చంద్రబాబు – జగన్: బుద్ధుల్లో తేడా అదే!

రాజకీయాల్లోకి ప్రతి వ్యక్తీ అధికారం కోసమే వస్తారు. కానీ, ప్రతి వ్యక్తీ ప్రజా సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నాం అని చెబుతూ ఉంటారు. అధికారం దక్కిన తర్వాత.. దాన్ని నిలబెట్టుకోవడం కోసం కొంతమేరకు…

రాజకీయాల్లోకి ప్రతి వ్యక్తీ అధికారం కోసమే వస్తారు. కానీ, ప్రతి వ్యక్తీ ప్రజా సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నాం అని చెబుతూ ఉంటారు. అధికారం దక్కిన తర్వాత.. దాన్ని నిలబెట్టుకోవడం కోసం కొంతమేరకు ప్రజాసేవ కూడా చేస్తూ ఉంటారు. కానీ.. మొదటి టార్గెట్ అధికారం మాత్రమే అనేది నిజం. అదేవిధంగా ఎన్నికల సీజను వచ్చినప్పుడు.. ప్రతి నాయకుడూ ప్రజలను ఆకర్షించడానికి అనేక మాటలు చెబుతూ ఉంటారు. ఇలాంటి ఆకర్షణీయమైన మాటలను కూడా తప్పుపట్టడం ద్వారా సాధించేది ఏమీ లేదు.

అయితే ఎవ్వరి మాటలు ఎలా ఉంటున్నాయి? ఎవరి మాటల్లో చిత్తశుద్ధి ఉంది? ఎవరి మాటల్లో నిజమైన ప్రజశ్రేయస్సు గురించిన కాంక్ష ఉంది.. అనేది మనమే జాగ్రత్తగా గమనించి తేల్చుకోవాలి. మరోరకంగా చెప్పాలంటే ఇలాంటి హామీలే ఆయా నాయకుల బుద్ధులను, ఆలోచన సరళిని, మోసాలను లేదా నిజాయితీని మనకు తేటతెల్లం చేస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం బాగా వేడెక్కుతున్న తరుణంలో.. ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రధానంగా తలపడుతున్న నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబునాయుడు ఎలాంటి మాటలు చెబుతున్నారో పరిశీలిద్దాం.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా.. తాను చేసిన సంక్షేమం ఆధారంగానే ఈ ఎన్నికలను ఎదుర్కోవాలని అనుకుంటున్నారు. ఆయన ప్రత్యర్థులు అయినా సరే.. ఒక్క విషయం మాత్రం ఒప్పుకుని తీరాలి. ‘‘మీ బిడ్డ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి మీ యింటిదాకా అందిఉంటే మాత్రమే మీరు ఓటు వేయండి. లేకపోతే ఓటు వేయనే వద్దు’’ అని చెప్పగల ధైర్యం, దమ్ము ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉన్నదా అనేది మనం ఎరగం. అలాంటి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ‘ఇంటింటికీ అభివృద్ధి’ అనే స్పష్టమైన ఎజెండాతో ఆయన ముందుకు వెళుతున్నారు.

చంద్రబాబునాయుడు విషయం వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. జగన్ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు మరికొంత మొత్తం జతచుసి.. ‘నేను మీకు ఎక్కువ డబ్బు ఇస్తాను’ మీరందరూ నాకు ఓటు వేయండి అని చెప్పండం తప్ప చంద్రబాబు మాటల్లో మరో ఆంతర్యం లేదు. ఆ రకంగా పేదల బతుకుల్ని వేలంపాటగా మార్చిన వ్యక్తి చంద్రబాబునాయుడు.

ఈ ఇద్దరు నాయకుల బుద్ధులను మనకు నిరూపించే మరో రెండు కీలకమైన అంశాలను కూడా గమనించాలి.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రప్రజలకు, భవిష్యత్తరాలకు కూడా కలిపి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందిస్తానని మాట ఇస్తున్నారు. ఇది కేవలం ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి చెబుతున్న ఉత్తుత్తి మాటగా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఈ అయిదేళ్ల పాలనలోనే ఆయన ఆ విషయాన్ని నిరూపించుకున్నారు.

నాడు -నేడు పనుల తర్వాత ఏపీలోని పాఠశాలలు ఎలా తయారయ్యాయో చూస్తే.. మనం ఆశ్చర్యపోతాం. కేవలం 30 నుంచి 50 మంది విద్యార్థులు ఉండే ప్రాథమిక పాఠశాలలో పక్కాగా పిల్లలకోసం మరుగుదొడ్లు, మినరల్ వాటర్ ప్లాంట్ అనేవి వస్తాయని అయిదేళ్ల ముందు ఏ ఒక్కరి ఊహకైనా అందేదేనా? ఈ రోజున ఏపీలో కార్పొరేట్ పాఠశాలలు అగ్గిపెట్టెల్లాంటి చీకటిగదుల్లో నడుస్తోంటే.. ప్రభుత్వ పాఠశాలలు ఉద్యానవనాల మధ్య వెలిసిన కుటీరాల్లాంటి వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి.

