Mazaka Review: మూవీ రివ్యూ: మజాకా

వెరైటీ కథ, వినోదాత్మక కథనం, కొంచెం యాక్షన్, ఫార్ములా పాటలు, కాస్తంత సెంటిమెంట్ కలగలిసిన ఈ చిత్రం

చిత్రం: మజాకా
రేటింగ్: 2.5/5
తారాగణం: సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అన్షు, అజయ్, మురళీ శర్మ, హైపర్ ఆది, సుబ్బరాయ శర్మ తదితరులు
సంగీతం: లియోన్ జేంస్
ఎడిటింగ్: చోట కె ప్రసాద్
కెమెరా: నిజార్ షఫీ
నిర్మాత: అనీల్ సుంకర, రాజేష్ దండ, ఉమేష్ బన్సాల్
దర్శకత్వం: నక్కిన త్రినాథ రావు
విడుదల: 26 ఫిబ్రవరి 2025

“ధమాకా” లాంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రం తర్వాత దర్శకుడు నక్కిన త్రినాథ రావు ఈ “మజాకా”తో ముందుకొచ్చాడు. సందీప్ కిషన్, రావు రమేష్ తండ్రీకొడుకులుగా కామెడీ చేసారని ట్రైలర్ ద్వారా అర్ధమయ్యింది. కమర్షియల్ ఫార్మాట్ లో వినోదాన్ని అశించే ప్రేక్షకులని టార్గెట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

రమణ (రావు రమేష్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రీకొడుకులు. ఆడదిక్కు లేని ఇంట్లో ఇద్దరూ బతుకుతుంటారు. భార్య చనిపోయిన తర్వాత రమణే కొడుకుని పెంచుతాడు. కొడుక్కి పెళ్లి సంబంధాల వేట మొదలుపెడతాడు. కానీ ఇద్దరూ మగవాళ్లే ఉండే ఇంటికి తమ అమ్మాయిని ఇవ్వమంటారు పెళ్లివాళ్లు. దాంతో ఒకరి సలహాతో ముందు తానొక పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వస్తాడు రమణ. ఆ ఆలోచనలో ఉండగా తనకి యశోద (అన్షు) తారసపడుతుంది. ఆమె ప్రేమలో పడతాడు. కృష్ణ తన కాలేజీలోనే చదివే మీరా (రీతూ) ప్రేమలో పడతాడు. అక్కడి నుంచి ట్విస్టులు, కథలో భార్గవ్ వర్మ (మురళీ శర్మ) పాత్ర ఎంటరవ్వడం జరుగుతాయి. ఎవరీ భార్గవ్ వర్మ? తండ్రీకొడుకుల ప్రేమాయణం ఏ టర్న్ తీసుకుంటుంది, ఎటు వెళ్లి ఎలా ముగుస్తుంది అనేది తెర మీద చూడాలి.

ఐడియా పరంగా కథ కొత్తగా ఉంది. ఈ కథని సెంటిమెంటల్ గా చెప్పొచ్చు, వినోదంగానూ మలచొచ్చు. రెండో రకమే సేఫ్ కనుక దర్శకుడు ఆ పంథా తీసుకుని రాసుకున్నాడు. అయితే ఆద్యంతం కడుపుబ్బ నవ్వేలే రాసుకోగలిగే స్కోప్ ఉన్నా చాలా సన్నివేశాల్లో రచన తేలిపోయింది. దర్శకుడు తీస్తున్నప్పుడు కొన్ని సీన్లు బాగా పేలతాయనే ఆలోచనతో తీసి ఉండొచ్చు. కానీ వాటిల్లో కొన్ని బలవంతంగానూ, పేలవంగానూ అనిపించాయి.

అలాగని నవ్వులు లేవని కాదు. అప్రయత్నంగా నవ్వు తెప్పించిన సన్నివేశాలు, ట్రాకులు కూడా ఉన్నాయిందులో. ముఖ్యంగా మురళీ శర్మ కేరెక్టరైజేషన్, నటన నవ్విస్తాయి. తనకు నచ్చని వాళ్లని చిన్న చిన్న విషయాలకే మర్డర్ చేయించేయమంటుంటాడు మురళీశర్మ. ఇది హాలీవుడ్ కామెడీ “డిక్టేటర్” నుంచి స్ఫూర్తి పొందినట్టు ఉంది.

ప్రధమార్ధంలో కథనం పడుతూ లేస్తూ సాగి ఇంటర్వెల్ టైం కి వినోదం పీక్స్ కి చేరింది. ద్వితీయార్ధం కూడా అంతే. కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి.

మళ్లీ కథ క్లైమాక్స్ వాతావరణంలోకి వచ్చేసరికి గాడిలో పడుతుంది. కథలో వేసుకున్న చిక్కుముడులు విడటం, సుఖాంతమవ్వడం జరుగుతుంది.

