సినిమాలకు సంబంధించి ఏ మేరకు తన ప్రమేయం ఉంటుంది, ఏ మేరకు తను జోక్యం చేసుకుంటాననే అంశాలపై హీరో సిద్ధు జొన్నలగడ్డ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో చాలా తెలివిగా మాట్లాడిన సిద్ధూ.. ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.
టిల్లూ స్క్వేర్ సినిమాకు సిద్ధూనే రచయిత. కాబట్టి ఈ మూవీకి సంబంధించి ప్రతి అంశంలో తన ప్రమేయం-జోక్యం రెండూ ఉన్నాయని స్పష్టం చేశాడు. ఆఖరి నిమిషం వరకు మార్పుచేర్పులు చేశామని, అమెరికాకు కాపీ పంపించే ముందు కూడా 2 డైలాగ్స్ జోడించానని చెప్పారు.
టిల్లూ స్క్వేర్ పూర్తిగా తన సినిమా కాబట్టి రైటింగ్, మేకింగ్ లో పూర్తి స్వేచ్ఛ తీసుకున్నానని.. ప్రతి సన్నివేశాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని, తిరిగి రీషూట్స్ కు వెళ్లామని అన్నారు.
ప్రస్తుతం ఈ హీరో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో మాత్రం తన జోక్యం ఉండదని, కేవలం ప్రమేయం మాత్రమే ఉంటుందని తెలిపారు. బొమ్మరిల్లు భాస్కర్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కు తను వెళ్లలేదని, క్యారెక్టర్ పై దర్శకుడికి ఓ విజన్ ఉంటుందని, దాన్ని ఫాలో అవ్వడం హీరోగా తన పని అని స్పష్టం చేశారు.
నీరజ కోన సినిమా పూర్తిస్థాయి ప్రేమకథగా వస్తోందని.. అందులో మంచి పాత్ర చేస్తున్నానని తెలిపిన సిద్ధు జొన్నలగడ్డ.. అందరి ఆలోచనలు, అభిప్రాయాల్ని లెక్కలోకి తీసుకొని ముందుకెళ్తున్నానని అన్నారు. పారితోషికం పరంగా ప్రస్తుతం తను మంచి పొజిషన్ లోనే ఉన్నానని కూడా క్లారిటీ ఇచ్చారు.