ఏపీలోని నిరుపేదలు ఉండే మారుమూల గ్రామాల్లోనూ, దళిత కాలనీల్లోనూ నడుస్తున్న పాఠశాలల్లో అక్కడి పసివాళ్లు కూడా అంతర్జాతీయ స్థాయి సిలబస్ లను అనుసరిస్తూ, ఇంగ్లిషు మీడియంలో చదువుకోగలరని ఇంకో పదేళ్ల తర్వాతనైనా ఏ ఒక్కరికైనా చిన్న ఆలోచన కలిగేదేనా? అలాంటి అద్భుతమైన రీతిలో విద్యారంగాన్ని సుసంపన్నం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

విద్యార్థుల చదువులకు దన్నుగా నిలవడం మాత్రమే కాదు, రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా డ్రాపవుట్స్ గా మారకూడదనే ఒక విశాల లక్ష్యంతో బడికి వెళ్లే పిల్లలందరి కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. విద్యారంగాన్ని సమగ్రంగా రూపురేఖలు మార్చడానికి కంకణం కట్టుకున్న ఇలాంటి మరో ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం ఎన్నడైనా చూసిందా? ఆ ముద్ర జగన్ కు మాత్రమే దక్కింది.

రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందిస్తానని ఆయన ప్రమాణం చేస్తున్నారు. అయిదేళ్ల కిందటితో పోలిస్తే ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. వాటిని కూడా కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దడానికి అడుగులు వేస్తున్నారు.

సామాన్యుడికి కూడూ గూడూ గుడ్డా తర్వాత.. అత్యంత ప్రాథమికమైన అవసరాలు విద్య, వైద్యం మాత్రమే. కూడూ గూడూ విషయంలో జగన్ సర్కారు ఎంత చిత్తశుద్ధితో ఉన్నదో అందరికీ తెలుసు. పేదల కోసం రేషన్ ద్వారా ఉచితంగానే నిత్యావసరాలు అందుతున్నాయి. పేదల సొంత ఇంటి కలను నిజం చేయడానికి లక్షల మందికి ఇంటిస్థలాలను మంజూరుచేసి, ఇళ్ల నిర్మాణానికి కూడా పూనుకున్న చరిత్ర మన రాష్ట్రంలో లేదు. వాటికి అదనంగానే జగన్ నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందేందుకు తన ప్రభుత్వం పూచీ ఉంటుందని నిరూపిస్తున్నారు.

అదే సమయంలో చంద్రబాబునాయుడు చెబుతున్న హామీ ఏమిటి? లేదా జగన్ కు ముందు అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఆయన నిరూపించుకున్న తీరు ఏమిటి? అయిదేళ్ల ముఖ్యమంత్రిగా.. రాజధాని అనే పేరుతో ఒక సామాజిక వర్గం ఆస్తుల విలువ పెరిగే కుట్రలు తప్ప, గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజలను ఒక మాయాప్రపంచంలో పెట్టడం తప్ప ఆయన చేసిన పని నిర్దిష్టంగా ఒక్కటి కూడా లేనేలేదు.

పోనీ ప్రస్తుతం ఎన్నికలకు తలపడుతూ ఆయన ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఆయన రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తానని ప్రమాణం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు చెప్పాల్సిన మాటేనా ఇది.

ఎక్కడైనా సరే.. నాయకులు ప్రజలను ఆకర్షించడానికి మద్యనిషేధం చేస్తాం అని ఎన్నికలప్పుడు చెబుతుంటారు. జగన్ కూడా 2019 ఎన్నికలకు పూర్వం అలాంటి మాటలు చెప్పారు. కానీ ఆయన అన్నరీతిగా సంపూర్ణ మద్యనిషేధం అనేది కార్యరూపంలోకి తేవడంలో విఫలం అయ్యారు. కానీ ప్రజలలో మద్యం అలవాటు పరిమితం కావడానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం దుకాణాల సంఖ్య తగ్గించారు. ప్రభుత్వ పరంగా మాత్రమే మద్యం విక్రయాలు చేపడుతున్నారు.

జగన్ అనుసరిస్తున్న మద్యం విధానం మీద సహజంగానే దండెత్తుతూ ఉండే విపక్షాలు, అందులో లోపాలు ఉంటే వాటి గురించి మాట్లాడవచ్చు. విమర్శించవచ్చు. దోపిడీ జరుగుతున్నదని అనవచ్చు. కానీ.. ఇదేం చోద్యం.. ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తానని పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా కూడా వెలగబెట్టి.. డెబ్భయి నాలుగేళ్ల వృద్ధనాయకుడు సెలవివ్వడం ఏమిటి? ఎంతటి ఖర్మ పట్టింది ఈ రాష్ట్రానికి? అధికారం మీది కాంక్షతో చంద్రబాబునాయుడు మతిచలించి మాట్లాడుతున్నారేమో అనికూడా మనకు అనిపిస్తుంది.

అధికారం కోసమే అందరు నాయకులూ ఎన్నికల ప్రచారంలో మాటలు వల్లిస్తుంటారు. మరి- నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తానంటున్న జగన్మోహన్ రెడ్డికి, నాణ్యమైన మద్యం అందిస్తా నన్నే ముఖ్యమంత్రిని చేయండి అంటున్న చంద్రబాబునాయుడికి తేడాను ప్రజలు గుర్తించగలరా? ప్రజలు మరీ చంద్రబాబునాయుడు అనుకుంటున్నంత అమాయకంగా ఉంటారా? ఈ రకమైన హామీలలోనే ఈ ఇద్దరు నాయకుల బుద్ధుల్లోని తేడాలు బయటపడిపోతున్నాయి. ప్రజలు తమ విచక్షణను ఉపయోగిస్తారు. నాయకుల బుద్ధికి తగినట్టుగానే తీర్పు చెబుతారు!