ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో నటుడు అలీ సమావేశం కావడం ఆసక్తిదాయకంగా మారింది. ఇటీవలి సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చలో పాల్గొన్న వారిలో అలీ ఉన్నారు. అప్పుడే అలీతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడారని, త్వరలోనే శుభవార్త వింటారని జగన్ వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి. అప్పుడే అలీకి రాజ్యసభ సభ్యత్వం ఖరారు అయ్యిందనే ప్రచారం ఊపందుకుంది.
తనతో మరోసారి వచ్చి కలవాలంటూ కూడా అప్పుడు అలీతో జగన్ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం రోజున అలీ తన కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం కావడం విశేషం. ఈ సమావేశంపై అలీ స్పందిస్తూ.. ఊహాగానాలు ఎలా ఉన్నా, వాటిపై పార్టీ కార్యాలయం నుంచినే స్పష్టత వస్తుందని అలీ వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేయమంటూ గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే పార్టీ నుంచి పిలుపు వచ్చిందని అలీ చెప్పారు. అయితే తను వృత్తిలో బిజీగా ఉండటంతో అందుకు ముందుకు రాలేదన్నారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వాన్నో మరో అంశాన్నో తను ఆశించడం లేదని అలీ అన్నారు. ఎలాంటి అప్ డేట్ ఉన్నా దానిపై పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వస్తుందంటూ అసలు విషయాన్ని చెప్పకుండానే అలీ దాటవేశారు.
గతంలో తెలుగుదేశం పార్టీ కి సన్నిహితుడిగా మెలిగారు అలీ. అప్పట్లోనే ప్రత్యక్ష పోటీ అంటూ కూడా ఉహాగానాలు వచ్చాయి. అయితే గత ఎన్నికల ముందు అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు.
పవన్ కల్యాణ్ కు సన్నిహితుడిగా ప్రచారం పొందినా, రాజకీయంగా మాత్రం అలీ పవన్ కు అసలేమాత్రం పడని జగన్ వెంట నిలవడం అప్పట్లోనే హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు గనుక అలీకి రాజ్యసభ సభ్యత్వం దక్కితే అది మరింత రాజకీయంగా హాట్ టాపిక్ కావడం ఖాయం.