టెక్నికల్ గా చూసుకుంటే సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. రెండు పాటలు మాత్రం ఓకే. చాలా రొటీన్ గా ఉంది తప్ప కథనాన్ని మరింత ఎంగేజింగ్ గా చేయడానికేమీ తోడ్పడలేదనిపించింది. పాటలు కూడా క్యాచీగా లేవు.

కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ కూడా ఇబ్బంది పెట్టలేదు. రచన పరంగా స్క్రీన్ ప్లేలో పట్టు కనపడింది.

సందీప్ కిషన్ తన రొటీన్ పద్ధతిలో చేసుకుపోయాడంతే. సిచువేషనల్ కామెడీయే తప్ప తన పర్ఫార్మెన్స్ తో కామెడీని పండించిన పరిస్థితి మాత్రం లేదు.

రావు రమేష్ నటనతో ఆకట్టుకున్నాడు. ఓల్డ్ ఏజ్ లో యంగ్ వైబ్స్ వస్తే ఎలా ఉంటుందో ఆసక్తికరంగా నటించి మెప్పించాడు.

మురళీ శర్మ పాత్ర తీరు, నటన బాగున్నాయి.

అన్షు చాలా ఏళ్ల తర్వాత తెర మీదకు వచ్చింది. చూడడానికి అందంగా ఉంది, నటన కూడా సరైన పాళ్లల్లో చేసి ఒప్పించింది.

రీతూ వర్మ నటనపరంగా ఓకే. మునుపటి సినిమాల్లోలా కాకుండా కాస్తంత చబ్బీగా ఉంది.

ఒకటి రెండు సీన్స్ లో ఇన్స్పెక్టర్ గా కనిపించిన అజయ్ కూడా నవ్వించాడు.

హైపర్ ఆది పంచులు మాత్రం తడిసిపోయిన దీపావళి టపాసుల్లా ఉన్నాయి..అస్సలు పెలలేదు. అతని తరహా కామెడీ పంచులు రొటీనైపోతూ బోర్ కొట్టే స్టేజ్ కి వచ్చాయి.

హైపర్ ఆదిని పెళ్లివాళ్లు కొట్టే సీన్, శవం దగ్గర రావురమేష్ చేసే సీన్ చాలా ఫోర్స్డ్ గా ఉన్నాయి. నవ్వించకపోగా విసిగించాయి. అలాగే లేచిపోయే సన్నివేశం కూడా సరిగ్గా సింకవ్వలేదు.

అలా అక్కడక్కడా బోర్ కొట్టే సీన్లు, డ్రాప్ అయినట్టు అనిపించే సీన్లున్నా క్షమిస్తూ..నిజంగా నవ్వించిన ఫార్స్ కామెడీ తరహా సీన్స్ ని ఎంజాయ్ చేస్తూ కూర్చోగలిగేవాళ్లకి ఈ చిత్రం ఇబ్బంది పెట్టదు.

నక్కిన త్రినాథరావు సినిమాల్ని చూసిన వాళ్లకి తన కామెడీ టైమింగ్ పట్ల అంచనాలు ఎక్కువుంటాయి. వాటిని పూర్తిగా మ్యాచ్ చేసిన చిత్రం కాదిది.

చివరిగా చెప్పేదేంటంటే..వెరైటీ కథ, వినోదాత్మక కథనం, కొంచెం యాక్షన్, ఫార్ములా పాటలు, కాస్తంత సెంటిమెంట్ కలగలిసిన ఈ చిత్రం పండగ సెలవల్లోనో, వేసవి సీజన్లోనో వచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నప్పే చిత్రం. డిసెంబర్ మూడో వారంలో వచ్చిన “ధమాకా” కి అదే కలిసొచ్చింది. ప్రస్తుతానికి ఆ వాతావరణం లేదు. అతిగా అంచనాలు పెట్టుకోకుండా కాలక్షేపం కోసం చూడాలనుకుంటే ప్రయత్నించొచ్చు. మరీ పర్ఫెక్ట్ నాన్ స్టాప్ కావాలంటే మాత్రం కష్టం.

బాటం లైన్: కొంచెమే మజా

8 Replies to “Mazaka Review: మూవీ రివ్యూ: మజాకా”

  1. Nee reviews lo pasa taggi poyindi, idi varakati la creative ga undatam ledu, idi varaku ilanti movies ni cheelchi chendade vadivi, neeku payment baaga mudutundi ee madya, Game changer appude ardam ayyindi, nuvu payments teesukuki review isthavani

  2. Maikhel tho hero mida ,dhamaka tho trinadhrao mida hope poyindi epdo ..dhamaka raviteja performance kosam chudachu , maikel vijay sethupati kosam chudachu ayna kuda maikel nirasapadatam

Comments are closed.