ఆలపాటి విజయానికి ధూళిపాళ్ల గండం!

అసలు ఆయన తనను సంప్రదించనేలేదని నరేంద్రకుమార్ మీడియా ముఖంగానే తేటతెల్లం చేస్తున్నారు.

మామూలుగా అయితే.. నామినేషన్ వేసేసి ఇంట్లో కూర్చున్నా సరే.. వారిని విజయం వరించాలి. ఎందుకంటే- ప్రధాన ప్రతిపక్ష పార్టీ అస్సలు పోటీయే చేయడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఎవ్వరైనా సరే.. గెలుపు కేక్ వాక్ అనుకుంటారు. కానీ.. గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పరిస్థితి ఎలా ఉన్నదంటే.. ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహించినా సరే.. గెలుస్తారా? లేదా? అనే భయాలు వారిని వెన్నాడుతున్నాయి. ఎవరో వచ్చి ఓడిస్తారనే భయం కాదు.. సొంత పార్టీలోనే ముఠాలు, కుమ్ములాటలు వికటించి ఓటమివైపు నడిపిస్తాయని భయపడుతున్నారు.

ఒకప్పటి తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు, ఇప్పుడు కూడా పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకే పార్టీకి ఒకే వర్గానికి చెందిన నాయకులు అయినప్పటికీ.. ఇరువురి మధ్య ఆధిప్యత పోరాటంతో పాటు.. మరో తకరారు కూడా ఉంది. సంగం డెయిరీ పగ్గాలు చేజిక్కించుకోవడానికి ఇరువురూ తలపడడమూ గతంలో జరిగింది. ధూళిపాళ్ల నెగ్గారు. వారి వైరం మాత్రం అలాగే మిగిలిపోయింది.

ఇప్పుడు.. అవసరం ఆలపాటిది! కానీ ఆయన తన ఈగోను తగ్గించుకునే ఉద్దేశంతో లేరు. సొంత పార్టీ అభ్యర్థేకదా.. ఆయన గెలిస్తే పార్టీ గెలిచినట్టే కదా అనే భావనతో ధూళిపాళ్ల కూడా లేరు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తానేమీ ఆలపాటికి అనుకూలంగా ప్రచారం చేయడం లేదని, అసలు ఆయన తనను సంప్రదించనేలేదని నరేంద్రకుమార్ మీడియా ముఖంగానే తేటతెల్లం చేస్తున్నారు. అయితే లోలోన తమ వర్గం వారందరూ.. ఆలపాటికి వ్యతిరేకంగా చేయాలని కూడా పురమాయిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంత జరుగుతున్నా ఇరువురు నాయకులను పిలిపించి సయోధ్య కుదిర్చడం గురించి పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదు. చూడబోతే.. తెనాలి సీటును నాదెండ్ల మనోహర్ కోసం త్యాగం చేసినందుకు ఆలపాటికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు గానీ.. ఆయన గెలుపు గురించి పట్టించుకోకుండా పార్టీ పక్కన పెట్టిందనే అభిప్రాయం కూడా పలువురిలో వ్యక్తం అవుతోంది.

ఒకవైపు తెలుగుదేశం అభ్యర్థికి సొంత పార్టీనుంచే సరైన మద్దతు దక్కడం లేదు. మరొకవైపు వామపక్షాల అండతో పోటీచేస్తున్న అభ్యర్థి లక్ష్మణరావుకు వైసీపీ మద్దతు కూడా ఉంది. పైగా ఆయన ఇప్పటికే ప్రచారంలో బాగా దూసుకువెళుతున్నారు. ధూళిపాళ్ల వంటి నాయకులు కూడా లోపాయికారీగా తెరవెనుక మద్దతు అందిస్తే గనుక.. లక్ష్మణరావు విజయం నల్లేరుపై బండినడక అవుతుందని కూడా పలువురు అనుకుంటున్నారు.

4 Replies to “ఆలపాటి విజయానికి ధూళిపాళ్ల గండం!”

Comments are closed.