆరు నెలల తర్వాత గడ్డం, జుట్టు పెంచుకుని వచ్చిన అతడికి ముప్పయ్ రోజుల పాటు సారీ చెప్పాలంటూ కండిషన్ పెడుతుంది.
అక్కడ్నుంచి ముప్పయ్ రోజుల సారీలు లెక్కపెట్టుకుంటూ గడువుకి ఇంకా వారం వుందనగానే ఐలవ్యూ అనేస్తుంది. అక్కడితో ఇరవై నాలుగో ముద్దు పెట్టేస్తే సినిమా అయిపోవాలి. కానీ అయోధ్యకుమార్‌కి అక్కడ మరో ఆలోచన వస్తుంది. శ్రీలక్ష్మి పరిణయానికి ముందు స్వయంవరం జరగాలంటూ త్రివిక్రమ్ రాసిన తొట్టెంపూడి వేణు సినిమాలోని కాన్‌ఫ్లిక్ట్‌ని అరువు తెచ్చుకోవడంతో కథ ఇంకో అరగంట ఆయుష్షు పెంచుకుని, అప్పటికే చావు బతుకుల్లో వున్న ప్రేక్షకుల సహనాన్ని సమూలంగా హరించేస్తుంది.
వివాహ వ్యవస్థ పట్ల నమ్మకం లేదని, పిల్లల్ని కనే హక్కు మనకి లేదని పిచ్చి వాదనతో కథ మళ్లీ మొదటికి వస్తుంది. ఇంతకీ పిల్లలు వద్దని ఎందుకంటున్నాడనే దానికో తలకు మాసిన కారణముంటుంది. అదేమిటో ఓపిక వుంటే తెర మీదే చూసుకోవాలి. అంతవరకు అయిన దానికీ కాని దానికీ ముద్దులు పెట్టేసుకున్న జంట ఆ ఇరవై నాలుగో ముద్దుని ఎలాగైతేనేం శుభం కార్డుకి ముందు పెట్టేసుకుంటుంది. ఈ మధ్యలో ఈ చిత్ర కథనం తిరిగినన్ని వంకర్లు తిరుమల రూట్లో కూడా వుండవేమో అనిపిస్తుంది.
డైరెక్టర్ ఐడియా ఆఫ్ హ్యూమర్ కూడా హాస్య గ్రంథులు ఆత్మహత్యకి పాల్పడే రీతిన సాగింది. నలుగురు మెయిన్ ఆర్టిస్టులు తక్క మిగతా వారి నట పటిమ చూడ్డానికి, చూస్తూ తెర చింపకుండా తమాయించుకోవడానికి భూదేవంత ఓర్పు అవసరం పడుతుంది. క్రౌడ్ ఫండింగ్‌తో హీరో తన కల నెరవేర్చుకోవడం సంగతేమో కానీ క్రౌడ్ పూలింగ్ చేసుకుని మరీ ఆత్మఘోష వెళ్లగక్కుకోవాల్సిన పరిస్థితి ప్రేక్షకులకి 24 కిస్సెస్ కల్పిస్తుంది.
బాటమ్ లైన్: 24 పెయిన్స్!
– గణేష్ రావూరి
తెలంగాణ రాజ్యానికి రాజు ఎవరో తెలుసా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్