నిన్ను చంపేస్తే దిక్కెవరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అసలే జగన్‌ను అంతమొందించాలనే కుట్రలు జరుగుతున్నాయనే వాదనలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాబు కామెంట్స్ వాటికి బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌పై బాబు కామెంట్స్‌ను వైఎస్ భారతి తప్పు పట్టారు.
పులివెందుల నియోజకవర్గంలో భారతి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆమె ప్రచారానికి జనం నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ చంపితే దిక్కెవరంటూ బాబు మాట్లాడ్డం ఆయన సంస్కారాన్ని చూపుతోందన్నారు. వయసులో పెద్దవాడైన చంద్రబాబు… ఆలోచించి మాట్లాడాలని ఆమె హితవు చెప్పారు. చంపాలనే ఆలోచన రావడం ముమ్మాటికీ తప్పని ఆమె పేర్కొన్నారు.
ఏదైనా వుంటే నేరుగా పోరాటం చేయాలని చంద్రబాబుకు వైఎస్ భారతి సూచించారు. రాజకీయంగా ప్రజల్లో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల మనసుల్ని గెలుచుకోవాలన్నారు. ఒక మనిషికి హాని చేయాలనుకుంటే అది మంచిది కాదన్నారు. అది తప్పు కదా? అని భారతి ప్రశ్నించారు.
దేవుని దృష్టిలోనూ, ప్రజల దృష్టిలోనూ, చట్టం దృష్టిలోనూ అది తప్పే అని భారతి కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఇలా మాట్లాడేవాళ్లను, ఆలోచించే వాళ్లను దేవుడే చూసుకుంటారని భారతి హెచ్చరించారు.