అనపర్తి టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తల్లి, భార్య, పిల్లలతో కలిసి రోడ్డెక్కారు. న్యాయం కోసం అనే నినాదంతో అనపర్తి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. నల్లమిల్లికి సీటు ఇచ్చినట్టే ఇచ్చి, చంద్రబాబు బీజేపీకి కేటాయించారు. అక్కడి నుంచి బీజేపీ తరపున ఎం.శివకృష్ణంరాజు బరిలో నిలుస్తారని జాతీయ పార్టీ ప్రకటించింది. దీంతో నల్లమిల్లి ఆవేదన వర్ణనాతీతం.
ఆయన్ను పట్టించుకునే టీడీపీ నాయకులే లేరు. ఓదార్పు పేరుతో గోరంట్ల బుచ్చయ్యచౌదరితో పాటు ఒకరిద్దరు నాయకులు వెళ్లడంతో, వారిని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. రాజకీయంగా రామకృష్ణారెడ్డి కుటుంబానికి బలమైన నేపథ్యం వుంది. రామకృష్ణారెడ్డి తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి 1983లో ఎన్టీఆర్ సునామీలో కూడా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 1985లో మళ్లీ విజయం సాధించారు. ఆ తర్వాత 1994, 1999లో కూడా మూలారెడ్డి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. పలుమార్లు ఓడిపోయారు. మూలారెడ్డి వారసుడిగా రామకృష్ణారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీడీపీ తరపున విజయం సాధించారు. 2019లో ఓడిపోయారు.
ఈ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి బీజేపీకి కేటాయించడంపై నల్లమిల్లి జీర్ణించుకోలేకపోతున్నారు. నల్లమిల్లి కమ్మ నాయకుడు కాకపోవడం వల్లే కనీసం ఆయనకు సమాచారం కూడా ఇవ్వకుండానే బీజేపీకి కేటాయించారని అక్కడి టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఇన్‌చార్జ్ బోడె ప్రసాద్‌కు టికెట్ ఇవ్వకూడదని మొదట చంద్రబాబు నిర్ణయించారు. పలువురి పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే కూడా నిర్వహించారు.
కానీ తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని భార్యా, పిల్లలతో బోడె ప్రసాద్ రోడ్డెక్కారు. అలాగే పలు చానళ్ల ఇంటర్వ్యూల్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబునాయుడు తలొగ్గారు. అనపర్తి విషయంలో మాత్రం చంద్రబాబు ఎందుకని లెక్క లేకుండా ప్రవర్తించారంటే, నల్లమిల్లి తన సామాజిక వర్గం కాదు కాబట్టే అనే చర్చకు తెరలేచింది. తన తల్లిని రిక్షాలో కూచోపెట్టుకుని న్యాయం చేయండని ప్రజల దగ్గరికి రామకృష్ణారెడ్డి వెళ్లడానికి చంద్రబాబే ప్రధాన కారకుడు. ఇప్పుడు చంద్రబాబు చేయగలిగిందేమీ లేదు.