కూటమి పొత్తు వికటిస్తోందన్న సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. మరీ ముఖ్యంగా అధికారంలోకి వస్తామన్న ధీమా, భరోసా టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో క్రమంగా సడులుతోంది. పొత్తు అధికారంపై భరోసా ఇవ్వడానికి బదులు, అందుకు విరుద్ధంగా భయాన్ని, అధైర్యాన్ని కలిగిస్తోంది. అనవసరంగా పొత్తు పెట్టుకున్నామేమో అనే ఆందోళన టీడీపీ నాయకులు, కార్యకర్తలను వెంటాడుతోంది.
పొత్తుతో తమకు తాము మరణ శాసనం రాసుకున్నామనే భావన టీడీపీలో ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూటమిలో అసమ్మతుల రాగాలాపనే. ముఖ్యంగా బీజేపీతో పొత్తు టీడీపీని చావు దెబ్బ తీస్తుందనే నిర్ణయానికి ఆ పార్టీ నాయకులు వచ్చారు. చివరికి పరిపూర్ణానందస్వామి లాంటి వారు కూడా బీజేపీతో పొత్తు టీడీపీని అధికారానికి దూరం చేస్తోందని బహిరంగంగానే మాట్లాడుతున్నారు.
చంద్రబాబునాయుడు అనుకున్నదొకటి, అమలవుతోంది మరొకటి అని చెప్పక తప్పదు. సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబునాయుడు తన రాజకీయ చరమాంకంలో తప్పటడుగులు వేస్తున్నారని సొంత పార్టీ కేడర్ అభిప్రాయపడడం గమనార్హం. అసలు పొత్తు కుదుర్చుకోవాలన్న ఆలోచనలోనే అర్థం లేదని చాలా అంటున్నారు. ఎందుకంటే పొత్తు అంటే… ఒక బలమైన రాజకీయ పార్టీ, బలమైన పార్టీలతో అవగాహన కుదుర్చుకోవడం.
కానీ ఏపీలో జరిగింది ఏంటి? టీడీపీ బలహీనపడిందని, తాము లేకపోతే అసలు ఆ పార్టీ ఉనికికే ప్రమాదం పొంచి వుందని స్వయంగా జనసేనాని పవన్‌కల్యాణ్ బహిరంగంగానే చెప్పారు. జనసేన అంటే బలమైన పార్టీ అని పవన్‌కల్యాణ్‌తో పాటు ఆ పార్టీ నాయకుల నమ్మకం. అందుకే జనసేనకు ఎక్కువ సీట్లు వస్తాయని జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతో నమ్మకంటా ఉన్నారు.
మొదట 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు మాత్రమే దక్కడంతో జనసైన కార్యకర్తలు, నాయకుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీనికి కారణం … తాము లేనిదే జగన్‌ను చంద్రబాబు ఎదుర్కోలేరని, అలాంటిది తమకు చాలా తక్కువ సీట్లు ఇచ్చారనుకోవడమే. ఆ తర్వాత 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లకు జనసేన పరిమితం కావడంతో ఇరుపార్టీల మధ్య ఓట్ల బదిలీపై నీలి నీడలు అలుముకున్నాయి. మధ్యలో బీజేపీ కలిసింది. ఏపీలో రాజకీయంగా బీజేపీ బలహీనమైన పార్టీ కావచ్చు. కానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నది వ్యవస్థల మద్దతు కోసమని అందరికీ తెలిసిన సంగతే. ఆ కోణంలో చూస్తే బీజేపీ బలమైన పార్టీ.
ఇలా మూడు బలమైన పార్టీల మధ్య పొత్తు అంటే, ఒకే ఒరలో మూడు కత్తులు ఇమడడం ప్రకృతి విరుద్ధం. అందుకే ఏపీలో కూటమి ఏర్పాటు… జగన్‌కు రాజకీయంగా కలిసొస్తోందన్న వాతావరణం నెలకుంది. పొత్తులేమో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య. రాజకీయ లాభం మాత్రం వైసీపీకి అనే చర్చ నడుస్తోంది. చివరికి ఏమవుతుందో చూడాలి.