జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పవన్‌కల్యాణ్ అన్న నాగబాబు తనకు చాలా రాజకీయ జ్ఞానం వుందని అనుకుంటుంటారు. అందుకే ఆయన ఆవేశంలో సోషల్ మీడియాలో వివాదాస్పాద పోస్టులు పెడుతుంటారు. విమర్శలు వెల్లువెత్తగానే వాటిని తొలగించడం కొత్తేమీ కాదు. గతంలో గాంధీజీని చంపిన గాడ్సేని దేశ భక్తుడిగా అభివర్ణించిన గొప్ప నాయకుడు నాగబాబు. ఇది నాగబాబు వ్యక్తిగత అభిప్రాయం అని అప్పట్లో పవన్‌కల్యాణ్ ప్రకటించుకోవాల్సి వచ్చింది.
తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై హత్యాయత్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ సీఎంలు స్టాలిన్, మమతాబెనర్జీ తదితరులు ఖండించారు. ఇంకా పలువురు ప్రముఖులు ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో తగవని హితవు చెప్పారు. అయితే నాగబాబుకు మాత్రం జగన్‌పై దాడి …అంతా స్క్రిప్ట్‌గా కనిపించడం గమనార్హం. బహుశా సినిమా రంగం నుంచి రావడంతో ఆయన ఆ దృష్టితోనే చూసినట్టు ఉన్నారు. పోనీ తన పోస్టుపై కట్టుబడి వుండింటే… మంచోచెడో అదో గౌరవంగా వుండేది. కానీ విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన గత రాత్రి చేసిన పోస్టును డిలీట్ చేసి, జగన్‌పై ఎంతో గౌరవాన్ని ప్రదర్శిస్తూ హత్యాయత్నాన్ని ఖండించడం చర్చనీయాంశమైంది.
అయితే జగన్‌పై హత్యాయత్నాన్ని అవహేళ చేస్తూ నాగబాబు పోస్టుపై కడుపు మండిన వైసీపీ అధికార ప్రతినిధి పసుపులేటి సందీప్ రాయల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఆ పోస్టు నాగబాబు కుటుంబానికి సంబంధించి సున్నిత వ్యక్తిగత వ్యవహారం కావడం గమనార్హం. సందీప్ రాయల్ పోస్టుతోనే నాగబాబు తన పోస్టును డిలీట్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాగబాబు రెండు పోస్టుల గురించి తెలుసుకుందాం.
గత రాత్రి 11.15 గంటలకు ఎక్స్ వేదికగా నాగబాబు చేసిన ట్వీట్ ఏంటంటే..
“చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావ్ మైక్… అస్సలు Scriptedలా అనిపించట్లేదు” అని నాగబాబు తన అజ్ఞానాన్ని, రాజకీయ అపరిపక్వతను చాటుకున్నారు. ఈ ట్వీట్‌పై దారుణమైన కామెంట్స్ వచ్చాయి. దీంతో ఆ ట్వీట్‌ను తొలగించి ఆదివారం (ఇవాళ) ఉదయం 10.10కి చేసిన ట్వీట్ ఏంటో చూద్దాం.
“జగన్ మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి అప్రజాస్వమిక చర్య. జనసేన ప్రధాన కార్యదర్శిగా నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలుండచ్చు. కాని ఇలా భౌతికంగా దాడి చేయడం హేయమైన చర్య, చట్టరీత్యా నేరం. పోలీసు వారు ఈ దాడికి పాల్పడిన దుండగులకి కఠిన శిక్ష వేయాలని, మరోమారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను…” అని పోస్టు పెట్టారు.
ఇదేదో ముందే పెట్టి వుంటే హుందాగా, గౌరవంగా ఉండేది. అభ్యంతకర పోస్టు పెడితే, అటు వైపు నుంచి అదే రీతిలో స్పందన వచ్చింది. దీంతో కోత ముడవాల్సిన దుస్థితి. మెగా కుటుంబం రాజకీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నదో నాగబాబు పోస్టులను చూసి అర్థం చేసుకోవచ్చు. ఒక మాట అనడం, పది అనిపించుకోవడం అన్నాదమ్ములకు బాగా అలవాటైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.