వారెవ్వా.. పవన్ స్టార్ క్యాంపెయినర్స్!

పార్టీలకు స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఎలా ఉండాలి? పార్టీలో అత్యంత సీనియర్లు, అత్యంత ప్రజాదరణ ఉన్నవాళ్లు, విధానాల గురించి మాట్లాడగలిగిన వాళ్లు, మేధావులు, ఎంతో బలమైన వ్యక్తులు అయి ఉండి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో…

పార్టీలకు స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఎలా ఉండాలి? పార్టీలో అత్యంత సీనియర్లు, అత్యంత ప్రజాదరణ ఉన్నవాళ్లు, విధానాల గురించి మాట్లాడగలిగిన వాళ్లు, మేధావులు, ఎంతో బలమైన వ్యక్తులు అయి ఉండి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయడం ఇష్టంలేనివాళ్లు లేదా ప్రత్యక్ష రాజకాయల్లో పోటీచేయడానికి రకరకాల కారణాల వల్ల అవకాశం దొరకని ముఖ్యులు స్టార్ క్యాంపెయినర్లుగా ఉండాలి.

కానీ పవన్ కల్యాణ్ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను చూస్తే.. ఆ పార్టీమీద, పవన్ కల్యాణ్ మీద జాలి కలుగుతుంది. టికెట్ ఆశించి పవన్ భజన చేస్తూ వచ్చిన వాళ్లకే ఈ హోదా కట్టబెట్టారని తెలిసిపోతుంది. సెలబ్రిటీ లాంటి హోదా ఉండే వాళ్లని ప్రచారానికి వాడుకోవడం వేరు. అలాగని, స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించడం వేరు. దీని వల్ల.. పార్టీ పరువు పోతుందనే ఆలోచన పవన్ కు కలిగినట్టు లేదు.

ఇంతకూ పవన్ తరఫున ఈ స్టార్ లు ఎవరో తెలుసా? పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, క్రికెటర్ అంబటి రాయుడు, డ్యాన్స్ మాస్టర్ జానీ, సినీ నటులు సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీను లట! ఏమిటి ఈ జట్టు! పవన్ కు చిన్నతనంగా అనిపించడం లేదా? అనేది పలువురి అనుమానం.

వీరిలో కొణిదెల నాగబాబును స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించడం నూటికి నూరుశాతం కరెక్టు. రేకెత్తిన వివాదాలు అన్నింటినీ పక్కన పెడితే.. నాగబాబు.. చాలా కాలంగా సామాజిక విషయాల మీద తన గళం వినిపస్తూ యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. తాను ప్రజాజీవితానికి దగ్గరగా ఉన్నాననే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగిస్తున్నారు.

అంబటి రాయుడుకు కూడా క్రికెటర్ గా స్టార్ క్యాంపెయినర్ గా ఆ స్థాయి ఉందని అనుకోవచ్చు. మరి మిగిలిన వారి సంగతి ఏమిటి?

సీరియల్ హీరోగా టాప్ గ్రేడ్ లో ఉండి.. సినిమాల్లోకి ఎంట్రీ తరువాత.. ఫేడ్ అవుట్ అయిపోయిన హీరో సాగర్, టీటీడీ భక్తి చానల్ కు అధిపతిగా జగన్ పదవిని కట్టబెడితే.. అక్కడి ఉద్యోగుల్ని లైంగికంగా వేధిస్తూ బూతు ఫోన్ కాల్స్ తో అడ్డంగా దొరికిపోయి ఆ పదవి పోగొట్టుకున్న లేకి మనిషి పృథ్వీ. పదవి పోయిన నాటినుంచి జగన్ ను తిడుతూ పవన్ పంచన చేరి ఇటు భజన చేస్తున్నాడు.

హైపర్ ఆది, గెటప్ శ్రీనులు పవన్ భక్తులు అన్నంత వరకు ఓకే. కానీ లేకి, థర్డ్ రేట్ కామెడీతో ప్రజలను అలరిస్తూ ఉండే ఈ బ్యాచ్ ప్రజాస్వామ్యంలో శాసనసభకు ఎన్నికలయ్యే వారి గురించి ప్రజలను ప్రభావితం చేయడానికి తగిన స్టార్ క్యాంపెయినర్ల హోదాలో ఉండడం అనేది చాలా సిగ్గుపడాల్సిన విషయం.

జనసేన పార్టీకి అభ్యర్థులకు గతిలేదని 21 సీట్లు వాటాగా దక్కితే సగం వరకు ఇతర పార్టీలనుంచి వలస వచ్చిన వారికి మాత్రమే కట్టబెట్టారని అందరికీ తెలుసు. అభ్యర్థులకు గతిలేని పార్టీకి.. పార్టీ గురించి నాలుగు మంచి మాటలు చెప్పే సీనియర్ల, ప్రజల్లో ఆదరణ గల వ్యక్తులకు కూడా దిక్కులేదని ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితా చూస్తే అర్థమవుతోంది.